మాకు కావాలి.. జెండర్‌ బడ్జెటింగ్‌ | Gender budgeting We need Gender‌ Budgeting‌ demand says women enterprenures | Sakshi
Sakshi News home page

మాకు కావాలి.. జెండర్‌ బడ్జెటింగ్‌

Published Tue, Feb 1 2022 5:28 AM | Last Updated on Tue, Feb 1 2022 9:02 AM

Gender budgeting: We need Gender‌ Budgeting‌ demand says women enterprenures - Sakshi

ముంబైకి చెందిన శ్రీజ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌. ‘బడ్జెట్‌’ లేదా ‘బడ్జెట్‌కు సంబంధించిన విశేషాలు’ ఆమెకు ఏమంత ఆసక్తిగా ఉండేవి కావు. ఆరోజు బడ్జెట్‌ రోజు. ఒకప్పుడు తనతోపాటు కలిసి చదువుకున్న రూప తనను అడిగింది...
‘ఇది జెండర్‌ బడ్జెటే అంటావా?’ అని.
శ్రీజకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు.

నిజం చెప్పాలంటే ‘జెండర్‌ బడ్జెట్‌’ అనే మాట వినడం తనకు తొలిసారి. దీని గురించి ఫ్రెండ్‌ను అడిగి తెలుసుకుంది. ఆరోజు మొదలైన ఆసక్తి తనను పబ్లిక్‌బడ్జెట్‌ను విశ్లేషిస్తూ జెండర్‌ బడ్జెటింగ్‌పై ప్రత్యేకంగా నోట్స్‌ రాసుకునేలా చేసింది.

‘బడ్జెట్‌ అనేది ఆర్థికవేత్తలు, ఎకనామిక్స్‌ స్టూడెంట్స్‌ వ్యవహారం అన్నట్లుగా ఉండేది నా ధోరణి. ఇది తప్పని, బడ్జెట్‌ అనేది మన జీవితానికి ముడిపడి ఉన్న విషయమని తెలుసుకోవడంలో కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు మాత్రం బడ్జెట్‌ విషయాలపై చాలా ఆసక్తి చూపుతున్నాను’ అంటుంది శ్రీజ.
ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు, ప్రవేశ పెట్టిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తలు, ఉద్యమకారుల నుంచి తరచుగా వచ్చే మాట... జెండర్‌ బడ్జెటింగ్‌ లేదా జెండర్‌ సెన్సిటివ్‌ బడ్జెటింగ్‌.
ఏమిటిది?
స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్‌ను జెండర్‌ దృక్పథం నుంచి పరిశీలించి, విశ్లేషించడం. దీనివల్ల ఏమవుతుంది?
నిపుణుల మాటల్లో చెప్పాలంటే...అసమానతలు, పక్షపాతధోరణులు లేకుండా చేయగలిగే మందు ఇది. స్త్రీ, పురుష ఉద్యోగులలో జీతభత్యాల మధ్య వ్యత్యాసం నుంచి వనరుల పంపకం వరకు తేడా లేకుండా చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. సంస్థాగత స్థాయిలో ప్రభుత్వసంస్థల విధానాలను పదునుగా విశ్లేషిస్తుంది.

రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక సంక్షేమం, భద్రత, విద్య... మొదలైన వాటిలో లింగవివక్షతకు తావు ఇవ్వని విధానం రూపుదిద్దుకునేలా తోడ్పడుతుంది. ‘లింగ వివక్ష’కు కారణమయ్యే రాజకీయ, ప్రాంతీయ, సాంస్కృతిక పరిమితులను ప్రశ్నిస్తుంది. మహిళలకు సంబంధించిన సోషల్‌ రీప్రొడక్షన్‌ రోల్స్‌ పబ్లిక్‌ బడ్జెట్‌లో గుర్తింపుకు నోచుకోవనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ‘జెండర్‌ బడ్జెటింగ్‌’కు ప్రాధాన్యత పెరిగింది.
కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన ప్రతికూలతల నేపథ్యంలో గతంతో పోల్చితే ‘జెండర్‌ బడ్జెటింగ్‌’ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ పెరిగింది.

‘కోవిడ్‌ సృష్టించిన కల్లోలం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ను మొదలు పెట్టాలనుకునేవారికి శాపంలా మారింది. ఎంతో కష్టపడి కంపెనీలు నిర్వహిస్తున్నవారు నష్టాలతో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలి. జెండర్‌ బడ్జెటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటారు ఫ్లోరెన్స్‌ క్యాపిటల్‌ సీయీవో పోషక్‌ అగర్వాల్‌.
‘ఎన్నికలలో రాజకీయ పార్టీలు మహిళలను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అయితే వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో జెండర్‌ బడ్జెటింగ్‌ అనే మాట కనిపించదు. ఇప్పటికైనా ఈ ధోరణిలో మార్పు రావాలి’ అంటారు తిరువనంతపురం (కేరళ)కు చెందిన లీనా.

కొన్ని యూనిట్లు రకరకాల కారణాల వల్ల నాన్‌–పెర్‌ఫార్మింగ్‌ అసెట్స్‌(ఎన్‌పీఏఎస్‌) జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. ఒక్కసారి ‘ఎన్‌పీఏఎస్‌’ ముద్ర పడిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తల పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఆ పారిశ్రామిక వేత్తలు పోరాటస్ఫూర్తిని కోల్పోయి నిస్తేజంగా మారుతున్నారు. ఎన్‌పీఏఎస్‌ జాబితాలో చేరిన తరువాత మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ధోరణిలో మార్పు రావాలంటుంది లేడి ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గనైజేషన్‌.

మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజ్‌ (ఎంఎస్‌ఎంఈ) లేదా చిన్న తరహా వ్యాపారాలలో ఎంతోమంది మహిళలు ఉన్నారు. వారు ‘కేంద్ర బడ్జెట్‌ 2022’పై ఆశలు పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులలో ప్రధానమైనది బ్యాంక్‌లోన్‌కు సంబంధించిన వడ్డీరేటు తగ్గించాలనేది. ‘స్పెషల్‌ కోవిడ్‌ ఇన్‌సెంటివ్‌’ ప్రకటించాలని బలంగా కోరుకుంటున్నారు. వేగంగా పుంజుకోవడానికి, దూసుకెళ్లడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో బ్యాంకులు ఉదారంగా ఉండాలని కోరుకుంటున్నారు. టెక్నాలజీ అప్‌గ్రేడెషన్‌కు సంబంధించి ‘ఎంఎస్‌ఎంఈ’లకు బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదు.

ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు, ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తి ఇస్తుంది. అయితే కోవిడ్‌ తుఫాను ఎన్నో దీపాలను ఆర్పేసింది. ఈ నేపథ్యంలో సానుభూతి కంటే చేయూత ముఖ్యం అంటున్నారు మహిళా పారిశ్రామికవేత్తలు. ‘విజయాల మాటేమిటోగానీ, ఉనికే కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అట్టడుగు వర్గాలు, గ్రామీణప్రాంతాలలో ఎంతోమంది మహిళా వ్యాపారులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. వారు నిలదొక్కువడానికి ప్రభుత్వం పూనుకోవాలి’ అంటుంది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌.

విద్యారంగంపై దృష్టిపెట్టినట్లే పారిశ్రామిక రంగంపై దృష్టిపెట్టాలని, అప్పుడే సక్సెస్‌ఫుల్‌ ఫిమేల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ వస్తారనేది అందరి నమ్మకం. పది మందికి ఉపాధి చూపుతూ, వందమందికి ఆదర్శంగా నిలుస్తున్న చిన్నతరహా మహిళా వ్యాపారులకు అండగా ఉండే  ఆశావహపరిస్థితిని బడ్జెట్‌ నుంచి ఆశిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు.

‘ సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఎలా తయారవుతారు?’ అనే ప్రశ్నకు ‘ఉన్నత విద్యాసంస్థలలో చదువుకున్నవారు, ఉన్నత విద్యను అభ్యసించినవారు’ అనేది సరిౖయెన జవాబు కాదు. అది కాలానికి నిలిచే సమాధానం కూడా కాదు. అయితే, కాలానికి ఎదురీది కూడా నిలదొక్కునేవారే నిజమైన వ్యాపారులు అంటారు. దీనికి ప్రభుత్వ సహకారం కావాలి. ఆ సహకారం వెలుగు బడ్జెట్‌లో కనిపించాలి.

‘జెండర్‌ బడ్జెటింగ్‌’అనేది ఎంత ఆకర్షణీయమైన మాటో, ఆచరణ విషయానికి వచ్చేసరికి రకరకాల దేశాల్లో రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. దీనిలో సంప్రదాయ ఆలోచనదే అగ్రభాగం. అయితే ప్రసుత్తం మూస ఆలోచనలకు చెల్లుచీటీ పాడే కాలం వస్తుంది.
‘నిజంగానే మహిళాలోకం నిండు హర్షం వహిస్తుందా?’ అనే ప్రశ్నకు నేటి బడ్జెట్‌ సమాధానం చెప్పనుంది.

పన్ను మినహాయింపుల ద్వారా మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి నిలదొక్కుకునేలా చేయాలి. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి.
– శ్రేయ సబర్వాల్, స్కైర్‌–ఫోర్క్‌ సీయీవో 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement