Taare Zameen par
-
పిల్లలూ దేవుడూ చల్లనివారే...
రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ చేస్తే నేటికీ అదొక అద్భుత నటన. ‘లవకుశ’లో లవుడుగా కుశుడుగా ఆ చిన్నారులు చెదిరిపోతారా మస్తిష్కం నుంచి. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అన్న పద్మినికి ఇన్నేళ్లు వచ్చినా ‘కుట్టి పద్మినే’. గతంలో బాలలు గొప్పగా నటించే పాత్రలు ఉండేవి. బాలల కోసమే తీసే సినిమాలు ఉండేవి. బాలలే నటించగా బాల భారతం వచ్చింది. బాల రామాయణమూ వచ్చింది. బాలల సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి. అవన్నీ ఇప్పుడు లేవు. పిల్లల భావోద్వేగాలను చెప్పే సినిమాలు దేవుడెరుగు. పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదం అందించే సినిమాలు ఎక్కడ? ఆమిర్‌ఖాన్ తీసిన ‘లగాన్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 11 మంది గ్రామీణులు బ్రిటిష్ వారి మీద క్రికెట్ ఆడి గెలుస్తారు. ఆ గ్రామీణుల్లో ఒక వయసు మళ్లిన వృద్ధ డాక్టర్ ఉంటాడు. ఒక దళిత వికలాంగుడు ఉంటాడు. చేతి వృత్తుల వారు ఉంటారు. ముస్లిం ఉంటాడు. వీరందరితోపాటు ఈ టీమ్‌కు సపోర్ట్‌గా ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. మేచ్ జరుగుతున్నప్పుడు కీలక ఆటగాడు గాయపడితే ఈ పిల్లవాడే బై రన్నర్‌గా రంగంలో దిగుతాడు. ఈ పాత్రల అల్లిక ఇలా ఎందుకు? దేశం అంటే సమాజం అంటే అందరూ అని. వారిలో పిల్లలూ ఉంటారని. ఇదే ఆమిర్ ఖాన్ డిస్లెక్సియాతో బాధపడే పిల్లల పక్షాన నిలబడి ‘తారే జమీన్ పర్’ తీస్తే ఆ సినిమా గొప్ప ప్రశంసలు పొందింది. అతనికి కలెక్షన్లు కూడా కురిపించింది. తెలుగు సినిమా కూడా ఇలా ఆలోచించగలదు. కాని ఆలోచించడం లేదు. ఘనమైన బాలల పాత్రలు గతంలో తెలుగు సినిమాల్లో బాలల పాత్రలు చాలా గట్టిగా ఉండేవి. వారి మీదే తీసిన సినిమాలూ వచ్చేవి. బాలల కేంద్రంగా ఉన్నా పెద్ద హీరోలు ఆ సినిమాలు చేసేవారు. ఎన్.టి.ఆర్ ‘రాము’, ‘లవకుశ’, ఏ.ఎన్.ఆర్ ‘సుడిగుండాలు’, శోభన్‌బాబు ‘సిసింద్రీ చిట్టిబాబు’, హరనాథ్ ‘లేత మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. సావిత్రి పిల్లల కోసమే ‘చిన్నారి పాపలు’ సినిమాను నిర్మించారు. ‘పాపం పసివాడు’ సినిమా ఆ రోజుల్లో మాస్టర్ రాము నటించగా సూపర్‌హిట్ అయ్యింది. పిల్లలే పాత్రలుగా బాలలకు చెప్పాల్సిన కథలు బాలల ద్వారానే చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగులో ‘బాల భారతం’ వచ్చింది. భారత కథలోని అన్ని పాత్రలను ఈ సినిమాలో బాలలే ధరించడం విశేషం. ‘మానవుడే మహనీయుడు’ వంటి హిట్ సాంగ్‌ను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత పిల్లలే అన్ని పాత్రలు పోషించగా భానుమతి రామకృష్ణ ‘భక్తధృవ మార్కండేయ’ తీశారు. కె.ఎస్.ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో ‘బాలానందం’, బి.ఆర్.పంతులు దర్శకత్వంలో ‘పిల్లలు తెచ్చిన చల్లనిరాజ్యం’ ఇవన్నీ పిల్లలకూ సినిమాల్లో చోటు ఉందనీ పిల్లలూ సినిమా కథను నడిపించగలవనీ నిరూపించాయి. ఇదే సమయంలో ‘భక్త ప్రహ్లాద’లో రోజారమణి విశేష ప్రతిభ కనపరిచి ప్రహ్లాదునిగా ఘనఖ్యాతి పొందారు. ఇది జరిగిన చాలా రోజులకు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి పూనిక మీద గుణశేఖర్ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రాముడిగా నటించారు. ఈ సమయాలకు అటు ఇటుగా బేబీ షాలినీ ‘బంధం’ వంటి సినిమాలతో వెలిగితే తరుణ్ ‘మనసు మమత’, ‘తేజ’ వంటి సినిమాలతో అలరించాడు. బేబి సుజిత ‘పసివాడి ప్రాణం’తో సినిమాకు ప్రాణం పోసింది. భద్రం కొడుకో కమర్షియల్ సినిమా ఒక ధోరణిలో బాలలకు చోటు కల్పిస్తే తెలుగులో 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ పార్లల్ సినిమాగా బాలల చిత్రాలకు దారి గట్టి పరిచింది. వీధి బాలల సమస్యలను చర్చించిన ఈ సినిమాకు ఓల్గా రచన చేయగా అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత అక్కినేని కుటుంబరావు మరికొన్ని బాలల సినిమాలు తీశారు. అయితే ఆ దారిలో ఎక్కువ సినిమాలు రాలేదు. మణిరత్నం తమిళంలో తీయగా తెలుగులో డబ్ అయిన ‘అంజలి’ ఒక రకమైన పిల్లలను లోకానికి చూపితే పిల్లలు తమకు జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నిలబడి ఎదగాలని చెప్పిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల్ని పిల్లల్లా చూపుతూ ప్రశంసలు పొందింది. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు బాలల కోసం సినిమా తాను తీయకపోవడం వెలితిగా భావించి బి.నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ నిర్మించారు. మారిన ధోరణి 2000 సంవత్సరం తర్వాత తెలుగు సినిమాల్లో పిల్లల పాత్రలు, చేష్టలు పూర్తిగా మారిపోయాయి. వారు పుట్టిన వెంటనే ప్రేమలో పడే స్థాయిలో ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోకడలు పోయాయి. పదేళ్ల లోపే గట్టిగా ప్రేమలో పడుతూ ‘తూనీగా తూనీగా’ అని పాడుకోవడం మొదలెట్టారు. హైస్కూల్ తరగతి గదుల్లో వారి ప్రేమలు కొనసాగాయి. మాస్టర్ భరత్ తమిళం నుంచి వచ్చి హాస్యం పేరుతో పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. భారతీయ భాషల్లో మెరుగైన బాలల పాత్రలతో సినిమాలు వస్తుంటే అతి చిన్న మార్కెట్ కలిగిన ఇరాన్ సినిమా అద్భుతమైన బాలల చిత్రాలతో ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మనం ఒక గొప్ప బాలల చిత్రం తీయలేకపోయాం. వారిని అలరించే టైం మిషన్ వంటి సబ్జెక్ట్స్ తీసుకుని ‘ఆదిత్య 369’ వంటి కమర్షియల్ చిత్రాలు కూడా తీయలేకపోతున్నాం. బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. బాలల థియేటర్ కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు లేదు. బాలల సినిమాలు రాయితీల వల్ల అయినా తయారయ్యేవి. ఇప్పుడు అవీ లేవు. తెలుగు బాలలూ... మీరిప్పుడు అనుభవిస్తున్నది పసిడి కాలం కానేకాదు... ప్లాస్టిక్ స్క్రీన్ కాలం! ఏం విషాదం ఇది!! బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. వారికి కాసింత వినోదాన్ని పంచుదాం -
తారే చైనా పర్
తారే జమీన్ పర్. 2007లో రిలీజైన ఆమిర్ ఖాన్ చిత్రం. అంతేనా... ఆమిర్ ఖాన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. అంతేనా... 2007లో ఆస్కార్ రేస్‌లో పోటీ పడిన చిత్రం. తల్లిదండ్రుల కోసం తీసిన పిల్లల చుట్టూ తిరిగే కథ ఇది. ఆలస్యమైనా చెప్పాల్సిన కథ వెళ్లాల్సిన చోటుకు వెళ్తుందటారు. ‘తారే జమీన్ పర్’ సినిమా పన్నెండేళ్ల తర్వాత చైనీస్ భాషలో రీమేక్ కాబోతోంది. చైనాలో ఆమిర్ ఖాన్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘పీకే, దంగల్’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేశాయి. మరి.. ఎంచక్కా డబ్బింగ్ చేసుకునేదానికి ఎందుకీ రీమేక్ అంటే.. రెండేళ్లు పైబడిన సినిమాల రిలీజ్ చైనాలో నిషేదం. దాంతో చైనీస్ లోకల్ స్టార్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రీమేక్ చేస్తున్నారు. మా డ్యుయో ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. విశేషమేటంటే చైనాలో పైరసీలో ఎక్కువ శాతం మంది వీక్షించిన చిత్రం కూడా ‘తారే జమీన్ పర్’ చిత్రమే. -
ఆ సినిమా చూసి... మా నాన్న మారారు!
‘‘ఆమిర్ ఖాన్ ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. నటుడిగా, వ్యక్తిగా ఆయన సూపర్. ప్రస్తుతం చేస్తున్న ‘దంగల్’ కోసం ఆయన మారిన విధానం చూస్తోంటే ఆశ్చర్యం వేస్తోంది’’ అని హీరో రణ్వీర్ సింగ్ అన్నారు. ఆమిర్ నటించి, దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ అంటే ఇష్టమంటూ - ‘‘ఈ సినిమాలో పిల్లాడికి పెయింటింగ్ ఇష్టం. కానీ, తల్లితండ్రులు చదవమని బలవంతపెడతారు. ఇలాంటి పరిస్థితే నాకు ఎదురైంది. నాకేమో సినిమాల్లోకి వెళ్లాలని కోరిక. కానీ, నాన్నగారేమో ఆయన వ్యాపారం కొనసాగించాలనుకున్నారు. అలాంటి పరిస్థితిలో నేనూ, మా నాన్న ‘తారే జమీన్ పర్’ చూశాం. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. అది చూశాక మా అనుబంధంలో మార్పొచ్చింది’’ అన్నారు. -
నేల మీద తారలు
దేడ్ కహాని - తారే జమీన్ పర్ అనగనగా ఓ భయంకరమైన అల్లరి అబ్బాయి. వాడికి అయిదేళ్లప్పుడు అన్నలు ఇసుకతో కట్టిన గుడిని కసిగా కూల్చేసి నాన్నతో దెబ్బలు తిన్నాడు. ఇంకో ఆర్నెల్ల తర్వాత స్కూల్లో మాస్టారు వేరే స్టూడెంట్‌ని కొడుతుంటే భయమేసి నెలరోజులు స్కూలుకెళ్లలేదు. ఇంట్లో బయల్దేరి, గుళ్లో కూర్చుని, ఆడుకుని, పడుకుని మళ్లీ స్కూలు వదిలే టైముకి ఇంటికెళ్లిపోయేవాడు. సినిమాలు చూస్తున్నప్పుడు నిద్ర రాదు. పుస్తకం తెరిస్తే పడుకునేవాడు. స్కూలు విషయం ఇంట్లో తెలిసి అమ్మచేత ఒళ్లంతా రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నాడు. అర్ధరాత్రి ఏదో గుర్తొచ్చి వాళ్ల నాన్న తలగడ కింద చెయ్యి పెడితే, పామనుకుని భయపడిన నాన్న తెల్లారేదాకా కొట్టారు. మూడు రోజులు కష్టపడి వత్తిన వందల అప్పడాలు అర సెకనులో చిదిమి ముక్కలు చేసి అమ్మచేత కవ్వం విరిగేలా తన్నులు తిన్నాడు. బైటికెళ్తే రక్తం కారుతూ వచ్చేవాడు. చెప్పకుండా సినిమాలకి పోయేవాడు. ఇంట్లోవాళ్లకి వాడొక పీడకల. వాడు మాత్రం అందమైన కలలు కంటూ పెరిగాడు. రాఘవేంద్రరావులా, దాసరిలా, విశ్వనాథ్‌లా, బాపులా, బాలచందర్‌లా, జంధ్యాలలా, సింగీతంలా, మణిరత్నంలా అవ్వాలని, అవుతానని కలలు కనేవాడు. చూసిన సినిమా కథ బాగా చెప్పేవాడు. ఎవరో ఒకరికి చెప్పకుండా నిద్రపోయే వాడు కాదు. ఎక్కువ బలైంది వాళ్లమ్మే పాపం. కాలేజీలో చదువు ఎగ్గొట్టడానికి కల్చరల్ కాంపిటీషన్స్‌కి వెళ్లేవాడు. వెళ్లగా వెళ్లగా అనుభవం వచ్చి, ప్రైజులు తేవడం మొదలెట్టాడు. ప్రైజులు తేగా తేగా కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అవ్వగానే సినిమాల్లోకి దూకేశాడు. ఈదగా ఈదగా అనుభవం వచ్చి ‘మనసంతా నువ్వే’ సినిమా తీసి దర్శకుడైపోయాడు. ఇది బాల్యం. పెరిగి పెద్దయిన ప్రతి ఒక్కరికీ ఇలా ఒక బాల్యం ఉంటుంది. అది అందరికీ చాలా అందంగా ఉంటుంది. థాంక్ గాడ్... అప్పట్లో ఇంటర్నెట్లు, గూగుల్ సెర్చ్‌లు, అతిగా నాలెడ్జ్‌లు లేవు, అనవసరమైన అవేర్నెస్లు లేవు. లేకపోతే నన్ను కూడా ఏ ‘డిస్లెక్సిక్’ పేషెంట్గానో భావించి, మా పేరెంట్స్ ఏ స్పెషల్ చైల్డ్ గానో ట్రీట్మెంట్ ఇప్పించేస్తే, ఎటో పారిపోయేవాణ్ని, ఏదో అయిపోయే వాణ్ని. కోపం వస్తే నాలుగు దెబ్బలేసినా, ప్రేమను పంచి, అందరు పిల్లల్లానే మామూలుగానే పెంచేశారు. కాబట్టి సమాజంలో ఉండగలిగాను. అనుకున్నది చేయగలిగాను. ఇది నా కథ. ఇలా మనలో అందరికీ ఒక కథ ఉంటుంది. దాని నుంచి ఈ రోజున మనం తీసుకోగలిగిన స్ఫూర్తి ఉంటుంది. నేర్చుకోవలసిన పాఠం ఉంటుంది. చిన్నప్పుడు చదువంటే ఉండే భయం నుంచి, జీవితంలో పైకి రావడమనే జయం వరకు మనని, ప్రతి ఒక్కరినీ ఏదో ఒక పాత్ర, ఒక సంఘటన, ఒక తల్లో, తండ్రో, స్నేహితుడో, గురువో, అంకులో, ఆంటీయో, తాతగారో, నానమ్మో, అమ్మమ్మో... ఎవరో ఒక వ్యక్తి ప్రభావితం చేసి ఉంటారు. అలా కూడా ఎవరూ లేని వాళ్లకోసం ‘తారే జమీన్ పర్’ అనే ఒక సినిమా ఉంది. మన నిన్నటికి, మన రేపటికి మధ్య సంధి కాలం చీకటైతే, అందులో వెలుగునిచ్చే నక్షత్రం... ‘తారే జమీన్ పర్’. దర్శీల్ సఫారీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు ‘ఇషాన్ నందకిషోర్ అవస్థీ’గా జీవించిన చిత్రం. విపిన్శర్మ, టిస్కాచోప్రా మన అమ్మానాన్నలే అనిపించేంత సహజంగా నటించి, అలరించిన చిత్రం. ఆమిర్‌ఖాన్ రామ్‌శంకర్ నికుంభ్గా అత్యద్భుతంగా ఇమిడిపోయి, నటుడిగా ఎదిగిపోయిన చిత్రం. ‘తారే జమీన్ పర్’ ఆమిర్‌ఖాన్‌కి దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ సినిమా కథ గురించి రాసే ముందు ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న కథని కచ్చితంగా చెప్పాలి. బాలీవుడ్లో దీపా భాటియా అనే ఫేమస్ ఫిమేల్ ఎడిటర్ ఒకామె ఉన్నారు. ఆమె భర్త అమోల్ గుప్తే కథలు రాసుకుంటూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ తిరుగుతుండేవాడు. ఒకరోజు దీపా భాటియా ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శక శ్రేష్టుడు ‘అకిరా కురసోవా’ బాల్యం గురించి చదువుతూ... అంతటి మేధావి, దర్శకుడూ చిన్నప్పుడు స్కూల్లో చాలా పూర్ స్టూడెంట్ అని, చదువనే చట్రంలో ఇమడలేక ఇబ్బంది పడ్డాడని తెలిసి, వాళ్లాయనతో దీనిమీద ఒక సినిమా కథ తయారు చేయమంది. భారతీయ బాల్య విద్యా నేపథ్యానికి అకిరా కురసోవా జీవితాన్ని తర్జుమా చేసే ప్రయత్నంలో అమోల్ గుప్తే చాలా రీసెర్చ్ చేశాడు. అందులో ఆయనకి ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్లు, ఏదో ఒక రంగంలో ప్రపంచాన్ని శాసించినవాళ్లు కూడా చిన్నప్పుడు ఒక ఫిక్స్డ్ కరిక్యులమ్‌లో, డిసిప్లిన్డ్ స్టడీస్‌లో ఫెయిలయ్యారని తెలిసింది. ఆ రీసెర్చ్ లోంచి డిస్లెక్సియా అనే వ్యాధి పిల్లలకి అక్షరాలని గుర్తుండనివ్వదని తెలిసింది. అన్ని విషయాల్లోనూ తెలివిగా ఉండే మూడో తరగతి పిల్లాడు యాపిల్ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకుని సరిగా రాయలేక పోతే, దానికి కారణం ఈ వ్యాధి అని అర్థమైంది. అలా ‘తారే జమీన్ పర్’ కథ పుట్టింది. దానికి సరిగ్గా సరిపోయే కుర్రాడి కోసం వెతుకుతూ, షమ్యక్ దేవర్ సమ్మర్ డ్యాన్స్ క్లాస్‌లో పిల్లల్ని చూస్తుంటే... దర్శీల్ సఫారీ అనే కుర్రాడు దొరికాడు. చదువుతో నానా అవస్థలు పడే ఇషాన్ అవస్థి పాత్రకు అతడు ఫిక్స్ అవ్వగానే... టీచర్ పాత్రధారి అయిన హీరో కోసం, నిర్మాత కోసం వెతకనారంభించాడు. ముందు హీరోని ఒప్పిస్తే నిర్మాత దొరుకుతాడు కాబట్టి అక్షయ్ఖన్నాని కలిసి కథ చెప్పాడు. కథ వల్లో, అమోల్ గుప్తే దర్శకత్వం వల్లో అక్షయ్ఖన్నా ఒప్పుకో లేదు. అప్పుడు ఆమిర్‌ఖాన్‌ని కలిశాడు. తన బాల్యంలో ఆర్ట్ క్లాస్ టీచర్ అయిన రామ్‌దాస్ సంపత్ నికుంభ్ని స్ఫూర్తిగా తీసుకుని అమోల్ గుప్తే హీరో పాత్రని రూపొందించాడు. అందుకే ఆ పాత్రకి రామ్‌శంకర్ నికుంభ్ అని పేరు పెట్టాడు. మంచి కథలకి, మంచి పాత్రలకి ఎప్పుడూ ముందుండే ఆమిర్‌ఖాన్ నికుంభ్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. తనే నిర్మాతగా, అమోల్ గుప్తేకి దర్శకత్వం అవకాశం ఇచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. కథ, మాటలు బావున్నా... స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తేడాగా ఉన్నాయని ఆమిర్‌కి అనుమానం వచ్చింది. అమోల్ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ, క్రియేటివ్‌గా కాయితం నుంచి వెండితెర మీదకి ఎక్కించే విషయాల్లో ఏదో లోపిస్తోందని ఆమిర్ అనుమానపడ్డాడు. దాంతో అమోల్‌ని దర్శకుడిగా వద్దన్నాడు. అయితే వేరే దర్శకులని వెతకడం, వాళ్లు దానిని ఎక్కించుకుని తెరకెక్కించేలోపు దర్శీల్ పెరిగి పెద్దయిపోతుండడం - ఇవన్నీ ఎందుకని ఆమిర్‌ఖాన్ స్వయంగా మెగాఫోన్ పట్టేసుకున్నాడు. తనే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా బాధ్యతలు భుజానేసుకుని అమోల్ గుప్తేని క్రియేటివ్ డెరైక్టర్‌గా పెట్టి ‘తారే జమీన్ పర్’ని మనకందించాడు. ప్రేక్షకులేం తక్కువ తినలేదు. 12 కోట్ల బడ్జెట్‌కి 89 కోట్లు తిరిగి ఇచ్చారు. ఇంత మంచి చిత్రం తీసిచ్చిన ఆమిర్ ఖాన్‌కి, కాసులతో పాటు అవార్డుల పంట కూడా పండింది. భారతదేశం తరఫున ఆస్కార్ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా నామినేట్ కూడా అయ్యింది. చెన్నైలో ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా మొదటి సినిమా దర్శకుడికి ఇచ్చే ‘గొల్లపూడి శ్రీనివాస్ అంతర్జాతీయ అవార్డు (తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్లో ప్రమాద వశాత్తూ మరణించిన తన కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు ఇరవై ఏళ్లుగా ప్రతి యేటా ఎంతోమంది అంతర్జాతీయ దర్శకులకి ప్రోత్సాహంగా ఈ అవార్డు ఇస్తున్నారు)’ ఆ యేడు ఆమిర్‌ఖాన్‌కి దక్కింది. ఇదీ... ‘తారే జమీన్ పర్’ తెర వెనుక కథ. చదవలేక పోవడం నిర్లక్ష్యం కాదు, వ్యాధి అని చెప్పే ఒక ఉపాధ్యాయుడు నిరాశా నిస్పృహలకు లోనైన చిన్నారిని ఉత్తేజితుల్ని చేసి ఆ స్కూల్‌కి చిన్న సైజు హీరోని చేస్తాడు. ఇది పిల్లలు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు. పిల్లలున్న తల్లిదండ్రులు, టీచర్లు అందరూ చూడాల్సిన చిత్రం. నిజానికి ఇది ఒక కమర్షియల్ చిత్రం కాదు. కంపల్సరీగా ప్రతి స్కూల్లోనూ చూపించాల్సిన పాఠం. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఉండాల్సిన పాఠం. ఆమిర్‌ఖాన్ నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలిచ్చాడు. ఇక దర్శకుడిగా మారి ఇచ్చిన ‘తారే జమీన్ పర్’ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అదొక ఆణిముత్యం. ర్యాంకుల కోసం పిల్లల నెత్తిమీద మోయలేని బరువును పెట్టేసి, ఒత్తిడికి లోను చేసి, వారి ఆత్మహత్యలకు సైతం కారణమవుతోన్న తల్లిదండ్రులందరికీ గొప్ప సందేశాన్నే ఇచ్చాడు ఆమిర్ ఈ చిత్రం ద్వారా. పిల్లలు వెనుకబడటానికి వాళ్లు మొద్దులు కావడం కారణం కాదని, ఏదైనా సమస్య ఉందేమో చూడమని, ఏదైనా టాలెంట్ ఉంటే వెలికి తీసి వాళ్లని గొప్పవాళ్లను చేయమని కొత్త పాఠం చెప్పాడు. ఎంత గొప్ప పాఠమిది! పిల్లలు... నేలమీది తారలు. వాళ్లని బాగా పెంచితేనే సమాజం బావుంటుంది. -
బిర్లా ప్లానిటోరియంలో తారేజమీన్ పర్
-
చిన్నచూపు చూస్తే కనువిప్పు తప్పదు!
శారీరక, మానసిక వైక ల్యాన్ని ఎవరూ కూడా కోరుకోరు. పుట్టుక ద్వారా అవిటితనం కొందర్ని వెంటాడితే, విధి వక్రించడం కారణంగా మరికొందరు ఆ బారిన పడుతారు. ఇందులో ఎవర్ని తప్పు పట్టక్కర్లేదు. భగవంతుడు రాసిన విధి రాత అని తమకు తాము సంతృప్తి పడటమే తప్ప.. విచారించి ప్రయోజనం లేదు అనే ఓ ధైర్యాన్ని కూడగట్టుకుని తనకు ఇష్టాలకు అనుగుణంగా..,సహ జంగా సక్రమించే వ్యక్తిగత నైపుణ్యంతో ఆకట్టుకున్నవారేందరూ మానవ ప్రపంచంలో ఎదురుపడుతుంటారు. వారిని స్పూర్తిగా తీసుకుని కొందరు భారతీయ సినీ ప్రపంచంలో అనుభూతికి లోనయ్యే చిత్రాలను అందిస్తే.. మరికొందరు వైకల్యాన్ని పాయింట్‌గా చేసుకుని అవహేళన చేసిన వారున్నారు. దృశ్య మాధ్యమంలో సినిమా చాలా శక్తివంతమైంది. ప్రభావవంతమైంది అనడంలో సందేహం అక్కర్లేదు. భారతీయ సినీ ప్రపంచాన్ని కళాత్మకం, వాణిజ్యం హద్దులతో సినిమా ప్రస్తానం సాగుతుండగా.. వాటన్నింటిని చెరిపేసి.. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడేవారిలోనూ అద్బుతమైన నైపుణ్యం, ప్రపంచానికి స్పూర్తినిచ్చే అంశాలుంటాయని పసిగట్టిన కొందరు దర్శకులు..తమ చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. కొన్ని కళాత్మకంగా రూపొందింతే, మరికొన్ని వాణిజ్య అంశాలను అధారంగా చేసుకుని హృదయాన్ని తడిమి.. ప్రేక్షకుడ్ని ఓ అద్బుతమైన అనుభూతికి లోను చేశాయి. వాటిలో సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, పదహారేళ్ల వయస్సు లాంటి తెలుగు చిత్రాలు ఆక ట్టుకోగా, బాలీవుడ్లో తారే జమీన్ పర్, బ్లాక్, బర్ఫీ చిత్రాలు వికలాంగుల్లో కూడా అద్బుతమైన టాలెంట్ ఉంటుందనే భావనను కలిగించాయి. వికలాంగులు సామాన్య మానవుల కంటే తక్కువేమి కాదు అని వారంటే చిన్నచూపు చూసే కొందరికి కనువిప్పును కలిగించాయి. సినిమా మాధ్యమం ద్వారా ఓ అద్బుతమైన భావనను కలిగించిన చిత్రాలను ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఓ సారి నెమరువేసుకుందాం. సిరిసిరిమువ్వ(1978) సవతి తల్లి వేధింపులకు గురయ్యే మూగ అమ్మాయి హైమాను శారీరకంగా అవిటివాడైన సాంబయ్య అనే వ్యక్తి చేర దీస్తాడు. హైమా అంటే సాంబయ్యకు అభిమానం, తన చేరదీసి ప్రయోజకురాలిగా చేసిన సాంబయ్యపై హైమకు ప్రేమ. ఇలాంటి కథతో తెరకెక్కిన సిరిసిరిమువ్వ చిత్రానికి అప్పట్లో ప్రేక్షకులు నీరాజనం పట్టారు. సిరివెన్నెల (1986) అంధుడైన ఓ ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ (సర్వదమన్ బెనర్జీ)కి, మూగ పెయింటర్ సుభాషిణి (సుహాసిని)కు, జ్యోతిర్మయి (మున్ మూన్ సేన్) మధ్య జరిగిన ప్రేమకథను సిరిసిరిమువ్వగా ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ తెరెక్కించారు. హరిప్రసాద్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించి జ్యోతిర్మయి ప్రోత్సాహానందిస్తుంది. ప్రోత్సాహం ఉంటే రాణిస్తారు అని హరిప్రసాద్ పాత్ర ద్వారా దర్శకుడు తెలియచెప్పాడు. ప్రకృతిని అంధుడైన ఓ సంగీత కారుడు ఎలా ఆస్వాదిస్తాడు. మూగ యువతి ఓ అంధుడికి తన భావాల్ని ఎలా వ్యక్త పరిచిందనే అంశాలతో సృజనాత్మక శైలిలో రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా గొప్ప విజయం సాధించింది. బ్లాక్(2005) మిచెల్లీ మ్యాక్నాలీ(రాణిముఖర్జీ) రెండేళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురవ్వడంతో అంధత్వం, చెవుడు వస్తుంది. తల్లితండ్రుల ప్రేమకు దూరమైన సమయంలో ఉపాధ్యాయుడు దేబరాజ్ సహాయ్ (అమితాబ్) చేర దీస్తాడు. ఉపాధ్యాయుడు అల్జీమర్స్ వ్యాధికి గురవుతాడు. వీరిమధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రేక్షుకుడిని ఉద్వేగాని గురి చేయడమే కాకుండా.. కంటతడి పెట్టించి.. ఓ అద్భుతమై ఫీలింగ్ గురయ్యేలా చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వైకల్యం అనేది శారీరానికే.. మనసుకు కాదు అనే గొప్ప పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తారే జమీన్ పర్ (2007) డిస్లేక్సియా అనే వ్యాధితో బాధపడుతున్న నంద కిశోర్ అవస్థి (ద ర్శిల్ సఫారీ)ని కన్నవారే ఆదరించ కపోగా, ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నారనే కారణంతో బోర్డింగ్ స్కూల్లో చేర్చుతాడు. మానసికంగా ఎదుగుదల లేకున్నా.. నందకిశోర్ లో మామూలుగా ఉండే పిల్లలకంటే ఎక్కువ నైపుణ్యం, టాలెంట్ ఉందని గ్రహించిన ఉపాధ్యాయుడు రామ్ శంకర్ నిఖంబ్(అమీర్ ఖాన్) పోత్స్రాహాన్ని అందిస్తాడు. టీచర్ ప్రోత్సాహంతో నంద కిశోర్ పాఠశాలలో ఉత్తమ పెయింటర్‌గా ఎంపికవుతాడు. బర్ఫీ (2012) బుద్దిమాంద్యంతో బాధపడే జిల్మిల్ చటర్జీ(ప్రియాంక చోప్రా), జాన్సన్(రణబీర్ కపూర్) మూగ, చెవిటితో బాధపడే యువకుడు, శృతి ఘోష్(ఇలియానా)కు మధ్య జరిగిన ప్రేమకథగా బర్ఫీ రూపొందింది. వీరిద్దరీ మధ్య జరిగిన కథను ఆకట్టుకునే విధంగా రొమాంటిక్, కామెడీ, డ్రామాలను మేలివించి.. ఓ అందమైన ప్రేమకథగా తెరకెకించారు అనురాగ్ బసు. ప్రేమానురాగాలు పంచితే మానసికంగా సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం. పైన తెలిపిన చిత్రాల్లో హైమా, సాంబయ్య, హరిప్రసాద్, సుభాషిణి, నంద కిశోర్, మిచెల్లీ, జిల్మిల్, జాన్సన్, దేబ్రాజ్ సహాయ్ లాంటి పాత్రలు సమాజంలో మనకు కనిపించడం సహజం. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వారిలో స్కిల్స్, టాలెంట్లు పుష్కలంగా ఉంటాయని దర్శకులు తమ కోణంలో చూపించారు. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యాన్ని అంతర్లీనంగా ప్రేక్షకులకు తెలియ చెబుతూనే సమాజం పట్ల వారి భాద్యతను చెప్పారు దర్శకులు. . సమాజంలో ఎదో ఒక వైకల్యంతో బాధపడేవారిని చేర దీసి పోత్రాహాన్ని అందిస్తే.. వాళ్లు రాణిస్తారు అని మనవంతు ఓ బాధ్యత గా ఫీలవుదాం.