ఒక ‘జెంటిల్‌మేన్’ పుట్టాలంటే,
ఏ ‘జీన్స్’ కావాలో..! వాడు ‘భారతీయుడై’...
దుండగుల పాలిట ‘అపరిచితుడై’...
నరకంలో శిక్షలన్నీ భూమ్మీదే ఆచరణలో పెట్టేసి,
అవినీతిని అంతమొందించేసి...
ఒక్కరోజులోనే ముఖ్యమంత్రై, రాష్ట్రాన్ని బాగుచేసిన ‘ఒకే ఒక్కడు’...
ఆగస్టు 17న పుడితే... అతనే దక్షిణ భారత దర్శకుల స్థాయిని,
మోడరన్ జెనరేషన్‌లో సినిమా బడ్జెట్‌ని, మార్కెట్‌ని వంద కోట్లు దాటించిన ‘రోబో’టిక్ బ్రెయిన్, వీర ‘శివాజీ’ - శంకర్! పేరుకి తమిళ దర్శకుడైనా, తెలుగువారికి చాలా సుపరిచితుడు, ఆప్తుడు, అభిమాన దర్శకుడు శంకర్‌కి జన్మదిన శుభాకాంక్షలతో ఈ హార్టికల్‌ని చిరుకానుకగా అందిస్తున్నాను.
సినిమాలో పెద్ద హీరో ఉండాలి. ప్రతి దర్శకుడి కోరికే ఇది.
సినిమాకి బాగా ఖర్చుపెట్టే నిర్మాత కావాలి. ప్రతి దర్శకుడి అవసరమే ఇది.
సినిమా సూపర్‌హిట్టవ్వాలి. ప్రతి దర్శకుడి కలే ఇది.
కానీ, సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలి. కేవలం దర్శకుడు శంకర్‌కి మాత్రమే మొదటి సినిమా నుంచి ఈ రోజుదాకా ఉన్న నిబద్ధత ఇది. నియమం ఇది. కట్టుబాటు ఇది.
అన్ని కమర్షియల్ కథల్లో హీరోలాగే శంకర్ సినిమాలో హీరో కూడా దొంగతనాలు చేస్తాడు. చట్టం నుంచి తప్పించుకుంటాడు. కానీ విద్యావ్యవస్థ మీద విరక్తి చెంది, పేద విద్యార్థుల్ని పెద్ద చదువులు చదివిస్తాడు. సామాన్య విద్యార్థుల కలల్ని తను కంటాడు. అందుకే అతను జెంటిల్‌మేన్.
పదిహేడు సంవత్సరాలు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా, కో-డెరైక్టర్‌గా ఎస్.ఎ.చంద్రశేఖర్, కె.బాలచందర్ తదితరుల దగ్గర సుశిక్షితుడై, కె.టి.కుంజుమోన్ నిర్మాతగా ‘జెంటిల్‌మేన్’ సినిమాకి మొదటిసారి మెగాఫోన్ పట్టారు శంకర్. అప్పుడే విక్రమ్‌ధర్మా అనే ఫైట్ మాస్టర్ కోసం రోజూ లంచ్ బ్రేక్‌లో ‘భైరవ ద్వీపం’ షూటింగ్‌కి వచ్చేవారు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డెరైక్టర్‌ని. విక్రమ్‌ధర్మాకి నాపై ఉన్న అభిమానం వల్ల, శంకర్‌తో కథాచర్చల్లో నన్నూ కూర్చోబెట్టుకునేవారు. ఆయన విజన్‌ని ఆయన మాటల్లో స్వయంగా నేనూ చూశాను.
మనిషి వీర సౌమ్యుడు, సహనశీలి. ఆలోచనల్లో వీర కసి. పని అయ్యేదాకా సడలని పట్టుదల. స్ప్లిట్ పర్సనాలిటీ. అందుకే ‘అపరిచితుడు’ కథను అంత బాగా రాసుకోగలిగారు. ‘జెంటిల్‌మేన్’ సూపర్‌హిట్ అయ్యాక కూడా విక్రమ్‌ధర్మాని కలవడానికి వచ్చేవారు. అప్పుడు నేను కమల్‌హాసన్ సినిమా ‘నమ్మవర్’కి అసోసియేట్‌ని. ‘భారతీయుడు’ రూపుదిద్దుకుంటోంది... ఎ.ఎం.రత్నం నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో. ఆ సినిమాకి నన్ను పనిచేయమని అడిగారు. అప్పటికే ఆయన దగ్గర తమిళ అసిస్టెంట్ డెరైక్టర్లు క్యూ కడుతున్నారు. మొదటి సినిమా రిలీజ్‌కి ముందు, రెండో సినిమా మేకింగ్‌లోనూ ఒకే రకమైన డౌన్ టూ ఎర్త్ నేచర్. ఆ టైమ్‌లోనే వాహినీ స్టూడియోకొచ్చి ఆయన పెళ్లికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి వెళ్లారు. అప్పుడు నేను ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాకి అసోసియేట్‌ని.
శంకర్‌ని కలిసినప్పుడు సినిమా గురించి తప్ప సినిమావాళ్ల గురించి ఆయన ఒక్కమాట కూడా తేడాగా మాట్లాడటం నేను వినలేదు. కలిసిన ప్రతిసారీ ఆయన స్థాయిలో అనూహ్యమైన మార్పులున్నాయి. కానీ స్వభావంలో అణువంతైనా మార్పు లేదు. స్థిత ప్రజ్ఞత అతన్నుంచి నేను నేర్చుకున్న మొదటి లక్షణం. సంగీతం, సాహిత్యం, హాస్యం, శృంగారం, రౌద్రంలో ఎక్కడా అతి గానీ, అసభ్యత గానీ, అశ్లీలం గానీ లేకపోవడం అతన్నుంచి దర్శకుడిగా నేను నేర్చుకున్న రెండో లక్షణం.
1990ల తర్వాతి దక్షిణ భారత చలనచిత్ర సీమ గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కచ్చితంగా శంకర్ ముందు వరుసలో ఉంటారు. సామాన్య మానవుడిని, నిరక్షరాస్యుడిని కూడా మెప్పించేలా, ఆలోచింపజేసేలా మంచి మాటలు చెప్పాలంటే, ఆ సినిమా దర్శకుడు చాలా విజ్ఞుడై ఉండాలి. తెలివితేటలు, సాహితీ పరిజ్ఞానంతో పాటు చాలా కామన్‌సెన్స్ ఉన్నవాడై ఉండాలి. గొప్ప టెక్నీషియన్స్‌ని, మేథావులైన రచయితల్ని, స్టార్స్‌ని, బాగా డబ్బుపెట్టే నిర్మాతని సమకూర్చుకున్నంత మాత్రాన శంకర్ స్థాయి దర్శకుడైపోరు ఎవరూ. నేల, బెంచీ, బాల్కనీ, రిజర్వ్‌డ్, ఎగ్జిక్యూటివ్, గోల్డ్ క్లాస్ టిక్కెట్లు కొన్న కోట్లమంది మెదళ్లని ఏకకాలంలో కదిలించి, నవ్వించి, ఒళ్లు గగుర్పొడిపించి, అద్భుతం అనిపించి, ఆ! అవును నిజమే కదా అని ఆలోచింపజేసి, సినిమా సూపర్‌హిట్ అనిపించడం అంటే... నేను ఈ ఆర్టికల్ రాసినంత సింపుల్ కాదు... శంకర్ లైఫ్ స్టైల్ అంత సింపుల్ కూడా కాదు - శంకర్ అంత టఫ్ - శంకర్ అంత కాంప్లికేటెడ్.
ఎంతో ధైర్యం, విజన్, యాటిట్యూడ్, ఫైర్, గట్ ఫీలింగ్, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే తప్ప ఎవరూ శంకర్ కాలేరు. శంకర్ ఒక ప్యాకేజీ. నవీన దర్శకుడి లక్షణాలకి ఒక నమూనా. న్యూ ట్రెండ్ సినిమాకి, టెక్నికల్‌గా ఎదుగుతున్న సొసైటీకి ఒక దిక్సూచి. యూత్‌కి ఒక రోల్ మోడల్.
రజనీకాంత్ నల్లగా ఉంటాడని మనకి చిన్నప్పట్నుంచీ తెలుసు. కానీ నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టే పెళ్లి చేసుకోను అనేస్తుంది శ్రీయ ‘శివాజీ’లో. ఆశ్చర్యంగా రజనీ తెల్లగా తయారవుతారు. ఇది టెక్నికల్‌గా సాధ్యమే అయినా, ఈ థాట్‌ని సినిమాలో పెట్టాలంటే, దర్శకుడికి చాలా విషయం ఉండాలి.
హిమాలయాలకి వెళ్లొచ్చీ వెళ్లొచ్చీ హిమాలయమంత కీర్తిని మూటగట్టుకున్న సూపర్‌స్టార్‌కి ఏ విలన్‌ని పెట్టినా, వెయ్యి మంది విలన్లని పెట్టినా ఆనదనిపించి, ఆయనకి ఆయన్నే విలన్‌ని చేసేశారు శంకర్ ‘రోబో’లో. అది హైట్స్ ఆఫ్ ఇంటెలిజన్స్.
కేరళ విద్యను ప్రయోగించి, లంచగొండుల భరతం పట్టే స్వాతంత్య్ర సమరయోధుడు ‘భారతీయుడు’. కవలలు పుడితే... ప్రేమించే అమ్మాయి కూడా కవలలే కావాలని పట్టు పడితే, సాంకేతికంగా తనో చెల్లెల్ని సృష్టించుకున్న అమ్మాయి కథ ‘జీన్స్’.
చాలామంది విద్యార్థినీ విద్యార్థులకి చిన్నప్పట్నుంచీ వ్యాసరచన పోటీల్లోనో, వక్తృత్వ పోటీల్లోనో ఇచ్చే టాపిక్ ‘‘నేనే ముఖ్యమంత్రినైతే...’’. ఆ టాపిక్‌కి ఆయన వెండితెర మీద రాసిన అద్భుత వ్యాసరచన ‘ఒకే ఒక్కడు’.
అన్నీ జీవితాల్లోంచి పుట్టినవే. సామాన్య, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జీవితాల్లోని అంతః సంఘర్షణలే. ఆవిష్కరించే తీరు మాత్రం అద్భుత రసంతో. అందుకే ఆయన సినిమాలు ఒకే రకమైన సామాజిక పరిస్థితుల్లో పెరిగిన దక్షిణ భారతావనిలో పెద్ద హిట్టు. బహుశా ఈ బలమే వేరే వ్యక్తిత్వం ఉన్న ఉత్తర భారతంలో బలహీనత అయినట్టుంది. వాళ్లకీ సమస్యలు చిన్నవిగానో, అసలు లేనట్టో ఉండుంటాయి. మాఫియా గన్నులో, ప్రియురాలి కన్నులో... ఈ రెండే దశాబ్దాలుగా ప్రధాన టాపిక్ అయిన నార్త్ ఇండియాలో పెన్షన్ ఆఫీసుల్లో లంచాలు, స్వతంత్ర సమరయోధుల బాధలు, అవినీతి, విద్యావ్యవస్థలో ప్రక్షాళనలు - ఇంత హెవీనెస్ అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదా సహజంగా అనిపించకపోయి ఉండొచ్చు. ఏదేమైనా శంకర్ ఎడాప్ట్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ పుట్టినరోజు బాలుడు మనోహరుడై మళ్లీ ముందుకు వస్తున్నాడు. ఈసారి సమస్య ఏదో, పరిష్కారం ఏదో! భారతీయ పురాణ ఇతిహాసాలు వేదాల సారమా? అత్యాధునిక సాంకేతిక మాయాజాలమా? మనిషి సాధారణంగా ఉండాలి. కలలు అసాధారణంగా ఉండాలి. అలా సినిమాని కలగన్నారు శంకర్. వాటిని అన్ని సినిమాల స్థాయిలో కాకుండా, ఇంకా విపరీత ధరలకి అమ్మే రేంజ్‌లో కలలు కన్నారు. ఆ కలల్లో ఒక అర్థవంతమైన, అవినీతి రహితమైన సమాజానికి కావాల్సిన సందేశాల్ని చుట్టి ఇస్తున్నారు.
బురద ఆర్థికంగా నిరుపేద అయితే, అందులో పుట్టిన పద్మం వెలకట్టలేనంత విలువైనది. శంకర్ మనిషిగా, మామూలు దర్శకుడిగా వెలకట్టలేని విలువైన వ్యక్తి. ఇది ఒక్క రాత్రిలోనో, అదృష్టాన్ని నమ్ముకుంటేనో జరగలేదు. పదిహేడేళ్ల పునాది, ఆగని చదువు, అపరిమితమైన మేధోమథనం - ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతను తీసే సినిమాలని కలిపి అనలైజ్ చేయలేం. కానీ ఒక దర్శకుడు తీసే సినిమాల వల్ల, అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకి తెలిసిపోతుంది. శంకర్ అంత గొప్పవాడు. తను నిర్మాతగా మారి, తన దగ్గర పనిచేసిన మంచి సహాయ దర్శకుల్ని దర్శకులుగా ప్రమోట్ చేసిన సహృదయుడు. న్యూవేవ్ దర్శకులందరికీ టార్గెట్ తన సినిమా, సినిమాకీ మరో వందమైళ్లు ముందుకి జరిపి కష్టపెట్టిస్తున్న కృషీవలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మర్యాదగా, వినయంగా మాట్లాడతారు. క్లుప్తంగా చెప్తారు. గుప్తంగా దానాలు చేస్తారు.
20 ఏళ్ల కెరీర్‌లో, సెలెబ్రిటీ లైఫ్‌లో ఎటువంటి చిన్న కాంట్రవర్సీ గానీ, చెడు గాసిప్పు గానీ అంతర్జాలంలోను, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలోనూ లేని ఏకైక వ్యక్తి శంకర్. ఇది నిజంగా చాలా చాలా కష్టం. కలల వ్యాపారంలో సంఘ సంస్కరణలని అమ్మడం అన్నిటికన్నా అత్యంత కష్టమైన పని. దానిని అమిత ఇష్టంగా చేసే వ్యక్తిగా, దర్శకుడిగా శంకర్ అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులలాగా నాక్కూడా అమిత ఇష్టం. సాటి దర్శకుడిగా చాలా గౌరవం. ఈ పుట్టినరోజు ఆయనకి మనోహరమైన మంచి హిట్టుని ఇస్తుందని గట్టిగా నమ్ముతూ... ఒక దర్శకుడినైనా, సాటి దర్శకుడు శంకర్ గురించి నన్ను ఈ సందర్భంగా ఆర్టికల్ రాయమని పురమాయించిన ‘సాక్షి’కి
కృతజ్ఞతలు.
- మీ
వి.ఎన్.ఆదిత్య
వ్యక్తిగతంగా శంకర్...
తమిళ చిత్రం ‘కుంగుమమ్’లో శివాజీ గణేశన్ పాత్ర పేరు శంకర్. తనకో కొడుకు పుడితే శంకర్ అని పేరు పెడతానని అనుకున్నారట శంకర్ తల్లి. పుట్టగానే ఆ పేరే పెట్టేశారట.
సినిమాల్లోకి రాకముందే చెన్నయ్‌లోని హాల్డా కంపెనీలో శంకర్ పనిచేవారు. అప్పుడు కార్మిక సంఘం కార్యకలాపాల విషయంలో చిన్న వివాదం జరిగి, మూడు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారట.
శంకర్‌కి గడియారాలంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు రకరకాల గడియారాలను సేకరించారు. ఎలాంటి సమయంలో అయినా చేతికి ఉన్న గడియారానికి ఒక్క గీటు కూడా పడకుండా జాగ్రత్తపడతారట.
పెళ్లయిన తర్వాత శంకర్ స్వయంగా షాప్స్‌కి వెళ్లి బట్టలు కొన్నదే లేదట. తన భార్య ఈశ్వరి సెలక్ట్ చేసినవే ఆయన ధరిస్తారట.
‘బాయ్స్’ సినిమాకి ముందు శంకర్ సిగరెట్లు తాగేవారు. ఆ సినిమా తర్వాత పూర్తిగా మానేశారు. అప్పుడప్పుడు రజనీకాంత్ ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘అంత సులువుగా ఎలా మానేయగలిగావ్ శంకర్’ అని అడగుతుంటారట.
షూటింగ్ లొకేషన్లో సిల్లీ జోకులేయడం శంకర్‌కి నచ్చదు. చాలా సీరియస్‌గా ఉంటారు. ఒకవేళ తనకు నచ్చనిది ఏదైనా జరిగితే.. అక్కణ్ణుంచి దూరంగా వెళ్లిపోతారు. కోపం తగ్గిన తర్వాతే లొకేషన్లోకి అడుగుపెడతారట.
ప్రతి రోజూ దాదాపు గంటసేపు షటిల్ కాక్ ఆడటం శంకర్ అలవాటు. షూటింగ్ లొకేషన్లో అప్పుడప్పుడూ తన సహాయ దర్శకులతో కూడా ఆడుతుంటారట.
భారతదేశంలో తాజ్‌మహల్, విదేశాల్లో పీసా టవర్ అత్యద్భుత కట్టడాలని శంకర్ అంటారు. తాజ్‌మహల్‌ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, పీసా అలా ఒరిగిపోయి ఉండటం వింతగా ఉంటుందని అంటుంటారట.
క్రియేటివిటీ +సోషల్ రెస్పాన్సిబిలిటీ =శంకర్
Published Sat, Aug 16 2014 11:16 PM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
Advertisement
Advertisement