‘అసహనం’పై భయం వద్దు
ప్రజలకు సీజేఐ ఠాకూర్ అభయం
♦ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నంత వరకు ఏమీ కాదు
♦ అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడగలం
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెల్లుబుకుతోందంటూ రాజుకున్న వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసహనం వివాదాన్ని రాజకీయ అంశంగా అభివర్ణించిన ఆయన...ఇది ఆలోచనా విధానానికి సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో సీజేఐ వివిధ అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఉగ్రవాదులకూ కొన్ని హక్కులున్నాయి...
‘‘దేశంలో చట్ట పాలన కొనసాగుతున్నంత కాలం స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నంత కాలం, పౌరుల హక్కులు, బాధ్యతలను కోర్టులు కాపాడుతున్నంత కాలం ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరంలేదని భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రజల హక్కులను మేము కాపాడగలం’’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు సహా పౌరులుకాని వారికీ కొన్ని హక్కులు ఉన్నాయని...చట్టప్రకారమే వారిని విచారించాల్సి ఉంటుందని, సరైన చట్ట ప్రక్రియలను పాటించకుండా ఉరిశిక్ష విధించడం కుదరదన్నారు. పౌరుల హక్కులను తాము కాపాడగలమని ఇటీవలి పరిణామాలు, అసహనం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీజేఐ బదులిచ్చారు. అయితే ప్రత్యేకించి తాను ఏ ఘటనను ప్రస్తావించట్లేదని స్పష్టం చేశారు.
జడ్జీల అవినీతిపై ఉక్కుపాదం
కొందరు జడ్జీల అవినీతి, దుష్ర్పవర్తన విషయంలో న్యాయ వ్యవస్థ చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే అపోహ నెలకొందని...దీన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జడ్జీల అవినీతి, దుష్ర్పవర్తనను ఉపేక్షించబోమన్నారు. కొలీజియం వ్యవస్థపై మాట్లాడుతూ.. ‘వారు (బెంచ్) కొలీజియం వ్యవస్థ కొనసాగొచ్చని పేర్కొన్నారు తప్ప కొలీజియం వ్యవస్థ కొనసాగాల్సిందేనని చెప్పలేదు’ గుర్తుచేశారు.
పిల్‌లపై అప్రమత్తత అవసరం...
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దుర్వినియోగం కాకుండా జడ్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘‘పిల్ అనేది కత్తిలాంటిది. వైద్యుడి చేతిలో పెడితే రోగుల ప్రాణాలు కాపాడతాడు. అదే మాంసం కొట్టే వాడి చేతిలో పెడితే...!’’ అని అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా సరి, బేసి సంఖ్య నంబర్లుగల ప్రైవేటు వాహనాలు జనవరి 1 నుంచి రోజువిడిచి రోజు రోడ్డెక్కేలా ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సీజేఐ ఠాకూర్ మద్దతు పలికారు. రూ. 20 వేల కోట్లతో చేపడుతున్న గంగా నది ప్రక్షాళన పథకంలో తమ జోక్యం అడ్డంకి కాదన్నారు.