మోదీ ప్రసంగంపై సుప్రీం చీఫ్ జస్టిస్ అసంతృప్తి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం మోదీ చేసినప్పటికీ సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల న్యాయమూర్తుల పెండింగ్ నియామకాలకు సంబంధించిన ప్రస్తావనే తీసుకురాలేదని, ఇది తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన మోదీ అనంతరం దాదాపు 94 నిమిషాలపాటు మాట్లాడారు. దేశంలోనే అతి సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చిన ప్రధానిగా ఆయన నిలిచారు. ఈ ప్రసంగంలో దేశంలోని పలు అంశాలు స్పృషించిన మోదీ.. న్యాయస్థానాలపై మాత్రం మాట్లాడలేదు.
దీంతో ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో న్యాయం జరిగేందుకు ఎంత సమయం పట్టిందో ప్రస్తుతం కూడా అంతే సమయం పడుతోందని, కేసులను పూర్తి చేసేందుకు కోర్టులకు పదేళ్లు పడుతుందని, ఇది న్యాయ వ్యవస్థ పనికి ఆటంకంగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కవితను కూడా వినిపించారు. అందరికీ పూలు, పండ్లు, ఇతర లబ్ధీలు ప్రకటించడంతోపాటు, స్నేహా విలువ చెప్పిన మీరు మాక్కూడా ఏదో ఒక మేలు చేయండి' అంటూ కవిత రూపంలో మరోసారి మోదీకి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.