CJI Thakur
-
ఆ వివాదం సమసిపోతుంది
కొలీజియంపై సీజేఐ ఠాకూర్ న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో పాల్గొనడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించడంతో తలెత్తిన వివాదం సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ అభిప్రా యపడ్డారు. శనివారం ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఠాకూర్ పైవిధంగా స్పందించారు. తాము ఆ సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లేదంటూ గురువారం కొలీజియం సమావేశానికి చలమేశ్వర్ గైర్హాజరయ్యారు. దీంతో సమావేశం వాయిదా పడింది. కొలీజియంలో ఠాకూర్‌తో పాటు జస్టిస్ దవే, జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ దీపక్, జస్టిస్ చలమేశ్వర్ సభ్యులు. న్యాయవిద్య మారాలి: జస్టిస్ చలమేశ్వర్ మారుతున్న న్యాయ అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యలో మార్పులు రావాలని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం సమావేశానికి గైర్హాజరుపై మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి ఆయన నిరాకరించారు. అయితే న్యాయమూర్తుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేవలం ఇద్దరు వ్యక్తులే న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తారని.. సమావేశంలో వాటికి ఓకేనా కాదా అని మాత్రమే అడుగుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తిని ఎంపిక చేసే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. -
మోదీ ప్రసంగంపై సుప్రీం చీఫ్ జస్టిస్ అసంతృప్తి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం మోదీ చేసినప్పటికీ సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల న్యాయమూర్తుల పెండింగ్ నియామకాలకు సంబంధించిన ప్రస్తావనే తీసుకురాలేదని, ఇది తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన మోదీ అనంతరం దాదాపు 94 నిమిషాలపాటు మాట్లాడారు. దేశంలోనే అతి సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చిన ప్రధానిగా ఆయన నిలిచారు. ఈ ప్రసంగంలో దేశంలోని పలు అంశాలు స్పృషించిన మోదీ.. న్యాయస్థానాలపై మాత్రం మాట్లాడలేదు. దీంతో ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో న్యాయం జరిగేందుకు ఎంత సమయం పట్టిందో ప్రస్తుతం కూడా అంతే సమయం పడుతోందని, కేసులను పూర్తి చేసేందుకు కోర్టులకు పదేళ్లు పడుతుందని, ఇది న్యాయ వ్యవస్థ పనికి ఆటంకంగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కవితను కూడా వినిపించారు. అందరికీ పూలు, పండ్లు, ఇతర లబ్ధీలు ప్రకటించడంతోపాటు, స్నేహా విలువ చెప్పిన మీరు మాక్కూడా ఏదో ఒక మేలు చేయండి' అంటూ కవిత రూపంలో మరోసారి మోదీకి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. -
స్నాతకోత్సవానికి నల్సార్ ముస్తాబు
శామీర్‌పేట్: నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం ప్రాంగణం లో నేటి సాయంత్రం 4గంటలకు 14వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నల్సార్ లా యూనివర్సీటీ వైస్ చాన్సలర్ ఫ్రొ.ఫైజాన్‌ముస్తఫా, రిజి్ట్రార్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని జస్టీస్ సిటీ ప్రాంగణంలో నిర్వహించే 14వ స్నాతకోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా టీఎస్.ఠాకూర్, విశిష్ట అతిథిగా తెలం గాణ -ఆంధ్రప్రదేశ్ (ఉమ్మిడి) రాష్ట్రాల సంయు క్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్సలర్ జస్టీస్ రమేశ్‌రంగనాథన్‌లతో పాటుపలువురు ప్రముఖులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. -
‘అసహనం’పై భయం వద్దు
ప్రజలకు సీజేఐ ఠాకూర్ అభయం ♦ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నంత వరకు ఏమీ కాదు ♦ అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడగలం న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెల్లుబుకుతోందంటూ రాజుకున్న వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసహనం వివాదాన్ని రాజకీయ అంశంగా అభివర్ణించిన ఆయన...ఇది ఆలోచనా విధానానికి సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో సీజేఐ వివిధ అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఉగ్రవాదులకూ కొన్ని హక్కులున్నాయి... ‘‘దేశంలో చట్ట పాలన కొనసాగుతున్నంత కాలం స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నంత కాలం, పౌరుల హక్కులు, బాధ్యతలను కోర్టులు కాపాడుతున్నంత కాలం ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరంలేదని భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రజల హక్కులను మేము కాపాడగలం’’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు సహా పౌరులుకాని వారికీ కొన్ని హక్కులు ఉన్నాయని...చట్టప్రకారమే వారిని విచారించాల్సి ఉంటుందని, సరైన చట్ట ప్రక్రియలను పాటించకుండా ఉరిశిక్ష విధించడం కుదరదన్నారు. పౌరుల హక్కులను తాము కాపాడగలమని ఇటీవలి పరిణామాలు, అసహనం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీజేఐ బదులిచ్చారు. అయితే ప్రత్యేకించి తాను ఏ ఘటనను ప్రస్తావించట్లేదని స్పష్టం చేశారు. జడ్జీల అవినీతిపై ఉక్కుపాదం కొందరు జడ్జీల అవినీతి, దుష్ర్పవర్తన విషయంలో న్యాయ వ్యవస్థ చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే అపోహ నెలకొందని...దీన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జడ్జీల అవినీతి, దుష్ర్పవర్తనను ఉపేక్షించబోమన్నారు. కొలీజియం వ్యవస్థపై మాట్లాడుతూ.. ‘వారు (బెంచ్) కొలీజియం వ్యవస్థ కొనసాగొచ్చని పేర్కొన్నారు తప్ప కొలీజియం వ్యవస్థ కొనసాగాల్సిందేనని చెప్పలేదు’ గుర్తుచేశారు. పిల్లపై అప్రమత్తత అవసరం... ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దుర్వినియోగం కాకుండా జడ్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘‘పిల్ అనేది కత్తిలాంటిది. వైద్యుడి చేతిలో పెడితే రోగుల ప్రాణాలు కాపాడతాడు. అదే మాంసం కొట్టే వాడి చేతిలో పెడితే...!’’ అని అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా సరి, బేసి సంఖ్య నంబర్లుగల ప్రైవేటు వాహనాలు జనవరి 1 నుంచి రోజువిడిచి రోజు రోడ్డెక్కేలా ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సీజేఐ ఠాకూర్ మద్దతు పలికారు. రూ. 20 వేల కోట్లతో చేపడుతున్న గంగా నది ప్రక్షాళన పథకంలో తమ జోక్యం అడ్డంకి కాదన్నారు.