మ్యాన్ విత్ సూపర్ పవర్స్ | Man with Super Powers | Sakshi
Sakshi News home page

మ్యాన్ విత్ సూపర్ పవర్స్

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

మ్యాన్ విత్ సూపర్ పవర్స్

మ్యాన్ విత్ సూపర్ పవర్స్

దేడ్ కహానీ - క్రిష్
ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం...

రాకేశ్ రోషన్ అద్భుత సృష్టి.
రికార్డులు బద్దలు కొట్టింది.
హృతిక్‌ని సూపర్‌హీరోని చేసింది.

‘మనం భవిష్యత్తుని చూడగలమేమో... కానీ మార్చలేం’ - ఈ జీవిత సత్యాన్ని ఒక కుటిలమైన మనసున్న శాస్త్రవేత్త తెలుసుకోవడం కథ. అతనికి ఆ నిజాన్ని తెలియపర్చినవాడు హీరో.
 ఇది ఒక కమర్షియల్ సినిమా కథ అంటే నమ్మగలమా? 2006లో విడుదలైన ‘క్రిష్’ సినిమాని చూస్తే నమ్మగలం.
 
ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా అన్నారు శ్రీశ్రీ ఓ సందర్భంలో. ‘మేక్ బిలీవ్’ సూత్రమే సినిమాకి ఆయువుపట్టు కాబట్టి ఉన్నట్టే అని నమ్మించేశారు దర్శకుడు రాకేష్ రోషన్, పేరు మోసిన ఆరుగురు రచయితలు. ఆ శక్తి పేరు క్రిష్. ఆ శక్తి తాలూకు మామూలు వ్యక్తి పేరు కృష్ణ మెహ్రా. ‘కోయీ మిల్‌గయా’ చిత్రం సూపర్‌హిట్ కావడం వల్ల, దానికి కొనసాగింపుగా వచ్చి బాక్సాఫీసును మరోసారి బద్దలుగొట్టిన చిత్రం... క్రిష్.
 
మన పురాణాల్లో చిన్నప్పటి కృష్ణుడు మహా మాయావి. కాళీయుని శిరసుపైన నాట్యం చేయడం, పూతన అనే రాక్షసిని సంహరించడం... ఇలాంటి అసాధారణ శక్తులున్న చిన్నపిల్లాడు మన భారతీయ పిల్లలందరికీ సూపర్ హీరో అన్నమాట. అలాగే ఆంజనేయస్వామి మనకొక సూపర్ హీరో. ఎంత దూరమైనా అవలీలగా ఎగరగలడు. సముద్రాన్ని దాటగలడు. లంకని దహించగలడు. ఈ లక్షణాలతో హాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. వాటి ఫ్రీమేకులో, రీమేకులో భారతీయ చిత్రాల్లోనూ వచ్చాయి.

కానీ మనమంటూ ఒక సూపర్‌మ్యాన్‌నో స్పైడర్‌మ్యాన్‌నో బ్యాట్‌మ్యాన్‌నో సృష్టించలేదు. ఏ ఇతర అబ్‌నార్మల్ అండ్ పవర్‌ఫుల్ మ్యాన్‌నీ మోడ్రన్ సినిమాల్లో వెండితెర మీద సృష్టించింది లేదు. అది పట్టుకున్నట్టు ఉన్నారు కథకుడు, దర్శకుడు, ఒకప్పటి బాలీవుడ్ హీరో అయిన రాకేశ్ రోషన్. కొడుకు హృతిక్‌తో తీసిన మొదటి చిత్రం ‘కహోనా ప్యార్ హై’ పెద్ద హిట్టవడం, ‘కోయీ మిల్‌గయా’ సూపర్‌హిట్ అవ్వడంతో పాటు నటుడిగా హృతిక్‌కి చాలా పేరు తెచ్చాయి. ఆ రెండు చిత్రాలతో హృతిక్ చిన్నారులను కూడా బాగా ఆకట్టుకున్నాడు. వీటన్నిటి నేపథ్యంతో తరువాతి సినిమా ఎలా ఉంటే బాగుంటుందో, అలాగే ఉంటుంది క్రిష్.
 
సాధారణంగా సీక్వెల్ తీసేటప్పుడు చాలా కష్టమైన విషయం ఏంటంటే... రెండున్నర గంటల మొదటి పార్టు నుంచి ఏ కథని రెండో భాగంలో ప్రేక్షకుడికి గుర్తు చేయాలి, ఏ పాత్రల్ని కొనసాగించాలి అన్నదే. అన్నిటి కంటే ముఖ్యంగా ఏ కథ, ఏ సంఘటనలు, ఏ పాత్రలు రెండో భాగంలో వద్దో తెలుసుకోవడం మరీ కష్టం. ఎన్ని వందల సీక్వెల్ చిత్రాలు చూసినా పార్ట్-2ని హిట్ చేయడానికి ఏ పాఠాలూ పని చేయవు. అన్నీ కుదిరి హిట్ అయితే అదృష్టమే. అంత రిస్క్ సీక్వెల్ తీయడం. అంత రిస్కునూ తీసుకుని సూపర్‌హిట్ అయిన సీక్వెళ్లు రెండున్నాయి.

ఒకటి క్రిష్, రెండో ధూమ్-2.
క్రిష్... మానవీయ కోణమున్న మంచి హీరో పాత్ర. ‘ధూమ్-2’లో హీరోది సమాజం అసహ్యించుకునే గజదొంగ పాత్ర. రెండూ మంచి చెడులకు రెండు నిర్వచనాలు. దర్శకులు, రచయితల భావాల్లో వైరుధ్యాలకి నిదర్శనాలు. రెండింటికీ బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.
 
ఇక క్రిష్ విషయానికొస్తే... ‘కోయీ మిల్‌గయా’లో స్పేస్ నుంచి వచ్చి, అమాయకుడైన రోహిత్‌కి అతీత శక్తులనిచ్చి, అద్భుత మేధావిని చేసి తన గ్రహానికి వెళ్లిపోయిన జాదూ ‘క్రిష్’లో మళ్లీ రాడు. కానీ జాదూ ఇచ్చిన అతీత శక్తులు మాత్రం రోహిత్ కొడుకు కృష్ణకి వస్తాయి. అతను చేసే జాదూనే సినిమా అంతా.
 
రోహిత్‌కి చిన్నప్పుడు మెదడు పెరగదు. కానీ కృష్ణకి చిన్నప్పుడే మెదడు బాగా పెరుగుతుంది. అందుకే అతన్ని ఆ ఊరి నుంచి దూరంగా, అడవిలో పెంచుతుంది అతడి బామ్మ. మనవడి అతీత శక్తుల గురించి లోకానికి తెలిస్తే, మళ్లీ ఎటు నుంచి ఏ ముప్పు వస్తుందోనని ఆమె భయం. అయితే అనుకోకుండా ట్రెక్కింగ్ క్యాంపుకొచ్చిన హీరోయిన్ వల్ల సింగపూర్ వెళ్లాల్సి వస్తుంది కృష్ణకి.

ఆమె వల్ల అతడు తన అస్తిత్వాన్ని దాచుకుని, క్రిష్‌గా వేరే అవతారం ఎత్తాల్సి వస్తుంది. తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి తన తండ్రి రోహిత్ చనిపోలేదని, ఇరవయ్యేళ్లుగా డాక్టర్ ఆర్య అనే సైంటిస్ట్ అధీనంలో బందీగా బతుకుతున్నాడని తెలుస్తుంది. దాంతో దుష్ట సంహారం చేసి, తండ్రిని విడిపించుకుంటాడు. తండ్రిని తీసుకెళ్లి బామ్మ ముందు నిలబెడతాడు.
 
ఎన్నేళ్లు చూసినా బాలీవుడ్‌కి కొత్త కరెన్సీ నోటులా కళకళలాడే ఫార్ములా... విడిపోయిన కుటుంబ సభ్యులు కలవడం. దీన్ని మన్‌మోహన్ దేశాయ్ మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాకేశ్ రోషన్ ఏమో అవసరమైనప్పుడు బాగా వాడుతుంటారు. మొదటి భాగం చూసినవాళ్లకి మరీ నచ్చాలి... పోల్చినా కూడా. చూడని వాళ్లకి విడిగా ఒక సినిమాలాగ నచ్చాలి.

ఈ రెండు విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, స్క్రీన్‌ప్లేలో బాగా ఫాలో అయ్యి సీన్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది క్రిష్ సినిమా చూస్తుంటే. నలభయ్యేళ్ల పాటు బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు రచన చేసిన ప్రసిద్ధ రచయిత సచిన్ భౌమిక్, రాకేశ్ రోషన్, ఆకాశ్ ఖురానా (నటుడు కూడా), హనీ ఇరానీ (జావెద్ అక్తర్‌తో విడిపోయిన భార్య, ఫర్హాన్ అక్తర్ తల్లి), రాబిన్ భట్... వీళ్లంతా స్క్రీన్‌ప్లే టీమ్. కథను రాకేశ్ రోషన్ అందిస్తే, మాటలు సంజయ్ మాసూమీ రాశారు.
 
సాధారణంగా ఇంతమంది కలిసి పని చేస్తే చపాతీ పిండి గుండ్రంగా అవకుండా ఎవరివైపు వాళ్లు లాక్కుని షేపవుట్ చేస్తారని భయం ఉంటుంది. అలాగే ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్’ అనే ఆంగ్ల సామెత కూడా ఉండనే ఉంది. అయినా కెప్టెన్ సమర్థుడైతే షిప్ టైటానిక్ అవ్వకుండా ఒడ్డుకి చేరుకుంటుంది. రాకేశ్ రోషన్ మంచి కెప్టెన్. అందుకే ‘క్రిష్’ మునిగిపోలేదు. విజయ తీరాలకు చేరాడు.
 ఇక మిగతా విషయాలు చూసుకుంటే... ‘క్రిష్’గా హృతిక్ ఓ సూపర్ పవర్‌లాగే కనిపించాడు సినిమాలో. అతడు తప్ప మరెవరికీ ఆ పాత్ర సూటవద నడంలో అతిశయోక్తి లేకపోవచ్చు. ప్రియాంకా చోప్రా కూడా తన పరిధిలో బాగా చేసింది. ఇక రోహిత్ తల్లి, క్రిష్ బామ్మగా రేఖ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించారు.
 
సినిమాలో మూడు పాటలు చాలా బాగుంటాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పక్కర్లేదు. హాలీవుడ్ చిత్రం ‘ఇండిపెండెన్స్ డే’కి గ్రాఫిక్ డిజైనర్స్‌గా పని చేసిన మార్ కొల్బే, క్రెగ్ ముమ్మా అనే హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌ని రూపొందించారు. సినిమా అంతా హీరో ఎగురుతూనే ఉండాలి. ఫైట్లలో మాత్రమే కాదు... సీన్లలోను, పాటల్లోను కూడా. అందుకే టోనీ చింగ్ అనే మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్‌ని ఫైట్ మాస్టర్‌గా పెట్టారు. షూటింగ్‌కి మూడు నెలల ముందే హృతిక్ చైనా వెళ్లి, టోనీ చింగ్ అకాడెమీలో శిక్షణ పొంది వచ్చాడు.
 
ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా... సినిమా స్థాయిని, మార్కెట్‌ని పెంచేలా సినిమా తీయడం, కంటెంట్‌లో తేడా రాకుండా చూసుకోవడం ఈ మిలీనియంలో ‘క్రిష్’ సినిమాతోనే మొదలైంది. తొమ్మిదేళ్ల తర్వాత అవే సూత్రాలతో తెలుగులో ‘బాహుబలి’ వచ్చింది.
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement