గ్లామర్ ట్రాప్ | ded khani fashion | Sakshi
Sakshi News home page

గ్లామర్ ట్రాప్

Published Sun, Feb 14 2016 4:00 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

గ్లామర్ ట్రాప్ - Sakshi

గ్లామర్ ట్రాప్

దేడ్ కహానీ - ఫ్యాషన్
మిలీనియమ్‌లో బాలీవుడ్ సినిమా దిశను, గతిని, మార్కెట్‌ను మార్చేసిన ట్రెండీ కమర్షియల్ హిట్ చిత్రాల కథలు, సంగతుల్ని విశ్లేషించుకునే మన ‘దేడ్ కహానీ’లో... చాందినీ బార్, పేజ్ 3ల గురించి నేను రాయలేదు కానీ కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్ గురించి రాసినప్పుడే ఆ సినిమాలని ప్రస్తావించాను. ఇప్పుడు ‘ఫ్యాషన్’. తీసిన ప్రతి సినిమా అప్పటి కాలాన్ని శాసిస్తూ పరిశ్రమను కొత్త దారి పట్టించేలా తీయడం ఆ దర్శకుడి అద్భుత ప్రతిభ, కఠిన శ్రమ తప్ప మరోటి కాదు.

సినిమా గురించి ఎన్ని విశేషాలైనా రాయచ్చు కానీ, ఒకే దర్శకుడి గురించి పదే పదే ఎలా కొత్తగా రాస్తాం అని ఆలో చిస్తుంటే, మధుర్ భండార్కర్ గురించి కొత్తగా ఈ వారం రాయడానికొక మంచి మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆయనని ‘పద్మశ్రీ’గా గుర్తించింది. తెలుగు నుంచి మన ఎస్.ఎస్.రాజమౌళిని గుర్తించినందుకు ఎంత ఆనందపడ్డానో, మధుర్ భండార్కర్ విషయంలోనూ అంతే. ఎందుకంటే, తెలుగులో ఇదే దేడ్ కహానీ ఎవరైనా రాస్తే అందులో తీసిన ప్రతి సినిమా లిస్టులో ఉండే దర్శకుడు రాజమౌళిగారొక్కరే.

ఇద్దరికీ కథ, కథనా ల్లోనూ, దర్శకత్వ శైలిలోను ఎందులోనూ సంబంధం, పోలిక లేవు. ఒకరిది కల... ఇంకొకరిది జీవితం. కానీ ప్రతిభ, కష్టం, క్రమశిక్షణ, తీస్తున్న సినిమాపై సాధికారత, ముద్ర ఇవి కామన్. అందుకే వీరికి లభించిన గుర్తింపు, అవార్డు కూడా కామన్. ఇక ఫ్యాషన్ విషయానికొద్దాం.
 
ఒక మధ్య తరగతి అమ్మాయి తండ్రికిష్టం లేకున్నా, తల్లి ప్రోత్సాహంతో ముంబై మహానగరంలో మోడల్‌గా రాణించాలని కలలుగని, ఫ్యాషన్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లో నెగ్గుకురావాలని చేసే ప్రయత్నాలు, అందులో అనుభవించే కష్టాలు, సుఖాలు, అనుభవాలు, అను భూతులు, నేర్చుకునే పాఠాలు ఇవన్నీ తెర మీద కళ్లకు కట్టినట్టు, చెవిలో చెప్పినట్టు, పెదవులు నవ్వినట్టు, గుండెను తడితో తడిమినట్టు ప్రేక్షకుడికి అనిపించేలా తీసిన సినిమా ఫ్యాషన్.

పదహారణాల భారతీయ ఆధునిక యువతి వ్యథని కథగా తీస్తే అయిన ఖర్చు పదహారు కోట్లు. వచ్చిన రాబడి అరవై కోట్ల పైనే. చిన్న సినిమాల్లో బాగా ఎక్కువ మార్జినల్ ప్రాఫిట్ వచ్చి ట్రెండ్ సృష్టించాలంటే, కంటెంట్ చాలా చాలా బలంగా ఉండాలి. సహజత్వం, ప్రేక్షకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకో గలిగే పాత్రలు, సన్నివేశాలు, సంభాషణ లతో పాటు ఆద్యంతం కట్టిపడేసే కథనం కూడా ఉండాలి. ఇవన్నీ బడ్జెట్ పరిమితు లకి లోబడి తెరకెక్కించాలంటే దర్శకుడు ఏ మధుర్ భండార్కరో అయ్యుండాలి.
 
సాధారణంగా మగవాడికి ఏదన్నా ఆలోచన వస్తే వెంటనే అది నోట్లోంచి బైటకొచ్చేస్తుంది ముందు. అదే ఆడవాళ్లకి ఏదన్నా ఆలోచన వస్తే అది నోట్లోంచి చచ్చినా రాదు. మనసులో దాక్కుని ఆచ రణ రూపంలో బైటకొస్తుంది. ఇది అర్థం కావటానికి మగాడికి జీవితకాలం సరి పోదు. అలా, అర్థం కాని పాఠాలు చద వాల్సి వస్తే విద్యార్థులు ‘గైడ్స్’మీద ఆధార పడతారు. అలాంటి గైడ్సే మధుర్ సినిమాలు. వాటిల్లో ‘ఫ్యాషన్’ ఒకటి.
 
2002, 3 ప్రాంతంలో హైదరాబాద్‌లో సినిమా చాన్స్‌కోసం హీరోయిన్‌గా ప్రయ త్నాలు చేసిన చిన్న మోడల్ ప్రియాంకా చోప్రా. నెక్కంటి శ్రీదేవి అనే నిర్మాత ‘అపురూపం’ అనే సినిమాలో ఆమెకి అవ కాశమిద్దామని ప్రయత్నించడం నాకింకా గుర్తే. దానికి మొదట తేజగారిని, ఆయన కాదన్నాక నన్ను దర్శకుడిగా అనుకు న్నారు. కారణాంతరాల వల్ల అది మొద లవ్వలేదు. కానీ ఆరేళ్ల తర్వాత ప్రియాంక  బాలీవుడ్‌లో అత్యంత విజయ వంతమైన హీరోయిన్. గ్లామర్‌కే కాదు పెర్‌ఫార్మెన్స్ తోనూ ప్రేక్షకుడి మన్ననలు, ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు కూడా గెల్చుకున్న ఉత్తమ నటి. ‘ఫ్యాషన్’ సినిమాకే ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును స్వీకరించింది ఫిల్మ్‌ఫేర్‌తో పాటు.

ఆమె అదృష్టం, కృషి, ఆమెను ‘అపురూపం’ సినిమా నుంచి తప్పించి, అంతర్జాతీయంగా అపురూపమైన కెరీర్‌ను సృష్టించి ఇచ్చాయి. అపరిమితమైన పోటీని, వాణిజ్య ప్రధానమైన పరిశ్రమలో విలువల్ని కాపాడుకుంటూ పనిచేయడం, అది కూడా ఏళ్ల తరబడి నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. అరగంటకి ఒక ఆస్కార్ ఉత్తమనటి అవార్డు ఇవ్వచ్చు - భారతీయ సినీ పరిశ్రమలో ఆడపిల్లలు సక్సెస్‌ఫుల్‌గా స్టార్‌డమ్‌లో నిలదొక్కు కోవడానికి పడే కష్టానికి.

పెదాల మీద చిరునవ్వు చెరగకుండా నటించే శ్రమకి. ఆత్మాభిమానంతో, కెరీర్‌లని పర్‌స్యూ చేసుకునే విధానానికి. ఇవన్నీ ‘ఫ్యాషన్’ సినిమాలో ఉంటాయి. లైట్ల ముందు స్టేజ్ మీద తళుక్కుమనే మోడల్స్ జీవితాల్లో స్టేజ్ వెనకాల ఉన్న చీకటి, ఆకలి, ఆర్తి, పోటీ, రాజకీయాలు, అవకాశాలు, అవకాశ వాదాలు, నిరాశలు, నిస్పృహలు అన్నీ ఫ్యాషన్‌లో చూడచ్చు.
 
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ ఒకే ఫ్లోలో ఉంటాయి మధుర్ సినిమాల్లో. ఫ్యాషన్‌లోనూ అంతే. ముఖ్యంగా చెప్పుకోవలసింది కంగనా రనౌత్ గురించి. ‘ఫ్యాషన్’తో బాలీవుడ్‌ని భారతీయ సినీ ప్రేక్షకుడి మన్ననలనీ పొందింది ఈ సహాయ నటి. ప్రియాంక చోప్రాతో సమానంగా ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డుని, ఫిల్మ్‌ఫేర్ అవార్డునీ కైవసం చేసుకోవడం గొప్ప, అరుదైన విషయం.

అసలు ఒకే కథలో రెండు పాత్రలకి ఇంత బలం ఉండడం కూడా చాలా రేర్. తన పాత్రకి కావల్సిన యాటిట్యూడ్‌ని, యారొగెన్స్‌ని, హావ భావాల్సి, బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్ది నట్టు దింపేసింది. అతి తక్కువ కాలంలో కంగనా బాలీవుడ్ ‘క్వీన్’గా వంద కోట్ల సినిమాల క్లబ్బులో హీరోలా చేరిపోడానికి పునాది ‘ఫ్యాషన్’ సినిమా.
 
ఒక దర్శకుడిగా కొన్ని వందల మంది మహిళా తారలతోను, వారి వ్యక్తిగత జీవితాలతోనూ పరిచయం ఉంది నాకు. కానీ ఏ రోజూ దానిని సినిమా కథగా మల చాలన్న ఆలోచనే నాకు రాలేదు. మధుర్ సనిమాలు చూడడం మొదలుపెట్టాక, నేను చూసిన జీవితంతో ‘తార’ అని ఒక కథ రాసుకున్నాను. కానీ ఆ కథ క్లైమాక్స్‌ని ఇంకా నేను చూడలేదు కాబట్టి కంప్లీట్‌గా రాయలేదు. వాస్తవాన్ని కల్పించిన కథగా చెప్పే టెక్నిక్‌ని మధుర్ సినిమాల ద్వారా తెల్సుకోవచ్చు.

నా చిన్నప్పుడు దాసరి నారాయణరావు, కె.బాలచందర్, కె.రాఘవేంద్రరావు... ఇలాంటి చిత్రాలని జనరంజకంగా తీసి సక్సెస్ చేయగలిగారు. ఆ తర్వాత ఈ పాతికేళ్లలో, ఈ జానర్‌లో ప్రతి ఆధునిక తెలుగు దర్శకుడూ ఫెయిలే. తమిళంలో తీస్తున్నారు. కానీ ఒక దర్శకుడు ఒకసారే తీయడం వల్ల అది బాణీ అవ్వలేకపోతోంది. హిందీలో మధుర్‌ది ఆ బాణీ. పరిశ్రమకి మేలు చేసే బాణీ. నటీనటులకి పరీక్ష పెట్టి, శిక్షణ నిచ్చి, తారాస్థాయికి తీసుకెళ్లి వదిలిపెట్టే బాణీ. పదిమందీ అనుసరించదగిన బాణీ.
 
మనం రోజూ చూసే జీవితాన్ని మనం నేర్చుకుంటే స్ఫూర్తి. పది మందికి చెప్పగలిగితే పాఠం. అందుకే ఈ దర్శ కుడు చాలామంది మోడ్రన్ దర్శకులకి మంచి మాస్టారు. ఈయన నేర్చుకున్న మంచి మేస్టారు మన తెలుగువాడైన రామ్ గోపాల్‌వర్మ. ఆయన ‘పద్మశ్రీ’ పథంలో పదం ఆర్జీవీది. శ్రీ మధుర్ భండార్కర్‌ది. గురువు గొప్పదనం శిష్యుడి ప్రగతిలోను, ప్రస్థానంలోను కనిపిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement