సినిమాల పందెం కోళ్లు | Funday Sankranti Movies Special | Sakshi
Sakshi News home page

సినిమాల పందెం కోళ్లు

Published Sun, Jan 10 2016 11:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

సినిమాల పందెం కోళ్లు

సినిమాల పందెం కోళ్లు

సినిమా సంక్రాంతి
తెలుగు సినిమాకీ, సంక్రాంతికీ అవినా భావ సంబంధం ఉంది. 1955లో కమర్షియల్‌గా సంక్రాంతి సీజన్‌లో మార్కెట్‌ని కొల్లగొట్టిన కోడి ‘మిస్సమ్మ’. అందులో అన్న ఎన్టీఆర్, మహానటుడు ఏఎన్‌ఆర్ కలిసి నటించడంతో హీరోలుగా పోటీ లేకుండా సినిమా గెలిచేసింది. అప్పట్నుంచి ప్రతి యేడూ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా సంక్రాంతికి ఒక సినిమా తనకుండేలా చూసుకున్నారు. 56లో ‘తెనాలి రామకృష్ణ’, 59లో ‘అప్పుచేసి పప్పుకూడు’, 60లో ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’, 61లో ‘సీతారామ కల్యాణం’, 62లో ‘గులేబకావళి కథ’, 63లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, 64లో ‘గుడి గంటలు’, 65లో ‘పాండవ వనవాసం’, 66లో ‘శ్రీకృష్ణ పాండవీయం’, 67లో ‘గోపాలుడు- భూపాలుడు’, 68లో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’, 69లో ‘వరకట్నం’, 70లో ‘తల్లా, పెళ్లామా’,71 నుంచి 76 వరకూ హిట్లు తగల్లేదు కానీ సినిమాలు పోటీలో ఉన్నాయి.

మళ్లీ 77లో ‘దానవీరశూరకర్ణ’ తో విజృంభించి సంక్రాంతి పందెంలో ఫస్ట్ బెస్ట్ కోడి తనదేనని నిరూపించారు.
 82లో ‘అనురాగ దేవత’ వరకు అన్నగారే సంక్రాంతికి తెలుగువాళ్ల అభిమాన గెలుపు కోడి. తర్వాత ఆ వారసత్వాన్ని సూపర్‌స్టార్ కృష్ణ అందుకున్నారు. 1976లో ‘పాడిపంటలు’తో ప్రారంభించి, 1997 తప్ప, వరుసగా 76 నుంచి 99 వరకూ అంటే 22 ఏళ్లు నిరాటంకంగా సంక్రాంతి బరిలో నిలబడ్డ స్టార్ కోడి తనదే అయ్యేలా చూసుకున్నారు.

తెలుగువారితో ఎక్కువసార్లు గెలిపించుకున్నారు. 87లో ‘ఊరికి మొనగాడు’, 82లో ‘బంగారు భూమి’, 84లో ‘ఇద్దరు దొంగలు’, 85లో ‘అగ్నిపర్వతం’, 93లో ‘పచ్చని సంసారం’, 94లో ‘నంబర్ వన్’, 95లో ‘అమ్మదొంగ’... ఇవన్నీ కృష్ణ ప్రైజ్ విన్నింగ్ గెలుపు కోళ్లు - ఆయా సంవత్సరాల సంక్రాంతి పందాల్లో. మెగాస్టార్ చిరంజీవి 87లో ‘దొంగ మొగుడు’తో, 89లో ‘అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు’తో, 97లో ‘హిట్లర్’తో, 2000లో ‘అన్నయ్య’తో సంక్రాంతి బరిలో భారీగా గెలిచినా, 2001 ‘మృగరాజు’, 2004 ‘అంజి’ తేడా కొట్టేశాయి.

అయినా మెగాస్టార్ సంక్రాంతిని కంపల్సరీ రిలీజ్ డేటుగా చూసుకున్న దాఖలాలు లేవు. ఇలా అడపాదడపా వచ్చి పందెం గెలిచిన చుట్టం ‘కోడే’ ఆయన. నందమూరి అన్న ఎన్టీఆర్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్యబాబు, సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వీళ్లిద్దరూ మాత్రం వీలైనంత వరకూ గెలుపోటములతో సంబంధం లేకుండా సంక్రాంతి బరిలో పందెంలో దిగడానికే ప్రయత్నం చేసే రసవత్తరమైన ఛాంపియన్ ‘కోళ్లు’ - 1985 నుంచి బాలకృష్ణ దాదాపు ప్రతి ఏడూ సంక్రాంతి బరిలో నిలబడ్డారు.

క్రమం తప్పకుండా ఈ ఏడాది 2016 వరకూ... ఈ ఏడు ‘డిక్టేటర్’తో మళ్లీ బలంగా పందెంలో నిలుచున్నారంటే అర్థమౌతోంది - సంక్రాంతిని అభిమానుల కోసం ఎలా సందడిగా మారుస్తున్నారో అని. 1985 నుంచి 2016 వరకూ అంటే దాదాపు ముప్ఫైఏళ్లకు పైగా అయిదుసార్లు మినహాయించి పందెంలో నిలబడ్డ కోడి నిజంగా గొప్ప కోడి. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, వంశోద్ధారకుడు, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ ఈ కోడి విజయాలు. సంక్రాంతి పందెంలో కన్సిస్టెంట్‌గా నిలబడుతున్న మరో ఛాంపియన్ పందెం కోడి మహేశ్‌బాబు.

1979 నుంచి 1990 వరకూ బాలనటుడిగానే బాక్సాఫీసుని బద్దలు కొట్టిన విజయాలనిచ్చిన ఈ సూపర్‌స్టార్ 2002లో ‘టక్కరిదొంగ’తో సంక్రాంతి బరిలోకి దిగారు. 2003లో ‘ఒక్కడు’తో ఆ ఏటి మేటిగా నిలిచారు. మళ్లీ 2012లో ‘బిజినెస్‌మ్యాన్’గా అలరించారు. 2013లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో తమ్ముడిగా గెలిచారు.
 
2003లో ‘నాగ’తో, 2004లో ఆంధ్రావాలాతో, 2005లో ‘నా అల్లుడు’తో సంక్రాంతి బరిలో పోటీచేసిన నందమూరి స్టార్ హీరో తారక్ 2010లో ‘అదుర్స్’తో సంక్రాంతి పందెంలో గెలుపు రుచి చవిచూశారు. 2004లో వర్షంతో ప్రభాస్ సంక్రాంతి పందెంలో బాలయ్యతోను, మెగాస్టార్ తోను పోటీపడి మరీ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. రామ్ 2006లో వై.వి.ఎస్. చౌదరి నిర్మాత, దర్శకుడుగా సంక్రాంతి బరిలోనే ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసి ‘చుక్కల్లో చంద్రుడు’గా వచ్చిన సిద్ధార్థతో ఢీకొని ఆ ఏడాది ఛాంపియన్ కోడిగా ముద్రేయించుకున్నారు.     

2011లో రవితేజ ‘మిరపకాయ్’తోను, 2013లో రామ్‌చరణ్ ‘నాయక్’తోను, 2014లో అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తోను, 2015లో పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‘గోపాల గోపాల’తోను, అదే ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్ ‘పటాస్’గా వచ్చి పందాల్లో నిర్మాతలు పెట్టిన డబ్బులు పోకుండా గెలిపించేశారు. చాలా అరుదుగా ఒక్కో ఏడు రెండు, మూడు కోళ్లు గెలుస్తాయి. అది ఈ పందాల్లో ప్రత్యేకత. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 2009లో నిర్మించిన ‘అరుంధతి’ ఆ ఏడాది సంక్రాంతి గెలుపు కోడిగా అనుష్కని నిలబెట్టింది. మొదటిసారి పందెం గెలిచిన ఆడ కోడి అనుష్క.

విక్టరీ వెంకటేష్ తన సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2000లో ‘కలిసుందాం రా’ అంటూ, చిరంజీవి ‘అన్నయ్య’తోను, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’తోనూ కలిసి ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఒక రకంగా సోలోగానూ, మల్టీస్టారర్‌తోను కలిపి సంక్రాంతికి ఘన విజయాలు దక్కించుకున్న హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, వెంకటేష్, మోహన్‌బాబు, కృష్ణంరాజులనే చెప్పాలి. 2002లో ‘సీమసింహం’, ‘టక్కరి దొంగ’ల భారీ పోటీ మధ్య తరుణ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ వై.కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘నువ్వు లేక నేను లేను’ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో పందెంలో గెలిచేసింది.

2003లో ఒక్కడు ప్రభంజనంతో కూడా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోని ‘పెళ్లాం ఊరెళ్తే’ బాగానే కాసులు రాబట్టింది. 2008లో ‘కృష్ణ’ సినిమాతో రవితేజ మరోసారి సంక్రాంతి సూపర్‌హిట్టు కోడిగా నిలబడినా ఆ దర్శకుడు వి.వి.వినాయక్ మళ్లీ 2010లో తారక్‌తో ‘అదుర్స్’ని కూడా సంక్రాంతి బరిలో విజేతగా నిలబెట్టారు. ఎన్టీఆర్‌తో మొదలైన సంక్రాంతి సినిమాల పండుగ సందడి రేపు రానున్న 2016 సంక్రాంతికి నందమూరి అభిమానుల మధ్యే పెద్ద పోటీకి తెరతీసింది. నందమూరి తారక్ ‘నాన్నకు ప్రేమతో’ అని సుకుమార్ దర్శకత్వంలో వస్తూండగా, నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా బరిలో ముందే ఉండడం ఈ సంక్రాంతికి బాగా ఆసక్తి రేపిన విషయం.
 
మామూలుగా హిట్ అయ్యే సినిమాలు వేలకు వేలున్నా, సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలు, వాటి గురించిన చర్చలు, వాటి కలెక్షన్ల తీరే మిగిలిన సీజన్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు రిలీజయ్యే సినిమాలకి మాత్రమే పోటీ అని ఫీలౌతాం. మిగిలిన సమయాల్లో ఏ రెండు సినిమాలున్నా సంక్రాంతికి ఉన్న చర్చ ఉండదు. కాబట్టి పోటీ గెలిచిన హీరోల అభిమానులు ఏడాదంతా కాలరెగరేసుకుని తిరుగుతారు. పైగా క్యాలెండర్ సంవత్సరం మొదలయ్యేది జనవరి కాబట్టి సంక్రాంతికి ప్రేక్షకుడు ఏ టైప్ చిత్రానికి పందెంలో గెలుపు పట్టం కడతాడో, ఆ ఏడాదంతా ఆ టైపు చిత్రాల నిర్మాణం బలవంతంగా జరిగిపోతుంది.

అయితే, సంక్రాంతి నేపథ్యంలోని కథాంశంతో రూపొందిన సినిమాలు చాలా తక్కువే. దర్శకరత్న దాసరి నారాయణరావు ‘ఊరంతా సంక్రాంతి’ అనే మల్టీస్టారర్‌లో అక్కినేని, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. అదొక్కటే సహజమైన తెలుగు స్వాభావిక సంక్రాంతి చిత్రం అయితే, హీరో వెంకటేష్ ‘సంక్రాంతి’ అనే సూపర్‌గుడ్ చిత్రంలో శ్రీకాంత్, శర్వానంద్‌లతో కలిసి నటించారు. ఇది తమిళ ‘ఆనందం’ చిత్రానికి రీమేక్. అరవ సాంబారు, పొంగల్ లాంటి కథా కథనాలు తప్ప తెలుగు పులిహోరలు, బొబ్బట్లు ఈ సంక్రాంతిలో మృగ్యం. అందుకే ఈ సంక్రాంతి, జనవరిలో రిలీజవ్వలేదు. కానీ మంచి హిట్ చిత్రం అయింది.
 
సంక్రాంతి అంటే కొత్త సంవత్సరం రాక. కొత్త చుట్టాల, అల్లుళ్ల రాక. కొత్త సినిమాల రాక. ‘పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే’ అన్న మహాకవి గురజాడవారిని గుర్తుచేసుకుంటూ, ఆ పండగలో పోటీని ఆస్వాదిద్దాం. ఆ పండుగని ఆనందంగా అనుభవించి ఈ ఏడాది ప్రారంభిద్దాం. అందరికీ నూతన సంవత్సర, మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
 - వి.ఎన్.ఆదిత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement