ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్‌లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం.
బిగిన్ ది బిగిన్
కమల్‌హాసన్ కెరీర్‌లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్.
మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్‌లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్‌ల కాంబినేషన్‌లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
లక్నో టు లాహోర్
దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్‌లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు
. ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’.
‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్‌లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్
సంతోషిల కాంబినేషన్‌లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్‌లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది.
ఎప్పటికీ హీరోయే!
జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment