సరిహద్దులు దాటిన ప్రేమ కథ
15, జూన్ 2001 మార్నింగ్ షో ‘లగాన్’ చూసిన కళ్లతో వెంటనే వేరే ఏ సినిమా చూడటానికీ ఇష్టపడని కళ్లు... రెండ్రోజుల్లోనే ‘గదర్’ సినిమా ఏ థియేటర్‌లో ఆడుతోందా అని పేపర్లో వెతికాయి. అనిల్‌శర్మ అనే పేరు లేని డెరైక్టర్... ఏమాత్రం సదభిప్రాయం లేని సన్నీడియోల్... అమీషాపటేల్, అమ్రిష్‌పురి తప్ప ఆకట్టుకునే మొహంగానీ, పేరుగానీ పోస్టర్‌మీద లేని సినిమా అది. అయినా మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది... రికార్డులు బద్దలుకొట్టే సినిమా అవుతుందని. అంతగా అందులో ఏముందా అనే కుతూహలం పెరిగింది. థియేటర్‌కి వెళ్లి చూస్తే బిగ్ సర్‌ప్రైజ్.
‘గదర్’ కథ చెప్పేముందు చరిత్రలో నిజంగా జరిగిన ఒక ప్రేమకథని చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశ సైనికుడు బూటాసింగ్, తెల్లదొర లార్డ్ మౌంట్‌బాటన్ వద్ద పనిచేస్తుండేవాడు. సిపాయి విభజన సమయంలో జైనాబ్ అనే ఒక ముస్లిం యువతిని కాపాడాడు, ప్రేమించాడు, పెళ్లాడాడు. విభజన తర్వాత ఆమెని కుటుంబ సభ్యులు పాకిస్తాన్ తీసుకెళ్లిపోయారు... బూటాసింగ్‌ని, అతని కూతురిని వదిలేసి. ఏమీ జరగనట్టే అక్కడ ఆమెకి మరో పెళ్లి చేసేశారు.
ఈలోగా కూతురితో దొంగతనంగా పాకిస్తాన్‌లోకి చొరబడిన బూటాసింగ్... తన భార్య పెళ్లి చేసుకోవడం చూసి తట్టుకోలేక కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. బూటా మరణించాడు. కానీ కూతురు బతికింది. ఇది భారత, పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ప్రేమకథ. పై కథలో బూటాసింగ్‌ని తారాసింగ్ చేసి, సిపాయిగా కాకుండా ట్రక్ డ్రైవర్‌ని చేసి, కూతురి స్థానంలో కొడుకుని పెట్టి, జైనాబ్ పేరుని సఖీనాగా మార్చి, ఆత్మహత్యా ఉదంతాన్ని హీరోచితంగా మార్చి... సఖీనాని, కొడుకుని తీసుకుని తారాసింగ్ తిరిగి హిందుస్తాన్ చేరుకోవడంతో సుఖాంతం చేస్తే... అదే ‘గదర్: ఏక్ ప్రేమ్‌కథ’.
ఎంత బండగా తీసినా, ఎన్ని బడ్జెట్ సమస్యలున్నా, ఒక ఎపిక్ కథని ‘పిక్’చర్‌గా మాత్రమే తీసినా... ఈ కథలో ఒక ఆత్మ ఉంది. ఒక సందేశం ఉంది. విభజన వల్ల పరస్పరం ద్వేషాగ్నులు రగిలిన హిందూ, ముస్లిముల వైరం మధ్య నలిగిన సున్నితమైన ప్రేమకి ప్రేక్షకులు కాసుల వర్షంతో అభిషేకం చేశారు. ‘షోలే’ తర్వాత భారతదేశంలో సింగిల్ థియేటర్స్‌లో అత్యధిక టికెట్లు అమ్ముడైన రెండో సినిమాగా ‘గదర్’ రికార్డు సృష్టించింది.
‘వెన్ ద లాజిక్ ఎండ్స్, దెన్ డ్రామా స్టార్ట్స్’ అన్న పాత సినీసూక్తికి నిర్వచనంలా ఉంటుంది ‘గదర్’. ఇన్‌స్టెంట్‌గా డ్రామా వస్తుంది. కన్నీళ్లు వస్తాయి. రక్తం ఉప్పొంగుతుంది. డైలాగులు బాంబుల్లా పేలతాయి. ఉద్రేకం కలిగిస్తాయి. వీటన్నింటినీ ఒక మాలలో గుచ్చిన గట్టి దారంలాగ ఉత్తమ్‌సింగ్ చక్కటి పాటలు, నేపథ్య సంగీతం... ఉదిత్ నారాయణ్ ఆర్ద్రతతో కూడిన స్వరం... అన్నీ కలిసి సన్నీడియోల్‌ని ప్రేమికుడిగా నమ్మించేశాయి.
ఆ రోజుకి మోస్ట్ ట్రేడింగ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ చిత్రానికి సైన్ చేయడం, ఈ సినిమా హిట్ మెట్లెక్కడానికి మొదటి కారణం. అక్కణ్నుంచి సూపర్‌హిట్ మెట్లు, బాక్సాఫీస్ రికార్డుల మెట్లు ఎక్కించిన ఘనత మాత్రం దర్శకుడు, హీరో, నిర్మాత, ఫైట్ మాస్టర్ టినూవర్మ, సంగీత దర్శకుడు ఉత్తమ్‌సింగ్, గీత రచయిత ఆనంద్ బక్షి, మాటల రచయిత శక్తిమాన్, కెమెరామెన్ జే బొరాడేలదే.
రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇవాళ చూసినా బోరు కొట్టదు. ఏదో ఒక హైలైట్ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది.
చాలా సెన్సిబుల్ ప్రేమకథలకి అలవాటు పడిన బాలీవుడ్ ప్రేక్షకులకి మసాలా రుచిని చూపించిన చిత్రంలా ఉంటుంది గదర్. క్లైమాక్స్‌లో వచ్చే పత్తి బస్తాల రైలు మీద ఫైట్, సినిమా మొదట్లో హిందూ, ముస్లిం మత ఘర్షణలు, సఖీనాని కాపాడటానికి తారాసింగ్ చేసే పోరాటాలు... అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. తీసుకున్న పాత్రే అమాయకమైన, బలిష్టమైన, నిరక్షరాస్యుడైన ట్రక్ డ్రైవర్ తారాసింగ్ పాత్ర కాబట్టి సన్నీడియోల్ నటన చాలా బావుంటుంది.
స్క్రీన్‌ప్లేలో ప్రాసెస్ అండ్ స్మూత్ ప్రిపరేషన్ పాటించకపోయినా ప్రేక్షకుడికి కావల్సినవన్నీ కంఫర్టబుల్‌గా ఇచ్చిన సినిమా కాబట్టి ప్రేక్షకుడు కూడా దీనికి బ్రహ్మరథం పట్టాడు. రికార్డుల రీత్యా మాత్రమే కాదు, అవార్డుల వల్ల కూడా కాదు, కంటెంట్ వల్ల మళ్లీ మళ్లీ చూడదగిన సినిమా గదర్. ‘ఉడ్‌జా కాలే కవ్వా తేరే’ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించటం ఈ చిత్రానికి ప్రధాన బలం. వచ్చేవారం మళ్లీ కలుద్దాం... ‘దిల్ చాహ్‌తా హై’ అంటూ!
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు