v.n.aditya
-
బ్యాడ్ పోలీస్ గుడ్ సన్
దేడ్ కహానీ - దబాంగ్ 2015లో ముంబై బాంబ్ బ్లాస్ట్‌ల నిందితుడు యాకూబ్ మెమన్‌ని ప్రభుత్వం ఉరితీయబోయే ముందు అత్యంత ప్రజాదరణ కలిగిన సినీ హీరో, భారతీయ పౌరుడు సల్మాన్‌ఖాన్, ‘‘యాకూబ్‌ని కాదు వాళ్లన్నయ్య టైగర్ మెమన్‌ని ఉరి తీయాలి - ఇతన్ని తీయకూడదు’’ అని పబ్లిగ్గా ట్వీట్లు పెట్టాడు - ‘భయం లేదు’. సెప్టెంబర్ 26, 2011లో ముంబై వరుస బాంబుదాడుల మారణ హోమం తర్వాత, ఇదే భారతదేశ పౌరుడు, అత్యధిక ప్రజాదరణ కలిగిన టాప్ త్రీ హీరోల్లో ఒకడు, సల్మాన్‌ఖాన్ ఏకంగా పాకిస్థానీ టెలివిజన్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ, పాకిస్థాన్ని బ్లేమ్ చేయకూడదు, భారతదేశ రక్షణ దళాల వైఫల్యం అని పబ్లిగ్గా చెప్పగలిగాడు - ‘భయం లేదు’. ప్రభుత్వ అటవీశాఖ నియమాలకి విరుద్ధంగా రాజస్థాన్‌లో షూటింగ్‌కి వెళ్లినపుడు స్నేహితులతో కలిసి కృష్ణజింకల్ని వేటాడగలిగాడు - దొరికినా, జైలుకెళ్లినా, మళ్లీ స్వేచ్ఛగా బైటికి రాగలిగాడు ఇదే నటుడు - ‘భయం లేదు’. మద్యం సేవించి, వాహనం నడిపినపుడు రోడ్డుపక్కన నిద్రిస్తున్న పౌరుల పైకి కారు పోనిచ్చి, వారి చావుకి కారణమైన అభియోగాన్ని కోర్టులో ఎదుర్కొన్న హీరో. - ‘భయం లేదు’. ఇవన్నీ బొమ్మకి అవతలవైపు బొరుసు - నిజ జీవిత పాత్ర వేసే నీచమైన వేషాలివి. అయినా ‘భయం లేదు’. ఎందుకంటే భారతీయ సమాజంలో పదిమంది అభిమానుల్ని సంపాదించగలిగినా, లేదా ప్రభుత్వ అండదండలున్నా, లేదు పదిమంది రౌడీలని పోషించగలిగినా, ఏ మగాడికీ ఇంక ‘భయం లేదు’ - జనాభాలో రెండో అగ్రదేశం విచిత్రంగా ఒక వ్యక్తి వెనకాలున్న జనాన్ని చూసి భయపడడం. ఈ బొరుసుని చూస్తే నాకు భయమేస్తుంది. మన సమాజం తాలూకు సిగ్గులేనితనం మీద అసహ్యం వేస్తుంది. కానీ అవతలి వైపు బొమ్మ, వెండితెర మీద కనిపించగానే అభిమానం పుట్టేస్తుంది. ఆనందం తాండవిస్తుంది. బొమ్మ చేసే మాయ అది. ఆ మాయ పుట్టించే భ్రమ అది. భయం లేకపోవడమే ఇంగ్లిషులో ఫియర్నెస్, హిందీలో ‘దబాంగ్’. అది సూపర్‌హిట్ సినిమాగా ఆడడం కేవలం సల్మాన్‌ఖాన్ చేసిన మెస్మరిజమ్. తమ్ముడు అర్బాజ్‌ఖాన్ నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ దర్శక, రచయిత అనురాగ్ కశ్యప్ సోదరుడు, అభినవ్ కశ్యప్‌ని దర్శకుడిగా తొలిసారి పరిచయం చేస్తూ, పాత తరం ప్రముఖ హీరో, మాజీ కేంద్ర మంత్రి శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హాను కథానాయికగా మొదటిసారి పరిచయం చేస్తూ, సల్మాన్‌ఖాన్ వీర సాహస, హస్య, శృంగార విన్యాసాలే తెరంతా నిండిపోయేలా, మధ్యలో తళుక్కుమని ఓ కంటిమీద నీటి చుక్క మొలకెత్తేలా కొంచెం కరుణ రసం కలిపి అల్లుకున్న పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ దబాంగ్. అమ్మకో కొడుకు, నాన్నకో కొడుకు. ఈ సవతి కొడుకుల మధ్య చిన్నప్పట్నుంచి వైరం. మామూలుగా ఈ లైన్ రాగానే మనసులో ఇద్దరు హీరోల సినిమా అని బలంగా అనిపించేస్తుంది. కానీ, సింగిల్ స్టార్ సినిమాగా దీన్ని ప్యాకేజ్ చేయడమే కష్టమైన పని, కొత్త పనీ కూడా. దానికే ఈ సినిమా కొత్తదనాన్ని పుణికిపుచ్చుకుందని నేననుకుంటున్నాను. చాలా ఏళ్ల తర్వాత వినోద్ ఖన్నా, డింపుల్ కపాడియా హీరో తల్లి, సవతి తండ్రిగా నటించడం కూడా బావుంది. ‘రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్’ అన్నది గొప్ప వాణిజ్య సూత్రం సినిమాలకి. అది సరిగ్గా పాటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యి నిర్మాతలకి కనక వర్షం కురిపించాయి. ‘దబాంగ్’ వాటిల్లో ఒకటి. 1999 తర్వాత 11 ఏళ్లల్లో మూడే మూడు సినిమాలు చేసి, ఆ మూడూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి దాదాపు కెరీర్ అయిపోయిందనుకున్న సల్మాన్‌ఖాన్‌ని ‘దబాంగ్’ 240 కోట్ల లాభసాటి స్టార్ హీరోగా మళ్లీ నాలుగైదేళ్లు, అరడజను సినిమాల దాకా టాప్‌లో నిలబెట్టింది. బాడీ పాతది. కానీ దానికి కుట్టిన చొక్కా చాలా కొత్తది, కలర్ఫుల్ది. అదే ఆకట్టుకుంది జనాన్ని. హీరోని ఎంత మాస్‌గా రాసుకున్నారో స్క్రిప్టులో, అంత క్లాస్‌గా చూపించారు లుక్స్‌లో. ఈ ఫ్యూజన్ సినిమాకి సరికొత్త ట్రెండ్‌ని తెచ్చింది. ఆ ఫ్యూజన్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేసి తెలుగులో తీసిన ‘గబ్బర్‌సింగ్’ కూడా సూపర్‌హిట్ అయింది. ఇంచుమించు సల్మాన్లాగే ముందు సినిమాల ఫ్లాపులతో ఉన్న పవర్‌స్టార్‌ని ఒకేసారి యాభై కోట్ల క్లబ్ దాటించేసి టాప్ హీరోగా టాలీవుడ్లో పోటీలో నిలబెట్టేసింది. నెగెటివ్ టచ్ ఉన్న హీరో పాజిటివ్‌గా మారడం అనే దుష్మన్ ఫార్ములా ఎప్పటికీ సూపర్‌హిట్టేనని మరోసారి మిలీనియమ్‌లో రుజువైంది. సోనాక్షి సిన్హా చాలా అందంగా, పరిపక్వంగా నటించింది. ‘మున్నీ బద్నామ్ హుఈ’ పాట ఈ చిత్రాన్ని ప్రజల్లో విపరీతంగా పాపులర్ చేసింది. మలైకా అరోరాఖాన్ స్వయంగా నర్తించింది. ఆమె ఈ చిత్ర నిర్మాత, సల్మాన్ సవతి సోదరుడి పాత్రధారి అర్బాజ్‌ఖాన్ భార్య. ఆమె కూడా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇమామి సంస్థ ‘జండుబామ్’ అనే తమ ప్రొడక్ట్ పేరు ఈ ఐటమ్ సాంగ్‌లో వాడినందుకు నిర్మాతల మీద కేసు పెట్టింది. కానీ కోర్టు బైట ఈ కేసు సెటిలైపోయి, మలైకాతో జండుబామ్ ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కూడా చేసుకుంది. చిత్రంలో కన్నా విచిత్రం భారత దేశంలో సహజంగా జరుగుతుంటుంది అనడానికి ఇదింకో ఉదాహరణ. ‘దబాంగ్’ ఓ సూత్రం. ప్రతి డైలాగులోనూ ఓ పంచ్గానీ, ఓ మాస్ మంత్రం గానీ, ఓ విజువల్ ఇంట్రెస్ట్ గానీ ఉంటుంది. దాన్ని పూర్తిగా, కాన్ఫిడెంట్‌గా, భయం లేకుండా క్యారీ చేశాడు కాబట్టే సల్మాన్‌ఖాన్‌కి సక్సెస్‌లో ఎక్కువ షేర్ వచ్చింది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒడిసిపట్టాడు కాబట్టే పవన్‌కల్యాణ్‌కి కూడా గబ్బర్‌సింగ్ సక్సెస్‌లో పెద్ద వాటా వచ్చింది. ఒక సినిమాని కొన్ని కోట్ల మంది చూస్తారు. కానీ పదుల మంది సరిగా అర్థం చేసుకుంటారు. మిగిలినవాళ్లు ఎంజాయ్ చేస్తారంతే. ఆ పదుల మందిలో మిత్రుడు తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఒకడు. అతణ్ని ఎంచుకున్న నిర్మాత బండ్ల గణేశ్ అభినందనీయుడు, అదృష్టవంతుడు కూడా. సోనూసూద్ ఊళ్లో చిన్న సైజు విలను. అతనికింద కొంతమంది రౌడీలు. అతనిపైన కొద్దిమంది రాజకీయ నాయకులు. హీరో ఒక అసిస్టెంట్ కమిషనర్. అయినా బండగా, బాధ్యత లేకుండా పెరిగిన బాపతు కాబట్టి రౌడీలా ప్రవర్తిస్తుంటాడు. దూకుడెక్కువ. ‘నాకు దమ్ముంది, ధైర్యం ఉంది - తిక్క కూడా ఉంది’ అని అతనే చెప్పుకుంటాడు. హీరో, విలన్ల గొడవలో విలన్ హీరో తల్లిని చంపుతాడు. తమ్ముణ్ని ఇరికిస్తాడు. తండ్రిని నష్టపరుస్తాడు. చివరికి హీరో చేతిలో చస్తాడు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదనుకుంటున్నారా... సినిమగా చూడండి భయం లేదు. పక్కా పైసా వసూల్. సల్మాన్‌ఖాన్ వీర సాహస, హస్య, శృంగార విన్యాసాలే తెరంతా నిండిపోయేలా, మధ్యలో తళుక్కుమని ఓ కంటిమీద నీటి చుక్క మొలకెత్తేలా కొంచెం కరుణ రసం కలిపి అల్లుకున్న పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ దబాంగ్. - వి.ఎన్.ఆదిత్య -
ఇంటెలిజెంట్ ఇడియట్స్
దేడ్ కహానీ - త్రీ ఇడియట్స్ ప్రతి సినిమాకీ మూలస్తంభాల్లా, త్రిమూర్తుల్లా ముగ్గురు నిర్ణయాత్మక శక్తులుంటారు. సినిమా హిట్టయితే వాళ్లని లోకమంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, కర్త, కర్మ, క్రియలని తెగ ఆరాధిస్తారు. సినిమా ఫ్లాపయితే వాళ్లని త్రీ ఇడియట్స్ అని తిడతారు. అలాంటిది ఏకంగా ‘త్రీ ఇడియట్స్’ అనే టైటిల్‌నే పెట్టి ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న త్రిమూర్తులున్నారు. వాళ్లే రాజ్‌కుమార్ హిరానీ, విధూ వినోద్ చోప్రా, ఆమిర్ ఖాన్. ఒక అద్భుతమైన సృష్టి‘కర్త’, క్రమశిక్షణ గల ‘క్రియా’స్రష్ట, కలిసి ఒకే సినిమాకి పనిచేయడం ఆ నిర్మాత చేసుకున్న మంచి ‘కర్మ’ల పుణ్యం అన్నమాట. అందుకే 60 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ప్రేక్షకులు ‘త్రీ ఇడియట్స్’ సినిమాని హారతిలా ‘కళ్ల’కద్దుకుని, పళ్లెంలో మూడు వందల కోట్ల రూపాయలు భక్తిగా వేసేశారు. భారతీయ సినిమాలో ఆ రోజుకి ఎవ్వరూ అందుకోని వాణిజ్యపరమైన ల్యాండ్ మార్కులన్నీ ఈ సినిమా సెట్ చేసింది. రికార్డుల్లో కొత్త పుంతలు తొక్కింది. కథకి, కథనానికి, మాటలకి, పాటలకి, కామెడీకి, సున్నితమైన భావోద్వేగాలకి, యువతరం తాలూకు ఆలోచనలకి, జీవన శైలికి, ఆశయాలకీ, రొమాన్స్కీ, ఆకతాయితనాలకీ, ర్యాగింగులకీ, విద్యావ్యవస్థని ప్రశ్నించ గలిగిన సామాజిక బాధ్యతల రెబెలిజానికి, పరిష్కారాన్ని కూడా చూపించగల మేధస్సుకి... అన్నిటికీ ఒక బెంచ్ మార్క్ ‘త్రీ ఇడియట్స్’. స్కూల్లో నాతో చదువుకున్న బాల్య స్నేహితుడు సత్యన్నారాయణకి ప్రముఖ మాటల, పాటల రచయిత లక్ష్మీ భూపాల్ మంచి స్నేహితుడు. ఆయన రాసిన కృష్ణవంశీగారి ‘చందమామ’ సినిమా సంభాషణలు నాకు బాగా నచ్చాయి. మా మిత్రుడి ప్రోద్బలం కూడా తోడై ఆయనతో ఒక సినిమాకి వర్క్ చేద్దాం అని అనుకున్నాను. ఆ సందర్భంగా మా సత్యం మీటింగ్ ఏర్పాటు చేశాడు. లక్ష్మీభూపాల్ అడిగిన మొదటి ప్రశ్న ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూశారా? నేను, ‘లేదండీ... రిలీజ్ రోజున ఔట్‌డోర్ షూటింగ్లో ఉన్నాను. నిదానంగా చూస్తాను’ అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. ‘ఆ సినిమా చూశాకే కలిసి మాట్లాడుకుందాం. మన మీటింగ్ రాఘవేంద్రరావుగారి సినీమ్యాక్స్ థియేటర్‌కి షిఫ్ట్’ అని చెప్పి టిక్కెట్లు బుక్ చేసేసి బలవంతంగా తీసుకెళ్లి థియేటర్లో కూర్చోపెట్టేశారు. సినిమాని ఇద్దరు స్నేహితులు కలిసి చూసినట్టు చూడలేదు మేం. ఇద్దరు వేర్వేరు ప్రేక్షకులు చూసినట్టు లీనమైపోయాం. సినిమా అయిపోయాక కూడా చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు. ముక్కూ మొహం తెలీని ప్రేక్షకుల్లా ఎవరి దారిన వాళ్లు పార్కింగ్ దగ్గరికి వచ్చేశాం. ఎవరన్నా దర్శకుడు సినిమాని బాగా తీస్తే వెంటనే ఫస్ట్ మైండ్లోకొచ్చే ఆలోచన ఎక్కడో మంచి ఫారెన్ ఫిల్మ్ పట్టుంటాడు లేదా, ఎవడో మంచి రైటర్ పాపం డెరైక్టర్ అవుదామని ఏళ్ల తరబడి స్క్రిప్టు రాసుకుని ఉంటే, డబ్బులిచ్చి లాగేసి ఉంటాడు. నా కన్నా ఇంకో హ్యూమన్ బ్రెయిన్‌కి నాలాగే ఒకటికి మించి రెండు, మూడు, నాలుగైదు సార్లు మంచి ఆలోచనలొస్తాయంటే ఎందుకో అంతరాత్మ ఓ పట్టాన అంగీక రించదు. ఈ ఆలోచనలన్నీ మున్నాభాయ్ పార్ట్ 1, పార్ట్ 2లకే వచ్చేశాయి. కొత్తగా ఈ మూడో సినిమా ఇంత బాగా, వాటిని మించి తీశాడంటే కారణం ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఆ కారణం వెతికే ప్రయత్నమే ఆ సెలైన్స్. చివరికి లక్ష్మీ భూపాల్‌గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పి ఇంటికొచ్చేశాను. ఎవడీ డెరైక్టరు? క్షీర సాగర మథనంలో కూడా ఓసారి విషం, ఓసారి అమృతం వచ్చాయి. నాలాంటి దర్శకులందరికీ ఓసారి మంచి మంచి ఆలోచనలు, ఒక్కోసారి చెత్త చెత్త ఆలో చనలు వస్తుంటాయి సినిమా విషయంలో. అలాంటిది ఎప్పుడు మెదడుని చిలికినా అమృతం లాంటి ఆలోచనలే ఒక దర్శకుడికి వస్తాయంటే నాకు నచ్చడం లేదు. ఆ ద్వేషంలోంచి ప్రేమించాను రాజ్‌కుమార్ హిరానీని. ఆ ప్రేమ ఆరాధనైంది. భక్తిగా మారింది. ఆలో చించడం నేర్చుకున్నాను. ఓ దర్శకుడిగా, ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా. ఈ రోజు వరకూ ‘షోలే’ తర్వాత అన్ని విభాగాల్లోనూ పెర్ఫెక్ట్, వెల్ మేడ్ సోషల్ సినిమా అండ్ బెస్ట్ ఎంటర్టైనర్ అంటే ‘త్రీ ఇడియట్స్’నే చెప్పొచ్చు. : కరీనా కపూర్ దటీజ్ రాజ్‌కుమార్ హిరానీస్ త్రీ ఇడియట్స్. ‘ఆల్ ఈజ్ వెల్’ అన్న మాటని కాయిన్ చేసి, ఏ కష్టంలో ఉన్నా, ఎవడి గుండెని వాడే తడుముకుని ‘ఆల్ ఈజ్ వెల్’ అని మూడు సార్లు అనుకోవాలని హీరో పాత్రతో చెప్పిం చడం ఒక అద్భుత సృష్టి. మున్నాభాయ్లో రుగ్మత పోగొట్టడం కోసం ‘జాదూకీ జప్పి’ అనే మందుని, త్రీ ఇడియట్స్‌లో బాధని పోగొట్టడం కోసం ‘ఆల్ ఈజ్ వెల్’ అనే మంత్రాన్ని కనిపెట్టిన రాజ్‌కుమార్ హిరానీని... భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ వైద్య సంపదైన ఆయుర్వేదాన్ని కనిపెట్టిన ధన్వంతరో, అతని వారసుడో అనుకోవాలి. చేతన్ భగత్ అనే యంగ్, భారతీయ మేధావి నవలా రచయిత రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఆధారంగా... అభిజిత్ జోషి, విధూ వినోద్ చోప్రాలతో కలిసి స్క్రీన్‌ప్లే రాసుకుని, సహ రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా త్రీ ఇడియట్స్ చిత్రాన్ని రూపొందించాడు రాజ్‌కుమార్ హిరాణీ. ఒక సినిమా సూపర్‌హిట్టు రెండు టేబుల్స్ మీద నిర్ణయించబడుతుంది అన్న ప్రాథమిక ఫార్ములా ప్రకారం, రైటర్స్ టేబుల్, ఎడిటర్స్ టేబుల్ రెండింటి మీదా కూర్చో గలిగిన దర్శకుడు, సినిమాని అంతలా శాసించగలిగిన దర్శకుడు భారతీయ దర్శకులలో ఈ తరంలో ఎవ్వరూ లేరు. డిసెంబర్ 25, 2009న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుత భారతీయ విద్యా విధాన రూపకల్పనకి ‘బైబిల్’ లాంటిది. ఫర్హాన్ ఖురేషి అనే ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన ఇంజినీరింగ్ కాలేజీ స్నేహితుడు రాంచోని వెతకడంతో సినిమా మొదలౌతుంది. తన మరో స్నేహితుడు రాజు రస్తోగితో కలిసి తమ కాలేజీ రోజుల్లో బాగా ఏడిపించిన ఓ దద్దోజనం లాంటి కామిక్ విలన్ చతుర్ రామ లింగంని కట్టి పడేసి, దారిలో కాలేజీ డీన్ ‘వైరస్’గారమ్మాయి పియకి పెళ్లి జరగ బోతోందని తెల్సుకుని ఆమెని పీటల మీద నుంచి తప్పించి, రాంచోని చేరుకుంటారు. ఆ ప్రయాణంలో అసలు రాంచో ఎవరు? కాలేజీలో ఎలా పరిచయం అయ్యాడు? పియకి అతనికి ప్రేమ ఎలా పుట్టింది? చతుర్ రామలింగం అలియాస్ సెలైన్సర్ రాంచోతో చేసిన చాలెంజ్ ఏమిటి? అందులో ఎవరు గెలిచారు? ‘వైరస్’ అనే డీన్‌కి రాంచోకి నడిచిన వార్ ఎలాంటి పరిణామాలకి దారి తీసింది? భారతీయ విద్యా విధానాన్ని రాంచో ఎలా ప్రశ్నిం చాడు? ఎలాంటి మంచి పరిష్కారాలు చూపించాడు? తీరా వీళ్లంతా క్లైమాక్స్‌లో కలుసుకునేసరికి రాంచో ఏం చేస్తు న్నాడు? పియ, రాంచో కలుసుకున్నారా? ముక్కుకి ముక్కు తగలకుండా ముద్దు పెట్టుకున్నారా లేదా?... ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు తెలుస్తాయి. ఈ కథని క్లుప్తంగా ఎలా రాయాలో నాకు తెలీలేదు. ప్రతి మాటనీ ప్రస్తావించాలి. ప్రతి సీన్ లోనూ నటీనటుల హావభావాల్ని అనలైజ్ చేసి డీటైల్డ్‌గా రాయాలి. సంగీతం గురించి, ఫోటోగ్రఫీ గురించి, కాస్ట్యూమ్స్ గురించి ప్రతి అంశం గురించీ క్లుప్తంగా చర్చించాలి. ఈ రోజు వరకూ ‘షోలే’ తర్వాత అన్ని విభాగాల్లోనూ పర్ఫెక్ట్, వెల్ మేడ్ సోషల్ సినిమా అండ్ బెస్ట్ ఎంటర్ టైనర్ అంటే ‘త్రీ ఇడియట్స్’నే చెప్పచ్చు. వైరస్ పెద్ద కూతురికి బిడ్డ పుట్టే సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం, అది చూసినప్పుడు కలిగే ఉత్కంఠ గురించి ఎంత రాసినా తక్కువే. పర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ అతికినట్టు సరిపోయాడు రాంచో పాత్రలో. పుస్తకం గురించి లెక్చెరర్కి రాంచో క్లాస్ పీకి నప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. రాజు పాత్ర క్యాంపస్ ఇంటర్వ్యూలో చూపించే కాన్ఫిడెన్స్‌కి ఫిదా అవ్వకుండా ఉండలేం. పిల్లలని ఇంజినీర్లో, డాక్టర్లో చెయ్యా లని బలవంతపెట్టి వారి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా వాళ్లని ఒత్తిడిలోకి నెట్టే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మొత్తం విద్యావ్యవస్థకి సూటిగా చెప్పిన రెండున్నర గంటల మంచి పాఠం త్రీ ఇడియట్స్. టైటిల్‌ని బట్టి ఇందులో ముగ్గురు స్నేహి తుల్నీ త్రీ ఇడియట్స్ అనుకుంటే తప్పు. చతుర్ రామలింగం, వైరస్, ఖురేషీ (మాధవన్) తండ్రి - ఈ ముగ్గురూ సమాజంలోని మూడు పాత్రలకి చిహ్నాలు. విద్యార్థుల్లో ఉండకూడని యాటిట్యూడ్ చతుర్, ఉపాధ్యాయుల్లో ఉండకూడని యాటిట్యూడ్ ‘వైరస్’, తల్లిదండ్రుల్లో ఉండకూడని యాటిట్యూడ్ ఖురేషి తండ్రి - వీళ్లల్లా నిజ జీవితంలో ఎవరున్నా వాళ్లే ఇడియట్స్. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
మ్యాచ్ ఫిక్సింగ్..
దేడ్ కహానీ - రబ్నే బనాదీ జోడీ ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని అనుకున్న రోజుల నుంచి ‘పెళ్లి జరగడం, భూలోకంలో నరకంతో సమానం’ అనుకునే రోజుల దాకా సమాజం చాలా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన జోడీ లాంటి పాత చింతకాయపచ్చడిని కొత్తగా వడ్డించాలనుకోవడం ఒక దుస్సాహసం. దాన్ని షారుక్ లాంటి అగ్రహీరోతో ప్లాన్ చేయడం, అది కూడా ఒక బోరింగ్ భర్త పాత్రలో, ఇంకో దుస్సాహసం. ఒక విచిత్రమైన దర్శకుడి గురించి ముందు మాట్లాడుకుని, తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. ‘ఆదిత్య చోప్రా’. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శక నిర్మాత యష్‌చోప్రా కొడుకు.1995లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ అని ఒక ప్రేమకథని రాసుకుని షారుక్‌ఖాన్, కాజోల్‌తో జంటగా తీస్తే... ఇరవయ్యొక్క సంవత్సరాలుగా ఇంకా ఆడుతూనే ఉంది ముంబై మరాఠా మాదిర్లో. ఈ మధ్యే సాక్షి టీవీలో వెయ్యి వారాలు పూర్తి చేసుకున్న డీడీఎల్జే సినిమా గురించి అరగంట సేపు చర్చించాం కూడా నేను, మిత్రులు సిరాశ్రీగారు, మహేష్ కత్తిగారు. అంత పెద్ద హిట్ ఇచ్చిన ఏ దర్శకుడైనా 1995 నుంచి ఈ ఇరవయ్యొక్క సంవత్స రాలలో కనీసం 15, 16 సినిమాలు తీసేస్తాడు సునాయాసంగా. కానీ దర్శకుడిగా ఆదిత్య చోప్రా మూడే సినిమాలు తీశాడు. నాలుగోది ఈ ఏడాది తీయబోతున్నాడు. అదే విచిత్రం. ఈలోగా నిర్మాతగా, కథకుడిగా, పంపిణీదారుడిగా రకరకాలుగా ఆక్యుపై అయినా, అతనిలోని దర్శకుడిని సినిమాలు తీయకుండా ఎలా నియంత్రించుకోగలుగుతున్నాడని నాకెప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే, తీసిన సినిమాలు అంత బాగా తీస్తాడు మరి. అవి ‘మొహబ్బతే’ లాగ ఆడకపోయినా, ‘రబ్నే బనాదీ జోడీ’లాగా ఆడినా అతని తీతలో మాత్రం తేడా ఉండదు. ‘తడి’ ఉంటుంది. అది తెర నుంచి మనలోకి నేరుగా ప్రవహిస్తుంది. తడుముతుంది. అలాంటి ఒక భావో ద్వేగాల, అనుభూతుల ప్రయాణమే ‘రబ్నే బనాదీ జోడీ’. ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని అనుకున్న రోజుల నుంచి ‘పెళ్లి జరగడం, భూలోకంలో నరకంతో సమానం’ అను కునే రోజుల దాకా సమాజం చాలా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన జోడీ లాంటి పాత చింతకాయ పచ్చడిని కొత్తగా వడ్డించా లనుకోవడం ఒక దుస్సాహసం. దాన్ని షారుక్ లాంటి అగ్రహీరోతో ప్లాన్ చేయడం, అది కూడా ఒక బోరింగ్ భర్త పాత్రలో... ఇంకో దుస్సాహసం. అయినా ఆదిత్య చోప్రా ఈ సినిమా తీయడానికి సాహసించడం వెనుక నాకు కొన్ని కారణాలున్నాయని అనిపించింది. భారతీయ సమాజంలో ఎంత ఆధునికత బైటకి కనపడినా, లోపల ‘కన్వెన్షనల్ థింకింగ్’ అలాగే గూడు కట్టుకుని పోయి ఉండడం మొదటి కారణం. షారుక్ లాంటి హీరో మీద, తన కాంబినేషన్లో కేవలం 22 కోట్ల బడ్జెట్లో సినిమా అయిపోగలిగే కథ, కథనాలుండడం రెండో కారణం. అంటే, సినిమా అట్టర్ ఫ్లాపయినా తీసినవాళ్లు, కొన్నవాళ్లు నష్టపోరు ఈ బడ్జెట్‌కి. అనుష్కశర్మ లాంటి అందమైన అమ్మాయిని మొదటిసారి హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం కాబట్టి, కుర్రకారుని అట్రాక్ట్ చేయగలం అన్న ధీమా ఇంకో కారణం. మొత్తమ్మీద సినిమా రిలీజై, థియేటర్లో కూర్చుంటే... రెండో ‘రాజ్‌కపూర్’ (షారుక్) అదర గొట్టేశాడు. ప్రేక్షకుడికి ఆ పాత్ర ఎక్కడం అన్నదాన్నే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. సుఖ్వీందర్సింగ్ ‘హాలే హాలే’ అని, రూప్‌కుమార్ రాథోడ్, శ్రేయాఘోషల్ ‘తుఝ్ మే రబ్ దిఖ్తా హై’ అని, సునిధి చౌహాన్, లభ్నూజీ ‘డాన్స్పే ఛాన్స్’ అని పాడే స్తుంటే వాళ్ల మధురమైన గొంతులతో, గమకాలతో, పాత్రల మధ్య మనమూ లీనమైపోయినట్టు ఉంటుంది. సలీమ్-సులేమాన్ మ్యూజిక్‌తో చేసిన మ్యాజిక్ అది. సురేందర్ సాహ్ని నా అన్నవాళ్లు లేని అనాథ. ఓ ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లో చిరుద్యోగి. అతనికి ఒకడే బెస్ట్‌ఫ్రెండ్... బాబీ అని ఒక బార్బరు. చిన్న, మధ్య తరగతి ఇంట్లో నివాసం. సింపుల్ జీవితం. ఓసారి సురేందర్ తనకి చదువు చెప్పిన మాస్టరుగారి కూతురి పెళ్లికెళ్తాడు. ఆ కూతురే తానీని (అనుష్క). చలాకీగా గడగడా మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతూ... చూడగానే ప్రేమించేయాలని పించేంత సరదాగా ఉంటుంది. ఆమె సూరిని చూడగానే ‘మీరేనా సూరి, మీవల్ల చిన్నప్పట్నుంచి ఎన్ని తిట్లు తిన్నానో, సూరిలా చదువుకో, సూరిలా మార్కులు తెచ్చుకో, సూరిలా క్రమశిక్షణగా ఉండు అని మా నాన్నగారు రోజూ తిట్టడమే’ అంటుంది. సూరి కళ్లల్లో గర్వం. అంతలోనే ఓ విషాదం. పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్త. కూతురి పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక మాస్టారికి గుండెపోటు వస్తుంది. తాను వెళ్లిపోతే తన కూతురు ఒంటరిగా మిగిలి పోతుందన్న భయంతో, ఆమెకు తోడుగా ఉండమని సురేందర్‌ని కోరతాడు. ఇద్దరినీ ఒక్కటి చేసి కన్నుమూస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. జరిగిన విషాదం నుంచి తానీ బయట పడదు. సురేందర్‌ని భర్తగా అంగీకరించదు. దగ్గరవదు. మౌనంగా ఉంటుంది. వండి పెడుతుంది. ఇంటి పనంతా చేస్తుంది. అంతే తప్ప అంతకు మించి ఆమెలో అతడి పట్ల ఏ భావమూ ఉండదు. కానీ సురేందర్ మాత్రం ఆమెను పిచ్చిగా ప్రేమిస్తాడు. మనసులోనే ఆరాధిస్తాడు. ఆమెకు ఎలా దగ్గరవ్వాలా అని చూస్తుంటాడు. అప్పుడే అతడికి ఓ అవకాశం దొరుకుతుంది. తానీ డ్యాన్స నేర్చుకోవాలని ఆశపడుతుంది. అందుకు అతడు అనుమతిస్తాడు. అయితే ఆమెకు దగ్గర కావాలన్న ఆశతో గెటప్ మార్చుకుని, మోడ్రన్ యువకుడిగా తయారయ్యి, రాజ్‌కపూర్ పేరుతో ఆమెకు డ్యాన్స పార్టనర్‌గా ఇన్స్టిట్యూట్లో చేరతాడు. భర్తగా దూరంగా ఉండిపోయినా స్నేహితుడిగా దగ్గరవుతాడు. ఆమె కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుని, ఆమె ఇష్టాలే తన ఇష్టంగా జీవించడం మొదలు పెడతాడు. హీరో వేషాలేసి ఆమెని ఫ్లర్టింగ్ చేసి, ఆమెతో తిట్లు తిని, ఆమెకి మంచి ఫ్రెండై, ఆమెని కాసేపు కన్ఫ్యూజ్ చేసి చివరికి తనతో ప్రేమలో పడేలా చేస్తాడు. లేచిపోదాం అంటాడు. ఇక్కడ్నుంచి ఆమె అంతర్మథనాన్ని ఎంతో అందంగా చిత్రీకరించాడు ఆదిత్య చోప్రా. నిజానికి తానీ అతనితో ప్రేమలో పడదు. పడబోయి ఆగిపోతుంది. స్నేహం దగ్గరే ఫుల్స్టాప్ పెడుతుంది. తన భర్తలో తనకు దేవుడు కనబడుతున్నాడని ముఖమ్మీదే చెప్పేస్తుంది. దాంతో అతడు కాంపిటీషన్ ఫైనల్స్‌కి రాడు. అయినా ఫర్వాలేదు అని ఓటమిని అంగీకరించే సమయంలో ఆమె భర్త ఎంటరవుతాడు. అద్భుతంగా డ్యాన్స చేస్తాడు. ఆ క్రమంలో ఆమెకి అర్థమౌతుంది... తన భర్త, ఆ యువకుడు ఒక్కరేనని. తన ప్రేమ కోసం అతడు మరో వ్యక్తిగా మారి తనకు చేరువయ్యాడని తెలుసుకుంటుంది. కన్నీళ్లతో భర్తకి అంకితమైపోతుంది. భగవంతుడి లీలా వినోదంలో ప్రతి అమ్మాయికీ ఓ రాజ్‌కపూర్ కావాలని ఉంటుంది. తొంభై తొమ్మిది శాతం మందికి సూరిలు దొరుకుతారు. తెగిస్తే విడాకులతో జీవితాలు పాడైపోతాయి. బరి తెగిస్తే రాజ్‌కపూర్‌తో సెటిలైపోయి గుణహీనులౌతారు. సూరిని అర్థం చేసుకునే సంస్కారం ఒకళ్లకో ఇద్దరికో ఉంటుంది. కానీ, ఆ సంస్కారాన్ని బైటకి తెచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మాత్రం సూరిదే అవుతుంది. రాజ్కపూర్లా భార్యని సుఖపెట్టాలని, చేరువ అవ్వాలని కష్టపడే ప్రతి సూరి... భార్య పాలిట హీరో అవుతాడు. ఇది చాలామంది మగాళ్లకి సంసార జీవితంలో భార్యల పట్ల ఉండాల్సిన బాధ్యతల పాఠం. చాలామంది ఆధునిక ,ఆదర్శ వివాహిత స్త్రీలకి భర్త పట్ల ఉండవలసిన దృక్పథాల పాఠం. కమర్షియల్ సినిమాల్లో కుదిరినట్టు సడన్‌గా వేషాలు మార్చి నాటకం ఆడేయడం నిజ జీవితంలో కుదరని పనే అయినా, వేషం స్థానే మనిషి తనవారి కోసం కొంచెం మారినా, 22 శాతం మార్పుకి 180 శాతం సుఖాన్ని, సంతోషాన్ని పొందడం ఖాయమని రబ్నే బనాది జోడీ చూస్తే మనకర్థమౌతుంది. అసలీ సినిమా గురించి చెప్పుకున్నప్పుడు ఆదిత్య గురించి ఎంత చెప్పుకుంటామో... షారుక్ గురించి కూడా అంతే చెప్పుకోవాలి. పాత తరహా దుస్తులు, మీసకట్లు, నూనె పూసిన తల కట్టు... అసలు రొమాంటిక్ హీరో షారుక్ ఇతనేనా అన్నంతగా సూరి పాత్రను ఆకళింపు చేసుకున్నాడు. అంతలోనే రాజ్ కపూర్‌గా తన సహజమైన స్టయిల్‌ను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. కాబట్టి ఈ చిత్ర సక్సెస్‌లో ఆదిత్యది సగభాగమైతే, షారుక్‌ది సగభాగం. ఆదిత్య చోప్రాలో ఆదిత్య అనే సగం పేరు నాకున్నందుకు నా తర్వాతి సినిమాల నుంచీ నీలో సగమైనా నేనాలో చిస్తానని కంకణం కట్టుకున్నానయ్యా చోప్రా... థాంక్యూ సో మచ్. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
గ్లామర్ ట్రాప్
దేడ్ కహానీ - ఫ్యాషన్ మిలీనియమ్‌లో బాలీవుడ్ సినిమా దిశను, గతిని, మార్కెట్‌ను మార్చేసిన ట్రెండీ కమర్షియల్ హిట్ చిత్రాల కథలు, సంగతుల్ని విశ్లేషించుకునే మన ‘దేడ్ కహానీ’లో... చాందినీ బార్, పేజ్ 3ల గురించి నేను రాయలేదు కానీ కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్ గురించి రాసినప్పుడే ఆ సినిమాలని ప్రస్తావించాను. ఇప్పుడు ‘ఫ్యాషన్’. తీసిన ప్రతి సినిమా అప్పటి కాలాన్ని శాసిస్తూ పరిశ్రమను కొత్త దారి పట్టించేలా తీయడం ఆ దర్శకుడి అద్భుత ప్రతిభ, కఠిన శ్రమ తప్ప మరోటి కాదు. సినిమా గురించి ఎన్ని విశేషాలైనా రాయచ్చు కానీ, ఒకే దర్శకుడి గురించి పదే పదే ఎలా కొత్తగా రాస్తాం అని ఆలో చిస్తుంటే, మధుర్ భండార్కర్ గురించి కొత్తగా ఈ వారం రాయడానికొక మంచి మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆయనని ‘పద్మశ్రీ’గా గుర్తించింది. తెలుగు నుంచి మన ఎస్.ఎస్.రాజమౌళిని గుర్తించినందుకు ఎంత ఆనందపడ్డానో, మధుర్ భండార్కర్ విషయంలోనూ అంతే. ఎందుకంటే, తెలుగులో ఇదే దేడ్ కహానీ ఎవరైనా రాస్తే అందులో తీసిన ప్రతి సినిమా లిస్టులో ఉండే దర్శకుడు రాజమౌళిగారొక్కరే. ఇద్దరికీ కథ, కథనా ల్లోనూ, దర్శకత్వ శైలిలోను ఎందులోనూ సంబంధం, పోలిక లేవు. ఒకరిది కల... ఇంకొకరిది జీవితం. కానీ ప్రతిభ, కష్టం, క్రమశిక్షణ, తీస్తున్న సినిమాపై సాధికారత, ముద్ర ఇవి కామన్. అందుకే వీరికి లభించిన గుర్తింపు, అవార్డు కూడా కామన్. ఇక ఫ్యాషన్ విషయానికొద్దాం. ఒక మధ్య తరగతి అమ్మాయి తండ్రికిష్టం లేకున్నా, తల్లి ప్రోత్సాహంతో ముంబై మహానగరంలో మోడల్‌గా రాణించాలని కలలుగని, ఫ్యాషన్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లో నెగ్గుకురావాలని చేసే ప్రయత్నాలు, అందులో అనుభవించే కష్టాలు, సుఖాలు, అనుభవాలు, అను భూతులు, నేర్చుకునే పాఠాలు ఇవన్నీ తెర మీద కళ్లకు కట్టినట్టు, చెవిలో చెప్పినట్టు, పెదవులు నవ్వినట్టు, గుండెను తడితో తడిమినట్టు ప్రేక్షకుడికి అనిపించేలా తీసిన సినిమా ఫ్యాషన్. పదహారణాల భారతీయ ఆధునిక యువతి వ్యథని కథగా తీస్తే అయిన ఖర్చు పదహారు కోట్లు. వచ్చిన రాబడి అరవై కోట్ల పైనే. చిన్న సినిమాల్లో బాగా ఎక్కువ మార్జినల్ ప్రాఫిట్ వచ్చి ట్రెండ్ సృష్టించాలంటే, కంటెంట్ చాలా చాలా బలంగా ఉండాలి. సహజత్వం, ప్రేక్షకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకో గలిగే పాత్రలు, సన్నివేశాలు, సంభాషణ లతో పాటు ఆద్యంతం కట్టిపడేసే కథనం కూడా ఉండాలి. ఇవన్నీ బడ్జెట్ పరిమితు లకి లోబడి తెరకెక్కించాలంటే దర్శకుడు ఏ మధుర్ భండార్కరో అయ్యుండాలి. సాధారణంగా మగవాడికి ఏదన్నా ఆలోచన వస్తే వెంటనే అది నోట్లోంచి బైటకొచ్చేస్తుంది ముందు. అదే ఆడవాళ్లకి ఏదన్నా ఆలోచన వస్తే అది నోట్లోంచి చచ్చినా రాదు. మనసులో దాక్కుని ఆచ రణ రూపంలో బైటకొస్తుంది. ఇది అర్థం కావటానికి మగాడికి జీవితకాలం సరి పోదు. అలా, అర్థం కాని పాఠాలు చద వాల్సి వస్తే విద్యార్థులు ‘గైడ్స్’మీద ఆధార పడతారు. అలాంటి గైడ్సే మధుర్ సినిమాలు. వాటిల్లో ‘ఫ్యాషన్’ ఒకటి. 2002, 3 ప్రాంతంలో హైదరాబాద్‌లో సినిమా చాన్స్‌కోసం హీరోయిన్గా ప్రయ త్నాలు చేసిన చిన్న మోడల్ ప్రియాంకా చోప్రా. నెక్కంటి శ్రీదేవి అనే నిర్మాత ‘అపురూపం’ అనే సినిమాలో ఆమెకి అవ కాశమిద్దామని ప్రయత్నించడం నాకింకా గుర్తే. దానికి మొదట తేజగారిని, ఆయన కాదన్నాక నన్ను దర్శకుడిగా అనుకు న్నారు. కారణాంతరాల వల్ల అది మొద లవ్వలేదు. కానీ ఆరేళ్ల తర్వాత ప్రియాంక బాలీవుడ్లో అత్యంత విజయ వంతమైన హీరోయిన్. గ్లామర్‌కే కాదు పెర్ఫార్మెన్స్ తోనూ ప్రేక్షకుడి మన్ననలు, ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు కూడా గెల్చుకున్న ఉత్తమ నటి. ‘ఫ్యాషన్’ సినిమాకే ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును స్వీకరించింది ఫిల్మ్‌ఫేర్‌తో పాటు. ఆమె అదృష్టం, కృషి, ఆమెను ‘అపురూపం’ సినిమా నుంచి తప్పించి, అంతర్జాతీయంగా అపురూపమైన కెరీర్‌ను సృష్టించి ఇచ్చాయి. అపరిమితమైన పోటీని, వాణిజ్య ప్రధానమైన పరిశ్రమలో విలువల్ని కాపాడుకుంటూ పనిచేయడం, అది కూడా ఏళ్ల తరబడి నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. అరగంటకి ఒక ఆస్కార్ ఉత్తమనటి అవార్డు ఇవ్వచ్చు - భారతీయ సినీ పరిశ్రమలో ఆడపిల్లలు సక్సెస్‌ఫుల్‌గా స్టార్డమ్లో నిలదొక్కు కోవడానికి పడే కష్టానికి. పెదాల మీద చిరునవ్వు చెరగకుండా నటించే శ్రమకి. ఆత్మాభిమానంతో, కెరీర్లని పర్స్యూ చేసుకునే విధానానికి. ఇవన్నీ ‘ఫ్యాషన్’ సినిమాలో ఉంటాయి. లైట్ల ముందు స్టేజ్ మీద తళుక్కుమనే మోడల్స్ జీవితాల్లో స్టేజ్ వెనకాల ఉన్న చీకటి, ఆకలి, ఆర్తి, పోటీ, రాజకీయాలు, అవకాశాలు, అవకాశ వాదాలు, నిరాశలు, నిస్పృహలు అన్నీ ఫ్యాషన్‌లో చూడచ్చు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ ఒకే ఫ్లోలో ఉంటాయి మధుర్ సినిమాల్లో. ఫ్యాషన్‌లోనూ అంతే. ముఖ్యంగా చెప్పుకోవలసింది కంగనా రనౌత్ గురించి. ‘ఫ్యాషన్’తో బాలీవుడ్‌ని భారతీయ సినీ ప్రేక్షకుడి మన్ననలనీ పొందింది ఈ సహాయ నటి. ప్రియాంక చోప్రాతో సమానంగా ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డుని, ఫిల్మ్‌ఫేర్ అవార్డునీ కైవసం చేసుకోవడం గొప్ప, అరుదైన విషయం. అసలు ఒకే కథలో రెండు పాత్రలకి ఇంత బలం ఉండడం కూడా చాలా రేర్. తన పాత్రకి కావల్సిన యాటిట్యూడ్‌ని, యారొగెన్స్ని, హావ భావాల్సి, బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్ది నట్టు దింపేసింది. అతి తక్కువ కాలంలో కంగనా బాలీవుడ్ ‘క్వీన్’గా వంద కోట్ల సినిమాల క్లబ్బులో హీరోలా చేరిపోడానికి పునాది ‘ఫ్యాషన్’ సినిమా. ఒక దర్శకుడిగా కొన్ని వందల మంది మహిళా తారలతోను, వారి వ్యక్తిగత జీవితాలతోనూ పరిచయం ఉంది నాకు. కానీ ఏ రోజూ దానిని సినిమా కథగా మల చాలన్న ఆలోచనే నాకు రాలేదు. మధుర్ సనిమాలు చూడడం మొదలుపెట్టాక, నేను చూసిన జీవితంతో ‘తార’ అని ఒక కథ రాసుకున్నాను. కానీ ఆ కథ క్లైమాక్స్‌ని ఇంకా నేను చూడలేదు కాబట్టి కంప్లీట్‌గా రాయలేదు. వాస్తవాన్ని కల్పించిన కథగా చెప్పే టెక్నిక్‌ని మధుర్ సినిమాల ద్వారా తెల్సుకోవచ్చు. నా చిన్నప్పుడు దాసరి నారాయణరావు, కె.బాలచందర్, కె.రాఘవేంద్రరావు... ఇలాంటి చిత్రాలని జనరంజకంగా తీసి సక్సెస్ చేయగలిగారు. ఆ తర్వాత ఈ పాతికేళ్లలో, ఈ జానర్లో ప్రతి ఆధునిక తెలుగు దర్శకుడూ ఫెయిలే. తమిళంలో తీస్తున్నారు. కానీ ఒక దర్శకుడు ఒకసారే తీయడం వల్ల అది బాణీ అవ్వలేకపోతోంది. హిందీలో మధుర్ది ఆ బాణీ. పరిశ్రమకి మేలు చేసే బాణీ. నటీనటులకి పరీక్ష పెట్టి, శిక్షణ నిచ్చి, తారాస్థాయికి తీసుకెళ్లి వదిలిపెట్టే బాణీ. పదిమందీ అనుసరించదగిన బాణీ. మనం రోజూ చూసే జీవితాన్ని మనం నేర్చుకుంటే స్ఫూర్తి. పది మందికి చెప్పగలిగితే పాఠం. అందుకే ఈ దర్శ కుడు చాలామంది మోడ్రన్ దర్శకులకి మంచి మాస్టారు. ఈయన నేర్చుకున్న మంచి మేస్టారు మన తెలుగువాడైన రామ్ గోపాల్‌వర్మ. ఆయన ‘పద్మశ్రీ’ పథంలో పదం ఆర్జీవీది. శ్రీ మధుర్ భండార్కర్ది. గురువు గొప్పదనం శిష్యుడి ప్రగతిలోను, ప్రస్థానంలోను కనిపిస్తుంది. -
సినిమాల పందెం కోళ్లు
సినిమా సంక్రాంతి తెలుగు సినిమాకీ, సంక్రాంతికీ అవినా భావ సంబంధం ఉంది. 1955లో కమర్షియల్‌గా సంక్రాంతి సీజన్లో మార్కెట్‌ని కొల్లగొట్టిన కోడి ‘మిస్సమ్మ’. అందులో అన్న ఎన్టీఆర్, మహానటుడు ఏఎన్ఆర్ కలిసి నటించడంతో హీరోలుగా పోటీ లేకుండా సినిమా గెలిచేసింది. అప్పట్నుంచి ప్రతి యేడూ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా సంక్రాంతికి ఒక సినిమా తనకుండేలా చూసుకున్నారు. 56లో ‘తెనాలి రామకృష్ణ’, 59లో ‘అప్పుచేసి పప్పుకూడు’, 60లో ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’, 61లో ‘సీతారామ కల్యాణం’, 62లో ‘గులేబకావళి కథ’, 63లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, 64లో ‘గుడి గంటలు’, 65లో ‘పాండవ వనవాసం’, 66లో ‘శ్రీకృష్ణ పాండవీయం’, 67లో ‘గోపాలుడు- భూపాలుడు’, 68లో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’, 69లో ‘వరకట్నం’, 70లో ‘తల్లా, పెళ్లామా’,71 నుంచి 76 వరకూ హిట్లు తగల్లేదు కానీ సినిమాలు పోటీలో ఉన్నాయి. మళ్లీ 77లో ‘దానవీరశూరకర్ణ’ తో విజృంభించి సంక్రాంతి పందెంలో ఫస్ట్ బెస్ట్ కోడి తనదేనని నిరూపించారు. 82లో ‘అనురాగ దేవత’ వరకు అన్నగారే సంక్రాంతికి తెలుగువాళ్ల అభిమాన గెలుపు కోడి. తర్వాత ఆ వారసత్వాన్ని సూపర్‌స్టార్ కృష్ణ అందుకున్నారు. 1976లో ‘పాడిపంటలు’తో ప్రారంభించి, 1997 తప్ప, వరుసగా 76 నుంచి 99 వరకూ అంటే 22 ఏళ్లు నిరాటంకంగా సంక్రాంతి బరిలో నిలబడ్డ స్టార్ కోడి తనదే అయ్యేలా చూసుకున్నారు. తెలుగువారితో ఎక్కువసార్లు గెలిపించుకున్నారు. 87లో ‘ఊరికి మొనగాడు’, 82లో ‘బంగారు భూమి’, 84లో ‘ఇద్దరు దొంగలు’, 85లో ‘అగ్నిపర్వతం’, 93లో ‘పచ్చని సంసారం’, 94లో ‘నంబర్ వన్’, 95లో ‘అమ్మదొంగ’... ఇవన్నీ కృష్ణ ప్రైజ్ విన్నింగ్ గెలుపు కోళ్లు - ఆయా సంవత్సరాల సంక్రాంతి పందాల్లో. మెగాస్టార్ చిరంజీవి 87లో ‘దొంగ మొగుడు’తో, 89లో ‘అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు’తో, 97లో ‘హిట్లర్’తో, 2000లో ‘అన్నయ్య’తో సంక్రాంతి బరిలో భారీగా గెలిచినా, 2001 ‘మృగరాజు’, 2004 ‘అంజి’ తేడా కొట్టేశాయి. అయినా మెగాస్టార్ సంక్రాంతిని కంపల్సరీ రిలీజ్ డేటుగా చూసుకున్న దాఖలాలు లేవు. ఇలా అడపాదడపా వచ్చి పందెం గెలిచిన చుట్టం ‘కోడే’ ఆయన. నందమూరి అన్న ఎన్టీఆర్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్యబాబు, సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వీళ్లిద్దరూ మాత్రం వీలైనంత వరకూ గెలుపోటములతో సంబంధం లేకుండా సంక్రాంతి బరిలో పందెంలో దిగడానికే ప్రయత్నం చేసే రసవత్తరమైన ఛాంపియన్ ‘కోళ్లు’ - 1985 నుంచి బాలకృష్ణ దాదాపు ప్రతి ఏడూ సంక్రాంతి బరిలో నిలబడ్డారు. క్రమం తప్పకుండా ఈ ఏడాది 2016 వరకూ... ఈ ఏడు ‘డిక్టేటర్’తో మళ్లీ బలంగా పందెంలో నిలుచున్నారంటే అర్థమౌతోంది - సంక్రాంతిని అభిమానుల కోసం ఎలా సందడిగా మారుస్తున్నారో అని. 1985 నుంచి 2016 వరకూ అంటే దాదాపు ముప్ఫైఏళ్లకు పైగా అయిదుసార్లు మినహాయించి పందెంలో నిలబడ్డ కోడి నిజంగా గొప్ప కోడి. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, వంశోద్ధారకుడు, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ ఈ కోడి విజయాలు. సంక్రాంతి పందెంలో కన్సిస్టెంట్గా నిలబడుతున్న మరో ఛాంపియన్ పందెం కోడి మహేశ్‌బాబు. 1979 నుంచి 1990 వరకూ బాలనటుడిగానే బాక్సాఫీసుని బద్దలు కొట్టిన విజయాలనిచ్చిన ఈ సూపర్‌స్టార్ 2002లో ‘టక్కరిదొంగ’తో సంక్రాంతి బరిలోకి దిగారు. 2003లో ‘ఒక్కడు’తో ఆ ఏటి మేటిగా నిలిచారు. మళ్లీ 2012లో ‘బిజినెస్‌మ్యాన్’గా అలరించారు. 2013లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో తమ్ముడిగా గెలిచారు. 2003లో ‘నాగ’తో, 2004లో ఆంధ్రావాలాతో, 2005లో ‘నా అల్లుడు’తో సంక్రాంతి బరిలో పోటీచేసిన నందమూరి స్టార్ హీరో తారక్ 2010లో ‘అదుర్స్’తో సంక్రాంతి పందెంలో గెలుపు రుచి చవిచూశారు. 2004లో వర్షంతో ప్రభాస్ సంక్రాంతి పందెంలో బాలయ్యతోను, మెగాస్టార్ తోను పోటీపడి మరీ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. రామ్ 2006లో వై.వి.ఎస్. చౌదరి నిర్మాత, దర్శకుడుగా సంక్రాంతి బరిలోనే ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసి ‘చుక్కల్లో చంద్రుడు’గా వచ్చిన సిద్ధార్థతో ఢీకొని ఆ ఏడాది ఛాంపియన్ కోడిగా ముద్రేయించుకున్నారు. 2011లో రవితేజ ‘మిరపకాయ్’తోను, 2013లో రామ్‌చరణ్ ‘నాయక్’తోను, 2014లో అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తోను, 2015లో పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‘గోపాల గోపాల’తోను, అదే ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్ ‘పటాస్’గా వచ్చి పందాల్లో నిర్మాతలు పెట్టిన డబ్బులు పోకుండా గెలిపించేశారు. చాలా అరుదుగా ఒక్కో ఏడు రెండు, మూడు కోళ్లు గెలుస్తాయి. అది ఈ పందాల్లో ప్రత్యేకత. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 2009లో నిర్మించిన ‘అరుంధతి’ ఆ ఏడాది సంక్రాంతి గెలుపు కోడిగా అనుష్కని నిలబెట్టింది. మొదటిసారి పందెం గెలిచిన ఆడ కోడి అనుష్క. విక్టరీ వెంకటేష్ తన సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2000లో ‘కలిసుందాం రా’ అంటూ, చిరంజీవి ‘అన్నయ్య’తోను, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’తోనూ కలిసి ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఒక రకంగా సోలోగానూ, మల్టీస్టారర్తోను కలిపి సంక్రాంతికి ఘన విజయాలు దక్కించుకున్న హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, వెంకటేష్, మోహన్‌బాబు, కృష్ణంరాజులనే చెప్పాలి. 2002లో ‘సీమసింహం’, ‘టక్కరి దొంగ’ల భారీ పోటీ మధ్య తరుణ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ వై.కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘నువ్వు లేక నేను లేను’ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో పందెంలో గెలిచేసింది. 2003లో ఒక్కడు ప్రభంజనంతో కూడా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోని ‘పెళ్లాం ఊరెళ్తే’ బాగానే కాసులు రాబట్టింది. 2008లో ‘కృష్ణ’ సినిమాతో రవితేజ మరోసారి సంక్రాంతి సూపర్‌హిట్టు కోడిగా నిలబడినా ఆ దర్శకుడు వి.వి.వినాయక్ మళ్లీ 2010లో తారక్‌తో ‘అదుర్స్’ని కూడా సంక్రాంతి బరిలో విజేతగా నిలబెట్టారు. ఎన్టీఆర్‌తో మొదలైన సంక్రాంతి సినిమాల పండుగ సందడి రేపు రానున్న 2016 సంక్రాంతికి నందమూరి అభిమానుల మధ్యే పెద్ద పోటీకి తెరతీసింది. నందమూరి తారక్ ‘నాన్నకు ప్రేమతో’ అని సుకుమార్ దర్శకత్వంలో వస్తూండగా, నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా బరిలో ముందే ఉండడం ఈ సంక్రాంతికి బాగా ఆసక్తి రేపిన విషయం. మామూలుగా హిట్ అయ్యే సినిమాలు వేలకు వేలున్నా, సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలు, వాటి గురించిన చర్చలు, వాటి కలెక్షన్ల తీరే మిగిలిన సీజన్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు రిలీజయ్యే సినిమాలకి మాత్రమే పోటీ అని ఫీలౌతాం. మిగిలిన సమయాల్లో ఏ రెండు సినిమాలున్నా సంక్రాంతికి ఉన్న చర్చ ఉండదు. కాబట్టి పోటీ గెలిచిన హీరోల అభిమానులు ఏడాదంతా కాలరెగరేసుకుని తిరుగుతారు. పైగా క్యాలెండర్ సంవత్సరం మొదలయ్యేది జనవరి కాబట్టి సంక్రాంతికి ప్రేక్షకుడు ఏ టైప్ చిత్రానికి పందెంలో గెలుపు పట్టం కడతాడో, ఆ ఏడాదంతా ఆ టైపు చిత్రాల నిర్మాణం బలవంతంగా జరిగిపోతుంది. అయితే, సంక్రాంతి నేపథ్యంలోని కథాంశంతో రూపొందిన సినిమాలు చాలా తక్కువే. దర్శకరత్న దాసరి నారాయణరావు ‘ఊరంతా సంక్రాంతి’ అనే మల్టీస్టారర్‌లో అక్కినేని, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. అదొక్కటే సహజమైన తెలుగు స్వాభావిక సంక్రాంతి చిత్రం అయితే, హీరో వెంకటేష్ ‘సంక్రాంతి’ అనే సూపర్‌గుడ్ చిత్రంలో శ్రీకాంత్, శర్వానంద్‌లతో కలిసి నటించారు. ఇది తమిళ ‘ఆనందం’ చిత్రానికి రీమేక్. అరవ సాంబారు, పొంగల్ లాంటి కథా కథనాలు తప్ప తెలుగు పులిహోరలు, బొబ్బట్లు ఈ సంక్రాంతిలో మృగ్యం. అందుకే ఈ సంక్రాంతి, జనవరిలో రిలీజవ్వలేదు. కానీ మంచి హిట్ చిత్రం అయింది. సంక్రాంతి అంటే కొత్త సంవత్సరం రాక. కొత్త చుట్టాల, అల్లుళ్ల రాక. కొత్త సినిమాల రాక. ‘పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే’ అన్న మహాకవి గురజాడవారిని గుర్తుచేసుకుంటూ, ఆ పండగలో పోటీని ఆస్వాదిద్దాం. ఆ పండుగని ఆనందంగా అనుభవించి ఈ ఏడాది ప్రారంభిద్దాం. అందరికీ నూతన సంవత్సర, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. - వి.ఎన్.ఆదిత్య -
నేల మీద తారలు
దేడ్ కహాని - తారే జమీన్ పర్ అనగనగా ఓ భయంకరమైన అల్లరి అబ్బాయి. వాడికి అయిదేళ్లప్పుడు అన్నలు ఇసుకతో కట్టిన గుడిని కసిగా కూల్చేసి నాన్నతో దెబ్బలు తిన్నాడు. ఇంకో ఆర్నెల్ల తర్వాత స్కూల్లో మాస్టారు వేరే స్టూడెంట్‌ని కొడుతుంటే భయమేసి నెలరోజులు స్కూలుకెళ్లలేదు. ఇంట్లో బయల్దేరి, గుళ్లో కూర్చుని, ఆడుకుని, పడుకుని మళ్లీ స్కూలు వదిలే టైముకి ఇంటికెళ్లిపోయేవాడు. సినిమాలు చూస్తున్నప్పుడు నిద్ర రాదు. పుస్తకం తెరిస్తే పడుకునేవాడు. స్కూలు విషయం ఇంట్లో తెలిసి అమ్మచేత ఒళ్లంతా రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నాడు. అర్ధరాత్రి ఏదో గుర్తొచ్చి వాళ్ల నాన్న తలగడ కింద చెయ్యి పెడితే, పామనుకుని భయపడిన నాన్న తెల్లారేదాకా కొట్టారు. మూడు రోజులు కష్టపడి వత్తిన వందల అప్పడాలు అర సెకనులో చిదిమి ముక్కలు చేసి అమ్మచేత కవ్వం విరిగేలా తన్నులు తిన్నాడు. బైటికెళ్తే రక్తం కారుతూ వచ్చేవాడు. చెప్పకుండా సినిమాలకి పోయేవాడు. ఇంట్లోవాళ్లకి వాడొక పీడకల. వాడు మాత్రం అందమైన కలలు కంటూ పెరిగాడు. రాఘవేంద్రరావులా, దాసరిలా, విశ్వనాథ్‌లా, బాపులా, బాలచందర్‌లా, జంధ్యాలలా, సింగీతంలా, మణిరత్నంలా అవ్వాలని, అవుతానని కలలు కనేవాడు. చూసిన సినిమా కథ బాగా చెప్పేవాడు. ఎవరో ఒకరికి చెప్పకుండా నిద్రపోయే వాడు కాదు. ఎక్కువ బలైంది వాళ్లమ్మే పాపం. కాలేజీలో చదువు ఎగ్గొట్టడానికి కల్చరల్ కాంపిటీషన్స్‌కి వెళ్లేవాడు. వెళ్లగా వెళ్లగా అనుభవం వచ్చి, ప్రైజులు తేవడం మొదలెట్టాడు. ప్రైజులు తేగా తేగా కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అవ్వగానే సినిమాల్లోకి దూకేశాడు. ఈదగా ఈదగా అనుభవం వచ్చి ‘మనసంతా నువ్వే’ సినిమా తీసి దర్శకుడైపోయాడు. ఇది బాల్యం. పెరిగి పెద్దయిన ప్రతి ఒక్కరికీ ఇలా ఒక బాల్యం ఉంటుంది. అది అందరికీ చాలా అందంగా ఉంటుంది. థాంక్ గాడ్... అప్పట్లో ఇంటర్నెట్లు, గూగుల్ సెర్చ్‌లు, అతిగా నాలెడ్జ్‌లు లేవు, అనవసరమైన అవేర్నెస్లు లేవు. లేకపోతే నన్ను కూడా ఏ ‘డిస్లెక్సిక్’ పేషెంట్గానో భావించి, మా పేరెంట్స్ ఏ స్పెషల్ చైల్డ్ గానో ట్రీట్మెంట్ ఇప్పించేస్తే, ఎటో పారిపోయేవాణ్ని, ఏదో అయిపోయే వాణ్ని. కోపం వస్తే నాలుగు దెబ్బలేసినా, ప్రేమను పంచి, అందరు పిల్లల్లానే మామూలుగానే పెంచేశారు. కాబట్టి సమాజంలో ఉండగలిగాను. అనుకున్నది చేయగలిగాను. ఇది నా కథ. ఇలా మనలో అందరికీ ఒక కథ ఉంటుంది. దాని నుంచి ఈ రోజున మనం తీసుకోగలిగిన స్ఫూర్తి ఉంటుంది. నేర్చుకోవలసిన పాఠం ఉంటుంది. చిన్నప్పుడు చదువంటే ఉండే భయం నుంచి, జీవితంలో పైకి రావడమనే జయం వరకు మనని, ప్రతి ఒక్కరినీ ఏదో ఒక పాత్ర, ఒక సంఘటన, ఒక తల్లో, తండ్రో, స్నేహితుడో, గురువో, అంకులో, ఆంటీయో, తాతగారో, నానమ్మో, అమ్మమ్మో... ఎవరో ఒక వ్యక్తి ప్రభావితం చేసి ఉంటారు. అలా కూడా ఎవరూ లేని వాళ్లకోసం ‘తారే జమీన్ పర్’ అనే ఒక సినిమా ఉంది. మన నిన్నటికి, మన రేపటికి మధ్య సంధి కాలం చీకటైతే, అందులో వెలుగునిచ్చే నక్షత్రం... ‘తారే జమీన్ పర్’. దర్శీల్ సఫారీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు ‘ఇషాన్ నందకిషోర్ అవస్థీ’గా జీవించిన చిత్రం. విపిన్శర్మ, టిస్కాచోప్రా మన అమ్మానాన్నలే అనిపించేంత సహజంగా నటించి, అలరించిన చిత్రం. ఆమిర్‌ఖాన్ రామ్‌శంకర్ నికుంభ్గా అత్యద్భుతంగా ఇమిడిపోయి, నటుడిగా ఎదిగిపోయిన చిత్రం. ‘తారే జమీన్ పర్’ ఆమిర్‌ఖాన్‌కి దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ సినిమా కథ గురించి రాసే ముందు ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న కథని కచ్చితంగా చెప్పాలి. బాలీవుడ్లో దీపా భాటియా అనే ఫేమస్ ఫిమేల్ ఎడిటర్ ఒకామె ఉన్నారు. ఆమె భర్త అమోల్ గుప్తే కథలు రాసుకుంటూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ తిరుగుతుండేవాడు. ఒకరోజు దీపా భాటియా ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శక శ్రేష్టుడు ‘అకిరా కురసోవా’ బాల్యం గురించి చదువుతూ... అంతటి మేధావి, దర్శకుడూ చిన్నప్పుడు స్కూల్లో చాలా పూర్ స్టూడెంట్ అని, చదువనే చట్రంలో ఇమడలేక ఇబ్బంది పడ్డాడని తెలిసి, వాళ్లాయనతో దీనిమీద ఒక సినిమా కథ తయారు చేయమంది. భారతీయ బాల్య విద్యా నేపథ్యానికి అకిరా కురసోవా జీవితాన్ని తర్జుమా చేసే ప్రయత్నంలో అమోల్ గుప్తే చాలా రీసెర్చ్ చేశాడు. అందులో ఆయనకి ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్లు, ఏదో ఒక రంగంలో ప్రపంచాన్ని శాసించినవాళ్లు కూడా చిన్నప్పుడు ఒక ఫిక్స్డ్ కరిక్యులమ్‌లో, డిసిప్లిన్డ్ స్టడీస్‌లో ఫెయిలయ్యారని తెలిసింది. ఆ రీసెర్చ్ లోంచి డిస్లెక్సియా అనే వ్యాధి పిల్లలకి అక్షరాలని గుర్తుండనివ్వదని తెలిసింది. అన్ని విషయాల్లోనూ తెలివిగా ఉండే మూడో తరగతి పిల్లాడు యాపిల్ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకుని సరిగా రాయలేక పోతే, దానికి కారణం ఈ వ్యాధి అని అర్థమైంది. అలా ‘తారే జమీన్ పర్’ కథ పుట్టింది. దానికి సరిగ్గా సరిపోయే కుర్రాడి కోసం వెతుకుతూ, షమ్యక్ దేవర్ సమ్మర్ డ్యాన్స్ క్లాస్‌లో పిల్లల్ని చూస్తుంటే... దర్శీల్ సఫారీ అనే కుర్రాడు దొరికాడు. చదువుతో నానా అవస్థలు పడే ఇషాన్ అవస్థి పాత్రకు అతడు ఫిక్స్ అవ్వగానే... టీచర్ పాత్రధారి అయిన హీరో కోసం, నిర్మాత కోసం వెతకనారంభించాడు. ముందు హీరోని ఒప్పిస్తే నిర్మాత దొరుకుతాడు కాబట్టి అక్షయ్ఖన్నాని కలిసి కథ చెప్పాడు. కథ వల్లో, అమోల్ గుప్తే దర్శకత్వం వల్లో అక్షయ్ఖన్నా ఒప్పుకో లేదు. అప్పుడు ఆమిర్‌ఖాన్‌ని కలిశాడు. తన బాల్యంలో ఆర్ట్ క్లాస్ టీచర్ అయిన రామ్‌దాస్ సంపత్ నికుంభ్ని స్ఫూర్తిగా తీసుకుని అమోల్ గుప్తే హీరో పాత్రని రూపొందించాడు. అందుకే ఆ పాత్రకి రామ్‌శంకర్ నికుంభ్ అని పేరు పెట్టాడు. మంచి కథలకి, మంచి పాత్రలకి ఎప్పుడూ ముందుండే ఆమిర్‌ఖాన్ నికుంభ్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. తనే నిర్మాతగా, అమోల్ గుప్తేకి దర్శకత్వం అవకాశం ఇచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. కథ, మాటలు బావున్నా... స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తేడాగా ఉన్నాయని ఆమిర్‌కి అనుమానం వచ్చింది. అమోల్ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ, క్రియేటివ్‌గా కాయితం నుంచి వెండితెర మీదకి ఎక్కించే విషయాల్లో ఏదో లోపిస్తోందని ఆమిర్ అనుమానపడ్డాడు. దాంతో అమోల్‌ని దర్శకుడిగా వద్దన్నాడు. అయితే వేరే దర్శకులని వెతకడం, వాళ్లు దానిని ఎక్కించుకుని తెరకెక్కించేలోపు దర్శీల్ పెరిగి పెద్దయిపోతుండడం - ఇవన్నీ ఎందుకని ఆమిర్‌ఖాన్ స్వయంగా మెగాఫోన్ పట్టేసుకున్నాడు. తనే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా బాధ్యతలు భుజానేసుకుని అమోల్ గుప్తేని క్రియేటివ్ డెరైక్టర్‌గా పెట్టి ‘తారే జమీన్ పర్’ని మనకందించాడు. ప్రేక్షకులేం తక్కువ తినలేదు. 12 కోట్ల బడ్జెట్‌కి 89 కోట్లు తిరిగి ఇచ్చారు. ఇంత మంచి చిత్రం తీసిచ్చిన ఆమిర్ ఖాన్‌కి, కాసులతో పాటు అవార్డుల పంట కూడా పండింది. భారతదేశం తరఫున ఆస్కార్ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా నామినేట్ కూడా అయ్యింది. చెన్నైలో ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా మొదటి సినిమా దర్శకుడికి ఇచ్చే ‘గొల్లపూడి శ్రీనివాస్ అంతర్జాతీయ అవార్డు (తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్లో ప్రమాద వశాత్తూ మరణించిన తన కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు ఇరవై ఏళ్లుగా ప్రతి యేటా ఎంతోమంది అంతర్జాతీయ దర్శకులకి ప్రోత్సాహంగా ఈ అవార్డు ఇస్తున్నారు)’ ఆ యేడు ఆమిర్‌ఖాన్‌కి దక్కింది. ఇదీ... ‘తారే జమీన్ పర్’ తెర వెనుక కథ. చదవలేక పోవడం నిర్లక్ష్యం కాదు, వ్యాధి అని చెప్పే ఒక ఉపాధ్యాయుడు నిరాశా నిస్పృహలకు లోనైన చిన్నారిని ఉత్తేజితుల్ని చేసి ఆ స్కూల్‌కి చిన్న సైజు హీరోని చేస్తాడు. ఇది పిల్లలు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు. పిల్లలున్న తల్లిదండ్రులు, టీచర్లు అందరూ చూడాల్సిన చిత్రం. నిజానికి ఇది ఒక కమర్షియల్ చిత్రం కాదు. కంపల్సరీగా ప్రతి స్కూల్లోనూ చూపించాల్సిన పాఠం. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఉండాల్సిన పాఠం. ఆమిర్‌ఖాన్ నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలిచ్చాడు. ఇక దర్శకుడిగా మారి ఇచ్చిన ‘తారే జమీన్ పర్’ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అదొక ఆణిముత్యం. ర్యాంకుల కోసం పిల్లల నెత్తిమీద మోయలేని బరువును పెట్టేసి, ఒత్తిడికి లోను చేసి, వారి ఆత్మహత్యలకు సైతం కారణమవుతోన్న తల్లిదండ్రులందరికీ గొప్ప సందేశాన్నే ఇచ్చాడు ఆమిర్ ఈ చిత్రం ద్వారా. పిల్లలు వెనుకబడటానికి వాళ్లు మొద్దులు కావడం కారణం కాదని, ఏదైనా సమస్య ఉందేమో చూడమని, ఏదైనా టాలెంట్ ఉంటే వెలికి తీసి వాళ్లని గొప్పవాళ్లను చేయమని కొత్త పాఠం చెప్పాడు. ఎంత గొప్ప పాఠమిది! పిల్లలు... నేలమీది తారలు. వాళ్లని బాగా పెంచితేనే సమాజం బావుంటుంది. -
పిక్చర్ అభీ బాకీ హై!
ప్రత్యేక కృతజ్ఞతలు అన్న హెడ్డింగ్ కింద, మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, డా॥ఎం.మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగార్జున, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహరాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తెలుగు సినిమా టైటిల్స్‌లో మొదటి టైటిల్ కార్డు ఇలా ఏ తెలుగు ప్రేక్షకుడైనా చూడగలడా? వాళ్లందరూ ఓ నిర్మాత కోసమో, దర్శకుడి కోసమో, హీరో కోసమో అయిదు నిముషాలు ఓ పాటలోనో, రెండు, మూడు సీన్లలోనో కనిపించగలరా? హీరోలే కాదు. అనుష్క, కాజల్, తమన్నా, శృతిహాసన్, సమంత... వీళ్లు కూడా. కానీ, అది హిందీలో చూడగలం. షారుఖ్ ఖాన్ సినిమాలో, ఫర్హాఖాన్ దర్శకత్వంలో, ‘ఓం శాంతి ఓం’ సినిమాలో అభిషేక్, అమితాబ్, అక్షయ్‌కుమార్, జితేంద్ర, ధర్మేంద్ర, తుషార్, రితేష్, సుభాష్ ఘయ్, రిషికపూర్, కరీనా, రాణీముఖర్జీ, రేఖ, ప్రీతి జింతా, షబానా అజ్మీ, సల్మాన్ ఖాన్... ఇలా ఒకరేమిటి? ఐఫా అవార్డులకో, ఫిల్మ్‌ఫేర్ అవార్డులకో హాజరైనట్టు తారా తోరణమంతా వచ్చి నటించారు. అభిషేక్, అక్షయ్ అయితే మరీను. ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్లో ఓం కపూర్ పాత్రధారి షారుఖ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఉడుక్కునే సాటి హీరోలుగా నటించారు. ఇలా చేయాలంటే చాలా స్పోర్టివ్‌నెస్ ఉండాలి ఆర్టిస్టుకి. అలాగే తనమీద తనకి నమ్మకం కూడా ఉండాలి. ‘ఓం శాంతి ఓం’... పాప్‌కార్న్ సినిమాల స్పెషలిస్టు ఫర్హాఖాన్ (పూర్వాశ్రమంలో గొప్ప డ్యాన్స్ డెరైక్టర్ - ప్రస్తుతం బాలీవుడ్లో పెద్ద కమర్షియల్ డెరైక్టరు) ‘మై హూ నా’ తర్వాత తీసిన రెండో చిత్రం. దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా చాలా పరిణతి చెందినట్టు అనిపించి, ఆమె అభిమానిగా మారిపోవచ్చుననిపించే సినిమా ‘ఓం శాంతి ఓం’. దీపికా పదుకొనెను హిందీ చిత్రసీమకి పరిచయం చేసిన మొదటి చిత్రం. అంతకుముందు ఆమె కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘ఐశ్వర్య’ అనే చిత్రంలో నటించింది. అది మన తెలుగు మన్మథుడు (నాగార్జున)కి రీమేక్. అయితే దాని గురించి మనకు పెద్దగా తెలియదు. షారుఖ్‌తో ‘ఓం శాంతి ఓం’లో మెరిశాకే దీపిక అందరికీ పరిచయమైంది. 1970లలో రిషికపూర్ హీరోగా ‘ఫర్జ్’ అనే సినిమా వచ్చింది. పునర్జన్మల కథలలో అదే లాస్ట్ సూపర్ హిట్. మ్యూజికల్‌గాను, ఎమోషన్స్ పరంగానూ, బాక్సాఫీసుని కొల్లగొట్టి విజయఢంకా మోగించిన చిత్రమది. అందులో రిషికపూర్ నటించిన ఓ పాటలో సిగ్నేచర్ లైనే ‘ఓం శాంతి ఓం’. ఇది స్టేజ్ సాంగ్. ఆ పాట షూటింగ్ జరుగుతుంటే, యంగ్ రిషికపూర్ స్టేజి మీద డ్యాన్స్ చేస్తుంటే, ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్లో ఒకడిగా, అంటే జూనియర్ ఆర్టిస్టుగా షారుఖ్ ఖాన్ కనిపిస్తాడు. ఇలా మొదలౌతుంది ‘ఓం శాంతి ఓం’. గ్రాఫిక్స్‌లో మిక్స్ చేసినా కూడా ఆలోచనే అద్భుతంగా ఉన్నప్పుడు సినిమాలో లీనమవ్వకుండా ఎలా ఉంటాం? ఓం ప్రకాశ్ అనే జూనియర్ ఆర్టిస్టుకి హీరో అయ్యి, ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవాలన్నది కల. అది తీసుకునేటప్పుడు ఇచ్చే స్పీచ్ కూడా చిన్న పిల్లల్ని కూర్చోపెట్టి మందు బాటిల్‌ని అవార్డ్‌లా పట్టుకుని ఇచ్చేస్తాడు. ‘‘నువ్వు విజయం సాధించాలని మనసులో బలంగా కోరుకున్నప్పుడు, మొత్తం విశ్వ మంతా ఏకమై నిన్ను విజేయుడిగా నిలబెడుతుంది. సినిమాల్లోలాగే, జీవితం కూడా సుఖాంతమే అవుతుంది. ఒకవేళ అలా అవ్వలేదని అనిపిస్తే - సినిమా ఇంకా అవ్వలేదు, ఇంకా ఉందని అర్థం’’ అని చెప్తాడు. చాలా స్ఫూర్తివంతమైన డైలాగ్ ఇది. మొదటి వాక్యం ‘పాలో కొయిలో’ది. కానీ దాన్ని ఈ చిత్రంలో వాడిన విధానం సందర్భోచితం. ఇలాంటి జూనియర్ ఆర్టిస్టు శాంతిప్రియ అనే పెద్ద స్టార్ హీరోయిన్ని ప్రేమిస్తాడు. ఓ షూటింగ్లో ఆమెని అగ్ని ప్రమాదం నుండి కాపాడతాడు కూడా. అప్పట్లో ‘మదర్ ఇండియా’ షూటింగ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నర్గీస్‌ని సునీల్‌దత్ కాపాడడం, ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లాడడం నిజంగా జరిగినదే. దాన్నే ఈ సీన్లో కూడా అసిస్టెంట్ డెరైక్టర్ హీరోతో ప్రస్తావిస్తాడు. ప్రాణాలకి తెగించి కాపాడిన హీరోకి కృతజ్ఞతలు చెప్పి, అతనితో స్నేహం చేస్తుంది శాంతిప్రియ. కానీ, శాంతికి నిర్మాత ముఖేష్ మెహ్రాతో అప్పటికే రహస్య వివాహం అయ్యి, గర్భం కూడా దాల్చుతుంది. ఇది తెలిసి ఓం ఆవేదన చెందుతాడు. ముఖేష్ మాత్రం ఆగ్రహిస్తాడు. ‘ఓం శాంతి ఓం’ అనే భారీ సినిమా తీసి హాలీవుడ్‌కి వెళ్దాం అనుకుంటున్న అతనికి శాంతిప్రియ సెంటి మెంటల్‌గా, ఎమోషనల్‌గా ఫీలవ్వడం రుచించక, అదే సెట్లో శాంతిప్రియని నిప్పు పెట్టి చంపేస్తాడు. అది చూసిన ఓం, శాంతిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేసి తానూ మరణిస్తాడు. అయితే ఈ క్రమంలో అతడు స్టార్ హీరో రాజేష్ కపూర్ కారు కింద పడతాడు. కారులోని వాళ్లు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఆస్పత్రిలో ఓం మరణిస్తాడు. అప్పుడే పురిటి నొప్పులు పడుతూన్న రాజేష్ కపూర్ భార్య కడుపున ఓం కపూర్‌గా పుడతాడు. అక్కడ్నుంచి కొత్త కథ మొదలవుతుంది. 2000 సంవత్సరానికి ఓం కపూర్ పెద్ద స్టార్ హీరో అవుతాడు. అతణ్ని అప్పు డప్పుడూ గత జన్మ జ్ఞాపకాలు వెంటాడు తుంటాయి. ఓసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకుంటూ గత జన్మలో ఇచ్చిన స్పీచ్‌ని తనకి తెలీకుండానే ఇస్తాడు. షూటింగ్ నిమిత్తం ముప్ఫయేళ్ల క్రితం కాలిపోయిన సెట్ చూశాక గతం పూర్తిగా గుర్తుకు వస్తుంది. వెంటనే వెళ్లి తల్లిని, స్నేహితుడిని కలుస్తాడు. అదే సమయంలో హాలీవుడ్లో పెద్ద నిర్మాతగా మారిన ముఖేష్‌ని చూస్తాడు. అతడు శాంతి ప్రియకు చేసిన అన్యాయం గుర్తొచ్చి పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతడికి శాండీ కనిపిస్తుంది. ఆమె అచ్చం శాంతిప్రియలాగే ఉండటంతో... ఆమెతో శాంతిలాగ యాక్ట్ చేయించి, ముఖేష్‌ని భయపెట్టి నిజం అతని చేతే చెప్పించాలని చూస్తాడు. అయితే ఇదంతా ముఖేష్‌కి తెలిసి పోతుంది. దాంతో ‘ఓం’ని చంపేయాలని చూస్తాడు. చివరి క్షణంలో శాంతి ఆత్మ స్వయంగా వచ్చి ముఖేష్‌ని చంపి తన పగ తీర్చుకుని వెళ్లిపోతుంది. ఓం కపూర్, శాండీ ఒకటవటంతో కథ ముగుస్తుంది. సినిమాకి పునర్జన్మ అనేది ఓ కమర్షియల్ సూత్రం. రివెంజ్ తీర్చు కోవడం అనేది ఇంకో బల మైన కమర్షియల్ సూత్రం. ఈ రెండూ సూపర్‌హిట్ ఫార్ములాలే. వీటిని ఒకే కథలో రాసుకుంటే, మంచి మాటలతో, మంచి పాత్రలతో, కామెడీతో, సెటైర్‌తో, విజువల్‌గా చాలా రిచ్‌గా, గెస్ట్ తారాతోరణంతో కన్నుల పండువగా తీస్తే ప్రేక్షకుడికి నచ్చక చస్తుందా? ఆ కష్టమంతా పడిన నిర్మాత షారుఖ్ ఖాన్‌కి, పెట్టిన ప్రతి రూపాయికి రెండున్నర రూపాయల చొప్పున తిరిగిచ్చారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీప్రేక్షకులు. ఫరా ఖాన్ మంచి హాస్య ప్రియురాలు. కమర్షియల్ మసాలా రుచి తెలిసిన వంటల స్పెషలిస్టు. అంతకన్నా మంచి నృత్య దర్శకురాలు. కాబట్టే కథ, కథాంశం సృజనాత్మకంగానూ, భావ ప్రేరకంగానూ లేకపోయినా మంచి పాళ్లలో సాల్ట్, పెప్పర్ చాలా వంటల్ని ఎలా కాపాడే స్తాయో, ఈవిడ సినిమాని పైన చెప్పుకున్న అంశాలు అలా కాపాడేస్తాయి. మంచి ఖాళీ సమయాల్లో రిలీజైతే సూపర్ హిట్ అవుతాయి. మార్కెట్‌కి హెల్ప్ అవుతాయి. రెవెన్యూ జనరేట్ చేస్తాయి. తేడా వచ్చినా మార్జినల్‌గా పెద్ద నష్టం కలిగించవు. ఎటు తిరిగి ఎటొచ్చినా చూసిన వాడికి టైమ్ పాస్, తీసినవాడికి నో లాస్. జియో ఫర్హాజీ... ఆప్కీ పిక్చర్స్ అభీ బాకీ హై! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ఈ జోడీ పర్ఫెక్ట్!
దేడ్ కహానీ - జబ్ వియ్ మెట్ చేపపిల్ల... నీళ్లల్లో ఈదుతున్నంతసేపూ నోటి దవడలు ఆడిస్తూనే ఉంటుంది. నీళ్లు తాగకుండా ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియ అది. దాని జీవనాధారం. అలాగే ఓ చేప కళ్లున్న ఆడపిల్ల, చలాకీగా ఇరవై నాలుగ్గం టలూ తన పెదాలని ఆడిస్తూనే ఉంటుంది. ఎదుటి వాడి మనోభావాలతో సంబంధం లేదు. అలా మాట్లాడుతూనే ఉంటుంది. చివరికి నిద్రలో కూడా. ఆమే... గీత్ సింగ్. అమాయకమైన పల్లె టూరి అమ్మాయి. ముంబైలో ట్రైన్ ఎక్కుతుంది. పరిగెడుతున్న ట్రైన్ లోపల కెమెరా పెట్టి, ఖాళీ డోరు షాటు, కదులు తున్న ట్రైనుని చూపిస్తూ, గట్టిగా గీత్ గొంతు, మాటలు మాత్రమే వినపడేలా కొంత దూరం నడిపించి, తర్వాతే ఆమె రూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు. ఒక వాగుడుకాయ్ క్యారెక్టర్‌కి ఇంతకంటే అందమైన, అర్థవంతమైన పరిచయం వేరేది ఉండదు. ఇలా గీత్‌ని పరిచయం చేయడానికి ముందే ముంబైలో ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు ఆదిత్య కశ్యప్‌ని చాలా నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఓడిపోయి, అదీ తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, ఆ రిఫ్లెక్షను తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద పడి, ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, మూగ బోయినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. గమ్యం తెలీక, ఎలా ఉన్నవాడు అలా ఇల్లొదిలి రెలైక్కి కూర్చుంటాడు. అలాంటి వాడికి కో-ప్యాసింజర్ గీత్. అడిగినా అడక్కపోయినా, విసుక్కున్నా, లేచి వెళ్లి ఇంకో దగ్గర కూర్చున్నా ఆమె ధోరణి ఆమెదే. ఆ ఇద్దరూ కలిసి చేసే రైలు ప్రయాణం, దాని కొనసాగింపుగా చేసే జీవిత ప్రయాణమే ‘జబ్ వియ్ మెట్’ సినిమా మొదటి భాగం. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆదిత్యని తన సెలయేటి ప్రవాహం లాంటి మాటల నుంచి ప్రసరించిన తరంగాల కరెంటుతో చైతన్యవంతుణ్ని చేస్తుంది గీత్. అద్భుతమైన సీన్ ఏంటంటే, తండ్రి మరణానికి కారణం తన తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోవడం అని, సమాజం తల్లి మీద వేసిన నిందని కొడుకుగా తనూ వేసి ఆమెపై కోపం పెంచుకున్న కశ్యప్‌కి గీత్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్పిస్తుంది. తల్లి కూడా ఒక మనిషే అని, ఆమె ప్రేమలో తప్పు లేదని, కొడుకుగా ఆమెని అర్థం చేసుకోవాలే తప్ప, సమాజం దృష్టి నుంచి ఆమెని చూడకూడదని చెప్తుంది. ఇలాంటి తల్లుల్ని నిజ జీవితంలో చూసే ఉంటాం, సమాజంలాగ వాళ్లని చెడుగా తిట్టే ఉంటాం - గీత్‌లా వాళ్లని మనుషులుగా భావించమని చెప్పేవాళ్లు మనకుండకపోవచ్చు. జబ్ వియ్ మెట్ గీత్... వుయ్ లెర్న్ హౌ టు లీడ్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ అదర్స్. సరే, అలాంటి గీత్‌ని ఆమె ఇంట్లోంచి తెల్లారుఝామున తీసుకొచ్చి ఆమె ప్రేమించిన అన్షుమన్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు కశ్యప్. ఆమె అడుగుతుంది - మా ఇంట్లోవాళ్లకి తెలీకుండా ఇలా వెళ్లిపోతున్నాను నన్ను క్షమిస్తారా అని! ఆదిత్య చెప్తాడు - మా అమ్మని నీవల్ల నేను అర్థం చేసుకున్నాను, నిన్ను కూడా మీవాళ్లు కొన్నాళ్లకి అర్థం చేసుకుంటారని. అన్షుమన్‌ని కలవకుండానే గీత్‌ని దింపేసి వెళ్లిపోతాడు కశ్యప్ - ఇక్కడ విశ్రాంతి. జీవితాన్ని ఎలా చూడాలో, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో గీత్ ఆదిత్యకే కాకుండా ఆడియెన్స్ అందరికీ చెప్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ రాశాను. ద్వితీయార్ధంలో ఆదిత్య చాలా యాక్టివ్ అయిపోతాడు. కానీ గీత్ మాత్రం జీవితంలో ఓడిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి డీలా పడిపోతుంది. అది తెలిసి ఆమెలో తన చైతన్యంతో కరెంట్ ప్రవహించేట్టు చేసి ఆమెని మామూలుగా తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఒకటవ్వడమే కథ. ప్రథమార్ధంలో ఉత్తుంగ తరంగం లాంటి గీత్‌గా మెప్పించిన కరీనా కపూర్ నీరసించడం, నీరస పాత్రలో బాగా మెప్పించిన షాహిద్ కపూర్ ద్వితీయార్ధంలో ఉత్తుంగ తరంగంలా ఎగసి పడలేకపోవడం చూస్తే... సినిమాని కొంచెం పడేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ, గీత్ ప్రేమించిన అన్షుమన్‌ని కుటుంబ సభ్యులు స్నేహితుడనుకుని, ఆదిత్యని అల్లుడనుకునే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆ ఇంటి సీన్లే సెకండ్ హాఫ్‌కి సేవింగ్ ఫ్యాక్టర్. ఒక విధంగా శ్రీను వైట్లగారి సినిమాల ఫార్మాట్ నుంచే ఈ చిత్ర రూపకల్పన జరిగినట్టు ఉంటుంది. ఆ ఇంటి సీన్లు తెలుగులో చాలా సినిమాలకి ముడి సరుకు. షాహిద్, కరీనాలు అప్పటికే ప్రేమికులుగా పాపులర్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ మరింత బాగా పండినట్టు ఉంటుంది. కానీ, ఇదే ‘దిల్వాలే దుల్హనియా’ టైమ్‌లో షారుఖ్, కాజోల్ లాంటి జంట చేసుంటే... ఇది కూడా వాటిలాగే ఒక కల్ట్ ఫిల్మ్ అవ్వగలిగే కథ, కథనం ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2007 అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా 2010లో హాలీవుడ్లో ‘లీప్ ఇయర్’ అనే సినిమాకి ప్రేరణ కావడం భారతీయ సినిమా గర్వించదగ్గ అంశమే. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌కి వచ్చేసరికి షాహిద్, కరీనాలు నిజ జీవితంలో విడిపోయారు. మీడియా అంతా అది ఈ చిత్రం తాలూకు పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించింది. కానీ తర్వాత అది నిజమని రుజువైంది. ఈ సినిమా టైటిల్‌ని ‘పంజాబ్ మెయిల్’ అని పెట్టాలా, ‘ఇష్క్ వయా భటిండా’ అని పెట్టాలా ‘జబ్ వియ్ మెట్’ అని పెట్టాలా తేల్చుకోలేక పబ్లిక్ ఓటింగ్ పెడితే జబ్ వియ్ మెట్ గెలిచింది. అలాగే రిలీజయ్యాక ప్రేక్షకుల మన్ననలూ గెలిచింది. కాసుల వర్షమూ రూపాయికి మూడు రూపాయల చొప్పున గెలుచుకొంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య అంశం... ప్రీతమ్ సంగీతం. ఆసాంతం ఆకట్టుకొంటుంది. నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కూడా చాలా బావుంటుంది. శ్రేయాఘోషల్కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గాను, సరోజ్ఖాన్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గాను, నేషనల్ అవార్డులను తేవడంతో పాటు కరీనా కపూర్‌కి ఉత్తమ నటిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు అవార్డుల్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండో చిత్రం ఇది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపుతో తర్వాత చాలా మంచి చిత్రాలు తీశాడు. ఇంతియాజ్ కథ కన్నా పాత్రకి, పాత్రల రూపకల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. వాటి ద్వారా జీవితాన్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రేమని చాలా సున్నితంగా ప్రస్తావిస్తాడు. సీన్స్‌ని సుతిమెత్తటి పూవుల్లా ప్యాంపర్ చేస్తాడు. అందుకే మంచి దర్శకుడిగా ఎదిగాడు. రైలు ప్రయాణం ఆధారంగా తీసిన ఈ చిత్రంతో కెరీర్లో, జీవితంలో సక్సెస్ అందుకున్నాడు. తిన్నగా హైవే ఎక్కేశాడు. ఇక పక్కదారి పట్టడనే భావిద్దాం. మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని, మనకు చూపిస్తాడనీ ఆశిస్తాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ప్రతి మదిలో రగిలిన క్రీడాస్ఫూర్తి!
దేడ్ కహానీ - చక్ దే ఇండియా నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసిన చిత్రమిది. అందుకే సూపర్‌హిట్ అయ్యింది. మిలీనియమ్‌లో వచ్చిన చిత్రాల్లో మణిపూసలా నిలిచింది. ప్రేక్షకులకే కాదు... యావత్ సమాజానికే ప్రేరణనిచ్చింది. హాకీ మ్యాచ్ చూడ్డానికి బోరు. అందులోనూ మహిళల హాకీ. మ్యాచ్ అసలు ఎక్కడాడతారో, ఎప్పుడు జరుగుతాయో కూడా తెలీదు. ఇది సగటు భారతీయుడిగా నా నాలెడ్జ్, నా ఇంటరెస్ట్. 1983 నుంచి ఇండియాలో మగాళ్ల ఆట అంటే క్రికెట్టే. 1990ల నుంచి ప్రపంచంలో ఆడవాళ్ల ఆట అంటే టెన్నిస్సే. వేరే ఆటలుంటాయని, అవి కూడా ఆడుతుంటారని అప్పుడప్పుడూ కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లాంటివి జరిగినప్పుడు న్యూస్పేపర్లో చదవడం... ఏ దేశానికెన్ని పతకాలు వచ్చాయో పట్టీ మాత్రం చూసేసి, ఇండియాని తక్కువ స్థానంలో చూడడం, ఆ తక్కువ పతకాలు తెచ్చిన ఆటగాళ్లని కూడా తక్కువ చేసి చూడడం అలవాటై పోయింది. అలా ఎదిగేశాం. అలాగే అన్ని ఆటల్నీ వదిలేశాం. ఇలాంటి భావ సంచయం ఉన్న నాలాంటి ప్రేక్షకుడు, అందులోనూ క్రికెట్ మతం పుచ్చుకున్న ఉన్మాది... హాకీ ఆటే ప్రధానంగా తీసిన సినిమా చూడ్డానికి ఏ మాత్రమైనా ఆసక్తి చూపిస్తాడా? అయినా నేను ‘చక్ దే ఇండియా’ సినిమా చూడ్డానికి వెళ్లాను. దానికి కారణం... అది యశ్‌రాజ్ ఫిలిమ్స్వాళ్లు షారుఖ్‌ఖాన్ హీరోగా, ఆదిత్యచోప్రా నిర్మాతగా, షిమిత్ అమీన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయడమే. అయితే సినిమా మాత్రం భారత హాకీ టీమ్‌కి సంబంధించి నది కాబట్టి కాస్త అయిష్టంగానే వెళ్లాను. ‘లగాన్’ చూసిన కళ్లతో హాకీ ఆటని చూడగలనా? అనుకున్నాను. అప్పటికి నాకు 33 ఏళ్లు. జీవితంలో ఎప్పుడూ ఒక్క హాకీ మ్యాచ్ చూసిన పాపాన పోలేదు. అందుకే ఆ సినిమాను చూడ్డానికి అంత కష్టంగా వెళ్లాను. కానీ ‘చక్ దే ఇండియా’ సినిమా చూశాక మాత్రం... జీవితాంతం హాకీ మ్యాచెస్‌ని వదలకుండా చూసి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. భారతదేశ పురుషాహంకార సమాజంలో ఆడవారు ఆటుపోట్లు ఎదుర్కోవడానికే గానీ ఆటలాడడానికి పనికి రారు అన్న భావన చాలామందిలో ఉంది. అందరూ పిచ్చిగా అభిమానించే క్రికెట్లోనే మహిళల క్రికెట్‌కి ఆదరణ లేని భారతీయ సమాజంలో... ఇతర ఆటలకి విలువ, ఆ ఆటగాళ్లకి గుర్తింపు లేని రోజుల్లో... ఆడవాళ్ల హాకీని ప్రధానంగా చూపిస్తూ ‘చక్ దే ఇండియా’ తీశారు. ఆ ఆటను ఎవ్వరూ ఎలా పట్టించుకోవడం లేదో, అదే కథగా తీసి చూపించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కొన్ని పాత్రల్లో ఎంతో బాగా ఇమిడిపోతాడు. అలా అతడు అద్భుతంగా ఇమిడిపోయిన వాటిలో మొదటిది ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ అయితే, రెండోది ‘చక్ దే ఇండియా’నే. మన జాతీయ క్రీడ హాకీ. కానీ దానికి మన దేశంలోనే ఆదరణ కరువైపోయింది. ఆ నిరాదరణ మహిళల హాకీని పూర్తిగా చంపేయబోయింది. అలాంటి సమయంలో హాకీ సమాఖ్య... ఒక భారత పురుషుల హాకీ టీమ్ మాజీ కెప్టెన్‌ని మహిళల టీమ్‌కి కోచ్‌గా నియమిస్తుంది. అతని పేరు కబీర్‌ఖాన్. కబీర్‌ఖాన్ ఇస్లాం మతస్థుడు. భారత హాకీ కెప్టెన్‌గా ప్రపంచ కప్ ఫైనల్లో పెనాల్టీ కార్నర్ గోల్‌గా మలచలేక విఫలమౌతాడు. దాంతో పాకిస్థాన్ గెలుస్తుంది. కబీర్‌ఖాన్ పాక్ ఆటగాళ్లని కంగ్రాట్యులేట్ చేస్తాడు. అది ఓ జర్నలిస్టు ఫొటో తీసి కబీర్ఖాన్ని దేశద్రోహిగా, పాకిస్థాన్‌కి అమ్ముడు పోయినవాడిగా చిత్రీకరిస్తాడు. దాంతో కబీర్‌ఖాన్ ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఒక పాత మిత్రుడి ప్రోత్సాహంతో హాకీ ఆటకు చేరువవు తాడు కబీర్. భారత మహిళల హాకీ టీమ్‌ని ప్రపంచకప్‌కి పంపించే ముందు కోచ్‌గా ఎవ్వరూ ముందుకు రాని సమయంలో... తన దేశభక్తిని నిరూ పించుకునే అవకాశంగా దాన్ని భావించి, కోచ్ పదవిని చేపడతాడు కబీర్‌ఖాన్. పదహారు మంది మహిళలున్న భారత హాకీ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను నెత్తిన వేసుకుంటాడు. ప్రపంచకప్ గెలిపించి మహిళల హాకీకి పునరుజ్జీవనం తేవడంతో పాటు తన మీదున్న మచ్చని పోగొట్టుకుంటాడు. కథ కంచికి, కబీర్‌ఖాన్ సొంత ఇంటికి చేరుకోవడంతో సుఖాంతమవుతుంది. జైదీప్ సాహ్ని అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటల రచయిత 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల హాకీ టీమ్ గెలిచిందన్న చిన్న ఆర్టికల్‌ను చదివాడు. ఆ నేపథ్యంలో సినిమా చేయాలనుకుని మహరాజ్ కృష్ణన్ కౌశిక్ అనే అప్పటి కోచ్‌ని కలిసి తాను అనుకున్న కథ చెప్పార్ట. ఆయన... 1982 ఏషియన్ గేమ్స్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన మీర్ రంజన్ నేగి అనే హాకీ ప్లేయర్‌ని పరిచయం చేశాడు. తన వల్లే పాక్ చేతిలో భారత్ ఓడిపోయిందని ఆరోపణలు ఎదుర్కొన్నాడు మీర్. అలా ఒక విన్నింగ్, ఇన్స్పిరేషన్ కథలో ఒక దేశద్రోహం, దేశభక్తి అనే అంశాలు కలగలసి సినిమా స్కోపుకి స్పాన్‌ని బాగా పెంచాయి. పదహారు మంది వివిధ రాష్ట్రాల అమ్మాయిలు, వివిధ ఆకారాలు, ఆహారాలు, అలవాట్లు, భాషలు, అభిప్రాయాలు ఉన్నవాళ్లు - ఒకసారి జీవితంలో దారుణంగా ఓడిపోయిన మనిషి గెడైన్స్‌లో గెలవడానికి కష్ట పడడమే ఈ చిత్ర కథ. మూడు కొప్పులు ఒక దగ్గరుంటే ప్రళయం అన్న నానుడిని తుడిచి పెట్టేలా పదహారు కొప్పులు కలిసి ప్రపంచ కప్పుని గెలిచి, భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగిరేలా చేయడం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సిక్కు జవాన్లు శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు అడవి దారిలో, జలాశయాలు దాటడానికి పెద్ద పెద్ద దుంగల్ని మోయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇన్స్పిరేషన్ కోసం అరిచే అరుపు ‘చక్ దే’. ప్రపంచకప్పు బ్రిడ్జి దూలాల కన్నా పెనుభారం. దేశ గౌరవం పెంచడం ప్రపంచకప్పు గెలవడం కన్నా బరువైనది. అందుకే అంత కష్టమైన పనిని క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పదహారు మంది అమ్మాయిలు నెరవేర్చాలి కాబట్టి ఈ చిత్రానికి ‘చక్ దే ఇండియా’ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఆడవారి మధ్య సహజంగా ఉండే ఈర్ష్య, అసూయలు ఉంటాయి. పోలికలు ఉంటాయి. అన్ని సహజమైన కథావస్తువులతో పాటు మామూలు మనిషిని, నిద్రాణమైన జాతిని, నిస్తేజమైన జీవితాల్ని, ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసే పవర్ఫుల్ స్ఫూర్తి... ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. ఈ చిత్రం సూపర్‌హిట్ అవ్వడానికి ఇదే కారణం. మిగిలిన హంగులన్నీ అందంగా అద్దిన అలంకారాలే. మిలీనియమ్‌లో ఇలాంటి కథలు ప్రేక్షకులకే కాదు, సమాజానికే ప్రేరణ. ఇది ఒక స్పోర్ట్స్ మూవీ కాదు. స్పోర్టివ్ స్పిరిట్‌కి సంబంధించిన మూవీ. ‘దిల్వాలే దుల్హనియా’ చిత్రంలో యువతని ప్రేమ మత్తులో ముంచిన ఆదిత్యచోప్రా తానే కనిపెట్టిన విరుగుడు మందు... ‘చక్ దే ఇండియా’ చిత్రం. ‘లగాన్’ జరిగిపోయిన కథ. చరిత్ర. ‘చక్ దే’ నడుస్తున్న వర్తమానం. ఇది మనం వెళ్తున్న దారి. చేరాల్సిన గమ్యం. స్త్రీకి, పురుషుడికి మధ్య సున్నితమైన ఇగోయిస్టిక్ తేడాని... సక్సెస్, కెరీర్, డ్రీమ్, గోల్ లాంటి వాటిని... హాకీకి క్రికెట్‌కి మధ్య ఉన్న ఇగోని కలిపి ప్రీతి అనే అమ్మాయి ప్రేమకథలో మిళితం చేయడం అద్భుతమైన ఆలోచన. ఈ ఒక్క కథే పది వాల్యూమ్స్ గ్రంథం. అది మాత్రమే కాదు. ప్రతి సీన్లోనూ ఎంతో జాగ్రత్త, పకడ్బందీ అల్లిక కనిపిస్తుంది. ‘చక్ దే ఇండియన్ సినిమా.’ చేతనైతే ప్రేరణని కమర్షియల్ కథావస్తువుగా చేద్దాం. ప్రేరణ, స్ఫూర్తి లాంటి మంచి అంశాలు... దురదృష్టవశాత్తూ అవార్డు చిత్రాల కథావస్తువులు మాత్రమే. దాన్ని మార్చడానికి ప్రయత్నించి, ఈ చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యచోప్రాకి శత సహస్ర శుభాభినందనలు. ఆయన ప్రయత్నానికి అందమైన రూపమిచ్చిన దర్శకుడికి హ్యాట్సాఫ్! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
లగే రహో గాంధీగిరీ!
* ఈ చిత్రం... మంచిని, మానవత్వాన్ని చాటింది. * మనిషి ఎలా బతకాలో నేర్పింది. * మనిషికి మహాత్ముడయ్యే మార్గాన్ని చూపింది. ఎప్పుడైనా రాజ్‌కుమార్ హిరానీ కనిపిస్తే... నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. అవే ఇవి... రాజ్ హిరానీ గారూ... మీరు మాత్రమే జీవితాన్ని ఇంత అందంగా, ఇంత మంచిగా, ఇంత ఆర్ద్రతతో, ఇంత ఆహ్లాదంగా, ఇంత పాజిటివ్‌గా ఎలా చూస్తారండీ? ప్రతి దర్శకుడూ కష్టపడి తను బాగా తీసిన ఒక్కో సినిమాని కళామతల్లి పాదాల వద్ద ఒక పువ్వుగా పేర్చుతుంటే... మీరు మాత్రమే సినిమాలో ఉన్న డెబ్భై సీన్లనీ డెబ్భై పువ్వులు చేసి, మీదైన స్క్రీన్‌ప్లేలో వాటికి దండ కూర్చి, కళామతల్లి కంఠంలో మీ ఒక్కో సినిమాని ఒక్కో పూవుల దండగా ఎలా వేస్తారండీ? మీ పూలని దండగా కూర్చే మీ దారం పేరేంటండీ? మీ మనసు ఫెవికాలా? మీ మెదడు సెలోఫెన్ టేపా? మానవత అనే దృష్టి మీకు మాత్రమే ఎలా వచ్చిందండీ? సమాజంలో ప్రతి మధ్య తరగతి వాడి మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు మీకు మాత్రమే ఎలా తెలుసండీ? మీకు పరకాయ ప్రవేశం తెలుసా? 200 కోట్లు చేరకుండానే చాలామంది దర్శకులు అగ్ర దర్శకులమని ఢంకా బజాయించి పబ్లిసిటీలు చేసుకుంటున్న ఈ రోజుల్లో... మూడొందల కోట్లు, నాలు గొందల కోట్లు అవలీలగా దాటించేసినా, ఎక్కడా పర్సనల్ పబ్లిసిటీ చేసుకోకుండా అగ్ర దర్శకుడిననే అహంకారం సామాజిక అనుసంధాన వేదికల్లో కనిపించనీకుండా ఎలా ఉంటున్నారండీ? మీ సినిమాలు మాత్రమే కంటి నుండి కాకుండా మనసు నుండి నీరు కార్పిస్తా యెందుకండీ? మీ సినిమా విడుదలైతే, ప్రేక్షకుడిగా అత్యంత ఆనందం, దర్శకుడిగా అతి సిగ్గు నాకెందుకు కలగాలండీ? ఏంటండీ ఈ టార్చరు? సమాజానికి మీరు సినిమా దర్శకుడా? మార్గ దర్శకుడా? ఎందుకండీ ఇంత మంచి సినిమా తీస్తారు అని నేనడగను. ఎలా అండీ ఇంత గొప్ప సినిమాలు అంత అలవోకగా తీస్తున్నారు అని నేనడుగుతున్నాను. ఈ మిలీనియమ్ సినిమాల్లో రాజ్‌కుమార్ హిరానీ సినిమాలు మాత్రమే రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే... అవే వస్తే, మిగిలిన సినిమాలన్నీ బలాదూరే కాబట్టి. వాటి గురించి రాయబుద్ధి కాదు కాబట్టి. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ జనామోదం పొందిన తర్వాత మళ్లీ కొంతకాలానికి అదే దర్శక నిర్మాతలు మున్నాభాయ్, సర్క్యూట్, మామూ పాత్రల్ని యథాతథంగా తీసుకుని, అదే ఆర్టిస్టులని ఉంచి (సంజయ్‌దత్, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ), విద్యాబాలన్‌ని హీరోయిన్గా పెట్టి తీసిన సినిమా ‘లగేరహో మున్నాభాయ్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 149వ చిత్రంగా ఈ చిత్రాన్ని ‘శంకర్‌దాదా జిందాబాద్’ పేరుతో అనువదించారు, నిర్మాత జెమిని కిరణ్. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సర్క్యూట్ (అర్షద్) ఒక మున్సిపల్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి లక్కీసింగ్ ఆఫీసుకి తీసుకెళ్తాడు. లక్కీసింగ్ (బోమన్) ఆ ఆఫీసర్ని బెదిరించి ఒక బిల్డింగ్ కబ్జా చేయడానికి పేపర్స్ సృష్టించుకుంటాడు. మున్నాభాయ్‌కి థ్యాంక్స్ చెప్పి స్వీట్లు ఇవ్వమంటాడు. మున్నాభాయ్ హాయిగా ఎఫ్.ఎం. రేడియోలో గుడ్ మా...ర్నిం...గ్... ముం... బై... అని సాగదీసి కార్యక్రమం మొదలుపెట్టే జాహ్నవిని ప్రేమిస్తూ ఆమె గొంతు కోసం ఆ రేడియో కార్యక్రమం మిస్సవ్వకుండా వింటూ ఉంటాడు. ముంబైలో ఉదయాన్నే జీతాల కోసం ఆఫీసులకి పరుగులు పెట్టే ఒత్తిడిలో బతకడాన్నే జీవించడం అంటే, మరి మరణించడాన్ని ఏమంటారు? అని అడుగుతుంది రేడియోలో జాహ్నవి. మున్నాభాయ్ లాంటి ప్రేక్షకుడు కూడా ఆ మాట అడిగిన జాహ్నవి పాత్రతో ప్రేమలో పడిపోతాడు వాడికీ మనసుంటే. అక్టోబర్ 2న బాపు గురించి కొన్ని ప్రశ్నలడుగుతాను, ఆ క్విజ్‌లో గెలిచిన వాళ్లు తర్వాత రోజు స్టూడియోలో నాతో షోలో పాల్గొనవచ్చు అంటుంది జాహ్నవి. మున్నాభాయ్ ఒక రౌడీ కాబట్టి బాపు అక్టోబర్ 2 మందు దొరకని ‘డ్రై’డే అని తప్ప, ఆ రోజుకి, ఆ రోజు పుట్టిన జాతి పితకి ఉన్న విలువేమిటో తెలియదు. అందుకే ముగ్గురు ప్రొఫెసర్లని కిడ్నాప్ చేసి, వాళ్ల సాయంతో షోలో సమాధానాలన్నీ కరెక్ట్‌గా చెప్పి జాహ్నవిని రేడియో స్టేషన్లో నేరుగా కలిసే అవకాశం పొందుతాడు. అయినా మున్నాభాయ్ ఎంత మంచివాడంటే, ఈ కిడ్నాప్ చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకీ సరైన సమాధానం చెప్పినప్పుడల్లా ఒక గ్రైండరో, ఫ్యానో, ఇస్త్రీ పెట్టో గిఫ్ట్‌గా ఇచ్చి పంపుతాడు. జాహ్నవికి తనని తాను మురళీ ప్రసాద్శర్మగా, ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుంటాడు మున్నా. జాహ్నవి సెకెండ్ ఇన్నింగ్స్ అనే వృద్ధాశ్రమం నడుపు తుంటుంది. ఆ ఆశ్రమం ఉన్న బిల్డింగ్‌ని తన కూతురికి (దియామీర్జా) పెళ్లి సంబంధం కుదర్చడానికి కట్నంగా ఇవ్వాల్సి వస్తుంది లక్కీసింగ్కి. దాంతో మున్నాభాయ్‌ని, జాహ్నవిని, ముసలి వాళ్లని హాలిడేకి పంపించి, సర్క్యూట్ అండ్ గ్యాంగ్‌తో కలిసి కబ్జా చేస్తాడు. అప్పటికే జాహ్నవి కోసం బాపు గురించి చదవడం మొదలుపెట్టిన మున్నాభాయ్‌కి బాపు స్వయంగా ప్రత్యక్షమై సత్యం వైపు, అహింస వైపు మార్గ దర్శనం చేస్తూ మున్నాభాయ్‌తో దాదాగిరి మానిపించి, దాని స్థానంలో గాంధీగిరి అనే కొత్త మార్గాన్ని పాటింపజేస్తుంటాడు. ఈ బాపు ప్రభావం వల్ల, సలహాల వల్ల లక్కీసింగ్లో పరివర్తన కలిగే వరకూ మున్నాభాయ్ ఆ బిల్డింగ్ కోసం అహింసతో నిరసన చేపడ తాడు. కానీ, అబద్ధం చెప్పి ప్రేమలో దింపిన సంగతి జాహ్నవితో చెప్పేస్తానని లక్కీసింగ్ బెదిరిస్తాడు. దాంతో తనే జాహ్నవికి నిజం చెప్పేస్తాడు మున్నా. ఆమె దూరమైపోయినా సత్యం, అహింసల కోసం నిలబడతాడు. చివరికి లక్కీలో మార్పును తీసుకురావడం, ఇల్లు ఇవ్వా ల్సిన అవసరం లేకుండా లక్కీ కూతురి పెళ్లి జరిపించడం, ఆ ఇంటిని మళ్లీ జాహ్నవికి అప్పగించడం జరుగుతుంది. చెప్పుకోడానికి ఇది కథ. కానీ ఇందులో ఉన్న డెప్త్ రాస్తే కాదు, చూస్తే తెలుస్తుంది. పుస్తకాలు చదివినంత మాత్రాన గాంధీ ప్రత్యక్షమైపోతాడా అనుకోవచ్చు. కానీ దానికీ ఓ చక్కని లాజికల్ ఆన్సర్ ఇచ్చారు హిరానీ. మున్నాభాయ్‌కి గాంధీజీ ప్రత్యక్షమవడం అనేది అతని హాలూసినేషన్. మతి భ్రమణం వల్ల అతనలా గాంధీజీతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ఆ విషయం మనకే కాదు, హీరో మున్నాభాయ్కీ అర్థమయ్యేలా చేసేందుకు మీడియా సమక్షంలో డాక్టర్లతో నిరూపణ అయ్యేలా చేశారు ఓ సన్నివేశంలో. ఇదే హెల్యూసినేషన్ని చివర్లో కామెడీ కోసం వాడుకున్నారాయన. లక్కీసింగ్ పరివర్తన చెందాక గాంధీజీని చూడాలన్న ఆశతో అదే లైబ్రరీకి వెళ్లి గాంధీజీ గురించి చదువుతాడు. ఆయన ప్రత్యక్షం అవ్వగానే ఫొటో దిగాలని ట్రై చేస్తాడు. ఆ తర్వాత, అంటే చిత్రం ఆఖరులో గాంధీ ఇచ్చే సందేశం ఎంతో విలువైనది. ‘‘నాకు గౌరవం ఇవ్వడం అంటే, నా విగ్రహాలు పెట్టి, నోట్ల మీద నా ముద్ర వేయించి, రోడ్లకి, కాలనీలకి నా పేర్లు పెట్టడం కాదు. నన్ను మనసులో నింపుకోవడం, నేను పాటించిన మార్గాన్ని కష్టమైన సహనంతో అవలంబించడం, నేను కలలుగన్న భారతావనిని తీర్చిదిద్దడంలో ప్రతి భారతీయుడూ నిర్మాణాత్మకంగా నడుం బిగించడం’’ అన్న ఆ మాటలు అందరూ మనసుల్లో నిలుపుకోవాల్సిన ఆణిముత్యాలు. పాఠాల్లో చదువుకుని, పరీక్షలు రాస్తేనే గాంధీజీ గురించి మనకి తెలిసినట్టు కాదు. ఆయన అడుగు జాడల్లో నడవాలి అని చెప్పేందుకు హిరానీ చేసిన ఓ అద్భుతమైన ప్రయత్నమే... ‘లగేరహో మున్నాభాయ్’. ఈ సినిమా చూస్తే నిజంగా గాంధీజీ సిద్ధాంతం ఏంటో, దాన్ని ఇవాళ్టి దైనందిన జీవితంలో ఎంత అందంగా పాటించవచ్చో తెలుస్తుంది. స్మరించుకోవడానికి గాంధీజీ దేవుడు కాదు. మనిషి మహాత్ముడు కావొచ్చు అనడానికి నిరూపణగా, నిర్వచనంగా నిలిచిన మనిషి. కాబట్టి గాంధీజీ చదువుకునే చరిత్ర కాదు, ఆచరించే పాత్ర. అనుసరించాల్సి మార్గం. ఇది మనకి తెలియజెప్పిన రాజ్‌కుమార్ హిరానీ కూడా దర్శకుల్లో మహాత్ముడు. మంచితనం, మంచి మార్గం మాత్రమే సినిమాల్లో ప్రతిబింబించే గొప్ప సంస్కారమున్న దర్శకుడు, రచయిత. నవ సమాజ సంస్కృతీ వికాస నిర్దేశకుడు, మార్గదర్శకుడు. సామాజిక కథాంశాలతో, మానవత, ఆర్ద్రత కలగలిపి... సెట్లు, గ్రాఫిక్కులు, భారీ తారాగణం, అంచనాలు పెంచే పబ్లిసిటీలు లేకుండానే వంద కోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్ల వసూళ్లు సునాయాసంగా చేసే కమర్షియల్ చిత్రాలను నిర్మాతలకి అందించిన మేటి దర్శకుడు. కళ్లు, చెవుల నుంచి పెద్ద మెదడుకి, అక్కణ్నుంచి గుండెకి ఒక ప్రయాణం చేసి... గుండెని తాకగానే అప్రయత్నంగా కళ్లల్లో నీరు ఉబికి వచ్చి చెంపని తడమడం ఎలా ఉంటుందో అనుభవించాలనుకుంటే ‘లగేరహో మున్నాభాయ్’ చూడండి. ఇది నిజం. గాంధీయిజమ్ అంత నిజం.ఇది అద్భుత జీవన సౌందర్యానికి రహదారి... ఇదే గాంధీగిరి! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
విలువలకు, వంచనకు మధ్య ఫైట్
దేడ్ కహానీ - కార్పొరేట్ * మంచి సినిమాకు ఉదాహరణ. * నిజాలను కళ్లకు కట్టింది. * పాఠ్యాంశంగా పుస్తకాలకెక్కింది. రెండు కార్పొరేటు సంస్థల అధిపతుల మధ్య ఫైటు, అది ముగిసిపోవడానికి వాళ్లు మాట్లాడుకున్న రేటు, ఆ రేటుకి వాళ్లు వెతికిన ఉద్యోగిని నిషీ అనే గోటు (మేక), ఆ గోటును వేసిన వేటు... మంచి సినిమా గురించి రాయరా అంటే మటన్ బిర్యానీ రెసిపీ మొదలు పెట్టాడేంటి అనుకుంటున్నారా! అదేం కాదు. ఓ మంచి సినిమా సారాంశాన్నే ఇలా క్లుప్తంగా చెప్పాను. 2006లో విడుదలైన ఆ మంచి సినిమా... మధుర్ భండార్కర్ తీసిన ‘కార్పొరేట్’. థియేటర్లలో సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలో కొన్ని అభిరుచి గల ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోతాయి. మరికొన్ని విమర్శకులు, సమీక్షకుల ఆర్టికల్స్‌లో, వాళ్ల మేధస్సుల్లో మమేకమై ఉంటాయి. కానీ ఇవన్నీ దాటి ‘కార్పొరేట్’ అనే సినిమా మాత్రం అహ్మదాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో పాఠ్యాంశంగా మారింది. సినిమాలు చూసి చదువులు పాడు చేసుకోకండ్రా అని పెద్దవాళ్లతో తిట్లు తిన్న ప్రతి సినీ అభిమానీ... ఓ సినిమా కూడా చదువైంది అని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశాన్నిచ్చిన సినిమా ‘కార్పొరేట్’. అది తీసిన మధుర్ భండార్కర్‌కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఈ వ్యాసం మొదలు పెట్టలేను. భారతదేశంలోని కొన్ని పుణ్య నదులు భౌతిక కాలుష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అయినా వాటిలో స్నాన మాచరించి, వాటిలోని నీళ్లు తాగుతున్న తరతరాల భారతీయుల రోగ నిరోధక శక్తిని నమ్మి... ఏ బ్యాక్టీరియా కలిసిన డ్రింకైనా భారతీయులు తాగేయగలరు, తాగి అరాయించుకోనూగలరు అనుకుంది ఓ విదేశీ కూల్‌డ్రింక్ కంపెనీ. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాలను అనుసరించకుండా, పెస్టిసైడ్స్‌ని ముప్ఫై శాతం ఎక్కువ మోతాదులో కలిపి భారతీయ మార్కెట్లో అమ్మేసింది. 2003లో బయట పడేవరకూ ఆ నిజం మనకు తెలీదు. మనకు తెలీని మరో విషయం ఏమిటంటే... మన భారతీయులం అవినీతిని, అన్యాయాన్ని, పాపాన్ని, లోపాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని, నిరుద్యోగాన్ని, ప్రాణాలకి విలువ లేకుండా తీసేయడాన్ని... ఇంకా ఇలాంటి ఎన్నో అవలక్షణాలని నరనరానా జీర్ణించేసుకుని పెరుగుతున్నాం కాబట్టి, ఈ సాంఘిక రోగాలేవీ మనల్ని ఏమీ చేయ లేవు. మనకి వీటి నిరోధక శక్తి కూడా ఎక్కువే. అందుకే వీటిని సహిస్తాం తప్ప నిరోధించం. అందుకే కూల్‌డ్రింక్‌లో పెస్టిసైడ్ కలిపారన్న వార్త కేసుగా మారిన ప్పుడు నాలుగు రోజులు మాట్లాడుకుని ఊరుకున్నాం. నెల తర్వాత మళ్లీ అవే కూల్డ్రింకులు మామూలుగా తాగేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు వాటి ప్రమాణా లేంటో మనకి తెలీదు. సడెన్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్ వస్తుంది... కుర్ కురేలో ప్లాస్టిక్ ఉందని, మాజా ఫ్యాక్టరీలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైన ఓ వర్కర్ తన రక్తాన్ని డ్రింకులో కలిపేశాడని! ఆ కాసేపు గుర్తుంచుకుంటాం. ఇంకో మెసేజ్ రాగానే మర్చిపోతాం. మనకి వ్యవస్థ మీద కన్నా మన నిరోధక శక్తి మీద నమ్మకం ఎక్కువ. ఈ సామాజిక బలహీనతల్ని బలంగా మార్చుకుని, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకున్న ఇద్దరు బడా వ్యాపారవేత్తల క థే... ‘కార్పొరేట్’. ఇద్దరు బడా వ్యాపారవేత్తలు ఒకరి మీద ఒకరు సాగించుకునే ప్రచ్ఛన్న యుద్ధంలో వారి వెంట ఉన్న పనివాళ్లు నీతిగా, నిజాయతీగా, కంపెనీ బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మి పని చేస్తుం టారు. ఎదుటి కంపెనీతో వారికి వైరం ఉన్నట్టు ద్వేషిస్తారు. చివరికి ఆ వ్యాపారా ధిపతులిద్దరూ రాజకీయ నాయకుల చొరవతో దేశ సంక్షేమం కోసం గొడవలు ఆపేసి ఒకటైపోతే... పనివాళ్లు బలైపో తారు. చదరంగంలో తెల్లరాజు, నల్లరాజు ఒకటైపోతే... వారి కోసం అప్పటివరకూ పోరాటం చేసిన మంత్రులు, సేనానులు, గుర్రాలు, ఏనుగులు, భటుల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు రచించారు, చిత్రీకరించారు మధుర్ ‘కార్పొరేట్’ చిత్రంలో. అజిత్ మోంగా, మనోజ్ త్యాగి అనే ఇద్దరు యువ రచయితలతో, కొత్తగా పరిశ్రమలోకి వస్తోన్న వాళ్లతో కూర్చుని మధుర్ ఈ చిత్ర స్క్రిప్టును తయారు చేయడం విశేషం. రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు కాకముందు కొన్నాళ్లు ఓ వీడియో షాప్ నడిపారు. అలాగే మధుర్ ఓ వీడియో షాపులో డెలివరీ బాయ్‌గా పని చేశారు. తర్వాత కొన్నాళ్లకి సినిమా పరిశ్రమలో ప్రవేశించి, చిన్నా చితకా సినిమాలకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశారు. అక్కడ వచ్చే వెయ్యి రూపాయల జీతం సరిపోక, మస్కట్‌లో ఉంటోన్న వాళ్ల అక్క దగ్గరకెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అదీ వర్కవుటవ్వక మళ్లీ ముంబై వచ్చి వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ‘రంగీలా’కి సహాయ దర్శకుడిగా పని చేసి, మెల్లగా దర్శకుడిగా మారారు. మోడ్రన్ మిలీనియమ్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కాని, సమాజంలో స్త్రీ పాత్ర ఎలా ఉందో కరెక్ట్‌గా, కనెక్టింగ్‌గా గాని చెప్పాలంటే... అది మధుర్కే సాధ్యం. ఫ్యాషన్, పేజ్ 3, కార్పొరేట్, చాందినీ బార్... ఇలా ఆయన తీసిన చిత్రాలన్నీ ఆ కోవకే చెందుతాయి. వర్మ దగ్గర పని చేసిన వందల మంది అసిస్టెంట్ డెరైక్టర్స్ ఆయన టేకింగ్ స్టయిల్ని అనుకరిస్తారు. కృష్ణవంశీ, మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్... ఇలా కొద్దిమంది మాత్రమే సమస్యని రాము ఎంత ఇన్టెన్సిటీతో చూపిస్తారో, భావోద్వేగాల్ని పాత్రల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఒకే మోతాదులో ఎలా పండించాలో అవగతం చేసుకున్నారు. దానికి వాళ్లు తమ క్రియేటివిటీని, సొంత బాణీని జోడిస్తారు. అందుకే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ‘కార్పొరేట్’కి పాటలు అనవసరం. పాటలకు పెద్దగా అవకాశం లేని కథ, కథనం అవ్వడం వల్ల ఆడియో అంత అప్పీలింగ్‌గా ఉండదు. అయితే పాత్రల తీరుతెన్నులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఎస్.ఐ..ఇ. కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నిషిగంధా దాస్ గుప్తాగా బిపాసా నటన అమోఘం. కార్పొరేట్ రాజకీయాలకు బలైపోయే నిజాయతీ పరురాలైన ఉద్యోగినిగా గుండెల్ని పిండుతుందామె. ఇతర పాత్రల్లో రాజ్‌బబ్బర్, రజత్ కపూర్, కేకే మీనన్‌ల నటన కూడా శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. కార్పొరేట్ అట్మాస్పియర్ని, స్థాయికి తగినట్టు పాత్రల ప్రవర్తనని, బాడీ లాంగ్వేజీని చూపించాడు దర్శకుడు. మాటలు ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు. అది బెస్ట్ పార్ట్ ఈ చిత్రంలో. మనకి అర్థం కాని కార్పొరేట్ కుట్రల్ని, జీవనశైలిని అతి సామాన్యులైన పాత్రల ద్వారా బ్రహ్మాండంగా చెప్పిం చారు మధుర్. బిపాసా ఆఫీసులో ఇద్దరు ప్యూన్లు, గులాబ్రావ్ అనే మంత్రి దగ్గర ఉండే గన్‌మెన్ ద్వారా వాళ్ల మాటల్లోనే కార్పొరేట్ సినిమా కథ, ఆత్మ, అర్థం... అన్నీ అందేస్తాయి ఆర్డినరీ ప్రేక్షకుడికి. ఓ సీన్లో ఒక ప్యూను... ‘ప్యూన్ అండ్ బాస్ మధ్య చాలా తేడా ఉంటుంది’ అంటాడు. రెండో ప్యూను ‘ఏంటా తేడా’ అని అడుగుతాడు. అప్పుడతను... ‘నైన్ టు సిక్స్ ఆఫీస్ టైమ్ అయితే, నైన్ టు ఫోర్ పని చేసి వెళ్లిపోయేవాడు ప్యూన్. ఫోర్ నుంచి పని మొదలుపెట్టేవాడు బాస్’ అంటాడు. అలాగే మరో సందర్భంలో... ‘కంపెనీ డబ్బు మీద సింగపూర్లు, మలేసియాలు తిరగడమే కార్పొరేట్ల జీవితం’ అని ఒక ప్యూన్ కామెంట్ చేస్తాడు. అలాగే... ‘కార్పొరేట్ కంపెనీ అంటే ఒక్క ముక్కలో చెప్తాను. ఎక్కడైతే ఒక్కడు చేయగలిగిన పనికి ఒక టేబుల్ మీద పదిమంది కూర్చుని డిస్కస్ చేసి, చివరికి ఆ పనిని చెడగొడతారో అదే కార్పొరేట్ ఆఫీస్’ అంటూ తేల్చేస్తాడు. ఇంకోసారి... ‘ఈ బాసుగారు ఆఫీసులో ఆర్నెల్లకోసారి సెక్రెటరీని మారుస్తారు’ అంటాడో ప్యూన్. ఎందుకని అడుగుతాడు రెండో ప్యూన్. ‘ఇండియాలో ఆర్నెల్లకోసారి భార్యని మార్చే అవకాశం లేదుగా, అందుకు’ అంటాడా మొదటి ప్యూన్. మంత్రిగారి గన్‌మెన్ కూడా ఇలాంటి నిజాల్ని అలవోకగా చెబుతుంటారు. ఒక గన్‌మేన్... ‘మంత్రిగారు ఆ గదిలోకి వెళ్లారు. ప్రముఖ నటి ఈ గదిలోకి వెళ్లారు. మరి నువ్వేంటి వాళ్లిద్దరి మధ్య సెట్టింగ్ అన్నావ్’ అని అడుగుతాడు. అప్పుడు రెండో గన్‌మేన్... ‘ఒరేయ్ బుద్ధూ... ఇలాంటి సెట్టింగుల కోసం స్టార్ హోటల్స్‌లో గదికి గదికి మధ్య తలుపులు ఉంటాయ్, పబ్లిక్‌కి తెలియకుండా’ అంటూ రహస్యాన్ని బైట పెడతాడు. ఇవి కొన్నే. ఇలాంటి డైలాగులు అడుగడుగునా ఉంటాయీ సినిమాలో. ఉమనైజింగ్, మూఢ భక్తి, స్వామీజీలను గుడ్డిగా నమ్మడం, రాజకీయ నాయకుల జోక్యం, లంచాలు, టై అప్స్, షేర్స్, నైతికతకి అనైతికతకి మధ్య సంఘర్షణ, వ్యక్తిగత జీవితాల్లో ఒంటరితనం, ప్రేమానురాగాలు, నిత్యం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాట... ఇలా డబ్బు, అధికారం చుట్టూ ఉండే అన్ని ఎలిమెంట్స్‌నీ కళ్లకి కట్టినట్టు చూపించేలా కథ రాసుకున్నారు మధుర్. ఈ ఆర్టికల్ కోసం సూపర్ హిట్ సినిమాలను చూస్తుంటే నాకో సూత్రం అర్థమైంది. కొత్తగా కథలు రాసుకునేవాళ్లకి పనికొస్తుందది. ముఖ్యంగా ‘కార్పొరేట్’ హిట్ కావడానికి ఆ సూత్రం ఒక ముఖ్య కారణం కాబట్టి చెప్పే తీరాలి. ఉత్థానంలో మొదలైన కథ పతనంతో ముగుస్తుంది. పతనంతో మొదలైన కథ ఉత్థానంతో సుఖాంతమవుతుంది. ఉత్థానం నుంచి ఉత్థానం, పతనం నుంచి పతనం డ్రామాని క్రియేట్ చెయ్యవు. ఫ్లాట్‌గా ఉండి సినిమాలు ఫెయిలవుతాయి. కావాలంటే ఏ సూపర్‌హిట్ సినిమా అయినా చూడండి... ఇదెంత నిజమో మీకే అర్థమవుతుంది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
మ్యాన్ విత్ సూపర్ పవర్స్
దేడ్ కహానీ - క్రిష్ ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... * రాకేశ్ రోషన్ అద్భుత సృష్టి. * రికార్డులు బద్దలు కొట్టింది. * హృతిక్‌ని సూపర్‌హీరోని చేసింది. ‘మనం భవిష్యత్తుని చూడగలమేమో... కానీ మార్చలేం’ - ఈ జీవిత సత్యాన్ని ఒక కుటిలమైన మనసున్న శాస్త్రవేత్త తెలుసుకోవడం కథ. అతనికి ఆ నిజాన్ని తెలియపర్చినవాడు హీరో. ఇది ఒక కమర్షియల్ సినిమా కథ అంటే నమ్మగలమా? 2006లో విడుదలైన ‘క్రిష్’ సినిమాని చూస్తే నమ్మగలం. ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా అన్నారు శ్రీశ్రీ ఓ సందర్భంలో. ‘మేక్ బిలీవ్’ సూత్రమే సినిమాకి ఆయువుపట్టు కాబట్టి ఉన్నట్టే అని నమ్మించేశారు దర్శకుడు రాకేష్ రోషన్, పేరు మోసిన ఆరుగురు రచయితలు. ఆ శక్తి పేరు క్రిష్. ఆ శక్తి తాలూకు మామూలు వ్యక్తి పేరు కృష్ణ మెహ్రా. ‘కోయీ మిల్గయా’ చిత్రం సూపర్‌హిట్ కావడం వల్ల, దానికి కొనసాగింపుగా వచ్చి బాక్సాఫీసును మరోసారి బద్దలుగొట్టిన చిత్రం... క్రిష్. మన పురాణాల్లో చిన్నప్పటి కృష్ణుడు మహా మాయావి. కాళీయుని శిరసుపైన నాట్యం చేయడం, పూతన అనే రాక్షసిని సంహరించడం... ఇలాంటి అసాధారణ శక్తులున్న చిన్నపిల్లాడు మన భారతీయ పిల్లలందరికీ సూపర్ హీరో అన్నమాట. అలాగే ఆంజనేయస్వామి మనకొక సూపర్ హీరో. ఎంత దూరమైనా అవలీలగా ఎగరగలడు. సముద్రాన్ని దాటగలడు. లంకని దహించగలడు. ఈ లక్షణాలతో హాలీవుడ్లో ఎన్నో సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. వాటి ఫ్రీమేకులో, రీమేకులో భారతీయ చిత్రాల్లోనూ వచ్చాయి. కానీ మనమంటూ ఒక సూపర్మ్యాన్నో స్పైడర్మ్యాన్నో బ్యాట్మ్యాన్నో సృష్టించలేదు. ఏ ఇతర అబ్నార్మల్ అండ్ పవర్ఫుల్ మ్యాన్నీ మోడ్రన్ సినిమాల్లో వెండితెర మీద సృష్టించింది లేదు. అది పట్టుకున్నట్టు ఉన్నారు కథకుడు, దర్శకుడు, ఒకప్పటి బాలీవుడ్ హీరో అయిన రాకేశ్ రోషన్. కొడుకు హృతిక్‌తో తీసిన మొదటి చిత్రం ‘కహోనా ప్యార్ హై’ పెద్ద హిట్టవడం, ‘కోయీ మిల్గయా’ సూపర్‌హిట్ అవ్వడంతో పాటు నటుడిగా హృతిక్‌కి చాలా పేరు తెచ్చాయి. ఆ రెండు చిత్రాలతో హృతిక్ చిన్నారులను కూడా బాగా ఆకట్టుకున్నాడు. వీటన్నిటి నేపథ్యంతో తరువాతి సినిమా ఎలా ఉంటే బాగుంటుందో, అలాగే ఉంటుంది క్రిష్. సాధారణంగా సీక్వెల్ తీసేటప్పుడు చాలా కష్టమైన విషయం ఏంటంటే... రెండున్నర గంటల మొదటి పార్టు నుంచి ఏ కథని రెండో భాగంలో ప్రేక్షకుడికి గుర్తు చేయాలి, ఏ పాత్రల్ని కొనసాగించాలి అన్నదే. అన్నిటి కంటే ముఖ్యంగా ఏ కథ, ఏ సంఘటనలు, ఏ పాత్రలు రెండో భాగంలో వద్దో తెలుసుకోవడం మరీ కష్టం. ఎన్ని వందల సీక్వెల్ చిత్రాలు చూసినా పార్ట్-2ని హిట్ చేయడానికి ఏ పాఠాలూ పని చేయవు. అన్నీ కుదిరి హిట్ అయితే అదృష్టమే. అంత రిస్క్ సీక్వెల్ తీయడం. అంత రిస్కునూ తీసుకుని సూపర్‌హిట్ అయిన సీక్వెళ్లు రెండున్నాయి. ఒకటి క్రిష్, రెండో ధూమ్-2. క్రిష్... మానవీయ కోణమున్న మంచి హీరో పాత్ర. ‘ధూమ్-2’లో హీరోది సమాజం అసహ్యించుకునే గజదొంగ పాత్ర. రెండూ మంచి చెడులకు రెండు నిర్వచనాలు. దర్శకులు, రచయితల భావాల్లో వైరుధ్యాలకి నిదర్శనాలు. రెండింటికీ బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఇక క్రిష్ విషయానికొస్తే... ‘కోయీ మిల్గయా’లో స్పేస్ నుంచి వచ్చి, అమాయకుడైన రోహిత్‌కి అతీత శక్తులనిచ్చి, అద్భుత మేధావిని చేసి తన గ్రహానికి వెళ్లిపోయిన జాదూ ‘క్రిష్’లో మళ్లీ రాడు. కానీ జాదూ ఇచ్చిన అతీత శక్తులు మాత్రం రోహిత్ కొడుకు కృష్ణకి వస్తాయి. అతను చేసే జాదూనే సినిమా అంతా. రోహిత్‌కి చిన్నప్పుడు మెదడు పెరగదు. కానీ కృష్ణకి చిన్నప్పుడే మెదడు బాగా పెరుగుతుంది. అందుకే అతన్ని ఆ ఊరి నుంచి దూరంగా, అడవిలో పెంచుతుంది అతడి బామ్మ. మనవడి అతీత శక్తుల గురించి లోకానికి తెలిస్తే, మళ్లీ ఎటు నుంచి ఏ ముప్పు వస్తుందోనని ఆమె భయం. అయితే అనుకోకుండా ట్రెక్కింగ్ క్యాంపుకొచ్చిన హీరోయిన్ వల్ల సింగపూర్ వెళ్లాల్సి వస్తుంది కృష్ణకి. ఆమె వల్ల అతడు తన అస్తిత్వాన్ని దాచుకుని, క్రిష్‌గా వేరే అవతారం ఎత్తాల్సి వస్తుంది. తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి తన తండ్రి రోహిత్ చనిపోలేదని, ఇరవయ్యేళ్లుగా డాక్టర్ ఆర్య అనే సైంటిస్ట్ అధీనంలో బందీగా బతుకుతున్నాడని తెలుస్తుంది. దాంతో దుష్ట సంహారం చేసి, తండ్రిని విడిపించుకుంటాడు. తండ్రిని తీసుకెళ్లి బామ్మ ముందు నిలబెడతాడు. ఎన్నేళ్లు చూసినా బాలీవుడ్‌కి కొత్త కరెన్సీ నోటులా కళకళలాడే ఫార్ములా... విడిపోయిన కుటుంబ సభ్యులు కలవడం. దీన్ని మన్మోహన్ దేశాయ్ మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాకేశ్ రోషన్ ఏమో అవసరమైనప్పుడు బాగా వాడుతుంటారు. మొదటి భాగం చూసినవాళ్లకి మరీ నచ్చాలి... పోల్చినా కూడా. చూడని వాళ్లకి విడిగా ఒక సినిమాలాగ నచ్చాలి. ఈ రెండు విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, స్క్రీన్‌ప్లేలో బాగా ఫాలో అయ్యి సీన్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది క్రిష్ సినిమా చూస్తుంటే. నలభయ్యేళ్ల పాటు బాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు రచన చేసిన ప్రసిద్ధ రచయిత సచిన్ భౌమిక్, రాకేశ్ రోషన్, ఆకాశ్ ఖురానా (నటుడు కూడా), హనీ ఇరానీ (జావెద్ అక్తర్‌తో విడిపోయిన భార్య, ఫర్హాన్ అక్తర్ తల్లి), రాబిన్ భట్... వీళ్లంతా స్క్రీన్‌ప్లే టీమ్. కథను రాకేశ్ రోషన్ అందిస్తే, మాటలు సంజయ్ మాసూమీ రాశారు. సాధారణంగా ఇంతమంది కలిసి పని చేస్తే చపాతీ పిండి గుండ్రంగా అవకుండా ఎవరివైపు వాళ్లు లాక్కుని షేపవుట్ చేస్తారని భయం ఉంటుంది. అలాగే ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్’ అనే ఆంగ్ల సామెత కూడా ఉండనే ఉంది. అయినా కెప్టెన్ సమర్థుడైతే షిప్ టైటానిక్ అవ్వకుండా ఒడ్డుకి చేరుకుంటుంది. రాకేశ్ రోషన్ మంచి కెప్టెన్. అందుకే ‘క్రిష్’ మునిగిపోలేదు. విజయ తీరాలకు చేరాడు. ఇక మిగతా విషయాలు చూసుకుంటే... ‘క్రిష్’గా హృతిక్ ఓ సూపర్ పవర్లాగే కనిపించాడు సినిమాలో. అతడు తప్ప మరెవరికీ ఆ పాత్ర సూటవద నడంలో అతిశయోక్తి లేకపోవచ్చు. ప్రియాంకా చోప్రా కూడా తన పరిధిలో బాగా చేసింది. ఇక రోహిత్ తల్లి, క్రిష్ బామ్మగా రేఖ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించారు. సినిమాలో మూడు పాటలు చాలా బాగుంటాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పక్కర్లేదు. హాలీవుడ్ చిత్రం ‘ఇండిపెండెన్స్ డే’కి గ్రాఫిక్ డిజైనర్స్గా పని చేసిన మార్ కొల్బే, క్రెగ్ ముమ్మా అనే హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌ని రూపొందించారు. సినిమా అంతా హీరో ఎగురుతూనే ఉండాలి. ఫైట్లలో మాత్రమే కాదు... సీన్లలోను, పాటల్లోను కూడా. అందుకే టోనీ చింగ్ అనే మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్‌ని ఫైట్ మాస్టర్‌గా పెట్టారు. షూటింగ్‌కి మూడు నెలల ముందే హృతిక్ చైనా వెళ్లి, టోనీ చింగ్ అకాడెమీలో శిక్షణ పొంది వచ్చాడు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా... సినిమా స్థాయిని, మార్కెట్‌ని పెంచేలా సినిమా తీయడం, కంటెంట్‌లో తేడా రాకుండా చూసుకోవడం ఈ మిలీనియంలో ‘క్రిష్’ సినిమాతోనే మొదలైంది. తొమ్మిదేళ్ల తర్వాత అవే సూత్రాలతో తెలుగులో ‘బాహుబలి’ వచ్చింది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
సర్కార్... మ్యాన్ ఆఫ్ పవర్!
దేడ్ కహానీ - సర్కార్ * ఇది వర్మ సినిమా. * ఇది అమితాబ్ సినిమా. * ఇద్దరి ఫ్యాన్స మెచ్చిన సినిమా. సెన్సార్ సర్టిఫికెట్ పడింది తెరమీద. సర్కార్, హిందీ, కలర్, సినిమా స్కోప్, 24 జూన్ 2005.. తర్వాత రెండు మూడు టైటిల్స్ పడ్డాయి కేసెరాసెరా, ఎమ్‌టీవీ ఇలా. అప్పుడొచ్చింది ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ కార్డు. ఏమనంటే, ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న, లెక్కలేనంత మంది దర్శకులలాగే నేను కూడా గాఢంగా, లోతుగా ప్రభావితుణ్నయ్యాను ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా చూసి. ఆ సినిమాకి నేనిచ్చే నివాళి ‘సర్కార్’ - రామ్‌గోపాల్‌వర్మ.’’ మామూలుగా రామ్‌గోపాల్‌వర్మ అనే టైటిల్ కార్డుకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి రామ్గోపాల్వర్మే ఇలా ఓ కార్డు వేస్తే... గాడ్ ఫాదర్‌కి, సర్కార్‌కి, వర్మకి మళ్లీ మళ్లీ ఫ్యాన్స్ అయిపోతారు ఎవరైనా. ఇంతకీ ఎవరీ సర్కార్? వెన్ సిస్టమ్ ఫెయిల్స్. ఏ పవర్ విల్ రైజ్. ఆ పవరే సర్కార్. అంటే, సుభాష్ నగ్రే. ఆ పాత్ర పోషించింది భారతదేశం ప్రేమించి, పడి చచ్చిపోయే అమితాబ్ బచ్చన్. వర్మ అంటే... ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత్రలాగ లెక్కలేనంత తిక్క ఉన్న వ్యక్తిగా ఈ జెనరేషన్ ట్విట్టర్ జనాలు భావించే ఓ వ్యక్తి. ఫ్లాష్‌బ్యాక్‌లో ‘బాషా’లో రజనీకాంత్ పాత్రలాగా మహా వ్యక్తి. తెలుగు సినిమా స్థాయిని, వ్యాపా రాన్ని మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని కూడా విపరీతంగా ప్రభావితం చేసిన మేధావి. మన నుంచి హిందీ సీమ కెగసి ‘రంగీలా’తో అక్కడ కూడా అగ్ర దర్శకుడిగా జెండా ఎగరేసిన ఘటికుడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీయ డంలో సిద్ధహస్తుడు. తన శిష్యులందర్నీ దర్శకులుగా మార్చిన నాణ్యమైన నిర్మాత. అతను మనవాడవ్వడం మన అదృష్టం, ఆయన దురదృష్టం (ఈ కోవలోకి వచ్చే తెలుగువాళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు). ముందు తీసిన సినిమాలతో అందరూ ఇతని పనైపోయింది అనుకున్నప్పుడు తనని దర్శకుడిగా మార్చిన, ప్రభావితం చేసిన సినిమాతో మళ్లీ ప్రేరణ పొంది... తన స్టైల్‌ని, ఇమేజ్‌ని, మార్కెట్‌ని, మేధస్సుని అన్నిటినీ సవ్యంగా ట్రాక్‌మీద పెట్టినట్టు వర్మ సర్కార్ సినిమా తీశారు. దటీజ్ వర్మ... దటీజ్ సర్కార్! వర్మ తీసిన మొదటి సినిమా ‘శివ’లో భవానీ పాత్రని హీరోగా మార్చి, మణి రత్నం తీసిన ‘నాయకుడు’లో కమల్ హాసన్ కొడుకు పాత్రని చిన్న హీరోగా మార్చి, సహజంగా ఉంటుందని ఆ రెండు పాత్రలకీ నిజ జీవితంలో తండ్రీ కొడుకు లైన అమితాబ్‌ని, అభిషేక్‌ని ఊహించి, వాళ్లకనుగుణంగా స్క్రిప్ట్ రాసి, పకడ్బందీగా తీసినట్టు ఉంటుంది సర్కార్. అలాగే ముంబైలో ఎన్నో ఏళ్లుగా మరాఠీ ప్రజల కోసం సమాంతర ప్రభుత్వం నడుపుతున్న శివసేన అధిపతి బాల్‌థాకరే జీవితంలోని సంఘటనల నుంచి స్ఫూర్తి పొందినట్టూ ఉంటుంది. వీటన్నిటికీ గాడ్ ఫాదర్ స్క్రీన్‌ప్లే స్టైల్, మేకింగ్ స్టైల్, పాత్ర చిత్రణ, స్వరూప స్వభావాలని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కాకపోవడం వలన ఈ చిత్రం మన మధ్య జరుగుతున్న ఫీలింగునిస్తుంది. ఇలా చాలా కోణాల్లోంచి దర్శకుడు చేసిన కృషి వల్ల ఈ చిత్రాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ లైబ్రరీలో భద్రపరిచారు. అది నిజంగా ఘనతే. ‘‘నాకు రైట్ అనిపించిందే నేను చేస్తాను. భగవంతుణ్ని ఎదిరించైనా, సమాజాన్ని ఎదిరించైనా, పోలీసుల్ని, చట్టాల్ని ఎదిరించైనా, మొత్తం సిస్టమ్‌ని ఎది రించైనా సరే’’... సమాంతర ప్రభుత్వం నడిపే వాడి ధైర్యం, యాటిట్యూడ్ అదే. ‘‘దగ్గర్లో ఉన్న లాభం చూసేముందు, దూరంగా వచ్చే నష్టాల్ని చూడు. పంచా యితీలు చేసేవాళ్లు ఆలోచించాల్సిందిదే’’.. ఇలాంటి మాటల సహాయంతో ‘సర్కార్’ పాత్రని అమితాబ్ చాలా సునాయాసంగా పోషించి మెప్పించేశారు. ‘‘అధికారం ఉన్నవాడు చేసే తప్ప యినా, రైటయిపోతుంది. నేను ఎవ్వర్నీ ఆలోచించొద్దు అనను. ఆలోచించకుండా పనిచెయ్యొద్దు అంటాను’’ - ‘‘సర్కార్ అనేది ఒక సిస్టమ్. అందులో జనం ఒక భాగం’’... ఇలాంటి పదునైన సంభా షణలు ఈ సినిమాలో కోకొల్లలు. బిగ్ బీ నటన సర్కార్ చిత్రానికి, వర్మ ఆలోచనలకి ప్రాణం పోసి నట్టుంటుంది. రౌడీయిజం, సోషల్ ప్రాబ్లెమ్స్ నేపథ్యం మాత్రమే. కథ, కథనం ఓ పెద్దమనిషి కుటుంబం, వారి మధ్య బంధాలు, స్పర్ధల చుట్టూ తిరు గుతూ ఉంటుంది. అందుకే ఈ చిత్రంలో ఒక ‘తడి’ ఉంటుంది. అది మనసుని తడు ముతుంది. ఇదో మంచి ఫార్ములా. అలాగే ప్రతీకారం అనేది కూడా ప్రేమలాగే తర తరాలుగా సినిమాల్లో మోస్ట్ పేయింగ్ ఎలిమెంట్. సర్కార్‌లో అదీ ఉంది. సహజ నటుడు, తెలుగువారు గర్విం చదగిన నటుడు కోట శ్రీనివాసరావుని చాలా ముఖ్యమైన పాత్రకి ఎంచుకున్నారు. నటుడు జీవాకి మరో ముఖ్యమైన పాత్ర నిచ్చారు. అయినా చిత్రానికి కావలసిన నేటివిటీని అణువంతైనా మిస్ కాకుండా చూసుకోవడం వర్మ తెలివికి నిదర్శనం. ఇక షాట్స్ గురించి చెప్పక్కర్లేదు. శివ, క్షణక్షణం, రంగీలా, సత్య తర్వాత రామ్‌గోపాల్‌వర్మ అద్భుతమైన షాట్ టేకింగ్ సర్కార్‌లో చూడగలం. సినిమాలో ప్రతి సీనూ ఒక సినిమాలా ఉండాలం టారు. అంటే టేకింగ్, మిడిల్, ఎండింగ్ పకడ్బందీగా అల్లుకోవడం అన్నమాట. అలా స్క్రీన్‌ప్లే సూత్రానికి కట్టుబడి రాసుకున్న స్క్రిప్టులా ఉంటుంది సర్కార్. ఇది కత్రినాకైఫ్‌కి రెండో సినిమా. నిషా కొఠారికి రెండో సినిమా. అభిషేక్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా. బహుశా అమితాబ్ నటించలేదని ఏ అవార్డూ ఇచ్చి ఉండరు జ్యూరీ మెంబర్లు. ఆయన అందులో జీవిం చారు మరి. లేకపోతే 1990లోనే ‘అగ్ని పథ్’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయనకి, ‘సర్కార్’కి అవార్డు రాకపోవడం విచిత్రం. అలాగే హీరో షాహిద్ కపూర్ తల్లి, నటుడు, దర్శకుడు, నిర్మాత పంకజ్ కపూర్ భార్య సుప్రియా పాఠక్ నటన అనిర్వచ నీయంగా ఉంటుంది ‘సర్కార్’లో. కాజోల్ చెల్లెలు తనీషా, ఆమె భర్తగా కేకే... అంద రివీ చక్కగా అమరిన పాత్రలు. అసలు సిసలు కాస్టింగ్ డెరైక్టర్ వృత్తికి నిర్వచ నంగా ఉంటుంది ‘సర్కార్’ సినిమా పాత్ర ధారుల ఎంపిక. కొన్ని వేల సినిమాలకి ప్రయత్నించినా కుదరని విషయం అది. ఈ వ్యాసం రాయడం కోసం సాహితీ మిత్రులు సిరాశ్రీ ద్వారా రామ్‌గోపాల్ వర్మకి ఫోన్ చేశాను. నేను ఆశ్చర్యపోయే ఆసక్తికరమైన విషయం ఆయన మాటల ద్వారా తెలిసింది. రామూగారు సీనియర్ ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక స్నేహి తుడు ‘ద గాడ్ ఫాదర్’ అనే ఇంగ్లిషు నవల ఇచ్చి, అందులో 26వ పేజీలో ఉన్న రొమాంటిక్ సీన్ చదవమన్నాట్ట. ఈయన ఇంటి కొచ్చి సీన్‌ని చదివేశార్ట. ఆ తర్వాత సరదాగా కవర్‌పేజీ చదివితే, ఆయన ఎప్పుడూ వినని మాఫియా లాంటి పదాలు కనపడ్డాయి. తోచక పుస్తకం మొద ట్నుంచీ చది వారట. చదవడం పూర్తయిన వెంటనే మళ్లీ మొదలు పెట్టారట. అలా నాలుగైదుసార్లు ఆసాంతం చదివేశార్ట. ఆయన ఇమాజి నేషన్‌లో గాడ్ ఫాదర్ నవల గాడ్ ఫాదర్ సినిమా కన్నా ఎక్కువగా, గొప్పగా కన పడింది, స్థిరపడిపోయింది. ఆ ఇమాజి నేషనే ఆయన దర్శకుడవ్వాలని బలంగా నిర్ణయించుకునేలా చేసింది. ఫ్రెండ్ నవల ఇచ్చినప్పుడు తన ఉద్దేశం వేరు. తీసుకున్నపుడు రామూగారి ఉద్దేశం వేరు. కానీ, ఏ విషయం నుంచి ఏం పుడుతుందో అది ఎలా పరిణమిస్తుందో - ఎవ్వరికీ తెలీదు. పైవాడికి తప్ప. ఆ పైవాడినే గాడ్ అంటారు. ఆయనే మనందరికీ ఫాదర్ అవుతారు. ఆయన సర్కారే భూమ్మీద చెల్లుబాటవుతుంది. అంతే! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
వెలుగు చాటు చీకటి
దేడ్ కహానీ - పేజ్ 3 జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? * చూస్తే వెలుగే కనిపిస్తుంది. * కానీ దాని వెనుక అంతా చీకటే. * పేజ్ 3 చెప్పే వాస్తవాలేంటి? మనుషుల జనన, మరణాల మధ్య సమాజంలో మారుతున్న అంశాలెన్నో. జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? కొంతమంది న్యూస్‌పేపర్ చదువుతారు. కొంతమంది నెట్లో అప్ టు డేట్ ఫాలో అవుతారు. ఇంకొంత మంది నాటకాలు, పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు. ఆధునిక యుగంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని కళ్లకి కట్టినట్టు చూపించే బలమైన సాధనం మాత్రం సినిమాలే. అవే మన న్యూస్‌పేపర్లు, మన పుస్తకాలు, మన ఇంటర్నెట్, అన్నీను. వాటిని బాగా చూపించే దర్శకులు దొరికితే ఆ సినిమాలు బాగా ఆడతాయి. లేకపోతే ఎలా వచ్చి, వెళ్లాయో తెలీకుండా వెళ్లిపోతాయి. సమాజాన్ని ప్రతిబింబించే సినిమా బాగా ఆడితే, ఎక్కువమంది ప్రేక్షకులు ఐడెంటిఫై అయ్యారు కాబట్టి, సమాజం అలా ఉందని అర్థం. లేదా ఎక్కువమంది అలా కోరుకోవడం వల్ల సమాజం అలా అవ్వబోతోందని అర్థం. అది సినిమాకి, సమాజానికి ఏళ్ల తరబడి అంతర్లీనంగా ఉన్న సంబంధం. వెండితెర మనం చదవక్కర్లేని న్యూస్ పేపరు. పెద్దగా చూసే టీవీ చానెల్. బ్రౌజ్ చెయ్యక్కర్లేని ఇంటర్నెట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2005లో ‘పేజ్ 3’ అని ఒక సినిమా రిలీజయ్యింది. అది ఇలాంటి సినిమానే. దాని దర్శకుడు మధుర్ భండార్కర్. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే సినిమాలు మాత్రమే తీసే దర్శకుడు. చాందినీ బార్, పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, హీరోయిన్ తదితర అద్భుత చిత్రాలు తీసిన వెండితెర న్యూస్ పేపర్/చానల్‌కి ఎడిటర్. 2005, జనవరి 21వ తేదీన విడుదలైన పేజ్ 3, కమర్షియల్‌గా సూపర్‌హిట్ సినిమాల కోవలోకి వచ్చేంత వసూళ్లు రాబట్టకపోయినా... ప్రేక్షకుల్ని మాత్రం వంద శాతం రీచ్ అయ్యింది. 2005 సంవత్సరానికి స్వర్ణకమలాన్ని గెల్చుకున్న జాతీయ ఉత్తమ చిత్రం ‘పేజ్ 3’. బెస్ట్ స్క్రీన్‌ప్లేకి, బెస్ట్ ఎడిటింగ్‌కి రెండు రజత కమలాలు గెల్చుకున్న చిత్రం పేజ్ 3. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెల్చుకున్న చిత్రం కూడా. మాధవీశర్మ ముంబైకి బతుకు తెరువు కోసం వచ్చిన మధ్యతరగతి యువతి. దీపక్ సూరి అనే సంపాదకుడు తన పేపర్లో ఆమెకి జర్నలిస్ట్‌గా ఉద్యోగం ఇస్తాడు. ఆ పేపర్లో పేజ్ 3 సెలెబ్రిటీల న్యూస్ కవరేజ్ చేస్తుంది. సిటీలో ఉన్న గ్లామరస్ పీపుల్ తాలూకు నైట్ లైఫ్ కవర్ చేసి రాయడమే ఆమె జాబ్. మాధవి రూమ్మేట్ పెర్ల్ ఒక ఎయిర్‌హోస్టెస్. డబ్బున్న వ్యక్తినెవరినైనా చూసి పెళ్లి చేసుకుని సెటిలైపోవాలని కలలు కంటూ ఉంటుంది. గాయత్రి అనే మరో పేద యువతి హీరోయిన్ కావాలని కలలు కంటుంది. ఆమె కూడా మాధవి రూమ్మేట్గా చేరుతుంది. డబ్బు, స్టార్డమ్ రెండింటినీ కవర్ చేయాల్సిన జర్నలిస్ట్‌కి వాటికోసమే ఆరాటపడే రెండు పాత్రల్ని స్నేహితురాళ్లుగా తీసుకోవడం దర్శకుడిలోని గొప్పదనం. రోహిత్ అనే స్టార్ హీరో గాయత్రిని మోసం చేసి కడుపు చేయడం, ఆమెని అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేయడంతో ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో ఆమె కడుపులోని శిశువు కడుపులోనే చని పోవడం జరుగుతాయి. ఈ కథనాన్ని ప్రచురించి రోహిత్‌ని ఎండగడదామని ప్రయత్నించిన మాధవికి బాస్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ ఆర్టికల్స్‌ని చించేయడమే కాక, మాధవితో రోహిత్‌కి బలవంతంగా క్షమాపణలు కూడా చెప్పిస్తాడు బాస్. ఈలోగా పెర్ల్ ఒక ముసలి ధనవంతుడిని పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేస్తుంది. మాధవి ప్రేమించిన స్నేహితుడు అభిజిత్ ‘గే’ అని తెలుస్తుంది. దాంతో చాలా బాధపడుతుంది. సెలెబ్రిటీ లైఫ్‌లో పైకి కనపడినంత సెలెబ్రేషన్ కాని, వైబ్రేషన్ కాని లోపల ఉండవని మాధవికి అర్థమౌతుంది. పేజ్ 3 నుంచి క్రైమ్ న్యూస్‌కి తన ఉద్యోగం మార్పించుకుంటుంది మాధవి. ఆ వృత్తిలో వినాయక్ అనే ఒక ఏసీపీ పరిచయమవుతాడు. ఆయన సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ సమస్యని వెలుగులోకి తెచ్చి పిల్లల్ని మాఫియా నుంచి కాపాడుతుంది. గాయత్రి ఒక దర్శకుడి కోరిక తీర్చి, అతని తర్వాతి సినిమాలో హీరోయిన్గా అవకాశం సంపాదిస్తుంది. ఇటు మాధవి ఏమో క్రైమ్ న్యూస్ కూడా తన పత్రికలో వేయించలేకపోతుంది. దాంతో ఆమె ఉద్యోగం పోతుంది. ఒక జర్నలిస్ట్ కోణం లోంచి డబ్బు, పరపతి, తారాపథం వీటిని చూస్తే చీకటిగానూ, ఛండాలంగానూ మాత్రమే కనపడతాయి. కానీ వాటిని సాధించాలనే ఆశయం ఉన్న పాత్రల్ని, ఆ ప్రయత్నంలో వాటి కష్టాల్ని చూస్తే మానవీయ కోణంలో ఇవి మంచిగా కనపడతాయి. రెంటినీ బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు - ఈ కథకి తను ఎంచుకున్న పాత్రలు, వాటి తీరుతెన్నుల ద్వారా. పోస్టర్ చూస్తే ఒక సాధారణమైన, యువతని ఆకర్షించడానికే తీసిన సినిమాలా కనిపిస్తుంది కానీ సినిమా చూస్తే మేధావి వంతమైన సినిమాలా కనిపిస్తుంది. ‘నైట్ లైఫ్’ అనే వెస్టర్న్ కల్చర్ భారతీయ సమాజం నలభై ఏళ్ల క్రితం నిద్ర పోతుండగా ప్రవేశించి వేళ్లూనుకుని, మర్రిచెట్టైపోయింది. ఇప్పుడు అన్ని ప్రధాన నగరాల్లోనూ డబ్బున్న వారి పిల్లలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, అందరూ ఈ నైట్ లైఫ్ అలవాటుదారులే. దాన్ని కథావస్తువుగా తీసుకోవడమే దర్శకుడి నైపుణ్యం. ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్ కూతురు కొంకణాసేన్ శర్మ పేజ్ 3 చిత్ర కథానాయిక. ఈమె 2002లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ అనే బాలీవుడ్ ఆంగ్ల చిత్రం (తల్లి అపర్ణాసేన్ రచయిత్రి, దర్శకురాలు ఈ చిత్రానికి) కొంకణాసేన్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది. పేజ్ 3తో పాటు అది కూడా చూసి తీరవలసిన చిత్రం. సహజమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల కోసమే ఈ చిత్రాలు. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
అజరామర ప్రేమకావ్యం
* పాకిస్తానీ అమ్మాయి * హిందుస్తానీ అబ్బాయి * ఇరువురినీ ఒక్కటి చేసిందెవరు? తన తల్లితో ఒక కూతురు ‘‘అతను నన్ను కనీసం ముట్టుకోలేదమ్మా - కానీ, నేను నా సర్వస్వం అతనికి ఇచ్చేసి వచ్చాను’’ అంటుంది. ఆ కూతురి పాత్రని ప్రేమించ కుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు, ‘‘నీకోసం నవ్వుతూ ప్రాణాలు ఇవ్వగలిగిన వాడే నీకు సరైన భర్త’’ అంటాడు. ఆ యువకుణ్ని ఆ అమ్మాయితో సహా ప్రేమిం చకుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ఇలాంటి పరిణతి చెందిన, పదునైన, నిజా యితీ కలిగిన పాత్రలున్న ప్రేమకథా చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడూ ప్రేమిస్తాడు. అందుకే ‘వీర్ - జారా’ని అందరూ ప్రేమించారు. కాసుల వర్షం కురిపించారు. ‘దిల్ తో పాగల్ హై’ వంటి సూర్హిట్ చిత్రం తీసిన యశ్‌చోప్రా ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన అజరామర ప్రేమకావ్యం ‘వీర్-జారా’. జారాఖాన్ అనే పాకిస్తాన్ అమ్మాయికీ, వీర్ ప్రతాప్‌సింగ్ అనే భారతీయ అబ్బాయికీ మధ్య నడిచే హృద్యమైన ప్రేమకథ ‘వీర్-జారా’. చాలామంది అనుకుంటారు మొదటి చిత్రం తీసే యువకులే మంచి ప్రేమ కథలు తీయగలరని. నిజ జీవితం ఛాయలు వాళ్ల సీన్లలో, పాత్రల స్వభావాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి, ప్రేక్షకులు ఐడెంటిఫై అవుతారని. అది కొంతవరకే నిజం. పాతబడినకొద్దీ వైన్‌లో కిక్ ఎక్కువ అయినట్టు, పరిణతి చెందిన కొద్దీ నిజమైన దర్శకుడు ప్రేమకథా చిత్రాల్ని అత్యద్భుతంగా మలచగలడు. అందుకు యశ్‌చోప్రా ఒక ఉదాహరణ. ‘ప్రేమన్నది పుస్తకాల్లో ఉంటుంది, పాటల్లో, కవితల్లో ఉంటుంది, జీవితంలో ఉండదు పిచ్చిదానా’... ఇలాంటి మాటలు రాయాలంటే, వాటిని తెరమీద సరైన సందర్భంలో, సరైన పాత్ర ద్వారా చెప్పించాలంటే దర్శకుడికి చాలా పరిణతి, అనుభవం ఉండాలి. ఒక మంచి ప్రేమకథ మనిషి మనసులో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న భావోద్వేగాలని పైకి తెస్తుంది. అలా పొంగిన అనుభూతుల వెల్లువలో మనసు తడుస్తుంది. తెలియకుండానే ఆ తడి కంటి నుంచి బైటకొస్తుంది. అది ఆ కథలోని గొప్పదనం కావచ్చు. అందులోని పాత్రల స్వభావాలు ఎక్కడో మనకి తెలుసున్నవో లేదా మనమో కావచ్చు. ఏదో ఒక సంభాషణో, సంఘటనో, అభినయమో, ఆ కథ క్రియేట్ చేసిన ఆరానో, మనని ఆ కథకుడో, దర్శకుడో పెట్టిన మూడో - కారణం ఏదైనా కానీ, రియాక్షన్ మాత్రం కళ్లు చెమ్మగిల్లడమే. అలా కళ్లు చెమర్చేలా చేసే అతికొన్ని మంచి ప్రేమకథల్లో ‘వీర్-జారా’ ఒకటి. ‘బ్యూటీ లైస్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్’ అన్నారు. అలా అని నాకు నచ్చే ప్రతి సినిమానీ నా కళ్లతో చూడమని కాదు. ఎవరి కళ్లతో వారే చూడాలి, ఎవరి మనసు తడిని వారి కళ్లల్లో వారే చూడాలి. ఎవరి బుర్రతో వారే ఆలోచించాలి. పోస్టర్ చూడగానే గొప్ప అభిప్రాయం ఏమీ కలగని సినిమా ‘వీర్-జారా’. యశ్‌చోప్రా పేరొక్కటే నాకు పర్సనల్‌గా ఎగ్జయిట్ మెంట్. దానికో కారణం ఉంది. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్‌గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్‌లో స్లో మోషన్లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్‌లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. హీరోలని ఫుల్ ఫిగర్లో బోల్డ్‌గా చూపిస్తారు సరైన టైమింగ్‌లో. ఆ షాట్ చూడ్డానికి చాలా బావుంటుంది. ఇది 35 ఎం.ఎం.లో మాత్రమే కుదురుతుందని అనుకునే వాడిని. కానీ, యశ్‌చోప్రా మాత్రమే సినిమా స్కోప్‌లో కూడా కుదిరించారు. అన్నిటికన్నా భారతీయ సినిమాలలో ప్రేమకథలకి, కుటుంబ బంధాల నేపథ్యమున్న కథలకి సంగీతం ఎంత ఆయువుపట్టో, సంగీతాన్ని పాటగానో, బ్యాక్గ్రౌండ్గానో ఎప్పుడెలా వాడు కోవాలో యశ్‌చోప్రా సినిమాలు చూసి నేర్చుకోవాలి. వీటన్నిటినీ మించి ప్రపంచంలో ఏ దేశంలో షూటింగ్ చేసినా, ఈయన సినిమాల్లో భారతదేశం పట్ల, భారతీయత పట్ల విపరీతమైన గౌరవం, అభిమానం కనపడతాయి. అందులోనూ తన సొంత రాష్ట్రం పంజాబ్‌ని, అక్కడి జీవన విధానాన్ని, పాత్రల్ని చాలా ఇష్టంగా, ఎక్కువ మమకారంతో, అందంగా చూపి స్తారు. అందుకే యశ్‌చోప్రా సినిమా అన గానే ఒక్కసారైనా ఆ సినిమా చూస్తాను. ఆయన ఆలోచనల్ని, రొమాంటిసిజమ్ని ఆస్వాదిస్తాను. 2004లో వస్తున్న చిత్రాల కథాంశాల స్పీడుని బట్టి చూస్తే ‘వీర్- జారా’ చాలా స్లోగా కనపడు తుంది. కానీ, 1950ల నుంచి 2015 దాకా వచ్చిన అజరా మరమైన చిత్రాలన్నింటిలో ‘వీర్-జారా’ ఒకటిగా నిలుస్తుంది. 25 కోట్లు ఖర్చు పెడితే, 95 కోట్ల వరకూ వసూలు చేసిన చిత్రాన్ని స్లో అని ఎలా అంటాం? ‘సోల్’ ఉన్న చిత్రం అంటాం గానీ. వీర్ ప్రతాప్‌సింగ్ భారత ఆర్మీ ఆఫీసర్. ఆపదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ ఆపరేషన్లు చేసి కాపాడటంలో దిట్ట. జారాఖాన్ గారాబంగా పెరిగిన పాకిస్తానీ ధన వంతుల పిల్ల. లాహోర్‌లో ఉంటుంది. తన నానమ్మ ఆఖరి కోరికగా ఆమె అస్థికలు పంజాబ్‌లోని సట్లెజ్ కాలువలో కలపాలని, ఇంట్లో చెప్పకుండా బస్సెక్కి బోర్డర్ దాటేస్తుంది. ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. వీర్ ఆమెని కాపాడతాడు. అతని సహకారంతో నానమ్మ చివరి కోరిక తీరుస్తుంది. తనకు సాయపడినందుకుగాను వీర్ని ఏదైనా ఒక కోరిక కోరుకోమంటుంది. దాంతో అతడు తనతో ఒకరోజు సరదాగా ఉండమంటాడు. మొదట తటపటా యించినా, మాట ఇచ్చింది కాబట్టి సరే అంటుంది. వీర్‌తో అతని ఊరెళ్తుంది. అతన్ని పెంచిన మామ సుమీర్ చౌదరి, అత్త సరస్వతీ కౌర్‌ల ఆప్యాయత, ఆతిథ్యం అన్నీ చూసి మురిసి పోతుంది. ఆ ఊళ్లో బాలుర పాఠశాల మాత్రమే పెట్టి బాలికలని చదువుకోకుండా వివక్ష చూపు తున్నారని, అది తప్పు అని క్లాస్ తీసు కుంటుంది. ఆ సలహా నచ్చడంతో సుమీర్ జారా పేరుమీదే బాలికల ఉన్నత పాఠ శాలకి శంకుస్థాపన చేస్తాడు. ఇవన్నీ జరిగే క్రమంలో జారా పట్ల ఆకర్షితుడవుతాడు వీర్. కానీ ఆ విషయం బయటపెట్టడు. అంతలో జారా వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఆమెను తీసుకుని స్టేషన్‌కి వెళ్తాడు వీర్. జారా రైలు ఎక్కబోతుండగా ఒక యువకుడు రావడం, అతడు తనకు కాబోయే భర్త అని జారా వీర్‌కి పరిచయం చేయడం, వీర్‌ను వదిలి అతడితో ఆమె పాకిస్తాన్ వెళ్లిపోవడం జరుగుతుంది. తీరా పాకిస్తాన్ వెళ్ళాక వీర్ జ్ఞాపకాలు జారాని వెంటాడతాయి. తాను వీర్ని ప్రేమిస్తున్న విషయం ఆమెకు అర్థమవుతుంది. అతడి కోసం పరితపిస్తుంది. దాంతో జారా స్నేహితురాలు వీర్ని పిలి పించడం, జారా తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో వీర్ త్యాగం చేయడానికి సిద్ధపడి భారతదేశానికి తిరిగి ప్రయాణ మవుతాడు. సరిగ్గా అప్పుడే జారాకి కాబోయే భర్త వీర్ని అరెస్ట్ చేయిస్తాడు. వేరే పేరుతో అస్తిత్వం క్రియేట్ చేసి అతనిపై భారతదేశ గూఢచారిగా ముద్ర వేసి, శిక్ష పడేలా చేస్తాడు. దాంతో 22 సంవత్సరాలు వీర్ జైల్లోనే ఉండిపోతాడు. ఆ తర్వాత పాకిస్తాన్ లాయరు, మానవ హక్కుల సంఘం సభ్యురాలు అయిన సామియా సిద్ధిఖీ... వీర్ కేసును వాదించ డానికి సిద్ధపడుతుంది. చివరికి తనే వీర్, జారాలను కలుపుతుంది. ఈ చిత్రంలో ప్రతి మాటా ఒక రసగుళిక. ప్రతి పాటా ఒక ఆణిముత్యం. ప్రతి ఫ్రేమూ కన్నులపండుగ. ప్రేమించిన యువతి కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసిన ప్రేమికుడిగా షారుఖ్ కంటతడి పెట్టించాడు. అతడిని కాపాడేందుకు తపించే న్యాయవాదిగా రాణీ ముఖర్జీ నటన అమోఘం. మొత్తంగా అవార్డుల్ని సాధించి, ప్రేక్షకుల కన్నుల్ని తడిపేసిన ‘వీర్-జారా’ ఓ గొప్ప ప్రేమకథగా బాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయింది! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్‌గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్‌లో స్లో మోషన్లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్‌లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. - రాణీముఖర్జీ -
డాక్టర్లకే వైద్యం
దేడ్ కహానీ - మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్. * షారుఖ్ చేయాల్సిన సినిమానా? * 700 మిలియన్ల ప్రాఫిట్? * సంజయ్‌దత్‌కి పెద్ద మలుపు? * చాలాకాలం తర్వాత ఫ్యాన్స్ ముందుకు మళ్లీ వచ్చిన హీరో? 1990ల మొదట్లో బజాజ్ చేతక్ స్కూటర్ల కంపెనీ ఒక అడ్వర్టయిజ్మెంట్ తయారుచేసింది. అందులో ‘హమార బజాజ్’ అని వచ్చే ట్యూన్ చాలా పాపులర్ అయింది. ఆ యాడ్‌లో ఓ 35-40 మధ్య వయస్కుడైన మధ్యతరగతి తండ్రి మోడల్‌గా నటించాడు. అప్పటికి, అతనితో సహా ఎవ్వరికీ తెలిసుండకపోవచ్చు - ఆ నటుడు మిలీనియం తర్వాత సాంకేతిక ప్రగతి పథంలో దూసుకుపోతూ, ఆ వేగంలో కనుమరుగైపోతున్న మానవీయ విలువల్ని భారతీయ వెండితెర మీద సజీవంగా ఆవిష్కరిస్తాడని, మెటీరియల్ పైన కాకుండా మనుషుల మధ్య బంధం ఉండాల్సిన ఆవశ్యకతని చాటి చెప్తాడని. సినిమా తీసే ప్రతి ఒక్కరి పేరు ‘దర్శకుడు’ అయితే, ఆధునిక భారతీయ సమాజానికి బతుకు విలువ తెలిపే దార్శనికుడిగా ఇతణ్ని ఆరాధిస్తారని.ఆయన పేరే రాజ్‌కుమార్ హిరానీ. రచయిత, దర్శకుడు. పలు వ్యాపార ఉత్పత్తులకి అడ్వర్జయిట్మెంట్లు తీసే రాజ్‌కుమార్ హిరానీని భారీ సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించి, అవి ఫ్లాపులై చేతులు బాగా కాలిన విధు వినోద్ చోప్రా పట్టుకుని దర్శకుణ్ని చేశాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. కానీ, ఇక్కడ ఈ ఆకు నాలుగాకులు ఎక్కువే చదివింది కాబట్టి, విధు వినోద్ చోప్రా కంపెనీని కమర్షియల్‌గా లాభాల బాట పట్టించింది. పేరులో మంచి అభిరుచి కలిగిన నిర్మాణ సంస్థగా అగ్రస్థానంలో, భారతీయ ప్రేక్షక హృదయాలలో నిలబెట్టింది. ఇద్దరూ జీవితంలో ఆ దశలో పడుతున్న అష్టకష్టాల నుంచి ఓదార్పు పొందారేమో, ఒకరి కోసం ఒకరున్నామని అనుకుని మనస్ఫూర్తిగా మైత్రీపూర్వకంగా కౌగిలించుకున్నారేమో - అదే సక్సెస్ మంత్రమైంది. వైద్యశాస్త్రంలో మందు కన్నా రోగిని అక్కున చేర్చుకుని ధైర్యాన్నిచ్చే ఒక్క కౌగిలింత రోగం నయమవడానికి ఎక్కువ పనిచేస్తుందని చెప్పారు. ఆ డాక్టర్ పేరే మున్నాభాయ్. ఈయన డిగ్రీ ఎంబీబీఎస్. కలిపితే ఆ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే డాక్టర్ పట్టా కాదు. రోలింగ్ టైటిల్స్‌లో చెప్పినట్టు మియా, బీవీ, బచ్చే చూడదగిన చిత్రం. చూసి తీరవలసిన చిత్రం. ఇంట్లో దాచుకోదగిన దృశ్య గ్రంథం. హిందీ సినిమా మొత్తం సోల్‌ని హిందీలో ఎక్కడా చెప్పలేదు గానీ, తెలుగులో చిరంజీవిగారు నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీమేక్‌లో పరుచూరి వెంకటేశ్వరరావుగారు ఒక్క డైలాగ్‌లో హీరో ద్వారా చెప్పించారు. ‘‘రోగిని ప్రేమించలేని డాక్టరు కూడా రోగితో సమానం’’. తెలుగుకి దర్శకులు శ్రీ జయంత్.సి.పరాన్జీ. హిందీ విషయానికొస్తే, నూట ఏడు మిలియన్లలో సినిమా తీస్తే, ఏడు వందల మిలియన్ల పైన వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇంత ఎబ్నార్మల్ మార్జినల్ ప్రాఫిట్... ఆ రోజుకి ఏ భారతీయ చిత్రానికీ లేదు. ఇందులో మొదట మున్నాభాయ్ పాత్రకి షారుక్ ఖాన్ని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన విరమించుకున్నాడు. వివేక్ ఒబెరాయ్‌ని పరిశీలించారు. చివరికి సంజయ్‌దత్‌ని వరించింది. అయిపోయిందనుకున్న సంజయ్‌దత్ కెరీర్‌ని మలుపు తిప్పి మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టిందీ చిత్రం. హీరోయిన్గా గ్రేసీసింగ్, ఆమె తండ్రి డాక్టర్ అస్తాన్గా బోమన్ ఇరానీ, సర్క్యూట్‌గా అర్షద్ వార్సీ అందరూ అదరగొట్టారు. చాలా ఏళ్ల తర్వాత సునీల్దత్ని మళ్లీ తెరపై చూపించిందీ చిత్రం. సంజయ్‌దత్ తండ్రి పాత్రలోనే. పోస్టర్ చూడగానే, అంత క్రేజ్ ఏమీ కలగలేదు. చిన్న బడ్జెట్లో తీసిన హిందీ కామెడీ సినిమా అనిపించింది. అందుకే రిలీజయ్యాక, ఓ వారం, పదిరోజుల పాటు అర్జెంటుగా ఈ చిత్రాన్ని చూసెయ్యాలనిపించలేదు. కానీ టాక్ బావుందని విన్నాక, మొదటిసారి ఈ చిత్రాన్ని చూశాక, ఇక చూడకుండా ఉండాలనిపించలేదు. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ‘జాదూకీ ఝప్పీ’ - మ్యాజిక్ హగ్ - కౌగిలి మాత్రం - కష్టాలో ఉన్న విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్దత్లకి ఊరటనిచ్చారు భారతీయ ప్రేక్షకులు. కలెక్షన్లతో గట్టిగా కౌగిలించుకున్నారు ఈ ముగ్గురినీ. ఓ అమాయక వీధిరౌడీ తండ్రి మనసుని కష్టపెట్టినందుకు, ప్రేమించిన అమ్మాయిని గెలుచుకునేందుకు వైద్య వ్యవస్థనే ప్రశ్నిస్తాడు. జవాబులు సూచిస్తాడు. ఆచరణలో తనే నిజమని నమ్మిస్తాడు. సినిమా అంతా సర్క్యూట్‌తో కలసి నవ్వులు పండిస్తాడు. అక్కడక్కడా కన్నీళ్లు పెట్టిస్తాడు. మనసులో తిష్ట వేసుకుని కూచుంటాడు. భారతదేశంలో సినిమా, క్రికెట్ అనేవి రెండూ రెండు అనధికారిక మతాలైతే, క్రికెట్లో మతగ్రంథం పేరు సచిన్ టెండూల్కర్ జీవిత కథ, సినిమాలో మత గ్రంథం రాజ్‌కుమార్ హిరానీ చిత్రాల స్క్రిప్టుల సంకలనం. ‘‘జీవించడానికి టైము లేనప్పుడు ప్రతి నిమిషం రెండు, మూడుసార్లు ఎక్కువ జీవించెయ్’’ - ఈ చిత్రంలోని ఓ మంచిమాట. చాలా సినిమాల్లోలాగ దర్శకుడు కార్పొ‘రేట్’ ఆసుపత్రుల మీద దాడి చేయలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్నే టార్గెట్ చేసి, దానికి ఒక వీధిరౌడీతో పాఠాలు చెప్పించాడు. మనిషికీ మనిషికీ మధ్య ఉండవలసిన ఆత్మీయతని ‘జాదూకీ ఝప్పీ’ (కౌగిలి మాత్రం) ద్వారా చూపించాడు. జీవితంలో మొదటిసారి మున్నాభాయ్ ఎంబీబీఎస్ అనే పాత్ర సినిమాలో కాకుండా నిజ జీవితంలో ఎక్కడైనా తారసపడి ఉంటే ఎంత బావుణ్ను అనిపించింది. ఇలా ఏ సినిమాలో ఈ చిత్రం కథాసంగ్రహం నేను రాయలేను. సినిమా మొత్తం రాసేయాల్సి వస్తుంది. కానీ ఈ చిత్రాన్ని మిస్సవ్వకుండా చూసి తీరాలని మాత్రం రాయగలను. ఆంగ్లంలో ‘చికెస్ సూప్ ఫర్ ద సోల్’ అనే మంచి కథల సంకలనాలు ఉన్నాయి. పుస్తకాలలో అవి అద్భుతాలు, మానసిక బలానికి ఉత్ప్రేరకాలు. సినిమాలలో మున్నాభాయ్ అలాంటిది. వచ్చేవారం ఆర్టికల్ వచ్చేలోపు ఈ సినిమాని అందరూ చూసేస్తారని విశ్వసిస్తూ నమస్తే. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
సరిహద్దులు దాటిన ప్రేమ కథ
15, జూన్ 2001 మార్నింగ్ షో ‘లగాన్’ చూసిన కళ్లతో వెంటనే వేరే ఏ సినిమా చూడటానికీ ఇష్టపడని కళ్లు... రెండ్రోజుల్లోనే ‘గదర్’ సినిమా ఏ థియేటర్లో ఆడుతోందా అని పేపర్లో వెతికాయి. అనిల్‌శర్మ అనే పేరు లేని డెరైక్టర్... ఏమాత్రం సదభిప్రాయం లేని సన్నీడియోల్... అమీషాపటేల్, అమ్రిష్‌పురి తప్ప ఆకట్టుకునే మొహంగానీ, పేరుగానీ పోస్టర్‌మీద లేని సినిమా అది. అయినా మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది... రికార్డులు బద్దలుకొట్టే సినిమా అవుతుందని. అంతగా అందులో ఏముందా అనే కుతూహలం పెరిగింది. థియేటర్‌కి వెళ్లి చూస్తే బిగ్ సర్ప్రైజ్. ‘గదర్’ కథ చెప్పేముందు చరిత్రలో నిజంగా జరిగిన ఒక ప్రేమకథని చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశ సైనికుడు బూటాసింగ్, తెల్లదొర లార్డ్ మౌంట్‌బాటన్ వద్ద పనిచేస్తుండేవాడు. సిపాయి విభజన సమయంలో జైనాబ్ అనే ఒక ముస్లిం యువతిని కాపాడాడు, ప్రేమించాడు, పెళ్లాడాడు. విభజన తర్వాత ఆమెని కుటుంబ సభ్యులు పాకిస్తాన్ తీసుకెళ్లిపోయారు... బూటాసింగ్ని, అతని కూతురిని వదిలేసి. ఏమీ జరగనట్టే అక్కడ ఆమెకి మరో పెళ్లి చేసేశారు. ఈలోగా కూతురితో దొంగతనంగా పాకిస్తాన్లోకి చొరబడిన బూటాసింగ్... తన భార్య పెళ్లి చేసుకోవడం చూసి తట్టుకోలేక కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. బూటా మరణించాడు. కానీ కూతురు బతికింది. ఇది భారత, పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ప్రేమకథ. పై కథలో బూటాసింగ్ని తారాసింగ్ చేసి, సిపాయిగా కాకుండా ట్రక్ డ్రైవర్ని చేసి, కూతురి స్థానంలో కొడుకుని పెట్టి, జైనాబ్ పేరుని సఖీనాగా మార్చి, ఆత్మహత్యా ఉదంతాన్ని హీరోచితంగా మార్చి... సఖీనాని, కొడుకుని తీసుకుని తారాసింగ్ తిరిగి హిందుస్తాన్ చేరుకోవడంతో సుఖాంతం చేస్తే... అదే ‘గదర్: ఏక్ ప్రేమ్‌కథ’. ఎంత బండగా తీసినా, ఎన్ని బడ్జెట్ సమస్యలున్నా, ఒక ఎపిక్ కథని ‘పిక్’చర్‌గా మాత్రమే తీసినా... ఈ కథలో ఒక ఆత్మ ఉంది. ఒక సందేశం ఉంది. విభజన వల్ల పరస్పరం ద్వేషాగ్నులు రగిలిన హిందూ, ముస్లిముల వైరం మధ్య నలిగిన సున్నితమైన ప్రేమకి ప్రేక్షకులు కాసుల వర్షంతో అభిషేకం చేశారు. ‘షోలే’ తర్వాత భారతదేశంలో సింగిల్ థియేటర్స్‌లో అత్యధిక టికెట్లు అమ్ముడైన రెండో సినిమాగా ‘గదర్’ రికార్డు సృష్టించింది. ‘వెన్ ద లాజిక్ ఎండ్స్, దెన్ డ్రామా స్టార్ట్స్’ అన్న పాత సినీసూక్తికి నిర్వచనంలా ఉంటుంది ‘గదర్’. ఇన్స్టెంట్గా డ్రామా వస్తుంది. కన్నీళ్లు వస్తాయి. రక్తం ఉప్పొంగుతుంది. డైలాగులు బాంబుల్లా పేలతాయి. ఉద్రేకం కలిగిస్తాయి. వీటన్నింటినీ ఒక మాలలో గుచ్చిన గట్టి దారంలాగ ఉత్తమ్‌సింగ్ చక్కటి పాటలు, నేపథ్య సంగీతం... ఉదిత్ నారాయణ్ ఆర్ద్రతతో కూడిన స్వరం... అన్నీ కలిసి సన్నీడియోల్‌ని ప్రేమికుడిగా నమ్మించేశాయి. ఆ రోజుకి మోస్ట్ ట్రేడింగ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ చిత్రానికి సైన్ చేయడం, ఈ సినిమా హిట్ మెట్లెక్కడానికి మొదటి కారణం. అక్కణ్నుంచి సూపర్‌హిట్ మెట్లు, బాక్సాఫీస్ రికార్డుల మెట్లు ఎక్కించిన ఘనత మాత్రం దర్శకుడు, హీరో, నిర్మాత, ఫైట్ మాస్టర్ టినూవర్మ, సంగీత దర్శకుడు ఉత్తమ్‌సింగ్, గీత రచయిత ఆనంద్ బక్షి, మాటల రచయిత శక్తిమాన్, కెమెరామెన్ జే బొరాడేలదే. రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇవాళ చూసినా బోరు కొట్టదు. ఏదో ఒక హైలైట్ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా సెన్సిబుల్ ప్రేమకథలకి అలవాటు పడిన బాలీవుడ్ ప్రేక్షకులకి మసాలా రుచిని చూపించిన చిత్రంలా ఉంటుంది గదర్. క్లైమాక్స్‌లో వచ్చే పత్తి బస్తాల రైలు మీద ఫైట్, సినిమా మొదట్లో హిందూ, ముస్లిం మత ఘర్షణలు, సఖీనాని కాపాడటానికి తారాసింగ్ చేసే పోరాటాలు... అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. తీసుకున్న పాత్రే అమాయకమైన, బలిష్టమైన, నిరక్షరాస్యుడైన ట్రక్ డ్రైవర్ తారాసింగ్ పాత్ర కాబట్టి సన్నీడియోల్ నటన చాలా బావుంటుంది. స్క్రీన్‌ప్లేలో ప్రాసెస్ అండ్ స్మూత్ ప్రిపరేషన్ పాటించకపోయినా ప్రేక్షకుడికి కావల్సినవన్నీ కంఫర్టబుల్‌గా ఇచ్చిన సినిమా కాబట్టి ప్రేక్షకుడు కూడా దీనికి బ్రహ్మరథం పట్టాడు. రికార్డుల రీత్యా మాత్రమే కాదు, అవార్డుల వల్ల కూడా కాదు, కంటెంట్ వల్ల మళ్లీ మళ్లీ చూడదగిన సినిమా గదర్. ‘ఉడ్జా కాలే కవ్వా తేరే’ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించటం ఈ చిత్రానికి ప్రధాన బలం. వచ్చేవారం మళ్లీ కలుద్దాం... ‘దిల్ చాహ్తా హై’ అంటూ! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
క్రియేటివిటీ +సోషల్ రెస్పాన్సిబిలిటీ =శంకర్
ఒక ‘జెంటిల్‌మేన్’ పుట్టాలంటే, ఏ ‘జీన్స్’ కావాలో..! వాడు ‘భారతీయుడై’... దుండగుల పాలిట ‘అపరిచితుడై’... నరకంలో శిక్షలన్నీ భూమ్మీదే ఆచరణలో పెట్టేసి, అవినీతిని అంతమొందించేసి... ఒక్కరోజులోనే ముఖ్యమంత్రై, రాష్ట్రాన్ని బాగుచేసిన ‘ఒకే ఒక్కడు’... ఆగస్టు 17న పుడితే... అతనే దక్షిణ భారత దర్శకుల స్థాయిని, మోడరన్ జెనరేషన్లో సినిమా బడ్జెట్‌ని, మార్కెట్‌ని వంద కోట్లు దాటించిన ‘రోబో’టిక్ బ్రెయిన్, వీర ‘శివాజీ’ - శంకర్! పేరుకి తమిళ దర్శకుడైనా, తెలుగువారికి చాలా సుపరిచితుడు, ఆప్తుడు, అభిమాన దర్శకుడు శంకర్‌కి జన్మదిన శుభాకాంక్షలతో ఈ హార్టికల్ని చిరుకానుకగా అందిస్తున్నాను. సినిమాలో పెద్ద హీరో ఉండాలి. ప్రతి దర్శకుడి కోరికే ఇది. సినిమాకి బాగా ఖర్చుపెట్టే నిర్మాత కావాలి. ప్రతి దర్శకుడి అవసరమే ఇది. సినిమా సూపర్హిట్టవ్వాలి. ప్రతి దర్శకుడి కలే ఇది. కానీ, సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలి. కేవలం దర్శకుడు శంకర్‌కి మాత్రమే మొదటి సినిమా నుంచి ఈ రోజుదాకా ఉన్న నిబద్ధత ఇది. నియమం ఇది. కట్టుబాటు ఇది. అన్ని కమర్షియల్ కథల్లో హీరోలాగే శంకర్ సినిమాలో హీరో కూడా దొంగతనాలు చేస్తాడు. చట్టం నుంచి తప్పించుకుంటాడు. కానీ విద్యావ్యవస్థ మీద విరక్తి చెంది, పేద విద్యార్థుల్ని పెద్ద చదువులు చదివిస్తాడు. సామాన్య విద్యార్థుల కలల్ని తను కంటాడు. అందుకే అతను జెంటిల్‌మేన్. పదిహేడు సంవత్సరాలు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా, కో-డెరైక్టర్‌గా ఎస్.ఎ.చంద్రశేఖర్, కె.బాలచందర్ తదితరుల దగ్గర సుశిక్షితుడై, కె.టి.కుంజుమోన్ నిర్మాతగా ‘జెంటిల్‌మేన్’ సినిమాకి మొదటిసారి మెగాఫోన్ పట్టారు శంకర్. అప్పుడే విక్రమ్ధర్మా అనే ఫైట్ మాస్టర్ కోసం రోజూ లంచ్ బ్రేక్‌లో ‘భైరవ ద్వీపం’ షూటింగ్‌కి వచ్చేవారు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డెరైక్టర్ని. విక్రమ్ధర్మాకి నాపై ఉన్న అభిమానం వల్ల, శంకర్‌తో కథాచర్చల్లో నన్నూ కూర్చోబెట్టుకునేవారు. ఆయన విజన్‌ని ఆయన మాటల్లో స్వయంగా నేనూ చూశాను. మనిషి వీర సౌమ్యుడు, సహనశీలి. ఆలోచనల్లో వీర కసి. పని అయ్యేదాకా సడలని పట్టుదల. స్ప్లిట్ పర్సనాలిటీ. అందుకే ‘అపరిచితుడు’ కథను అంత బాగా రాసుకోగలిగారు. ‘జెంటిల్‌మేన్’ సూపర్‌హిట్ అయ్యాక కూడా విక్రమ్ధర్మాని కలవడానికి వచ్చేవారు. అప్పుడు నేను కమల్‌హాసన్ సినిమా ‘నమ్మవర్’కి అసోసియేట్ని. ‘భారతీయుడు’ రూపుదిద్దుకుంటోంది... ఎ.ఎం.రత్నం నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో. ఆ సినిమాకి నన్ను పనిచేయమని అడిగారు. అప్పటికే ఆయన దగ్గర తమిళ అసిస్టెంట్ డెరైక్టర్లు క్యూ కడుతున్నారు. మొదటి సినిమా రిలీజ్‌కి ముందు, రెండో సినిమా మేకింగ్‌లోనూ ఒకే రకమైన డౌన్ టూ ఎర్త్ నేచర్. ఆ టైమ్‌లోనే వాహినీ స్టూడియోకొచ్చి ఆయన పెళ్లికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి వెళ్లారు. అప్పుడు నేను ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాకి అసోసియేట్ని. శంకర్‌ని కలిసినప్పుడు సినిమా గురించి తప్ప సినిమావాళ్ల గురించి ఆయన ఒక్కమాట కూడా తేడాగా మాట్లాడటం నేను వినలేదు. కలిసిన ప్రతిసారీ ఆయన స్థాయిలో అనూహ్యమైన మార్పులున్నాయి. కానీ స్వభావంలో అణువంతైనా మార్పు లేదు. స్థిత ప్రజ్ఞత అతన్నుంచి నేను నేర్చుకున్న మొదటి లక్షణం. సంగీతం, సాహిత్యం, హాస్యం, శృంగారం, రౌద్రంలో ఎక్కడా అతి గానీ, అసభ్యత గానీ, అశ్లీలం గానీ లేకపోవడం అతన్నుంచి దర్శకుడిగా నేను నేర్చుకున్న రెండో లక్షణం. 1990ల తర్వాతి దక్షిణ భారత చలనచిత్ర సీమ గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కచ్చితంగా శంకర్ ముందు వరుసలో ఉంటారు. సామాన్య మానవుడిని, నిరక్షరాస్యుడిని కూడా మెప్పించేలా, ఆలోచింపజేసేలా మంచి మాటలు చెప్పాలంటే, ఆ సినిమా దర్శకుడు చాలా విజ్ఞుడై ఉండాలి. తెలివితేటలు, సాహితీ పరిజ్ఞానంతో పాటు చాలా కామన్సెన్స్ ఉన్నవాడై ఉండాలి. గొప్ప టెక్నీషియన్స్‌ని, మేథావులైన రచయితల్ని, స్టార్స్‌ని, బాగా డబ్బుపెట్టే నిర్మాతని సమకూర్చుకున్నంత మాత్రాన శంకర్ స్థాయి దర్శకుడైపోరు ఎవరూ. నేల, బెంచీ, బాల్కనీ, రిజర్వ్డ్, ఎగ్జిక్యూటివ్, గోల్డ్ క్లాస్ టిక్కెట్లు కొన్న కోట్లమంది మెదళ్లని ఏకకాలంలో కదిలించి, నవ్వించి, ఒళ్లు గగుర్పొడిపించి, అద్భుతం అనిపించి, ఆ! అవును నిజమే కదా అని ఆలోచింపజేసి, సినిమా సూపర్‌హిట్ అనిపించడం అంటే... నేను ఈ ఆర్టికల్ రాసినంత సింపుల్ కాదు... శంకర్ లైఫ్ స్టైల్ అంత సింపుల్ కూడా కాదు - శంకర్ అంత టఫ్ - శంకర్ అంత కాంప్లికేటెడ్. ఎంతో ధైర్యం, విజన్, యాటిట్యూడ్, ఫైర్, గట్ ఫీలింగ్, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే తప్ప ఎవరూ శంకర్ కాలేరు. శంకర్ ఒక ప్యాకేజీ. నవీన దర్శకుడి లక్షణాలకి ఒక నమూనా. న్యూ ట్రెండ్ సినిమాకి, టెక్నికల్‌గా ఎదుగుతున్న సొసైటీకి ఒక దిక్సూచి. యూత్‌కి ఒక రోల్ మోడల్. రజనీకాంత్ నల్లగా ఉంటాడని మనకి చిన్నప్పట్నుంచీ తెలుసు. కానీ నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టే పెళ్లి చేసుకోను అనేస్తుంది శ్రీయ ‘శివాజీ’లో. ఆశ్చర్యంగా రజనీ తెల్లగా తయారవుతారు. ఇది టెక్నికల్‌గా సాధ్యమే అయినా, ఈ థాట్‌ని సినిమాలో పెట్టాలంటే, దర్శకుడికి చాలా విషయం ఉండాలి. హిమాలయాలకి వెళ్లొచ్చీ వెళ్లొచ్చీ హిమాలయమంత కీర్తిని మూటగట్టుకున్న సూపర్‌స్టార్‌కి ఏ విలన్ని పెట్టినా, వెయ్యి మంది విలన్లని పెట్టినా ఆనదనిపించి, ఆయనకి ఆయన్నే విలన్ని చేసేశారు శంకర్ ‘రోబో’లో. అది హైట్స్ ఆఫ్ ఇంటెలిజన్స్. కేరళ విద్యను ప్రయోగించి, లంచగొండుల భరతం పట్టే స్వాతంత్య్ర సమరయోధుడు ‘భారతీయుడు’. కవలలు పుడితే... ప్రేమించే అమ్మాయి కూడా కవలలే కావాలని పట్టు పడితే, సాంకేతికంగా తనో చెల్లెల్ని సృష్టించుకున్న అమ్మాయి కథ ‘జీన్స్’. చాలామంది విద్యార్థినీ విద్యార్థులకి చిన్నప్పట్నుంచీ వ్యాసరచన పోటీల్లోనో, వక్తృత్వ పోటీల్లోనో ఇచ్చే టాపిక్ ‘‘నేనే ముఖ్యమంత్రినైతే...’’. ఆ టాపిక్‌కి ఆయన వెండితెర మీద రాసిన అద్భుత వ్యాసరచన ‘ఒకే ఒక్కడు’. అన్నీ జీవితాల్లోంచి పుట్టినవే. సామాన్య, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జీవితాల్లోని అంతః సంఘర్షణలే. ఆవిష్కరించే తీరు మాత్రం అద్భుత రసంతో. అందుకే ఆయన సినిమాలు ఒకే రకమైన సామాజిక పరిస్థితుల్లో పెరిగిన దక్షిణ భారతావనిలో పెద్ద హిట్టు. బహుశా ఈ బలమే వేరే వ్యక్తిత్వం ఉన్న ఉత్తర భారతంలో బలహీనత అయినట్టుంది. వాళ్లకీ సమస్యలు చిన్నవిగానో, అసలు లేనట్టో ఉండుంటాయి. మాఫియా గన్నులో, ప్రియురాలి కన్నులో... ఈ రెండే దశాబ్దాలుగా ప్రధాన టాపిక్ అయిన నార్త్ ఇండియాలో పెన్షన్ ఆఫీసుల్లో లంచాలు, స్వతంత్ర సమరయోధుల బాధలు, అవినీతి, విద్యావ్యవస్థలో ప్రక్షాళనలు - ఇంత హెవీనెస్ అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదా సహజంగా అనిపించకపోయి ఉండొచ్చు. ఏదేమైనా శంకర్ ఎడాప్ట్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ పుట్టినరోజు బాలుడు మనోహరుడై మళ్లీ ముందుకు వస్తున్నాడు. ఈసారి సమస్య ఏదో, పరిష్కారం ఏదో! భారతీయ పురాణ ఇతిహాసాలు వేదాల సారమా? అత్యాధునిక సాంకేతిక మాయాజాలమా? మనిషి సాధారణంగా ఉండాలి. కలలు అసాధారణంగా ఉండాలి. అలా సినిమాని కలగన్నారు శంకర్. వాటిని అన్ని సినిమాల స్థాయిలో కాకుండా, ఇంకా విపరీత ధరలకి అమ్మే రేంజ్లో కలలు కన్నారు. ఆ కలల్లో ఒక అర్థవంతమైన, అవినీతి రహితమైన సమాజానికి కావాల్సిన సందేశాల్ని చుట్టి ఇస్తున్నారు. బురద ఆర్థికంగా నిరుపేద అయితే, అందులో పుట్టిన పద్మం వెలకట్టలేనంత విలువైనది. శంకర్ మనిషిగా, మామూలు దర్శకుడిగా వెలకట్టలేని విలువైన వ్యక్తి. ఇది ఒక్క రాత్రిలోనో, అదృష్టాన్ని నమ్ముకుంటేనో జరగలేదు. పదిహేడేళ్ల పునాది, ఆగని చదువు, అపరిమితమైన మేధోమథనం - ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతను తీసే సినిమాలని కలిపి అనలైజ్ చేయలేం. కానీ ఒక దర్శకుడు తీసే సినిమాల వల్ల, అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకి తెలిసిపోతుంది. శంకర్ అంత గొప్పవాడు. తను నిర్మాతగా మారి, తన దగ్గర పనిచేసిన మంచి సహాయ దర్శకుల్ని దర్శకులుగా ప్రమోట్ చేసిన సహృదయుడు. న్యూవేవ్ దర్శకులందరికీ టార్గెట్ తన సినిమా, సినిమాకీ మరో వందమైళ్లు ముందుకి జరిపి కష్టపెట్టిస్తున్న కృషీవలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మర్యాదగా, వినయంగా మాట్లాడతారు. క్లుప్తంగా చెప్తారు. గుప్తంగా దానాలు చేస్తారు. 20 ఏళ్ల కెరీర్లో, సెలెబ్రిటీ లైఫ్‌లో ఎటువంటి చిన్న కాంట్రవర్సీ గానీ, చెడు గాసిప్పు గానీ అంతర్జాలంలోను, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలోనూ లేని ఏకైక వ్యక్తి శంకర్. ఇది నిజంగా చాలా చాలా కష్టం. కలల వ్యాపారంలో సంఘ సంస్కరణలని అమ్మడం అన్నిటికన్నా అత్యంత కష్టమైన పని. దానిని అమిత ఇష్టంగా చేసే వ్యక్తిగా, దర్శకుడిగా శంకర్ అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులలాగా నాక్కూడా అమిత ఇష్టం. సాటి దర్శకుడిగా చాలా గౌరవం. ఈ పుట్టినరోజు ఆయనకి మనోహరమైన మంచి హిట్టుని ఇస్తుందని గట్టిగా నమ్ముతూ... ఒక దర్శకుడినైనా, సాటి దర్శకుడు శంకర్ గురించి నన్ను ఈ సందర్భంగా ఆర్టికల్ రాయమని పురమాయించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. - మీ వి.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా శంకర్... తమిళ చిత్రం ‘కుంగుమమ్’లో శివాజీ గణేశన్ పాత్ర పేరు శంకర్. తనకో కొడుకు పుడితే శంకర్ అని పేరు పెడతానని అనుకున్నారట శంకర్ తల్లి. పుట్టగానే ఆ పేరే పెట్టేశారట. సినిమాల్లోకి రాకముందే చెన్నయ్‌లోని హాల్డా కంపెనీలో శంకర్ పనిచేవారు. అప్పుడు కార్మిక సంఘం కార్యకలాపాల విషయంలో చిన్న వివాదం జరిగి, మూడు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారట. శంకర్‌కి గడియారాలంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు రకరకాల గడియారాలను సేకరించారు. ఎలాంటి సమయంలో అయినా చేతికి ఉన్న గడియారానికి ఒక్క గీటు కూడా పడకుండా జాగ్రత్తపడతారట. పెళ్లయిన తర్వాత శంకర్ స్వయంగా షాప్స్కి వెళ్లి బట్టలు కొన్నదే లేదట. తన భార్య ఈశ్వరి సెలక్ట్ చేసినవే ఆయన ధరిస్తారట. ‘బాయ్స్’ సినిమాకి ముందు శంకర్ సిగరెట్లు తాగేవారు. ఆ సినిమా తర్వాత పూర్తిగా మానేశారు. అప్పుడప్పుడు రజనీకాంత్ ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘అంత సులువుగా ఎలా మానేయగలిగావ్ శంకర్’ అని అడగుతుంటారట. షూటింగ్ లొకేషన్లో సిల్లీ జోకులేయడం శంకర్‌కి నచ్చదు. చాలా సీరియస్‌గా ఉంటారు. ఒకవేళ తనకు నచ్చనిది ఏదైనా జరిగితే.. అక్కణ్ణుంచి దూరంగా వెళ్లిపోతారు. కోపం తగ్గిన తర్వాతే లొకేషన్లోకి అడుగుపెడతారట. ప్రతి రోజూ దాదాపు గంటసేపు షటిల్ కాక్ ఆడటం శంకర్ అలవాటు. షూటింగ్ లొకేషన్లో అప్పుడప్పుడూ తన సహాయ దర్శకులతో కూడా ఆడుతుంటారట. భారతదేశంలో తాజ్‌మహల్, విదేశాల్లో పీసా టవర్ అత్యద్భుత కట్టడాలని శంకర్ అంటారు. తాజ్‌మహల్‌ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, పీసా అలా ఒరిగిపోయి ఉండటం వింతగా ఉంటుందని అంటుంటారట. -
ఉదయ్‌ని చూశాక డిసైడయ్యాను... గుణపాఠంలా మిగలకూడదని!
సెలబ్రిటీ కాలమ్: వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు ఒక ఉదయం అస్తమించిందన్న వార్తతో తెల్లారింది ఆ రోజు నాకు! ఉదయ్‌కిరణ్ ఇక లేడని దాని సారాంశం. ఇంగ్లిషు నవలల్లో సీరియల్ కిల్లర్లాంటి వాడెవడో అజ్ఞాతంగా సినిమా పరిశ్రమ మీద పగబట్టి వరుస హత్యలు చేయిస్తున్నట్టు అనిపించింది. అవి చదువుతున్న పాఠకుడిలాగ చెమటలు పట్టి భయం వేసింది. దేవుడైతే దయుంటుంది, దయ్యం అయితే నిర్దయుంటుందని చదివాం కదా! ఇది దేవుడి పని కాదు. విధివంచనతో అనారోగ్యం పాలై తనువు చాలించినవారు ధర్మవరపుగారు, శ్రీహరిగారు, ఏవిఎస్గారు అయితే, మానసిక అనారోగ్యంతో నిజ జీవితాన్ని బాధ్యతారాహిత్యంగా బలి తీసుకున్నవాడు ఉదయ్. నా మొదటి సినిమా ‘మనసంతా నువ్వే’లోను, నా రెండో సినిమా ‘శ్రీరామ్’లోను కథానాయకుడు తను. ‘‘యూ ఆర్ రిచ్ బై ఫ్రెండ్స్ అండీ’’ అనేవాడు నన్ను చూసి. నిజమే. ఫ్రెండ్స్‌ని మించిన ఆస్తి లేదు. అది లేకే తనీ రోజు నాస్తి అయిపోయాడు. తను చాలా బాగా మాట్లాడేవాడు, అంతకంటే బాగా మర్యాదగా ప్రవర్తించేవాడు. కానీ, స్నేహితుల్ని ఎందుకు కూడగట్టుకోలేకపోయాడో! ‘‘నేను ‘ఇంద్ర’ వందరోజుల ఫంక్షన్‌కి వెళ్లి, ఆయన అభిమానినని చెప్తే చిరంజీవి అభిమానులందరూ నా సినిమాలకి కూడా వస్తారని మా మేనేజర్ సలహా ఇచ్చారు. అతను చాలా మేధావండీ, మంచి సలహాలిస్తున్నాడు’’ అన్నాడొక రోజు. నేను, నా ఫ్రెండ్ కమ్ కో-డెరైక్టర్ శంకర్ కె. మార్తాండ్ ఉన్నాం. ‘‘జీవితంలో ఎప్పుడూ లెక్కలేసి ఏ పనీ చెయ్యొద్దు ఉదయ్. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనని భూమ్మీదకి పంపాడు. మనం ఆ లెక్కలకి స్టెప్పులెయ్యాలి తప్ప మళ్లీ కొత్తగా లెక్కలెయ్యకూడదు, అలా వేస్తే ఆన్సర్ కచ్చితంగా రాంగవుతుంది’’ అని చెప్పాను. సక్సెస్‌లో ఉన్నప్పుడు తన దగ్గర చేరి, చెత్త సలహాలిచ్చేవాణ్ని నమ్మాడు. అతడి లెక్కలు తలకెక్కించుకున్నాడు. చివరికి అతని లెక్క తప్పింది. అతన్నుంచి స్ఫూర్తి పొందిన వేలమందికి రాంగ్ ఆన్సరిచ్చి వెళ్లిపోయాడు. సినిమా పరిశ్రమలో సంబంధాలన్నీ తొంభైశాతం అవసరానికే. అందువల్ల సినిమా పరిశ్రమ గురించి అవగాహన లేని ఇంట్లోవాళ్లు అనవసరంలా అనిపిస్తుంటారు అప్పుడప్పుడూ. ఆ అగాథం పెరగకుండా చూసుకోవడం చాలా కష్టం. ఉదయ్‌ని ఆ అగాథమే ఒంటరివాణ్ని చేసింది. ఆత్మన్యూనతకి గురి చేసి, ఆత్మహత్యకి ప్రేరేపించింది. అతనితో కెరీర్ ప్రారంభంలో మంచి రిలేషన్ ఉన్న నేను, ఎమ్మెస్రాజుగారు, తేజగారు, ఆర్పీపట్నాయక్... అందరం మళ్లీ సక్సెస్ బాట పట్టడానికి పోరాటం చేస్తున్నాం. మాలో ఏ ఒక్కరు సూపర్‌హిట్ కొట్టినా, అతన్ని కూడా బయటకి లాగేవాళ్లం. మాకన్నా నటుడిగా అతనికి అవకాశాలెక్కువ. టీవీ సీరియల్ చేసినా అవసరాలు గట్టెక్కేస్తాయి. పైగా ఉదయ్ సినిమాల్లో డబ్బు గడించడమే తప్ప, మాలాగా తన డబ్బు పెట్టిన దాఖలాల్లేవు. ఎన్నో అననుకూల పరిస్థితుల్ని మొండిగా ఎదుర్కొన్నవాడు. కనీసం యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే వీరుడిగా మర్యాద ఉంటుంది. కానీ శత్రువుకి తలవంచాడు. అదే నచ్చలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, మోహన్‌బాబు, చిరంజీవి, శ్రీకాంత్, రవితేజ... ఇలా చాలామంది సినిమా పరిశ్రమకు చెందని కుటుంబాల నుంచి వచ్చారు ఉదయ్లాగా. వీరందరూ ఎప్పుడూ సక్సెస్‌లోనే లేరు. చాలా హిట్లూ ఫ్లాపులూ చూశారు. నాకు తెలిసి పదిమందికి స్ఫూర్తినిచ్చే ఏ లెజెండ్ లేదా సెలెబ్రిటీ లైఫ్ చూసినా... వాళ్ల హిట్లు, ఫ్లాపులు కాదు, అవి రెండూ వచ్చినప్పుడు వాళ్లు పాటించిన మెంటల్ బ్యాలెన్స్ మాత్రమే వాళ్ల సక్సెస్. అది గారడీ వాడు తీగ మీద నడిచిన దానికన్నా కష్టం. ఆ బ్యాలన్స్ తప్పి కిందపడ్డాడు ఉదయ్. నేను సినిమాల్లోకి రాకముందు మా అమ్మగారికి ఆవేశంగా చెప్పాను- ‘‘ఒక రిస్క్ తీసుకుంటానమ్మా... సక్సెస్ అయితే పదిమందికి పాఠంగా నిలబడతాను, ఫెయిలైతే పదిమందికి గుణపాఠంగా నిలబడతాను’’ అని. కానీ, ఉదయ్‌కిరణ్‌ని చూశాక కచ్చితంగా డిసైడ్ అయ్యాను, గుణపాఠంగా మిగలకూడదని. స్ఫూర్తి పొంది మొండిగా సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి తను స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగాక కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఉంటాయి. వాటిని తనకు నేర్పించడానికి ఉదయ్ ఒక గాడ్ఫాదర్ని ఏర్పరచుకోలేకపోయాడు. ఒక ఆత్మీయుణ్ని సంపాదించుకోలేకపోయాడు. ఇది అతని ఫెయిల్యూర్ అనలేను కానీ, అతన్ని ఫెయిల్యూర్ నుంచి కాపాడలేకపోయిన ఫ్యాక్టర్ అని అనుకోగలను. మనసు మరీ బాలేకపోతే తనతో కలిసిపని చేసిన సునీల్‌తో కాసేపు మాట్లాడినా, సునీల్ ద్వారా త్రివిక్రమ్‌ని కలిసినా స్వాంతన లభించేది. ఆర్పీతోనో, దశరథ్తోనో ఓ అరగంట స్పెండ్ చేసినా ఉపశమనం కలిగేది. తేజగారి దగ్గరికో, ఎమ్మెస్ రాజు గారి దగ్గరకో వెళ్లి కాసేపు కూర్చున్నా మనశ్శాంతి లభించేది. సీతారామశాస్త్రి గారింటికో, భరణి గారింటికో వెళ్లి కూర్చున్నా జీవనపోరాటం ఎలా చేయాలో అర్థమై ఉండేది. దాసరిగారో, రాఘవేంద్రరావుగారో చెప్పేది కొద్దిసేపు మౌనంగా విన్నా బోలెడంత ఎనర్జీ వచ్చేది. వాళ్లంతా పొగడరు. స్ఫూర్తి కలిగేలా సజెస్టివ్గా తిడతారు. వీళ్లందరినీ ఉదయ్ ఏదో ఒక సందర్భంలో కలిశాడు. కలిసినప్పుడల్లా వాళ్లు తనతో సినిమా చేస్తారా చేయరా అని పరిశీలించుకుని వచ్చేసేవాడే తప్ప వాళ్లతో తను మాట్లాడడం కానీ వాళ్ల మాటలు వినడం కానీ చేయలేదు. సక్సెస్‌లో ఉన్నప్పుడు సినిమాలు చేయడానికి మనకి మనుషులతో పర్సనల్‌గా అనుబంధం అక్కర్లేదు. కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మాత్రం అది చాలా అవసరం! ఎవ్వరితోనూ దాన్ని ఏర్పరచుకోలేకపోయాడు ఉదయ్. అదే తను జీవితంలో మిస్సైన విషయం! ఎవ్వరినీ అణగదొక్కేంత సీను పరిశ్రమలో ఎవరికీ లేదు. కానీ, ఎవరైనా మనని ప్రోత్సహించేంత రిలేషన్షిప్ మనకుందా లేదా అన్నది మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఇది ఉదయ్‌కి తెలీలేదు. అనూహ్యమైన సక్సెస్ చిన్నవయసులోనే రావడం, తన జీవితంలో జరిగిన పరిణామాలలో తనే నిర్ణయాలు తీసుకోవడం, అతనికి ఎవరన్నా మంచో, చెడో చెప్పే అవకాశం లేకుండా చేశాయి. ఇతరులతో పోల్చుకోవడం, ప్రతి పని నుంచి/వ్యక్తి నుంచి మనకు అనుకూలంగా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడం... ఈ రెండు లక్షణాలూ ఎప్పుడూ మంచివి కావు. అవి ఎవర్నైనా తీవ్రమైన డిప్రెషన్‌కి గురి చేస్తాయి. అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్, నాని మంచి స్నేహితులు ఉదయ్‌కి. కానీ వాళ్లతో పోల్చుకోవడం వల్లే ఆత్మన్యూనతకి గురయ్యాడు. వీళ్లంతా ఉదయ్కన్నా ఎక్కువ కష్టపడ్డారు కెరీర్లో. నితిన్‌కి తండ్రి సపోర్ట్ ఉంది. కానీ నవదీప్ కుటుంబానికి సినిమాలతో సంబంధం లేదు. సినిమాలలో పెట్టుబడులూ లేవు. కానీ అతనికి ఇండస్ట్రీనిండా స్నేహితులే. ఈ ఎనాలిసిస్ అంతా ఉదయ్‌కి మాటల సందర్భంలో నేను చెప్పిన విషయాలే! ఇది ఇప్పుడు రాయడం వల్ల అతను తిరిగి రాడని తెలుసు. అయితే, ఈ పరిశ్రమలోకి వచ్చే కొత్తవాళ్లల్లో ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని తెలుసుకుంటే అంతే చాలు! ఇండస్ట్రీలో సక్సెస్‌లో ఉన్నవాళ్లకి కూడా అది లేని అనుభవజ్ఞులతో ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ అవసరాన్ని క్యాష్ చేసుకుని కొన్నాళ్లు ఓపిగ్గా, స్థిరంగా ఉండాలి మనకి సక్సెస్ వచ్చేవరకూ. ఎప్పుడూ ఒక సినిమా తీసి ప్రూవ్ చేసుకోగలిగే అవకాశాన్ని మిగుల్చుకోవాలి. ఉదయ్ మంచివాడు. అమాయకంగా పరిశ్రమలోకి ఎంటరై, అనూహ్యంగా పెకైదిగాడు. తర్వాత విధి చేతిలో ఒరిగాడు. పెకైగిరాడు. ఈ ప్రస్థానంలో తప్పు పట్టాల్సినదేవన్నా ఉంటే తను తీసుకున్న నిర్ణయాలనే కానీ తనని కాదు. ఆ నిర్ణయాలకి బలవంతుడయ్యిందీ, బలయ్యిందీ కూడా అతనే! ఉదయ్‌ది ఒక ఉదంతం. ఒక మంచి కుర్రాడిచ్చిన చెడ్డ ఉదాహరణ! జీవితంలో నటిస్తే ఏర్పడే అగాథం ఒంటరితనం. భ్రమలో జీవిస్తే ఏర్పడే ఒంటరితనం అథఃపాతాళం. భగవంతుడు, జాతకం, అదృష్టం, మారుతున్న సమాజం... అన్నీ అందలమెక్కించాయి ఉదయ్‌ని. మన పక్కింటి కుర్రాణ్నో, మనింట్లో తమ్ముడ్నో చూసినట్టు మురిసిపోయింది అశేషాంధ్ర ప్రజానీకం. అందుకే అతని మరణాన్ని, దాన్ని అతను బలవంతంగా కోరుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేకపోయింది. ఎవరినన్నా నొప్పిస్తే మన్నించండి!