ఒక దేశ పౌరుడిగా నెరవేర్చవలసిన కొన్ని బాధ్యతలుంటాయి. అవి నెరవేరుస్తూనే తన హక్కుల కోసం కూడా అతడు నిలబడాల్సి ఉంటుంది. అది కూడా తన బాధ్యతలో భాగం చేసుకున్నవాడే సమాజ శ్రేయస్సు గురించీ, సాటి మానవుడి గురించీ ఆలోచించగలడు, వారి కోసం పాటుపడగలడు. బాధ్యతగా ఉండటమంటే కేవలం ‘బుద్ధిగా’ తన పని తాను చూసుకోవడం కాదు. కానీ పాలకులకు కావాల్సింది ఎందులోనూ తలదూర్చని, అంటే ఏ ఉద్యమాల్లోనూ తలదూర్చని, సమాజంలో తమ వాటా కోసం పోరాడని వాళ్లు మాత్రమే. అలా ఉండటం కంటే ‘బాధ్యత లేనివాళ్లు’గా ఉండటమే దేశానికి మంచిది. ఎందుకంటే, ఆలోచన కూడా ఆత్మ నిర్భరతలో భాగమే! ‘అసలైన’ ఆత్మ నిర్భరతే నిజమైన స్వాతంత్య్రం!
‘‘భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత గత డెబ్భై అయిదేళ్లలో ఎంతసేపూ పౌర హక్కుల గురించి మాట్లాడుతూ, ఆ హక్కుల కోసమే కొట్లాడుతూ ఉండటం వల్ల దేశం బలహీనపడుతూ వచ్చింది. హక్కుల కోసం పోరాటం పేరిట ఇన్నేళ్లూ కాలం గడిపేశాం. మన పౌరులు తమ బాధ్యతల్ని మరచిపోయి భారతదేశాన్ని బలహీనపర్చడంలో పెద్ద పాత్ర వహించారు. 2047వ సంవత్సరం నాటికి, మనం 24 ఏళ్లలో కోల్పోయిన గత వైభవాన్ని తిరిగి పొందాలంటే దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడానికి బాధ్యతలు శిరసావహించే మార్గంలో యువత నడవాలి.’’
– ప్రధాని మోదీ ఢిల్లీలో 20 జనవరి 2022న జారీ చేసిన ప్రకటన
కానీ ఇంతకూ అసలు విశేషమేమంటే, ప్రధానమంత్రి ఒక దేశ బాధ్యతాయుత ప్రథమ పౌరునిగా తాను పేర్కొన్న ‘పౌర బాధ్యతల’ అధ్యాయంలో... దేశాన్ని వెనక్కి కాకుండా ముందుకు నడిపించడానికి అనుసరించాల్సిన శాస్త్రీయ దృక్పథం గురించిన ప్రస్తావన నామ మాత్రంగా కూడా లేకపోవడం! ప్రజలు తమకు తాముగా అంకితం చేసుకున్న (‘ఉయ్ ది పీపుల్’) రాజ్యాంగానికి ఏ రాజకీయ పక్షానికి చెందిన నాయకులైనా ఎలా తూట్లు పొడవగలరో డాక్టర్ అంబేడ్కర్ ఎంతో దూరదృష్టితో హెచ్చరించారు: ‘‘రాజ్యాంగ రూపాన్ని మార్చ కుండానే ఆచరణలో రాజ్యాంగం లక్ష్యాలకు పాలకులు తూట్లు పొడుస్తూ ముందుకు సాగిపోవచ్చు. ఎందుకంటే, రాజ్యాంగబద్ధమైన నైతికత అనేది స్వభావసిద్ధంగా అలవడే లక్షణం కాదు. అలాంటి ఉత్తమ లక్షణం పాలకులు అలవర్చుకుంటే తప్ప అబ్బేది కాదు’’ అంటూనే అంబేడ్కర్... ‘ప్రజాస్వామ్యం’ అనే మాట భారతదేశానికి సంబంధించినంతవరకూ ప్రధానంగా ‘ప్రజాస్వామ్య వ్యతిరేక’ లక్షణం కలిగివున్నదని వర్ణించారు.
‘‘అధికార స్థానాలు ఆక్రమించేవారు ఎవరైనా తమ ఇష్టం వచ్చిన రీతిలో పాలించడానికి స్వేచ్ఛ లేదు’’ అని అంబేడ్కర్ తెగేసి చెప్పారు. కానీ, భారత రాజ్యాంగానికి, అందులోని నిర్దేశిత బాధ్యతలకు పాల కులు అనుకూలంగా నడుచుకుంటున్నారా అన్నది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం నాడు మనం నిశితంగా పరిశీలించు కోవలసిన ఘడియ! దేశంలోని దళిత వర్గాలన్నీ పరాయి బ్రిటిష్ వలస సామ్రాజ్య పాలనా దాష్టీకాలను అనుభవించాయి. అయితే స్వాతంత్య్రానంతర పాలనలో నూతన రాజ్యాంగం రచనలో అంబే డ్కర్ ఆధ్వర్యంలో మెట్టువాటాను పంచుకున్న దళిత బహుజన వర్గాలకు ఆచరణలో సమాన హక్కులు పొంది, అను భవించే హక్కు ఉంది. అందువల్లనే దేశ పాలకులు ఏ వర్గం వారైనా, ఏ రంగు వారైనా ఇందుకు భిన్నంగా నడుచుకోవడానికి వీల్లేదన్నది ఏ పాలకుడి నిర్దేశమో కాదు, రాజ్యాంగ నిర్దేశమని మరచిపోరాదు.
‘కరోనా’ వైరస్ వ్యాప్తి పేరిట ఒక వైపున దిక్కూమొక్కూ లేని కోట్లాదిమంది ప్రజలు, అందులోనూ 16 కోట్లమందికి పైగా నిరు పేదలు... మందుల పేరిట యథేచ్ఛగా సాగుతున్న నిలువుదోపిడీకి బలైపోతున్నారు. మరోవైపున ఇదే అదనుగా ప్రపంచ అపర కుబేరుల సంపద రెట్టింపు అయింది. వారిలో భాగంగానే భారతదేశ కుబేరుల సంఖ్య 102 నుంచి 142కు డేకి, ‘చంపుడు కల్లం’గా (ఇనీక్వాలిటీ కిల్స్) మారిన పరిస్థితిని ‘ఆక్స్‌ఫామ్’ సంస్థ తాజా అంతర్జాతీయ వార్షిక నివేదిక (17 జనవరి 2022) వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ‘పౌర హక్కుల రక్షణ’ పేరిట దేశంలోని యువత నడుపుతున్న ఆందోళనోద్యమాల వల్లనే దేశం బలహీనపడిందని పాలకులు వాపోవడం దుస్సహం!
సరిగ్గా ఈ దశలోనే సుప్రసిద్ధ హిందీ రచయిత సంపత్ సరళ్ – పాలకులు చేపట్టిన ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ నినాదం చాటున సాగుతున్న ‘పరాయి ఆర్థిక వ్యవస్థ పోషణ’ తతంగాన్ని ఎండగడుతూ గొప్ప వ్యంగ్య రచన చేశారు. (దీని తెలుగు అనువాదం: వేములపల్లి రాధిక). హిందీలో వాగాడంబరాన్నే ‘వాణీ విలాసం’ అంటారని చెబుతూ, ఆ ‘విలాసం’ ఎలాంటిదో, దాని పోకడ ఎలా ఉంటుందో వర్ణించారు. దేశ పాలకుల ‘ఆత్మ నిర్భరత’ (స్వయం పోషక స్థితి) ఎన్ని రూపాలలో, మరెన్ని రూపాంతరాలలో మన ముందు సాక్షాత్క రిస్తుందో చూపారు. ‘‘చర్ఖావాలే (గాంధీ) దేశాన్ని ఏ కంబంధ హస్తాల నుండి విడిపించారో చాయ్‌వాలే తిరిగి వాళ్ల చేతుల్లోనే పెట్టా’’రని మరెవరో కాదు, స్వయానా చాయ్‌వాలే పార్టీకి చెందిన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ పెద్ద మనిషే ఫిర్యాదు చేస్తాడు. ఏమని? ‘మేం స్వదేశీ నినాదంతో సింహాసన మెక్కిస్తే ఏం చేశాడు? విదేశీ కంపెనీల కోసం దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడంలో మునిగితేలు తున్నారంటాడు. కాగా, మల్టీ నేషనల్ ఇంటింటా తిష్ఠ వేసుకునుందని ఎవడైనా అంటే, వాడు ‘దేశ ద్రోహి’ అన్న ముద్ర వేస్తారు. అందుకే ఈ పరిణామాన్నే రచయిత సంపత్ సరళ్... కుంటి దయ్యం ముందు ఇంట్లోవాళ్లనే మింగిందన్న సామెతను నిజం చేసేట్టుగా చిత్రిస్తాడు.
‘ఆత్మనిర్భరత’ (స్వయం పోషకం) నినాదం అనేది ‘పరాయి పోషకమే స్వయం పోషక నినాదం’ అన్నట్టుగా కరోనా వైరస్ లాగా రూపాంతరాలు తొడుగుతోంది! ఈ దుఃస్థితి క్రమంగా ఎలా పాకి పోతోందో సంపత్ సరళ్ ఇంకా ఇలా వివరించాడు: ‘‘మా దేశాన్ని స్వావలంబిత దేశంగా మార్చిపెట్టమని విదేశస్థులకు మొర పెట్టుకునే దేశ నాయకుడు ‘లోకల్ నుండి ఓకల్’కు మారి మనకు హోంవర్క్ ఇస్తే... ఆయన భక్త సమూహంలో ఒక కుహనా జాతీయవాది ఎన్ని రూపాల్లో ఎలా సందేశాలు పంపుతాడో చూడండి:
‘తన చైనీస్ మొబైల్ నుండి / నా కొరియన్ మొబైల్‌కు
ఇంగ్లండ్ రాజభాషలో / అమెరికన్ వాట్సాప్ ద్వారా
నాకొక సందేశం పంపాడు –
భారతదేశాన్ని స్వావలంబన దేశంగా మారుద్దామని!
సరిగ్గా – ఆ సమయంలో ‘సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ చైనాలో తయారైన విగ్రహమని చాలామందికి గుర్తులేదు! ఎందు కంటే ‘విగ్రహాలు సందేశాలు చదవలేవు’ గనుక, పటేల్ విగ్రహం తయారైంది చైనాలోనే అన్నది చాలామందికి తెలియదు, తెలిసినా మర్చిపోయి ఉంటారు. అంతేగాదు, మనకు పెట్టుబడులు గుప్పించే ప్రపంచ కుబేరుల పెద్ద బిల్ గేట్స్ మరిన్ని పెట్టుబడులు గుప్పించా లంటే ‘భారతదేశానిది స్వయంపోషక ఆర్థిక విధానమే’నని చెబు తూనే ఉండటం మన చెవులకూ ఎంతో ‘ఇంపు’గానే ఉంటుందని చెబుతూ ‘మన ఆర్థిక శాఖ వారు తమ కార్యాలయం ముందు కొలంబస్ విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారని శరద్ జోషీ చెప్పకనే చెప్పాడు! ఎందుకనంటే– ఒకవేళ కొలంబసే అమెరికాని కనుక్కొని ఉండకపోతే మనం అప్పెక్కడ నుంచి తెచ్చుకోగలం అన్నది శరద్ జోషీ పీకులాట.
అందుకే మన ‘ఆత్మనిర్భరతా’ (స్వయంపోషక వ్యవస్థ) నినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమర్థించాలంటే– ముందు ‘చర్ఖావాలే (గాంధీజీ) దేశాన్ని ఏ కబంధ హస్తాల నుండి విడిపించారో చాయ్‌వాలే తిరిగి వాళ్ల చేతుల్లోనే పెడుతున్నారన్న స్వదేశీ జాగరణ్ మంచ్’ పెద్దమనిషొకడు చేసిన తీవ్రమైన ఫిర్యాదునూ, విదేశీ కంపెనీల కోసం దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడంలో మునిగి తేలు తున్నారన్న అభియోగాన్నీ పాలకులు ఎలా సమర్థించుకుంటారో ఆచరణలో చూసి తీరాల్సిందే! ఎందుకంటే, ‘కుంటి దయ్యం ఇంట్లో వాళ్లనే ముందు మింగేయకముందే’ జాగ్రత్త పడటం జరూరుగా జరగాల్సిన పని గనుక! దీన్నిబట్టి, స్వయంపోషక ఆర్థిక వ్యవస్థకు ఏకైక రక్షణ... పరాయి పెట్టుబడిని పోషించుకుంటూ పోవడమేనని అర్థం చేసుకోవాలా?!
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment