Arbitration Center
-
Global maritime india summit 2023: సముద్ర వాణిజ్య ఆర్బిట్రేషన్ కేంద్రంగా భారత్!
ముంబై: సముద్ర వాణిజ్య అంశాలు, వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం భారత్‌లో ఏర్పడాలన్న ఆకాంక్షను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఇందుకు తగిన సామర్థ్యాలు, న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. దేశ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచడానికి ఫైనాన్సింగ్, బీమా, మధ్యవర్తిత్వం, మరిన్ని విభిన్న సౌలభ్యాల సృష్టి అవసరమని కూడా అన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సరఫరాలు, సరఫరాల భద్రతలో అంతరాయాలు, సరఫరాల చైన్ విచి్ఛన్నం వంటి పలు సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమయంలో జరిగిన ఈ సదస్సుకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు సందర్భంగా ‘మారిటైమ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఆర్బిట్రేషన్’ అన్న అంశంపై నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... సెషన్లో ప్రసంగించారు. ► లండన్ లేదా సింగపూర్ లేదా దుబాయ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బ్రిట్రేషన్) కేంద్రాలలో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, వారంతా అక్కడి సీనియర్ న్యాయవాదులకు సహాయం చేస్తున్నారు తప్ప, ఒక కేసును స్వయంగా చేపట్టి, పరిష్కరించడంలేదు. ఈ ధోరణి మారాలి. ► మన మధ్యవర్తిత్వ ప్రక్రియలు, చట్టాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం అవసరం. తద్వారా అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. మనం ఈ దిశలో ఒక వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు, మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా కలిగి ఉండవచ్చు. ► భారత్ మధ్యవర్తిత్వంలో తన బలాన్ని మెరుగుపరచుకుంటోంది. అయితే అంతర్జాతీయ ఆంక్షలు– ఒత్తిళ్లను తగ్గించుకునే దిశలో దేశం పూర్తి స్థాయి భారత్–ఆధారిత రక్షణ, నష్టపరిహార (పీఅండ్ఐ) సంస్థను కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇది షిప్పింగ్ కార్యకలాపాల లో మరింత వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది. తీరప్రాంత, లోతట్టు జలాల్లో పనిచేసే నౌక లకు తగిన రక్షణాత్మక చర్యలను అందిస్తుంది. ► ప్రధాన వస్తువుల ఎగుమతులు కొన్నిసార్లు అవాంతరాలకు గురవుతాయి. ఫలితంగా ఆహార అభద్రత శక్తి అభద్రత వంటి అంశాలు తీవ్రతరమవుతాయని. దీనితో ద్రవ్యోల్బణం సమస్యా తలెత్తవచ్చు. కోవిడ్ సవాళ్ల నుండి బయటకు వస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం ఈ సవాలును ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను ప్రపంచవ్యాప్త పరస్పర సహకారంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ► సముద్ర రంగానికి ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పటికీ, బ్యాంకులు ఈ రంగానికి నిధులు సమకూర్చడంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. ఈ రంగానికి సంబంధించిన అధిక నష్టాల అవకాశం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సముద్రరంగం పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ► భారత్– మిడిల్ ఈస్ట్–యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇప్పుడు కీలకం. మేము యూరప్, మధ్య ఆసియాలను సముద్రం అలాగే భూ మా ర్గం ద్వారా చేరుకోవాలని చూస్తున్నాము. తద్వా రా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించడం జరుగుతోంది. ► కోవిడ్–19 తర్వాత సముద్ర వాణిజ్యానికి మద్దతుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), దేశీయ బీమా కంపెనీల మద్దతుతో ‘‘మెరైన్ కార్గో పూల్’’ ఆవిష్కరణ జరిగింది. ► 12 ప్రభుత్వ ఓడరేవుల్లో తొమ్మిదింటిలో 35 ప్రాజెక్టులను మానిటైజేషన్ కోసం గుర్తించడం జరిగింది. అన్నీ సవ్యంగా జరిగితే నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా రూ. 14,483 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోనటైజ్ చేయవచ్చు. ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రధాన ఉద్దేశం. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న ఓడరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.కె. రామచంద్రన్ -
రాజీకి రాచబాట
సాక్షి, హైదరాబాద్: రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) కీలకపాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. దేశంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వీకే టవర్స్‌లో ఏర్పాటు చేసిన దేశ తొలి ఐఏఎంసీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో కలసి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ను ఏఐఎంసీ ప్రోత్సహిస్తుందని, తక్కువ ఖర్చు, స్వల్ప సమయంలో వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సూచించగా ఆరు నెలల్లోనే ఈ కేంద్రం ప్రారంభానికి అడుగులు పడ్డాయన్నారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అన్ని రకాలుగా ఈ ప్రదేశం అనువైన వేదికన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో స్వల్ప వ్యవధిలోనే వసతి కల్పించిందని, శాశ్వత భవన నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయించిందని సీజేఐ ప్రశంసించారు. దేశ, విదేశాలకు చెందిన అనేక వివాదాలు ఈ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. ప్రారంభానికి ముందే పెద్ద కేసు: సీఎం కేసీఆర్ ఐఏఎంసీ ప్రారంభానికి ముందే లలిత్ మోదీ కుటుంబ వివాదానికి సంబంధించిన పెద్ద కేసు పరిష్కారం కోసం ఈ సంస్థకు వచ్చిందని, ఈ కేంద్రం విజయవంతం అవుతుందనడానికి ఇదే శుభసూచకమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా పురోగమిస్తోందని, అన్ని రంగాలకు చిరునామాగా మారనుందన్నారు. కోర్టుల్లో పరిష్కారానికి నోచుకోని కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ఒప్పందాల్లో వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రాన్ని ఆశ్రయించేలా చట్టానికి సవరణలు తెస్తామని కేసీఆర్ తెలిపారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన భారత న్యాయ శిఖరం జస్టిస్ రమణకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు, మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ నాగార్జున, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజీ-మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైందని.. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు! అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్: సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోందని.. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన పాత్ర పోషించారన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. -
అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారమే లక్ష్యం
-
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభం
-
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్) మధ్యవర్తిత్వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం వేదికగా మారనుంది. అంతేకాక ఈ కేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు హైదరాబాద్‌కు తరలి వస్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు. సింగపూర్, దుబాయ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లను చూసి భారత్‌లో ఇది ఉండాలని మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. సెంటర్లో త్వరలోనే పనులు ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. అది మీ చేతులమీదగానే జరగాలి. దానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఉంటుంది’’ అని తెలిపారు. హైదరాబాద్‌కు సీజే.. మూడు రోజుల పర్యటనలో భాగంగా జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నగరానికి వచ్చారు. సోమవారం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. -
ముంబైలో ఆర్బిట్రేషన్ సెంటర్
ముంబై: సింగపూర్ ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) త్వరలో తీవ్ర పోటీ ఎదుర్కోనుంది. వ్యాపార సంఘాల కోసం ఎస్ఐఏసీ తరహాలో ముంబైలో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ లా కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మేరకు వెల్లడించారు. ‘ముంబైలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వివాదాల పరిష్కారం కోసం ఎక్కువ మంది సింగపూర్‌కు తరలి వెళ్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలకు చెందిన సీఈవోలకు ముంబై నెలవు కాబట్టి ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్‌ను ముంబైలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ ఆర్బిట్రేషన్ సెం టర్ ఎంతో అవసరమని సీఎం అన్నారు. పెట్టుబడులకు న్యాయవ్యవస్థ కీలకమని చెప్పారు. ముంబైలో ఏర్పాటు చేస్తున్న ఆర్బిట్రేషన్ సెంటర్ దేశంలోనే మొదటిది. లాభాపేక్ష లేకుండా.. 1991 నుంచి ఎస్ఐఏసీ కొనసాగుతోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తోంది. ముంబైలోని ఇండియా బుల్స్ సెంటర్ వద్ద 2013లో ఎస్ఐఏసీ అనుసంధాన సంస్థను ఏర్పాటు చేశారు. దేశానికి చెందిన వ్యాపారవేత్తలు ఎక్కువగా ఎస్ఐఏసీని ఆశ్రయిస్తున్నారని, 2014 లో విదేశీ వినియోగదారుల్లో దేశానిది మూడో స్థానమని ఎస్ఐఏసీ వెబ్సైట్ వెల్లడించింది. కోర్టు వ్యాజ్యాల కన్నా తక్కువ దీని పరిధి, అధికారం తక్కువే అయినప్పటికీ కోర్టు వ్యాజ్యాల కన్నా తొందరగా, ఖర్చు లేకుండా వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ, వాణిజ్య, ఇంజినీరింగ్, కార్పొరేట్, రవాణా, సముద్ర రవాణా, బీమా సంబంధ వివాదాలను ఎస్ఐఏసీ ఎక్కువగా పరిష్కరిస్తుంది. 9-12 నెలల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. సింగపూర్‌తో సంబంధం లేని సంస్థలు కూడా ఎస్‌ఐఏసీలో వివాదాలు పరిష్కరించుకోవచ్చు. చర్చలు కూడా సంబంధిత సంస్థల దేశాల్లోనే జరుగుతాయి. దిగువ న్యాయస్థానాలు అవసరం: సీఎం కోర్టుల్లో న్యాయం పొందడానికి ఎక్కువ మొత్తంలో ధనం వెచ్చిస్తుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సత్వర అభివృద్ధికి దిగువ న్యాయస్థానాల ఆవశ్యకత ఉందని అన్నారు. తద్వారా సుప్రీం, హైకోర్టుపై భారం కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారుల అవసరార్థం మానవ వనరులను పెంచాలని ఎన్ఎల్యూని కోరారు. ఆస్తి హక్కులు, ఐటీపై మరింత పట్టు సాధించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.