నేల మీద తారలు | Taare Zameen Par | Sakshi
Sakshi News home page

నేల మీద తారలు

Published Sun, Dec 27 2015 4:14 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

నేల మీద తారలు

నేల మీద తారలు

దేడ్ కహాని - తారే జమీన్ పర్
అనగనగా ఓ భయంకరమైన అల్లరి అబ్బాయి. వాడికి అయిదేళ్లప్పుడు అన్నలు ఇసుకతో కట్టిన గుడిని కసిగా కూల్చేసి నాన్నతో దెబ్బలు తిన్నాడు.
 
ఇంకో ఆర్నెల్ల తర్వాత స్కూల్లో మాస్టారు వేరే స్టూడెంట్‌ని కొడుతుంటే భయమేసి నెలరోజులు స్కూలుకెళ్లలేదు. ఇంట్లో బయల్దేరి, గుళ్లో కూర్చుని, ఆడుకుని, పడుకుని మళ్లీ స్కూలు వదిలే టైముకి ఇంటికెళ్లిపోయేవాడు.
 సినిమాలు చూస్తున్నప్పుడు నిద్ర రాదు.

పుస్తకం తెరిస్తే పడుకునేవాడు. స్కూలు విషయం ఇంట్లో తెలిసి అమ్మచేత ఒళ్లంతా రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నాడు. అర్ధరాత్రి ఏదో గుర్తొచ్చి వాళ్ల నాన్న తలగడ కింద చెయ్యి పెడితే, పామనుకుని భయపడిన నాన్న తెల్లారేదాకా కొట్టారు. మూడు రోజులు కష్టపడి వత్తిన వందల అప్పడాలు అర సెకనులో చిదిమి ముక్కలు చేసి అమ్మచేత కవ్వం విరిగేలా తన్నులు తిన్నాడు.
 బైటికెళ్తే రక్తం కారుతూ వచ్చేవాడు. చెప్పకుండా సినిమాలకి పోయేవాడు.

ఇంట్లోవాళ్లకి వాడొక పీడకల. వాడు మాత్రం అందమైన కలలు కంటూ పెరిగాడు. రాఘవేంద్రరావులా, దాసరిలా, విశ్వనాథ్‌లా, బాపులా, బాలచందర్‌లా, జంధ్యాలలా, సింగీతంలా, మణిరత్నంలా అవ్వాలని, అవుతానని కలలు కనేవాడు. చూసిన సినిమా కథ బాగా చెప్పేవాడు. ఎవరో ఒకరికి చెప్పకుండా నిద్రపోయే వాడు కాదు. ఎక్కువ బలైంది వాళ్లమ్మే పాపం.
 
కాలేజీలో చదువు ఎగ్గొట్టడానికి కల్చరల్ కాంపిటీషన్స్‌కి వెళ్లేవాడు. వెళ్లగా వెళ్లగా అనుభవం వచ్చి, ప్రైజులు తేవడం మొదలెట్టాడు. ప్రైజులు తేగా తేగా కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అవ్వగానే సినిమాల్లోకి దూకేశాడు. ఈదగా ఈదగా అనుభవం వచ్చి ‘మనసంతా నువ్వే’ సినిమా తీసి దర్శకుడైపోయాడు. ఇది బాల్యం. పెరిగి పెద్దయిన ప్రతి ఒక్కరికీ ఇలా ఒక బాల్యం ఉంటుంది.

అది అందరికీ చాలా అందంగా ఉంటుంది. థాంక్ గాడ్... అప్పట్లో ఇంటర్నెట్‌లు, గూగుల్ సెర్చ్‌లు, అతిగా నాలెడ్జ్‌లు లేవు, అనవసరమైన అవేర్‌నెస్‌లు లేవు. లేకపోతే నన్ను కూడా ఏ ‘డిస్లెక్సిక్’ పేషెంట్‌గానో భావించి, మా పేరెంట్స్ ఏ స్పెషల్ చైల్డ్ గానో ట్రీట్‌మెంట్ ఇప్పించేస్తే, ఎటో పారిపోయేవాణ్ని,  ఏదో అయిపోయే వాణ్ని. కోపం వస్తే నాలుగు దెబ్బలేసినా, ప్రేమను పంచి, అందరు పిల్లల్లానే మామూలుగానే పెంచేశారు. కాబట్టి సమాజంలో ఉండగలిగాను. అనుకున్నది చేయగలిగాను.

ఇది నా కథ. ఇలా మనలో అందరికీ ఒక కథ ఉంటుంది. దాని నుంచి ఈ రోజున మనం తీసుకోగలిగిన స్ఫూర్తి ఉంటుంది. నేర్చుకోవలసిన పాఠం ఉంటుంది. చిన్నప్పుడు చదువంటే ఉండే భయం నుంచి, జీవితంలో పైకి రావడమనే జయం వరకు మనని, ప్రతి ఒక్కరినీ ఏదో ఒక పాత్ర, ఒక సంఘటన, ఒక తల్లో, తండ్రో, స్నేహితుడో, గురువో, అంకులో, ఆంటీయో, తాతగారో, నానమ్మో, అమ్మమ్మో... ఎవరో ఒక వ్యక్తి ప్రభావితం చేసి ఉంటారు. అలా కూడా ఎవరూ లేని వాళ్లకోసం ‘తారే జమీన్ పర్’ అనే ఒక సినిమా ఉంది.

మన నిన్నటికి, మన రేపటికి మధ్య సంధి కాలం చీకటైతే, అందులో వెలుగునిచ్చే నక్షత్రం... ‘తారే జమీన్ పర్’. దర్శీల్ సఫారీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు ‘ఇషాన్ నందకిషోర్ అవస్థీ’గా జీవించిన చిత్రం. విపిన్‌శర్మ, టిస్కాచోప్రా మన అమ్మానాన్నలే అనిపించేంత సహజంగా నటించి, అలరించిన చిత్రం.
 
ఆమిర్‌ఖాన్ రామ్‌శంకర్ నికుంభ్‌గా అత్యద్భుతంగా ఇమిడిపోయి, నటుడిగా ఎదిగిపోయిన చిత్రం.
 ‘తారే జమీన్ పర్’ ఆమిర్‌ఖాన్‌కి దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ సినిమా కథ గురించి రాసే ముందు ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న కథని కచ్చితంగా చెప్పాలి.
 బాలీవుడ్‌లో దీపా భాటియా అనే ఫేమస్ ఫిమేల్ ఎడిటర్ ఒకామె ఉన్నారు. ఆమె భర్త అమోల్ గుప్తే కథలు రాసుకుంటూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ తిరుగుతుండేవాడు.

ఒకరోజు దీపా భాటియా ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శక శ్రేష్టుడు ‘అకిరా కురసోవా’ బాల్యం గురించి చదువుతూ... అంతటి మేధావి, దర్శకుడూ చిన్నప్పుడు స్కూల్లో చాలా పూర్ స్టూడెంట్ అని, చదువనే చట్రంలో ఇమడలేక ఇబ్బంది పడ్డాడని తెలిసి, వాళ్లాయనతో దీనిమీద ఒక సినిమా కథ తయారు చేయమంది. భారతీయ బాల్య విద్యా నేపథ్యానికి అకిరా కురసోవా జీవితాన్ని తర్జుమా చేసే ప్రయత్నంలో అమోల్ గుప్తే చాలా రీసెర్చ్ చేశాడు.

అందులో ఆయనకి ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్లు, ఏదో ఒక రంగంలో ప్రపంచాన్ని శాసించినవాళ్లు కూడా చిన్నప్పుడు ఒక ఫిక్స్‌డ్ కరిక్యులమ్‌లో, డిసిప్లిన్డ్ స్టడీస్‌లో ఫెయిలయ్యారని తెలిసింది. ఆ రీసెర్చ్ లోంచి డిస్లెక్సియా అనే వ్యాధి పిల్లలకి అక్షరాలని గుర్తుండనివ్వదని తెలిసింది. అన్ని విషయాల్లోనూ తెలివిగా ఉండే మూడో తరగతి పిల్లాడు యాపిల్ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకుని సరిగా రాయలేక పోతే, దానికి కారణం ఈ వ్యాధి అని అర్థమైంది. అలా ‘తారే జమీన్ పర్’ కథ పుట్టింది.
 
దానికి సరిగ్గా సరిపోయే కుర్రాడి కోసం వెతుకుతూ, షమ్యక్ దేవర్ సమ్మర్ డ్యాన్స్ క్లాస్‌లో పిల్లల్ని చూస్తుంటే... దర్శీల్ సఫారీ అనే కుర్రాడు దొరికాడు. చదువుతో నానా అవస్థలు పడే ఇషాన్ అవస్థి పాత్రకు అతడు ఫిక్స్ అవ్వగానే...  టీచర్ పాత్రధారి అయిన హీరో కోసం, నిర్మాత కోసం వెతకనారంభించాడు. ముందు హీరోని ఒప్పిస్తే నిర్మాత దొరుకుతాడు కాబట్టి అక్షయ్‌ఖన్నాని కలిసి కథ చెప్పాడు.

కథ వల్లో, అమోల్ గుప్తే దర్శకత్వం వల్లో అక్షయ్‌ఖన్నా ఒప్పుకో లేదు. అప్పుడు ఆమిర్‌ఖాన్‌ని కలిశాడు. తన బాల్యంలో ఆర్ట్ క్లాస్ టీచర్ అయిన రామ్‌దాస్ సంపత్ నికుంభ్‌ని స్ఫూర్తిగా తీసుకుని అమోల్ గుప్తే హీరో పాత్రని రూపొందించాడు. అందుకే ఆ పాత్రకి రామ్‌శంకర్ నికుంభ్ అని పేరు పెట్టాడు. మంచి కథలకి, మంచి పాత్రలకి ఎప్పుడూ ముందుండే ఆమిర్‌ఖాన్ నికుంభ్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. తనే నిర్మాతగా, అమోల్ గుప్తేకి దర్శకత్వం అవకాశం ఇచ్చాడు.
 
నెలలు గడుస్తున్నాయి. కథ, మాటలు బావున్నా... స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తేడాగా ఉన్నాయని ఆమిర్‌కి అనుమానం వచ్చింది. అమోల్ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ, క్రియేటివ్‌గా కాయితం నుంచి వెండితెర మీదకి ఎక్కించే విషయాల్లో ఏదో లోపిస్తోందని ఆమిర్ అనుమానపడ్డాడు. దాంతో అమోల్‌ని దర్శకుడిగా వద్దన్నాడు.
 
అయితే వేరే దర్శకులని వెతకడం, వాళ్లు దానిని ఎక్కించుకుని తెరకెక్కించేలోపు దర్శీల్ పెరిగి పెద్దయిపోతుండడం - ఇవన్నీ ఎందుకని ఆమిర్‌ఖాన్ స్వయంగా మెగాఫోన్ పట్టేసుకున్నాడు. తనే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా బాధ్యతలు భుజానేసుకుని అమోల్ గుప్తేని క్రియేటివ్ డెరైక్టర్‌గా పెట్టి ‘తారే జమీన్ పర్’ని మనకందించాడు.
 
ప్రేక్షకులేం తక్కువ తినలేదు. 12 కోట్ల బడ్జెట్‌కి 89 కోట్లు తిరిగి ఇచ్చారు. ఇంత మంచి చిత్రం తీసిచ్చిన ఆమిర్ ఖాన్‌కి, కాసులతో పాటు అవార్డుల పంట కూడా పండింది.
 భారతదేశం తరఫున ఆస్కార్ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా నామినేట్ కూడా అయ్యింది. చెన్నైలో ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా మొదటి సినిమా దర్శకుడికి ఇచ్చే ‘గొల్లపూడి శ్రీనివాస్ అంతర్జాతీయ అవార్డు (తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్‌లో ప్రమాద వశాత్తూ మరణించిన తన కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు ఇరవై ఏళ్లుగా ప్రతి యేటా ఎంతోమంది అంతర్జాతీయ దర్శకులకి ప్రోత్సాహంగా ఈ అవార్డు ఇస్తున్నారు)’ ఆ యేడు ఆమిర్‌ఖాన్‌కి దక్కింది. ఇదీ... ‘తారే జమీన్ పర్’ తెర వెనుక కథ.
 
చదవలేక పోవడం నిర్లక్ష్యం కాదు, వ్యాధి అని చెప్పే ఒక ఉపాధ్యాయుడు నిరాశా నిస్పృహలకు లోనైన చిన్నారిని ఉత్తేజితుల్ని చేసి ఆ స్కూల్‌కి చిన్న సైజు హీరోని చేస్తాడు. ఇది పిల్లలు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు. పిల్లలున్న తల్లిదండ్రులు, టీచర్లు అందరూ చూడాల్సిన చిత్రం. నిజానికి ఇది ఒక కమర్షియల్ చిత్రం కాదు. కంపల్సరీగా ప్రతి స్కూల్లోనూ చూపించాల్సిన పాఠం. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఉండాల్సిన పాఠం.
 
ఆమిర్‌ఖాన్ నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలిచ్చాడు. ఇక దర్శకుడిగా మారి ఇచ్చిన ‘తారే జమీన్ పర్’ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అదొక ఆణిముత్యం. ర్యాంకుల కోసం పిల్లల నెత్తిమీద మోయలేని బరువును పెట్టేసి, ఒత్తిడికి లోను చేసి, వారి ఆత్మహత్యలకు సైతం కారణమవుతోన్న తల్లిదండ్రులందరికీ గొప్ప సందేశాన్నే ఇచ్చాడు ఆమిర్ ఈ చిత్రం ద్వారా.

పిల్లలు వెనుకబడటానికి వాళ్లు మొద్దులు కావడం కారణం కాదని, ఏదైనా సమస్య ఉందేమో చూడమని, ఏదైనా టాలెంట్ ఉంటే వెలికి తీసి వాళ్లని గొప్పవాళ్లను చేయమని కొత్త పాఠం చెప్పాడు. ఎంత గొప్ప పాఠమిది! పిల్లలు... నేలమీది తారలు. వాళ్లని బాగా పెంచితేనే సమాజం బావుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement