జనుల కోసం తపించాడతడు!  | Sakshi Guest Column On BalaGopal | Sakshi
Sakshi News home page

జనుల కోసం తపించాడతడు! 

Published Sun, Oct 8 2023 12:36 AM | Last Updated on Sun, Oct 8 2023 12:36 AM

Sakshi Guest Column On BalaGopal

పుట్టిన ప్రతి జీవి జీవితం బాగుండాలని తపించారాయన. జీవించే హక్కు కోసం తన చివరి ఊపిరి వరకు ఆయన పోరాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరి రక్షణ కోసం ఉద్యమించారాయన. చట్టాల ఉల్లంఘనను నిలదీశారు. ఆయనే కె. బాల గోపాల్‌! హింస ఏదైనా, ఎవరు చేసినా ఈ హక్కుల నేత, ప్రజల న్యాయవాది వ్యతి రేకించే వారు. అది రాజ్యహింస అయినా, ప్రైవేట్‌ వ్యక్తుల హింస అయినా దేనినీ సహించే వారు కాదు. అభివృద్ధి పథకాల పేరిట ప్రజల జీవించే హక్కును ప్రభుత్వాలు హరిస్తు న్నాయనీ; నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి ఇచ్చిన సంపదను కోట్లాదిమంది జీవనోపాధికి ఉపయోగించాలనీ సెజ్‌లను వ్యతి రేకిస్తూ పోరాటం చేశారు. భూ నిర్వాసితుల పక్షాన నిలబడ్డారు. 

బాలగోపాల్‌ సర్‌  2009 అక్టోబర్‌ 8న ఆకస్మికంగా హైదరాబాద్‌లో మరణించారు. ప్రముఖ జర్నలిస్ట్, ఆయన సహచరి వసంత లక్ష్మి, వారి కొడుకు కళ్ళ ముందే ఆయన ఊపిరి వదిలారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల నిజమైన ఉద్యమ గొంతు మూగ వోయింది. సర్‌ ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోయి 14 ఏండ్లు దాటు తున్నా ఆయన ఎక్కడో ఇంకా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన చివరి సారిగా  మంచిర్యాలలోని మా ఇంటికి భార్యాకుమారులతో  కలిసి వచ్చి భోజనం చేసి శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ గనిని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడిన విషయాలూ, ఆయన నింపిన మనో ధైర్యం నేటికీ గుర్తుకు వస్తున్నాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణవార్త కలిచి వేసింది. హడావిడిగా మిత్రులతో హైదరాబాద్‌ వెళ్లి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నాను. ఎన్‌కౌంటర్లపై న్యాయ విచా రణ జరపాలనీ, పోలీసుల మీద హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలనీ, సంఘటనా స్థలానికి వెళ్లి నిజనిర్దారణ చేసి మరీ డిమాండ్‌ చేసే వారు బాలగోపాల్‌. లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన తర్వాత చాలా కేసులను ఆయన తీసుకుని వాదించారు. రాజ్యానికి ఆయనంటే గుబులు, ఆందోళన. అందుకే ఆయన్ని భౌతిక దాడులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెంలో పోలీసులు బాల గోపాల్‌ మీద ప్రీ ప్లాన్డ్‌గా దాడి చేసి కొట్టి, గాయపరిచి చచ్చి పోయాడని భావించి కాలువలో పడేసి వెళ్లిపోయారు. అప్పుడు ఆయనను చూసిన కొందరు అభిమానులు కాపాడారు. 

కష్టపడే వారికి కనీస వేతనాల కోసం, ఆదివాసీల హక్కుల కోసం; బొగ్గు గని కార్మికుల, కాంట్రాక్టు కార్మికుల జీవితాల మెరుగు కోసం; కాలుష్య రహిత సమాజం కోసం... మొత్తంగా మానవ హక్కుల కోసం ఆయన పోరాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినపుడు బాలగోపాల్‌ వెంట వచ్చిన టీమ్‌తో నేనూ వెళ్లే వాడిని. ఆయన, నేను కలిసి కాగజ్‌ నగర్‌ నుంచి ఒక సంఘటనలో ఒకే సైకిల్‌ మీద నిజ నిర్ధారణకు వెళ్లిన సందర్భం ఇంకా గుర్తుంది. ఓపెన్‌ కాస్ట్‌ గనులు సృష్టించే విధ్వంసం మీద పోరాట సందర్భం అది. ఆ గనులు వద్దని ప్రజలు చేసిన ఉద్యమంలో బాలగోపాల్‌ పాత్ర కీలకంగా ఉండేది. 

లాకప్‌ డెత్‌లకు వ్యతిరేకంగా కూడా ఆయన కేసులు వేశారు. రాజ్యంతో పోరాడారు. కార్మికుల న్యాయమైన సమ్మె పోరాటాలను కూడా సమర్థించి వాటిల్లో పాల్గొని మద్దతు ఇచ్చేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించే వారు. ఉద్యమానికి మద్దతు కూడా ఇచ్చారు. ఆయన లేని లోటు ఆయన మరణించి 14 ఏండ్లు దాటినా ఇంకా భర్తీ చేసేవారు రాలేదు. బాల గోపాల్‌ లాంటి మనుషుల కొరత ఈ సమాజానికి ఉంది. ప్రశ్నించే వారి మీద ఉపా లాంటి కేసులు పెరిగాయి. మానవ హక్కులు ఎక్కడికక్కడ హరించ బడుతున్నాయి.

దేశంలో ఒక వర్గానికి చెందిన వారిని కులం, మతం పేరు ఎమీద తీవ్ర అణచివేతకు గురి చేస్తున్నారు. లాకప్‌ లలో పెట్టి, పబ్లిక్‌గా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, పెరుగుతున్న అమానవీయ చర్యలు, తద్వారా అధి కారం నిలబెట్టుకునే ప్రయత్నం, దేశంలో పెరిగిన నిరుద్యోగం, అసమానతలు, ఆకలి, అధిక ధరలు, ఆర్థిక ఇబ్బందులు, దేశ ప్రజలను విడదీసి పాలించే విధానం... ఇన్నింటి మధ్య నలుగుతున్న జనం హక్కుల గురించి ప్రశ్నించేవారు కరవవుతున్నారు. బాల గోపాల్‌ మళ్ళీ రావడం కుదరదు. కాబట్టి బుద్ధిజీవులే అందుకు సిద్ధం కావాలి. అందుకు సమయం ఇదే, ఛలో ఛలో కాలం పిలుస్తోంది. బాల గోపాల్‌ పిలుపు ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్లుంది. ఛలో ఛలో కహీన్‌ దేర్‌ న హోజాయే!

ఎం.డి. మునీర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, విశ్లేషకులు ‘ 99518 65223
(నేడు హైదరాబాద్‌ ఎస్‌వీకేలో బాలగోపాల్‌ 14వ సంస్మరణ సభ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement