ఆన్‌లైన్‌లో పాక్‌ యువతితో ప్రేమ.. ప్రియుడి కోసం సరిహద్దులు దాటి! | Pakistani Woman Tries To Cross Border For Hyderabadi Lover Gets Arrested | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పాక్‌ యువతితో ప్రేమ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అడ్డం తిరిగిన కథ!

Published Thu, Aug 11 2022 12:34 AM | Last Updated on Thu, Aug 11 2022 7:58 AM

Pakistani Woman Tries To Cross Border For Hyderabadi Lover Gets Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌదీలో ఉంటున్న హైదరాబాద్‌ అబ్బాయి, పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి ‘ఆన్‌లైన్‌’లో ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దీంతో అతడు, ఆమెను నేపాల్‌ మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన ప్రేయసిని నేపాల్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే బాధ్యతని తన సోదరుడికి అప్పగించాడు.

ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సరిహద్దు దాటుతూ సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)కు మంగళవారం చిక్కారు. పాక్‌ యువతిని, అహ్మద్‌ సోదరునితోపాటు వారికి సహకరించిన నేపాల్‌ వ్యక్తినీ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. సినిమా కథను తలపిస్తున్న ప్రేమకథ వివరాలిలా ఉన్నాయి.  

ప్రేమగా మారిన ‘సోషల్‌’పరిచయం... 
పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన అహ్మద్‌ కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఇతడికి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదిజా నూర్‌ సోషల్‌మీడియాలో పరిచ యమైంది. చాటింగ్, వాయిస్, వీడియోకాల్స్‌తో ఈ ఆన్‌లైన్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే విషయాన్ని నూర్‌ తన తల్లిదండ్రులకు చెప్పింది.

అయితే భారతీయుడికిచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. నూర్‌ ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనువైన మార్గాల కోసం అన్వేషించాడు. ముందుగా ఆమెను హైదరాబాద్‌ పంపి, తరువాత తానూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. సౌదీలో అహ్మద్‌ పని చేస్తున్న హోటల్లోనే కొందరు నేపాలీలు పని చేస్తున్నారు. ఏళ్లుగా కలిసుండటంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. 

నేపాల్‌ వరకు సోదరుడిని పంపి... 
నూర్‌ను తమ దేశం మీదుగా హైదరాబాద్‌ పంపుదామంటూ నేపాలీలు అహ్మద్‌కు సలహా ఇచ్చారు. అక్కడ వారికి సహాయం చేయడానికి జీవన్‌ అనే నేపాలీని ఏర్పాటు చేశారు. దీంతో అహ్మద్‌ తన సోదరుడు మహ్మద్‌ను రంగంలోకి దింపాడు. నూర్‌కోసం ఆర్జూ బాగ్దాదియా పేరుతో నకిలీ ఆధార్‌ కార్డు తయారు చేయించాడు. దీన్ని తీసుకుని మహ్మద్‌ గత వారం నేపాల్‌ చేరుకున్నాడు. నూర్‌ దుబాయ్‌ మీదుగా నేపాల్‌ వచ్చింది. నేపాలీ జీవన్‌తోసహా ముగ్గురూ ఇండో–నేపాల్‌ సరిహద్దు బిహార్‌లోని సీతమ్రాహీ జిల్లా బిట్టామోర్‌ బోర్డర్‌ ఔట్‌పోస్టుకు మంగళవారం చేరుకున్నారు.

తెల్లవారుజామున అక్కడ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తూ ఎస్‌ఎస్‌బీ బలగాల కళ్లల్లో పడ్డారు. నూర్‌ వద్ద హైదరాబాద్‌కు చెందిన మహిళగా ఆధార్‌ కార్డు, పాకిస్తాన్‌ పాస్‌పోర్టు, ఫైసలాబాద్‌లోని జీసీ ఉమెన్‌ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతున్నట్లు గుర్తింపుకార్డు, పాక్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు లభించాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది.  

పలు కోణాల్లో సాగుతున్న విచారణ 
గూఢచర్యం కోసం వస్తుందేమోనని అనుమానించిన పోలీసులు.. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్‌ఎస్‌బీ అ«ధికారులు సీతమ్రాహీ పోలీసులకు ముగ్గురినీ అప్పగించారు. సీతమ్రాహీ ఎస్పీ హరికిషోర్‌ రాయ్‌ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘నూర్‌ సైకాలజీ స్టూడెంట్‌. జూలై 29న ఇస్లామాబాద్‌లోని నేపాల్‌ ఎంబసీకి వెళ్లి నెల రోజులకు టూరిస్ట్‌ వీసా తీసుకుంది. దీని ద్వారానే దుబాయ్‌ మీదుగా కాఠ్మాండు చేరుకుంది. ఈమె అరెస్టుకు సంబంధించి పాక్‌ ఎంబసీకి సమాచారం ఇచ్చాం’అని తెలిపారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్‌ పోలీసులతో కలిసి అహ్మద్, మహ్మద్‌లకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో... ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నాయి. నూర్, మహ్మద్, జీవన్‌లను విచారించడానికి ఓ బృందం బిహార్‌ బయలుదేరి వెళ్లింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement