All We Imagine as Light: గోల్డెన్‌ బరిలో మన బంగారం | Payal Kapadia All We Imagine as Light in Cannes 2024 competition section | Sakshi
Sakshi News home page

All We Imagine as Light: గోల్డెన్‌ బరిలో మన బంగారం

Published Thu, Apr 18 2024 6:07 AM | Last Updated on Thu, Apr 18 2024 9:56 AM

Payal Kapadia All We Imagine as Light in Cannes 2024 competition section - Sakshi

క్రియేటివ్‌ వరల్డ్‌

డెబ్యూ ఫిక్షన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముంబైకి చెందిన పాయల్‌ కపాడియా. కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లోని ప్రిస్టీజియస్‌ కాంపిటీషన్‌ సెక్షన్‌ పామ్‌ డ ఓర్‌ (గోల్డెన్‌ పామ్‌)లో పాయల్‌ ఫిల్మ్‌ పోటీ పడనుంది. మూడు దశాబ్దాల తరువాత మన దేశం నుంచి ఈ విభాగానికి ఎంపికైన చిత్రం ఇదే...

ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న పాయల్‌కు ఆర్థికశాస్త్రం కంటే సినిమా శాస్త్రమే ఎక్కువగా దగ్గరైంది. ఆ ఇష్టంతోనే ‘పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో చేరాలనుకుంది. రెండో ప్రయత్నంలో ఫిల్మ్‌ డైరెక్షన్‌ కోర్సులో చేరింది.  పాయల్‌కు తొలి గుర్తింపు ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(2017)కు మన దేశం నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఇది. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు డైలాగ్‌ రైటింగ్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ స్క్రిప్ట్‌ రాసుకుంది.

పాయల్‌ శబ్దప్రేమికురాలు. ‘చెవులు మూసుకొని సినిమా చూస్తే ఏ ఫీలింగ్‌ ఉండదు’ అంటున్న పాయల్‌కు ఏ దృశ్యంలో ఎలాంటి శబ్దం ఉపయోగించాలో బాగా తెలుసు. ‘సినిమాలు ఎందుకు తీస్తారు?’ అనే ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా జవాబు చెప్పవచ్చు. పాయల్‌ చెప్పే జవాబు మాత్రం... ‘నన్ను నేను అర్థం చేసుకోవడానికి, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చిత్రాలు తీస్తాను’ సినిమాను పాయల్‌ అర్థం చేసుకునే కోణం కూడా భిన్నమైనది. ‘సినిమా అనేది ΄్లాటే సర్వస్వంగా ఉండనక్కర్లేదు. చక్కని కవిత్వం చదివినట్లు ఉన్నా సరిపోతుంది’ అనేది ఆమె మనసులోని భావం.

 సోకాల్డ్‌ ఆడంబరాలు, పాపులర్‌ కల్చర్‌కు దూరంగా ఉండే ‘రిషి వ్యాలీ స్కూల్‌’లో చదువుకున్న చదువు పాయల్‌ ఆలోచనలను విశాలం చేసింది. ఇప్పుడంటే ప్రపంచ ‘చిత్ర’ పటంలో తనకంటూ కొంత గుర్తింపు సాధించింది పాయల్‌. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లితే మాత్రం ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించి ఫస్ట్‌ రిజెక్షన్‌ ఆమెను అమితంగా బాధించింది. కలల మేడ కళ్ల ముందే కుప్పకూలినట్లుగా అనిపించింది.

‘స్కూల్‌ రోజుల నుంచి పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాలనేది నా కల. ఎందుకంటే నేను అభిమానించే ఎంతో మంది దర్శకులు అక్కడ చదువుకున్నారు. మొదట బాధ అనిపించినా ఆ తరువాత రెండో ప్రయత్నం చేయాలనుకున్నాను’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పాయల్‌. రెండో ప్రయత్నం చేసి ఉండకపోతే ఆమె ప్రతిభ వృథాగా పోయేది.

‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’కు లభించిన గుర్తింపుతో పాయల్‌ మనసులో ఆత్మవిశ్వాసం అనే బీజం పడింది. ‘ది లాస్ట్‌ మ్యాంగో బిఫోర్‌ ది మాన్‌సూన్‌’ ఫిల్మ్‌తో ఆ విత్తనం మొలకెత్తింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ క్రిటిక్స్‌ ప్రైజ్‌ గెలుచుకుంది.‘ఏ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పాయల్‌. ఇది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (2021)లో బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘గోల్డెన్‌ ఐ’ అవార్డ్‌ అందుకుంది.

ఫిల్మ్‌మేకర్స్‌ డిజిటల్‌ ప్రపంచంలో ఉన్న ఈ కాలంలోనూ ‘ఫిల్మ్‌’ అంటే పాయల్‌కు ప్రత్యేక ఇష్టం. ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ను ఫిల్మ్‌ పైనే షూట్‌ చేసింది. ‘డిజిటల్‌ ఫిల్మ్‌తో పోల్చితే ఓల్డ్‌–స్కూల్‌ ఫిల్మ్‌లో ఇమేజ్‌కు సంబంధించిన ఈస్థెటిక్‌ క్వాలిటీ, సాఫ్ట్‌నెస్‌ భిన్నంగా ఉంటుంది’ అంటుంది పాయల్‌.
ఫిల్మ్‌మేకింగ్‌ అనేది ఇలా అనుకోగానే అలా అయిపోదు. కొన్నిసార్లు చాలా టైమ్‌ తీసుకోవచ్చు. అందుకు ఎంతో ఓపిక అవసరం. అందుకే చిత్రనిర్మాణాన్ని శిల్పం చెక్కడంతో పోల్చుతుంది పాయల్‌. ‘చిత్రనిర్మాణం అనేది చాలా ఓపికగా శిల్పం చెక్కడం లాంటిది. ఆ శిల్పం ఎలా రూపుదిద్దుకోనుందో శిల్పికి కూడా తెలియదు. చిత్రం కూడా అంతే’ అంటుంది పాయల్‌.

పాయల్‌ తల్లి నళిని మలాని ఆర్టిస్ట్‌. దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాల క్యాసెట్లను ఇంటికి తీసుకువచ్చేది. సినిమాలపై పాయల్‌ ఆసక్తికి తల్లి ఫిల్మ్‌ కలెక్షన్‌ ఒక కారణం. ‘చూడాలేగానీ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఎంతో అందం దాగుంది. అలాంటి అందాలను అమ్మ ఆస్వాదిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది’ అంటుంది పాయల్‌.
తల్లి ప్రభావం పాయల్‌పై కనిపిస్తుంది. ‘జీవనోత్సాహం నుంచే సృజన జనిస్తుంది’ అంటున్న పాయల్‌ తనదైన విజువల్‌ లాంగ్వేజ్‌ను తయారు చేసుకుంటోంది.

మూడు దశాబ్దాల తరువాత...
పాయల్‌ కపాడియా గుర్తింపును మరో స్థాయికి తీసుకు వెళ్లిన ఫీచర్‌ ఫిల్మ్‌ ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌. ముంబైలోని నర్స్‌ ప్రభ, భర్త, ప్రభ స్నేహితురాలు అను కేంద్రంగా సాగే చిత్రం ఇది. షాజీ ఎస్‌ కరుణ్‌ మలయాళ చిత్రం ‘స్వాహమ్‌’ తరువాత కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రధాన పోటీకి ఎంపికైన చిత్రంగా ప్రత్యేకతను సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆల్‌ వి...’కి దర్శకత్వంతో పాటు రచన కూడా చేసింది పాయల్‌. ఈ చిత్రంలో దివ్య ప్రభ(మలయాళం సినిమా టేక్‌ ఆఫ్‌ ఫేమ్‌), కనీ కుస్రుతి (కేరళ కేఫ్‌ ఫేమ్‌), హృదు హరూన్‌ నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement