
కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులోనూ ఏళ్లతరబడి కష్టపడుతున్నా దానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం లేకపోతే ఆ బాధ తట్టుకోలేం. ఒకప్పుడు నటి తిలోత్తమ షోమ్ (Tillotama Shome) పరిస్థితి కూడా ఇదే! ఈ బెంగాలీ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలవుతోంది. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌లో అనేక సినిమాలు చేసిన ఆమె ఇటీవలే షాడోబాక్స్ చిత్రంతో అలరించింది. తాజాగా ఈమె తన అనుభవాలను చెప్తూ బోరున ఏడ్చేసింది.
పారితోషికంతో కారు కొంటా..
తిలోత్తమ మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాకు ఓ డైరెక్టర్ చాలా తక్కువ పారితోషికం ఇచ్చాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక జరిగిన పార్టీలో అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నువ్వు దేనిపై అయినా మనసు పారేసుకున్నావా? అని అడిగారు. అందుకు నేను అవును, ఫలానా కారు అంటే నాకిష్టం. ఆ కారు రేటుకు తగ్గట్లుగా నాకు పారితోషికం వచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని కొంటాను అని చెప్పాను.
అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవ్
ఇంతలో ఆ డైరెక్టర్ మధ్యలో కలగజేసుకుని.. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు.. కానీ ఎప్పటికీ నువ్వు ఊహించినంత డబ్బు సంపాదించలేవు అన్నాడు. ఇదెంత అన్యాయం కదా..! కానీ ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తూ.. మనకెంత టాలెంట్ ఉన్నా సరే దానికి తగ్గట్లు రెమ్యునరేషన్ ఇవ్వరు. ఇప్పటికీ ఆ దర్శకుడు అన్న మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
రెట్టింపు తీసుకున్నా..
అయితే అతడి మాటలు నాలో కసిని పెంచాయి. నేను ఎలాగైనా చెప్పినంత సంపాదించి తీరాలనుకున్నాను. తర్వాత నాకో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను అడిగినంత ఇవ్వాలన్నాను. నాలుగు నెలల తర్వాత మా చర్చలు సఫలమయ్యాయి. నేను కలగన్నదానికంటే రెట్టింపు పారితోషికం తీసుకున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేను అంటూ నటి కన్నీళ్లు పెట్టుకుంది. తిలోత్తమ.. సర్, ద నైట్ మేనేజర్, మాన్‌సూన్ వెడ్డింగ్, ఢిల్లీ క్రైమ్, లస్ట్ స్టోరీస్ 2, పాతాళ్ లోక్ 2 వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు దగ్గరైంది.
చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు.. కంగనా షాక్