దేశంలో అత్యంత ధనవంతుడు మళ్లీ ముకేషే
ఒక్క ఏడాదిలో దాదాపు 31 వేల కోట్ల రూపాయల సంపద కరిగిపోయినా కూడా.. దేశంలో అత్యంత ధనవంతుడిగా వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ముకేష్ అంబానీయే నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ 1,25,222 కోట్ల రూపాయలని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు తొలిసారిగా దేశంలోని వందమంది అత్యంత సంపన్నవంతుల జాబితాలో చోటు సంపాదించుకోగలిగారు. అంబానీ తర్వాత రెండో స్థానంలో 1,19,259 కోట్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, మూడో స్థానంలో 1,05,345 కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ ఉన్నారు.
ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్, బిన్నీ బన్సల్ తొలిసారిగా 86వ స్థానంలోకి ప్రవేశించారు. వీళ్ల ఒక్కొక్కరి సంపద 8613 కోట్ల రూపాయలుగా నిర్ధరించారు. మొత్తం వంద మంది సంపద కలిపి 22,85,797 కోట్ల రూపాయలు అయ్యింది. అయితే గత సంవత్సరం కంటే మాత్రం ఇది దాదాపు వంద కోట్ల రూపాయలు తక్కువ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం 7 శాతం వృద్ధిరేటుతో ముందుకెళ్తోందని, అయితే దేశంలోని వందమంది ధనవంతుల సంపద మాత్రం గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి విలువ తగ్గడంతో కొంతమేర కరిగిపోయిందని ఫోర్బ్స్ విశ్లేషించింది.
టాప్ టెన్ ధనవంతులు వీరే..
ముకేష్ అంబానీ - 1,25,222 కోట్లు
దిలీప్ సంఘ్వీ - 1,19,259 కోట్లు
అజీమ్ ప్రేమ్జీ - 1,05,345 కోట్లు
హిందూజా సోదరులు - 1,05,345 కోట్లు
పలోంజీ మిస్త్రీ - 97,394 కోట్లు
శివ్ నాడార్ -85,469 కోట్లు
గోద్రెజ్ కుటుంబం - 75,530 కోట్లు
లక్ష్మీ మిట్టల్ - 74,205 కోట్లు
సైరస్ పూనావాలా- 52,341 కోట్లు
కుమార మంగళం బిర్లా-51,679 కోట్లు