చైనా స్పందనకు కృతజ్ఞతలు
సీఎం ఫడ్నవీస్
- ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన
- సోమవారం అర్ధరాత్రి ముంబై చేరుకున్న సీఎం
- అక్కడి కంపెనీలతో పలు ఒప్పందాలు
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చైనా కీలకపాత్ర పొషిస్తుందని వెల్లడి
ముంబై: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం అర్ధరాత్రి ముంబై చేరుకున్నారు. ‘చైనా స్పందనకు కృతజ్ఞతలు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చైనా ముఖ్య పాత్ర పోషించనుంది’ అని నగరానికి చేరుకున్న తర్వాత ఆయన ట్వీట్ చేశారు. ప్రధానితో కలసి మే 14 చైనా పర్యటనకు వెళ్లిన సీఎం ఫడ్నవీస్.. బీజింగ్‌లో జరిగిన రాష్ట్రాలు, ప్రావిన్సుల ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ‘స్థిర పట్టణీకరణ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ లివింగ్’, అలాగే దేశాల అభివృద్ధిలో రాష్ట్రాల పాత్రపై చర్చించారు. పర్యటనలో భాగంగా ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమం గురించి చైనా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు వివరించారు.
పలు చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ టెర్రీ గూ, చైనీస్ ఆటోమోబైల్ సంస్థ బిక్వీ ఫోటాన్ చైర్మన్, సీఈవో జిన్ యూ వాంగ్‌తో సీఎం సమావేశమయ్యారు. బీజింగ్, హాంగ్‌జూ, చెంగ్డూ నగరాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతోనూ భేటీ అయ్యారు. అజంతా-ఎల్లోరా గుహలున్న ఔరంగాబాద్ నగరాన్ని ‘సిస్టర్ సిటీ’లో భాగంగా డొంగ్వాన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. హెయర్, యాప్, సీజీజీసీ, తైవాన్ పరిశ్రమ, గ్రేట్ వాల్ మోటార్స్ ఇతర అతిపెద్ద పారిశ్రామికాధికారులతో ఆయన సమేశమయ్యారు. గత నెలలో కూడా సీఎం జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలలో పర్యటించి ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ ప్రయోజనాల గురించి వివరించారు.