ఆ వివాదం సమసిపోతుంది
కొలీజియంపై సీజేఐ ఠాకూర్
న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో పాల్గొనడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించడంతో తలెత్తిన వివాదం సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ అభిప్రా యపడ్డారు. శనివారం ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఠాకూర్ పైవిధంగా స్పందించారు. తాము ఆ సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లేదంటూ గురువారం కొలీజియం సమావేశానికి చలమేశ్వర్ గైర్హాజరయ్యారు. దీంతో సమావేశం వాయిదా పడింది. కొలీజియంలో ఠాకూర్‌తో పాటు జస్టిస్ దవే, జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ దీపక్, జస్టిస్ చలమేశ్వర్ సభ్యులు.
న్యాయవిద్య మారాలి: జస్టిస్ చలమేశ్వర్
మారుతున్న న్యాయ అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యలో మార్పులు రావాలని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం సమావేశానికి గైర్హాజరుపై మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి ఆయన నిరాకరించారు. అయితే న్యాయమూర్తుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేవలం ఇద్దరు వ్యక్తులే న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తారని.. సమావేశంలో వాటికి ఓకేనా కాదా అని మాత్రమే అడుగుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తిని ఎంపిక చేసే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.