ఎమ్మెల్యే బిజయ్‌శంకర్ దాస్‌తో బాధితురాలు సోమాలికా(ఫైల్)
భువనేశ్వర్: బిజూ జనతాదళ్ అభ్యర్థి, తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిజయ్‌శంకర్ దాస్ చిక్కుల్లో పడ్డారు. ఆయన స్నేహితురాలు సోమాలికా దాస్(29) దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించి, విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు నిందిత శాసనసభ సభ్యుడికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... 2022 మే 13న సోమాలికా దాస్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ పట్ల కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రధానంగా జగత్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ ఆమె సమస్యలను పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది.
ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సీఆర్‌పీసీ 154(3) సెక్షన్ కింద ఏదైనా చర్య తీసుకోవడంలో జిల్లా ఎస్పీ చొరవ కల్పించుకోవాలి. ఈ మేరకు ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సోమాలికా దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 27న జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు బిజయ్‌శంకర్‌కు వ్యతిరేకంగా తాజా ఫిర్యాదుతో పాటు తన ఆర్డర్ కాపీతో ఐఐపీ, జగత్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా అనుబంధ సమాచారంతో ఫిర్యాదు ఆమోదించి, కేసు నమోదు చేయాలని జగత్‌సింగ్‌పూర్ ఐఐసీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
హైకోర్టు ఆదేశాల మేరకు సోమాలికా జగత్‌సింగ్‌పూర్ ఐఐసీని సంప్రదించి, రాతపూర్వక ఫిర్యాదును సమర్పించింది. దీని ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఆమెకు సంబంధిత అధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో దాఖలు చేసిన ఫిర్యాదు వ్యతిరేకంగా ఠాణా పోలీసు అధికార వర్గాలు స్పందించక పోవడంతో హైకోర్టుని ఆశ్రయించడం అనివార్యమైందని స్పష్టంచేశారు.
బీజేడీ ఎమ్మెల్యే తన ఎన్నికల ఖర్చుల కోసం డబ్బును సేకరించేందుకు సెక్స్ రాకెట్లను నిర్వహిస్తున్నారని సోమాలికా గతంలో ఆరోపించారు. అలాగే పెళ్లి చేసుకుంటానని దగా చేశారని, జగత్‌సింగ్‌పూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి అన్నీ సిద్ధం చేసి, సకాలంలో కానరాకుండా అదృశ్యమై తనను మోసం చేశారని విమర్శించింది. దీనిపై తనపై సంబంధిత ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆరోపించింది. వీటికి సంబంధించి అన్ని సాక్ష్యాలను అందిస్తానని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment