విలువలకు, వంచనకు మధ్య ఫైట్ | Corporate movie story | Sakshi
Sakshi News home page

విలువలకు, వంచనకు మధ్య ఫైట్

Published Sun, Oct 18 2015 1:14 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM

విలువలకు, వంచనకు మధ్య ఫైట్ - Sakshi

విలువలకు, వంచనకు మధ్య ఫైట్

దేడ్ కహానీ  - కార్పొరేట్
* మంచి సినిమాకు ఉదాహరణ.
* నిజాలను కళ్లకు కట్టింది.
 
*  పాఠ్యాంశంగా పుస్తకాలకెక్కింది.
రెండు కార్పొరేటు సంస్థల అధిపతుల మధ్య ఫైటు, అది ముగిసిపోవడానికి వాళ్లు మాట్లాడుకున్న రేటు, ఆ రేటుకి వాళ్లు వెతికిన ఉద్యోగిని నిషీ అనే గోటు (మేక), ఆ గోటును వేసిన వేటు... మంచి సినిమా గురించి రాయరా అంటే మటన్ బిర్యానీ రెసిపీ మొదలు పెట్టాడేంటి అనుకుంటున్నారా! అదేం కాదు.

ఓ మంచి సినిమా సారాంశాన్నే ఇలా క్లుప్తంగా చెప్పాను. 2006లో విడుదలైన ఆ మంచి సినిమా... మధుర్ భండార్కర్ తీసిన ‘కార్పొరేట్’. థియేటర్లలో సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలో కొన్ని అభిరుచి గల ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోతాయి. మరికొన్ని విమర్శకులు, సమీక్షకుల ఆర్టికల్స్‌లో, వాళ్ల మేధస్సుల్లో మమేకమై ఉంటాయి. కానీ ఇవన్నీ దాటి ‘కార్పొరేట్’ అనే సినిమా మాత్రం అహ్మదాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పాఠ్యాంశంగా మారింది.

సినిమాలు చూసి చదువులు పాడు చేసుకోకండ్రా అని పెద్దవాళ్లతో తిట్లు తిన్న ప్రతి సినీ అభిమానీ... ఓ సినిమా కూడా చదువైంది అని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశాన్నిచ్చిన సినిమా ‘కార్పొరేట్’. అది తీసిన మధుర్ భండార్కర్‌కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఈ వ్యాసం మొదలు పెట్టలేను.
 భారతదేశంలోని కొన్ని పుణ్య నదులు భౌతిక కాలుష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అయినా వాటిలో స్నాన మాచరించి, వాటిలోని నీళ్లు తాగుతున్న తరతరాల భారతీయుల రోగ నిరోధక శక్తిని నమ్మి... ఏ బ్యాక్టీరియా కలిసిన డ్రింకైనా భారతీయులు తాగేయగలరు, తాగి అరాయించుకోనూగలరు అనుకుంది ఓ విదేశీ కూల్‌డ్రింక్ కంపెనీ.

అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాలను అనుసరించకుండా, పెస్టిసైడ్స్‌ని ముప్ఫై శాతం ఎక్కువ మోతాదులో కలిపి భారతీయ మార్కెట్లో అమ్మేసింది. 2003లో బయట పడేవరకూ ఆ నిజం మనకు తెలీదు. మనకు తెలీని మరో విషయం ఏమిటంటే... మన భారతీయులం అవినీతిని, అన్యాయాన్ని, పాపాన్ని, లోపాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని, నిరుద్యోగాన్ని, ప్రాణాలకి విలువ లేకుండా తీసేయడాన్ని... ఇంకా ఇలాంటి ఎన్నో అవలక్షణాలని నరనరానా జీర్ణించేసుకుని పెరుగుతున్నాం కాబట్టి, ఈ సాంఘిక రోగాలేవీ మనల్ని ఏమీ చేయ లేవు.

మనకి వీటి నిరోధక శక్తి కూడా ఎక్కువే. అందుకే వీటిని సహిస్తాం తప్ప నిరోధించం. అందుకే కూల్‌డ్రింక్‌లో పెస్టిసైడ్ కలిపారన్న వార్త కేసుగా మారిన ప్పుడు నాలుగు రోజులు మాట్లాడుకుని ఊరుకున్నాం. నెల తర్వాత మళ్లీ అవే కూల్‌డ్రింకులు మామూలుగా తాగేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు వాటి ప్రమాణా లేంటో మనకి తెలీదు. సడెన్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్ వస్తుంది... కుర్ కురేలో ప్లాస్టిక్ ఉందని, మాజా ఫ్యాక్టరీలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైన ఓ వర్కర్ తన రక్తాన్ని డ్రింకులో కలిపేశాడని! ఆ కాసేపు గుర్తుంచుకుంటాం.

ఇంకో మెసేజ్ రాగానే మర్చిపోతాం. మనకి వ్యవస్థ మీద కన్నా మన నిరోధక శక్తి మీద నమ్మకం ఎక్కువ. ఈ సామాజిక బలహీనతల్ని బలంగా మార్చుకుని, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకున్న ఇద్దరు బడా వ్యాపారవేత్తల క థే... ‘కార్పొరేట్’.
 
ఇద్దరు బడా వ్యాపారవేత్తలు ఒకరి మీద ఒకరు సాగించుకునే ప్రచ్ఛన్న యుద్ధంలో వారి వెంట ఉన్న పనివాళ్లు నీతిగా, నిజాయతీగా, కంపెనీ బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మి పని చేస్తుం టారు. ఎదుటి కంపెనీతో వారికి వైరం ఉన్నట్టు ద్వేషిస్తారు. చివరికి ఆ వ్యాపారా ధిపతులిద్దరూ రాజకీయ నాయకుల చొరవతో దేశ సంక్షేమం కోసం గొడవలు ఆపేసి ఒకటైపోతే... పనివాళ్లు బలైపో తారు. చదరంగంలో తెల్లరాజు, నల్లరాజు ఒకటైపోతే... వారి కోసం అప్పటివరకూ పోరాటం చేసిన మంత్రులు, సేనానులు, గుర్రాలు, ఏనుగులు, భటుల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు రచించారు, చిత్రీకరించారు మధుర్ ‘కార్పొరేట్’ చిత్రంలో.
 
అజిత్ మోంగా, మనోజ్ త్యాగి అనే ఇద్దరు యువ రచయితలతో, కొత్తగా పరిశ్రమలోకి వస్తోన్న వాళ్లతో కూర్చుని మధుర్ ఈ చిత్ర స్క్రిప్టును తయారు చేయడం విశేషం. రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు కాకముందు కొన్నాళ్లు ఓ వీడియో షాప్ నడిపారు. అలాగే మధుర్ ఓ వీడియో షాపులో డెలివరీ బాయ్‌గా పని చేశారు. తర్వాత కొన్నాళ్లకి సినిమా పరిశ్రమలో ప్రవేశించి, చిన్నా చితకా సినిమాలకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశారు.

అక్కడ వచ్చే వెయ్యి రూపాయల జీతం సరిపోక, మస్కట్‌లో ఉంటోన్న వాళ్ల అక్క దగ్గరకెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అదీ వర్కవుటవ్వక మళ్లీ ముంబై వచ్చి వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ‘రంగీలా’కి సహాయ దర్శకుడిగా పని చేసి, మెల్లగా దర్శకుడిగా మారారు.     
 మోడ్రన్ మిలీనియమ్‌లో ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి కాని, సమాజంలో స్త్రీ పాత్ర ఎలా ఉందో కరెక్ట్‌గా, కనెక్టింగ్‌గా గాని చెప్పాలంటే... అది మధుర్‌కే సాధ్యం. ఫ్యాషన్, పేజ్ 3, కార్పొరేట్, చాందినీ బార్... ఇలా ఆయన తీసిన చిత్రాలన్నీ ఆ కోవకే చెందుతాయి.

వర్మ దగ్గర పని చేసిన వందల మంది అసిస్టెంట్ డెరైక్టర్స్ ఆయన టేకింగ్ స్టయిల్‌ని అనుకరిస్తారు. కృష్ణవంశీ, మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్... ఇలా కొద్దిమంది మాత్రమే సమస్యని రాము ఎంత ఇన్టెన్సిటీతో చూపిస్తారో, భావోద్వేగాల్ని పాత్రల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఒకే మోతాదులో ఎలా పండించాలో అవగతం చేసుకున్నారు. దానికి వాళ్లు తమ క్రియేటివిటీని, సొంత బాణీని జోడిస్తారు. అందుకే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు.
 
‘కార్పొరేట్’కి పాటలు అనవసరం. పాటలకు పెద్దగా అవకాశం లేని కథ, కథనం అవ్వడం వల్ల ఆడియో అంత అప్పీలింగ్‌గా ఉండదు. అయితే పాత్రల తీరుతెన్నులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఎస్.ఐ..ఇ. కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నిషిగంధా దాస్ గుప్తాగా బిపాసా నటన అమోఘం. కార్పొరేట్ రాజకీయాలకు బలైపోయే నిజాయతీ పరురాలైన ఉద్యోగినిగా గుండెల్ని పిండుతుందామె. ఇతర పాత్రల్లో రాజ్‌బబ్బర్, రజత్ కపూర్, కేకే మీనన్‌ల నటన కూడా శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది.

కార్పొరేట్ అట్మాస్పియర్‌ని, స్థాయికి తగినట్టు పాత్రల ప్రవర్తనని, బాడీ లాంగ్వేజీని చూపించాడు దర్శకుడు. మాటలు ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు. అది బెస్ట్ పార్ట్ ఈ చిత్రంలో.
 మనకి అర్థం కాని కార్పొరేట్ కుట్రల్ని, జీవనశైలిని అతి సామాన్యులైన పాత్రల ద్వారా బ్రహ్మాండంగా చెప్పిం చారు మధుర్. బిపాసా ఆఫీసులో ఇద్దరు ప్యూన్లు, గులాబ్‌రావ్ అనే మంత్రి దగ్గర ఉండే గన్‌మెన్ ద్వారా వాళ్ల మాటల్లోనే కార్పొరేట్ సినిమా కథ, ఆత్మ, అర్థం... అన్నీ అందేస్తాయి ఆర్డినరీ ప్రేక్షకుడికి.
 
ఓ సీన్లో ఒక ప్యూను... ‘ప్యూన్ అండ్ బాస్ మధ్య చాలా తేడా ఉంటుంది’ అంటాడు. రెండో ప్యూను ‘ఏంటా తేడా’ అని అడుగుతాడు. అప్పుడతను... ‘నైన్ టు సిక్స్ ఆఫీస్ టైమ్ అయితే, నైన్ టు ఫోర్ పని చేసి వెళ్లిపోయేవాడు ప్యూన్. ఫోర్ నుంచి పని మొదలుపెట్టేవాడు బాస్’ అంటాడు. అలాగే మరో సందర్భంలో... ‘కంపెనీ డబ్బు మీద సింగపూర్లు, మలేసియాలు తిరగడమే కార్పొరేట్ల జీవితం’ అని ఒక ప్యూన్ కామెంట్ చేస్తాడు. అలాగే... ‘కార్పొరేట్ కంపెనీ అంటే ఒక్క ముక్కలో చెప్తాను. ఎక్కడైతే ఒక్కడు చేయగలిగిన పనికి ఒక టేబుల్ మీద పదిమంది కూర్చుని డిస్కస్ చేసి, చివరికి ఆ పనిని చెడగొడతారో అదే కార్పొరేట్ ఆఫీస్’ అంటూ తేల్చేస్తాడు.

ఇంకోసారి... ‘ఈ బాసుగారు ఆఫీసులో ఆర్నెల్లకోసారి సెక్రెటరీని మారుస్తారు’ అంటాడో ప్యూన్. ఎందుకని అడుగుతాడు రెండో ప్యూన్. ‘ఇండియాలో ఆర్నెల్లకోసారి భార్యని మార్చే అవకాశం లేదుగా, అందుకు’ అంటాడా మొదటి ప్యూన్. మంత్రిగారి గన్‌మెన్ కూడా ఇలాంటి నిజాల్ని అలవోకగా చెబుతుంటారు. ఒక గన్‌మేన్... ‘మంత్రిగారు ఆ గదిలోకి వెళ్లారు. ప్రముఖ నటి ఈ గదిలోకి వెళ్లారు. మరి నువ్వేంటి వాళ్లిద్దరి మధ్య సెట్టింగ్ అన్నావ్’ అని అడుగుతాడు. అప్పుడు రెండో గన్‌మేన్... ‘ఒరేయ్ బుద్ధూ... ఇలాంటి సెట్టింగుల కోసం స్టార్ హోటల్స్‌లో గదికి గదికి మధ్య తలుపులు ఉంటాయ్, పబ్లిక్‌కి తెలియకుండా’ అంటూ రహస్యాన్ని బైట పెడతాడు.
 
ఇవి కొన్నే. ఇలాంటి డైలాగులు అడుగడుగునా ఉంటాయీ సినిమాలో. ఉమనైజింగ్, మూఢ భక్తి, స్వామీజీలను గుడ్డిగా నమ్మడం, రాజకీయ నాయకుల జోక్యం, లంచాలు, టై అప్స్, షేర్స్, నైతికతకి అనైతికతకి మధ్య సంఘర్షణ, వ్యక్తిగత జీవితాల్లో ఒంటరితనం, ప్రేమానురాగాలు, నిత్యం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాట... ఇలా డబ్బు, అధికారం చుట్టూ ఉండే అన్ని ఎలిమెంట్స్‌నీ కళ్లకి కట్టినట్టు చూపించేలా కథ రాసుకున్నారు మధుర్.
 
ఈ ఆర్టికల్ కోసం సూపర్ హిట్ సినిమాలను చూస్తుంటే నాకో సూత్రం అర్థమైంది. కొత్తగా కథలు రాసుకునేవాళ్లకి పనికొస్తుందది. ముఖ్యంగా ‘కార్పొరేట్’ హిట్ కావడానికి ఆ సూత్రం ఒక ముఖ్య కారణం కాబట్టి చెప్పే తీరాలి. ఉత్థానంలో మొదలైన కథ పతనంతో ముగుస్తుంది. పతనంతో మొదలైన కథ ఉత్థానంతో సుఖాంతమవుతుంది. ఉత్థానం నుంచి ఉత్థానం, పతనం నుంచి పతనం డ్రామాని క్రియేట్ చెయ్యవు. ఫ్లాట్‌గా ఉండి సినిమాలు ఫెయిలవుతాయి. కావాలంటే ఏ సూపర్‌హిట్ సినిమా అయినా చూడండి... ఇదెంత నిజమో మీకే అర్థమవుతుంది.     
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement