అజరామర ప్రేమకావ్యం
* పాకిస్తానీ అమ్మాయి
* హిందుస్తానీ అబ్బాయి
* ఇరువురినీ ఒక్కటి చేసిందెవరు?
తన తల్లితో ఒక కూతురు ‘‘అతను నన్ను కనీసం ముట్టుకోలేదమ్మా - కానీ, నేను నా సర్వస్వం అతనికి ఇచ్చేసి వచ్చాను’’ అంటుంది. ఆ కూతురి పాత్రని ప్రేమించ కుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు, ‘‘నీకోసం నవ్వుతూ ప్రాణాలు ఇవ్వగలిగిన వాడే నీకు సరైన భర్త’’ అంటాడు.
ఆ యువకుణ్ని ఆ అమ్మాయితో సహా ప్రేమిం చకుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ఇలాంటి పరిణతి చెందిన, పదునైన, నిజా యితీ కలిగిన పాత్రలున్న ప్రేమకథా చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడూ ప్రేమిస్తాడు. అందుకే ‘వీర్ - జారా’ని అందరూ ప్రేమించారు. కాసుల వర్షం కురిపించారు.
‘దిల్ తో పాగల్ హై’ వంటి సూర్‌హిట్ చిత్రం తీసిన యశ్‌చోప్రా ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన అజరామర ప్రేమకావ్యం ‘వీర్-జారా’. జారాఖాన్ అనే పాకిస్తాన్ అమ్మాయికీ, వీర్ ప్రతాప్‌సింగ్ అనే భారతీయ అబ్బాయికీ మధ్య నడిచే హృద్యమైన ప్రేమకథ ‘వీర్-జారా’.
చాలామంది అనుకుంటారు మొదటి చిత్రం తీసే యువకులే మంచి ప్రేమ కథలు తీయగలరని. నిజ జీవితం ఛాయలు వాళ్ల సీన్లలో, పాత్రల స్వభావాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి, ప్రేక్షకులు ఐడెంటిఫై అవుతారని. అది కొంతవరకే నిజం. పాతబడినకొద్దీ వైన్‌లో కిక్ ఎక్కువ అయినట్టు, పరిణతి చెందిన కొద్దీ నిజమైన దర్శకుడు ప్రేమకథా చిత్రాల్ని అత్యద్భుతంగా మలచగలడు. అందుకు యశ్‌చోప్రా ఒక ఉదాహరణ. ‘ప్రేమన్నది పుస్తకాల్లో ఉంటుంది, పాటల్లో, కవితల్లో ఉంటుంది, జీవితంలో ఉండదు పిచ్చిదానా’... ఇలాంటి మాటలు రాయాలంటే, వాటిని తెరమీద సరైన సందర్భంలో, సరైన పాత్ర ద్వారా చెప్పించాలంటే దర్శకుడికి చాలా పరిణతి, అనుభవం ఉండాలి.
ఒక మంచి ప్రేమకథ మనిషి మనసులో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న భావోద్వేగాలని పైకి తెస్తుంది. అలా పొంగిన అనుభూతుల వెల్లువలో మనసు తడుస్తుంది. తెలియకుండానే ఆ తడి కంటి నుంచి బైటకొస్తుంది. అది ఆ కథలోని గొప్పదనం కావచ్చు. అందులోని పాత్రల స్వభావాలు ఎక్కడో మనకి తెలుసున్నవో లేదా మనమో కావచ్చు. ఏదో ఒక సంభాషణో, సంఘటనో, అభినయమో, ఆ కథ క్రియేట్ చేసిన ఆరానో, మనని ఆ కథకుడో, దర్శకుడో పెట్టిన మూడో - కారణం ఏదైనా కానీ, రియాక్షన్ మాత్రం కళ్లు చెమ్మగిల్లడమే. అలా కళ్లు చెమర్చేలా చేసే అతికొన్ని మంచి ప్రేమకథల్లో ‘వీర్-జారా’ ఒకటి.
‘బ్యూటీ లైస్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్’ అన్నారు. అలా అని నాకు నచ్చే ప్రతి సినిమానీ నా కళ్లతో చూడమని కాదు. ఎవరి కళ్లతో వారే చూడాలి, ఎవరి మనసు తడిని వారి కళ్లల్లో వారే చూడాలి. ఎవరి బుర్రతో వారే ఆలోచించాలి. పోస్టర్ చూడగానే గొప్ప అభిప్రాయం ఏమీ కలగని సినిమా ‘వీర్-జారా’. యశ్‌చోప్రా పేరొక్కటే నాకు పర్సనల్‌గా ఎగ్జయిట్ మెంట్. దానికో కారణం ఉంది. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు.
జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్‌గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్‌లో స్లో మోషన్‌లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్‌లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. హీరోలని ఫుల్ ఫిగర్‌లో బోల్డ్‌గా చూపిస్తారు సరైన టైమింగ్‌లో. ఆ షాట్ చూడ్డానికి చాలా బావుంటుంది. ఇది 35 ఎం.ఎం.లో మాత్రమే కుదురుతుందని అనుకునే వాడిని. కానీ, యశ్‌చోప్రా మాత్రమే సినిమా స్కోప్‌లో కూడా కుదిరించారు.
అన్నిటికన్నా భారతీయ సినిమాలలో ప్రేమకథలకి, కుటుంబ బంధాల నేపథ్యమున్న కథలకి సంగీతం ఎంత ఆయువుపట్టో, సంగీతాన్ని పాటగానో, బ్యాక్‌గ్రౌండ్‌గానో ఎప్పుడెలా వాడు కోవాలో యశ్‌చోప్రా సినిమాలు చూసి నేర్చుకోవాలి. వీటన్నిటినీ మించి ప్రపంచంలో ఏ దేశంలో షూటింగ్ చేసినా, ఈయన సినిమాల్లో భారతదేశం పట్ల, భారతీయత పట్ల విపరీతమైన గౌరవం, అభిమానం కనపడతాయి. అందులోనూ తన సొంత రాష్ట్రం పంజాబ్‌ని, అక్కడి జీవన విధానాన్ని, పాత్రల్ని చాలా ఇష్టంగా, ఎక్కువ మమకారంతో, అందంగా చూపి స్తారు. అందుకే యశ్‌చోప్రా సినిమా అన గానే ఒక్కసారైనా ఆ సినిమా చూస్తాను. ఆయన ఆలోచనల్ని, రొమాంటిసిజమ్‌ని ఆస్వాదిస్తాను.
2004లో వస్తున్న చిత్రాల కథాంశాల స్పీడుని బట్టి చూస్తే ‘వీర్- జారా’ చాలా స్లోగా కనపడు తుంది. కానీ, 1950ల నుంచి 2015 దాకా వచ్చిన అజరా మరమైన చిత్రాలన్నింటిలో ‘వీర్-జారా’ ఒకటిగా నిలుస్తుంది. 25 కోట్లు ఖర్చు పెడితే, 95 కోట్ల వరకూ వసూలు చేసిన చిత్రాన్ని స్లో అని ఎలా అంటాం? ‘సోల్’ ఉన్న చిత్రం అంటాం గానీ.
వీర్ ప్రతాప్‌సింగ్ భారత ఆర్మీ ఆఫీసర్. ఆపదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ ఆపరేషన్లు చేసి కాపాడటంలో దిట్ట. జారాఖాన్ గారాబంగా పెరిగిన పాకిస్తానీ ధన వంతుల పిల్ల. లాహోర్‌లో ఉంటుంది. తన నానమ్మ ఆఖరి కోరికగా ఆమె అస్థికలు పంజాబ్‌లోని సట్లెజ్ కాలువలో కలపాలని, ఇంట్లో చెప్పకుండా బస్సెక్కి బోర్డర్ దాటేస్తుంది. ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. వీర్ ఆమెని కాపాడతాడు. అతని సహకారంతో నానమ్మ చివరి కోరిక తీరుస్తుంది. తనకు సాయపడినందుకుగాను వీర్‌ని ఏదైనా ఒక కోరిక కోరుకోమంటుంది.
దాంతో అతడు తనతో ఒకరోజు సరదాగా ఉండమంటాడు. మొదట తటపటా యించినా, మాట ఇచ్చింది కాబట్టి సరే అంటుంది. వీర్‌తో అతని ఊరెళ్తుంది. అతన్ని పెంచిన మామ సుమీర్ చౌదరి, అత్త సరస్వతీ కౌర్‌ల ఆప్యాయత, ఆతిథ్యం అన్నీ చూసి మురిసి పోతుంది. ఆ ఊళ్లో బాలుర పాఠశాల మాత్రమే పెట్టి బాలికలని చదువుకోకుండా వివక్ష చూపు తున్నారని, అది తప్పు అని క్లాస్ తీసు కుంటుంది. ఆ సలహా నచ్చడంతో సుమీర్ జారా పేరుమీదే బాలికల ఉన్నత పాఠ శాలకి శంకుస్థాపన చేస్తాడు. ఇవన్నీ జరిగే క్రమంలో జారా పట్ల ఆకర్షితుడవుతాడు వీర్. కానీ ఆ విషయం బయటపెట్టడు.
అంతలో జారా వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఆమెను తీసుకుని స్టేషన్‌కి వెళ్తాడు వీర్. జారా రైలు ఎక్కబోతుండగా ఒక యువకుడు రావడం, అతడు తనకు కాబోయే భర్త అని జారా వీర్‌కి పరిచయం చేయడం, వీర్‌ను వదిలి అతడితో ఆమె పాకిస్తాన్ వెళ్లిపోవడం జరుగుతుంది.
తీరా పాకిస్తాన్ వెళ్ళాక వీర్ జ్ఞాపకాలు జారాని వెంటాడతాయి. తాను వీర్‌ని ప్రేమిస్తున్న విషయం ఆమెకు అర్థమవుతుంది. అతడి కోసం పరితపిస్తుంది.
దాంతో జారా స్నేహితురాలు వీర్‌ని పిలి పించడం, జారా తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో వీర్ త్యాగం చేయడానికి సిద్ధపడి భారతదేశానికి తిరిగి ప్రయాణ మవుతాడు. సరిగ్గా అప్పుడే జారాకి కాబోయే భర్త వీర్‌ని అరెస్ట్ చేయిస్తాడు. వేరే పేరుతో అస్తిత్వం క్రియేట్ చేసి అతనిపై భారతదేశ గూఢచారిగా ముద్ర వేసి, శిక్ష పడేలా చేస్తాడు. దాంతో 22 సంవత్సరాలు వీర్ జైల్లోనే ఉండిపోతాడు. ఆ తర్వాత పాకిస్తాన్ లాయరు, మానవ హక్కుల సంఘం సభ్యురాలు అయిన సామియా సిద్ధిఖీ... వీర్ కేసును వాదించ డానికి సిద్ధపడుతుంది. చివరికి తనే వీర్, జారాలను కలుపుతుంది.
ఈ చిత్రంలో ప్రతి మాటా ఒక రసగుళిక. ప్రతి పాటా ఒక ఆణిముత్యం. ప్రతి ఫ్రేమూ కన్నులపండుగ. ప్రేమించిన యువతి కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసిన ప్రేమికుడిగా షారుఖ్ కంటతడి పెట్టించాడు. అతడిని కాపాడేందుకు తపించే న్యాయవాదిగా రాణీ ముఖర్జీ నటన అమోఘం. మొత్తంగా అవార్డుల్ని సాధించి, ప్రేక్షకుల కన్నుల్ని తడిపేసిన ‘వీర్-జారా’ ఓ గొప్ప ప్రేమకథగా బాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయింది!
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు
హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్‌గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్‌లో స్లో మోషన్‌లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్‌లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది.
- రాణీముఖర్జీ