
అభిమాన హీరో కోసం లక్షలు ఖర్చుపెట్టుకుని వచ్చినందుకు మాకు తగిన శాస్తే జరిగిందంటున్నారు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) అభిమానులు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హృతిక్.. డల్లాస్‌లో శనివారం జరిగిన మీట్ అండ్ గ్రీట్ (meet-and-greet) కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమం రసాభాసగా జరిగినట్లు తెలుస్తోంది. వేలు, లక్షలు గుమ్మరించి ఎన్నో ఆశలతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
సెల్ఫీకి నో
కార్యక్రమం చివర్లో వచ్చిన హృతిక్ ఫ్యాన్స్‌తో కనీసం ఫోటో కూడా దిగలేదట. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉంటుందని, మా పిల్లలు కూడా తనతో డ్యాన్స్ చేసే అవకాశం ఉందని నమ్మించి డబ్బులు గుంజిన నిర్వాహకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక అభిమాని అయితే ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కోసం రూ.1.20 లక్షలు (1500 డాలర్లు) వెచ్చించి వెళ్తే హృతిక్ తనతో సెల్ఫీ దిగడానికి నిరాకరించాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
డబ్బు గుమ్మరించి దండగ
ఇంత డబ్బు ఖర్చు పెట్టి, రెండు గంటలు లైన్‌లో నిలబడింది ఇలాంటి అనుభవం కోసమేనా? అని మండిపడుతున్నారు. మరికొందరేమో.. 'మా పిల్లలు హృతిక్‌తో డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తామని ఈవెంట్ నిర్వాహకులు మాటిచ్చారు. అందుకోసం డబ్బు కూడా తీసుకున్నారు. స్టార్ హీరోతో డ్యాన్స్ చేస్తామని ఆశగా ఎదురుచూసిన పిల్లలకు నిరాశే ఎదురైంది. వారి మనసు ముక్కలైంది.'
పిల్లల ఏడుపులు..
'ఈవెంట్ చాలా చెత్తగా చేశారు. మమ్మల్ని నాలుగు గంటలపాటు బయట చలిలోనే నిలబెట్టారు. కనీసం ఒక ఫోటో తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్టేజీపై నుంచి తోసేశారు. పిల్లల ఏడుపులు.. అరుపులతో తొక్కిసలాటలా అనిపించింది' అని పేర్కొంటున్నారు. హృతిక్ నేడు న్యూజెర్సీలో, ఏప్రిల్ 12న చికాగోలో, ఏప్రిల్ 13న బే ఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరుకానున్నాడు. అతడి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వార్ 2లో నటిస్తున్నాడు. ఇది ఆగస్టు 14న విడుదల కానుంది. అనంతరం క్రిష్ 4 సినిమా చేయనున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా మారనున్నాడు.