Leena Gandhi Tewari Inspirational Story: ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి కంపెని యుఎస్వీ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనే కాదు కార్యాలయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడా అరుపులు, కేకలు వినబడవు. ప్రశాంతమైన వాతావరణంలో పని జరుగుతుంటుంది. ‘నేను నీ కంటే ఎక్కువ. నువ్వు నా కంటే తక్కువ... అనే వాతావరణం మా సంస్థలో కనిపించదు. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటుంది లీనా గాంధీ తివారి. యుఎస్వీ చైర్‌పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళలలో రూ.3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో నిలిచింది.
చదవండి : Divya Gokulnath: ఫోర్బ్స్ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా?
ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. కానీ మనసు ఉన్న వాళ్లకు రెండు వేరు వేరు కావు. లీనా తివారి ఇలాంటి వ్యక్తే. వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతను మిళితం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది లీనా. ‘డా. సుశీలగాంధీ– సెంటర్ ఫర్ అండర్ ప్రివెలేజ్డ్ ఉమెన్’ తరఫున అట్టడుగు వర్గాల మహిళలకు అనేక రకాలుగా సహాయంగా నిలుస్తుంది. పేద గ్రామీణ విద్యార్థులకు విద్య చెప్పించడం నుంచి కంప్యూటర్‌లో శిక్షణ ఇప్పించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.
‘మహిళలు తమ సొంతకాళ్ల మీద నిలబడేలా చేయడానికి సహకరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడవాళ్లు ఎంత చదువుకున్నా పురుషులతో సమానం కాదు అనే ఆధిపత్య భావజాలాన్ని తొలగించడం మరో ఎత్తు. మొదటి లక్ష్యం సులభమేకాని రెండోది మాత్రం క్లిష్టమైనది. దానికి నిరంతర కృషి కావాలి. క్లిష్టమైన వాటిని దారికి తేవడం ఎంటర్‌ప్రెన్యూర్ చేసే పనుల్లో ఒకటి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అదే చేయాలనుకుంటున్నాను’ అంటున్న లీనా మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మాట నిలబెట్టుకుంటుంది. యుఎస్వీలో ఉన్నతస్థానాల్లో మహిళలు ఉన్నారు. వారి ప్రతిభ, కృషి సంస్థ విజయానికి ఇంధనంగా పనిచేస్తుంది.
‘మొదట్లో ఏ మహిళలకైనా ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తే...నేను చేయలేనేమో అన్నట్లుగా మాట్లాడేవారు. నువ్వు తప్పకుండా చేయగలవు. నీలో ఆ ప్రతిభ ఉంది...అని ప్రోత్సహిస్తే కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం మాత్రమే కాదు తమను తాము నిరూపించుకున్న మహిళలు మా సంస్థలో ఎంతోమంది ఉన్నారు’ అంటుంది లీనా. 1961లో యుఎస్వీ ఏర్పాటయింది. అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు స్త్రీలను గౌరవించే సంస్కృతికి కూడా సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలు పాదుకొల్పిన ఈ విలువలను మరింత ముందుకు తీసుకువెళుతుంది లీనా.
‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్’లో పట్టా పుచ్చుకుంది. వ్యాపార పాఠాలు మాత్రమే కాదు జీవితపాఠాలను కూడా చదువుకుంది లీనా. అందుకే ‘ఫోర్బ్స్’ మాత్రమే కాదు ఫిలాంత్రోపి జాబితాలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. దీనిలో ఒక వాక్యం...
‘నువ్వు గెలవడమే కాదు ఇతరుల గెలుపు గురించి కూడా ఆలోచించు' లినా తివారీ గాంధీ వ్యక్తిత్వానికి అద్దం పట్టే వాక్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చదవండి: World Post Day: జ్ఞాపకాల మూట
Comments
Please login to add a commentAdd a comment