బీజేపీదే హవా! | BJP will have positive results coming Elections | Sakshi
Sakshi News home page

బీజేపీదే హవా!

Published Sat, Mar 15 2014 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

బీజేపీదే హవా! - Sakshi

బీజేపీదే హవా!

  • లోక్‌సభ ఎన్నికలపై ఎన్‌డీటీవీ సర్వేలో వెల్లడి
  •   అత్యధికంగా 195 సీట్లు గెలుచుకోనున్న ప్రతిపక్ష బీజేపీ
  •   ఎన్‌డీఏ కూటమికి 229 సీట్లు... 
  •   కాంగ్రెస్‌కు 106 సీట్లు... యూపీఏకి 129 
  •   ప్రత్యామ్నాయ కూటమికి 55 సీట్లే.. ఇతరులకు 130 
  •   సీమాంధ్రలో కాంగ్రెస్ మట్టి.. తెలంగాణలోనూ గట్టి దెబ్బ
  •   వైఎస్సార్‌సీపీకి 15 సీట్లు... 43% ఓట్లు
  •   టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు... 
  • ఎన్‌డీటీవీ సర్వేలో ఏ కూటమికి ఎన్ని..?
     ఎన్‌డీఏ 229 (బీజేపీ: 195)
     యూపీఏ 129 (కాంగ్రెస్: 106)
     ఇతరులు 130 
     ప్రత్యామ్నాయం 55 
     
     న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ హవా ఉంటుందని.. ఆ పార్టీ అత్యధికంగా 195 సీట్లు గెలుచుకుంటుందని తమ తాజా ఎన్నికల సర్వే (ఒపీనియన్ పోల్)లో వెల్లడయిందని జాతీయ వార్తా చానల్ ఎన్‌డీటీవీ తెలిపింది. హంసా రీసెర్చ్ గ్రూప్‌తో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం.. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 229 సీట్లు లభిస్తాయని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీకి 43 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. ఇక అధికార యూపీఏ సారథి కాంగ్రెస్ పార్టీ బలం సగానికి సగం పడిపోయి 106 సీట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. యూపీఏకు మొత్తంగా 129 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే చెప్తున్నట్లు వెల్లడించింది. వామపక్షాలతో కూడిన ప్రత్యామ్నాయ కూటమికి కేవలం 55 సీట్లు వస్తే, ఇతర పార్టీలన్నిటికీ కలిపి 130 సీట్లు వస్తాయని పేర్కొంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 350 నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా ప్రజలను సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వివరించింది. సర్వే ముఖ్యాంశాలివీ...
     
      ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గణనీయంగా లాభపడనుంది. మొత్తం 80 లోక్‌సభ సీట్లలో 40 సీట్లు గెలుచుకునే అవకాశముంది. ఇక్కడ ఆ పార్టీకి ప్రస్తుతం 10 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అధికార సమాజ్‌వాది పార్టీ కేవలం 13 సీట్లు గెలుచుకోగలదు. ఇది గతం కన్నా 10 సీట్లు తక్కువ. కాంగ్రెస్ - ఆర్‌ఎల్‌డీలు కలిసి ఉమ్మడిగా 12 సీట్లు గెలుచుకోగలవు. ఇది గతం కన్నా 14 సీట్లు తక్కువ. 
     
      ఢిల్లీలో గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరింత బలపడింది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాలను ఆప్ సొంతం చేసుకుంటుందని సర్వే చెప్తోంది. బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దారుణ పరాభవం తప్పదు. 
     
      ఒడిశాలో నవీన్‌పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోనుంది. కాంగ్రెస్‌కు 3 సీట్లు మాత్రమే దక్కుతాయి. బీజేపీ ఒక సీటును గెలుచుకుని ఒడిశాలో ఖాతా తెరిచే పరిస్థితి ఉంది. 
     
      అస్సాంలో బీజేపీ, ఏజీపీలకు ఒక్క సీటు కూడా రాదని సర్వే చెప్తోంది. కాంగ్రెస్, ఏయూడీఎఫ్‌లు 13 సీట్లు గెలుచుకునే అవకాశముంది.
     
      కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అత్యధికంగా 13 సీట్లు గెలుచుకుంటుంది. ఇది గతం కన్నా 3 సీట్లు తక్కువ. వామపక్షాల సీట్లు 7కు పెరుగుతాయి. ఇది గత ఎన్నికల కన్నా 4 సీట్లు ఎక్కువ. 
     
      హర్యానాలో బీజేపీ, దాని మిత్రపక్షం హర్యానా వికాస్ పార్టీకి కలిపి 7 సీట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 3 సీట్లు మాత్రమే వచ్చేలా ఉన్నాయి. 
     
      పశ్చిమబెంగాల్‌లోని లోక్‌సభ 40 స్థానాల్లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 32 సీట్లు గెలుచుకుంటుంది. బెంగాలీ ఓటర్లు దేశ ప్రధానమంత్రి పదవికి మమతాకే తొలి ప్రాధాన్యం ఇవ్వటం సర్వేలో వెల్లడైన మరో విశేషం. 
     
      తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో ముఖ్యమంత్రి జె.జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే 27 సీట్లు గెలుచుకుంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లిన డీఎంకే భారీగా నష్టపోతుంది. డీఎండీకేతో కలిసి రాష్ట్రంలో ఖాతా తెరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే పరిస్థితి లేదు. 
     
      బీజేపీ కర్ణాటకలో మళ్లీ పుంజుకుంటోందని, మహారాష్ట్రలోనూ గణనీయ ఫలితాలు సాధిస్తుందని, ఇక గుజరాత్‌లో గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. 
     
     తెలంగాణలో టీఆర్‌ఎస్ పైచేయి
     తెలంగాణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా దెబ్బతింటుందని ఎన్‌డీటీవీ సర్వే చెప్తోంది. ఇక్కడ మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో 11 సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది. ఇది గతం కన్నా 9 సీట్లు ఎక్కువ. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు కేవలం 5 సీట్లు మాత్రమే లభిస్తాయని.. ఇక్కడ గతం కన్నా 7 సీట్లు తక్కువకు ఆ పార్టీ బలం పడిపోతుందని అంచనా వేసింది. ఇతరులకు మరో సీటు లభిస్తుందని చెప్తోంది. ఓట్లలో సైతం టీఆర్‌ఎస్‌కు 33 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 27 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా. ఇక బీజేపీకి 15 శాతం, టీడీపీకి 8 శాతం, ఇతరులకు 17 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. 
     
     సీమాంధ్రలో కాంగ్రెస్ ఖతం
     సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మట్టికరవనుందని ఎన్‌డీటీవీ సర్వే స్పష్టంచేస్తోంది. ప్రస్తుత లోక్‌సభలో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు 21 సీట్లు ఉంటే.. ఇప్పుడు ఒక్క సీటుకే పరిమితమవుతుందని సర్వే చెప్తోంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అలాగే.. టీడీపీ-బీజేపీ కూటమికి 9 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఓట్లలో కూడా అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు, బీజేపీ-టీడీపీ కూటమికి 37 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెప్తోంది. ఇక కాంగ్రెస్‌కు పోలయ్యే ఓట్ల శాతం 14కు పడిపోతుందని, ఇతరులకు మరో 6 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement