sankranti special
-
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
-
కోనసీమ ‘ప్రభ’
సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పాయి. వివరాల్లోకి వెళితే...డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వాసం. పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరాబాద్ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు. రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీస్తారు. వరి కంకుల కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తులు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చకుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు. -
TS: సంక్రాంతికి 4వేల స్పెషల్ బస్సులు
హైదరాబాద్, సాక్షి: సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో TSRTC అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత ప్రయాణం.. ఈ బస్సులకూ వర్తించేలా ఈ సందర్భంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 4 వేల 484 బస్సులు అదనపు బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇందులో 626 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి. బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని.. సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని తెలిపారాయన. అలాగే.. సంక్రాంతి పండగకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని స్పష్టత ఇచ్చింది. ఈ సమీక్షలో ఈడీలు, జిల్లాల రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనునట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్, హైదరాబాద్- కాకినాడ, కాకినాడ-హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్‌పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్‌పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సంబరాల సంక్రాంతి..
నెల రోజులపాటు జరుపుకొనే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి. ప్రత్యేకతలెన్నో ఉన్న పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకునేవే! సంక్రాంతి పండుగ మాత్రం అందుకు భిన్నం. దీనిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. ఈ పండుగ ప్రత్యేకించి ఒక దేవుడికో, దేవతకో సంబంధించినది కాదు. పంటల పండుగ. కళాకారుల పండుగ. రైతుల పండుగ. కొత్తల్లుళ్ల పండుగ. పెద్దల పండుగ. రంగవల్లుల పండుగ. వినోదాల పండుగ. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కనకనే అందరికీ పెద్ద పండుగ అయ్యింది. ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న తమ పంట పండి ఇంటికి వచ్చిన సంబరంతో చేసుకునే పండుగ ఇది. పంట వేసినప్పటినుంచి çకోతకోసి ఇంటికి వచ్చేదాకా ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు వివిధ చేతివృత్తుల వాళ్లు, కళాకారులు అండగా నిలబడతారు. రైతుల అవసరాలు తీర్చి, వినోదం పంచి మానసికోల్లాసం కలిగిస్తారు. ప్రతిఫలంగా రైతులు వారికి ధాన్యం కొలిచి ఇస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే శుభాల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి పండుగ. ఉత్తరాయణం సకల శుభకార్యాలు జరుపుకొనేందుకు యోగ్యమైన కాలం. ఇంతకీ ఉత్తరాయణమంటే ఏమిటో చూద్దాం. సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయనం రాత్రి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక తన దిశ మార్చుకుని ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాప కాలం అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే! అయితే ఉత్తరాయణం విశిష్ఠత వేరు. భూమిపై రాత్రి, పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని, సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాయణం నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య పై ఒరిగిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. శాస్త్ర ప్రకారం ప్రతి సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే, మిగిలిన పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రమణ దానాలు... సర్వపాపహరాలు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్ఠమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం. సంక్రాంతి అనేది నెలరోజుల పండుగ. ధనుర్మాసంలో వచ్చే పండుగ. ధనుర్మాసం అని పండితులంటారు కానీ, వాడుకభాషలో చెప్పాలంటే సంక్రాంతి నెల పట్టటం అంటారు. ఈ నెల పట్టిన దగ్గరనుంచి తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో పండుగ వాతావరణం వస్తుంది. ఆడపడచులు ఇంటిముందు ఊడ్చి, కళ్లాపి చల్లి రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యప్పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. హరిదాసుల ఆగమనం వెనక... లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ , ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీకృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ, కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి సందర్భంగా కనిపించే సంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చును. సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనపడతారు. వీరి తలపై ఉండే పాత్రకు అక్షయ పాత్ర అని పేరు. హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అందుకే పిల్లలు, పెద్దలు పోటీలు పడి మరీ హరిదాసుల తలపై ఉండే అక్షయ పాత్రలో బియ్యం, కూరగాయలు వంటివి ఉంచుతారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవిని శ్రీకృష్ణుడిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుంచి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమా రమణ గోవిందో హరీ అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉత్త చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాలలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని ఆ శ్రీమహా విష్ణువుకు కానుకలు బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసులతోపాటు, ఈ పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు, పగటి వేషధారులు, గారడీవాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులు కన్నుల పండువుగా తమ కళాకౌసలాన్ని ప్రదర్శిస్తారు. సంక్రాంతి పర్వదినంతో ఈ కళా ప్రదర్శనలన్నీ ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు. సంక్రాంతి పండుగలో మరిన్ని ప్రత్యేకతలు... పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేయడంతో కపిలముని వాళ్లందరినీ తన కంటిచూపు నుంచి వెలువడిన క్రోధాగ్ని జ్వాలలతో భస్మం చేశాడు. దాంతో వారికి మోక్షం లభించక అధోలోకాలలో పడి ఉన్నారని, వారికి సద్గతులు కలగాలంటే వారి భస్మరాశుల మీద గంగ ప్రవహించాలని తెలుసుకున్న వారి వంశీకులు చాలామంది గంగను భువికి రప్పించాలని పరిపరివిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టకేలకు భగీరథుడు తన కఠోర తపస్సు, ఎడతెగని ప్రయత్నాలతో ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. అందుకే సంక్రాంతి నాడు చేసే స్నానం గంగాజలంలో మునక వేసినంత సత్ఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాద్యాన్ని పట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు వెళ్లి అత్యంత అద్భుతంగా గంగిరెడ్ల విన్యాసం చేయించారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! నీ పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు దేవతలు చేసిన విన్యాసాలే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. ప్రతి ఆచారానికీ ఓ కథ... కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే! పక్షులు కూడా రైతన్న నేస్తాలే! అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాం. కానీ ఈ కనుమ రోజున మాత్రం ర«థం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివరి వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట. దాంతో కోపం వచ్చిన శివుడు ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. అందుకే కనుమ రోజు పశువులను ముఖ్యంగా ఎడ్లను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. డుబుక్కు డుబుక్కు... బుడబుక్కలవాళ్లు ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది. పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిజాములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ కొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా డుబుక్కు డుబుక్కుమని శబ్దం చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ కొత్తవారిని కట్టడి చేస్తారు బుడబుక్కలవాళ్లు. వీరు తొలిజామంతా పంటకు కాపలా కాసి రెండోజాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతారు. శంఖనాదాల జంగందేవర సాక్షాత్తూ శివుని అవతార అంశగా భావించే ఈ జంగందేవర శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర! జంగందేవర రాకను గ్రామీణులు శుభంగా భావిస్తారు. పిట్టలదొరలు గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక చిత్ర విచిత్ర వేషధారణలో మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు, కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. ఇతడి మాటలే కాదు, ఆహార్యమూ వింతగా ఉంటుంది. పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు. అందుకే ఏమాత్రం పొసగని దుస్తులు ధరించేవారిని, డంబాలు పోయేవారిని పిట్టలదొరతో పోల్చుతుంటారు. సోదెమ్మ ‘సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను. ఉన్నదున్నట్టు చెబుతాను. లేనీదేమీ చెప్పను తల్లీ!’ అంటూ మన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర, రవికలగుడ్డ పెట్టించుకుని చల్లగా ఉండమని ఆశీర్వదించి వెళ్లిపోతుంది సోదెమ్మ. ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మనం బాగుంటే తామూ బాగుంటామని, మన క్షేమసౌఖ్యాలలో తామూ ఉంటామని భావిస్తూ, అందుకు తగ్గట్టే గ్రామస్థులకు మనోల్లాసం కలిగిస్తారు. మనకింత సాయం చేసిన వాళ్లు మననుంచి కోరుకునేది కాసిన్ని బియ్యం, కాసిని చిల్లర పైసలు, కాసిన్ని పాత దుస్తులే కదా... అందుకే లేదని కసిరికొట్టకుండా వారు కోరినది ఇచ్చి మన ముంగిటికొచ్చే చిరుకళాకారులను ఆదరించాలి. అందరికీ మంచిని పంచాలి. అందరి మంచిని పెంచాలి. సంక్రాంతి అల్లుడి ఘనత ఏమిటంటారా ? ఏ పండగకైనా ఇంటి అల్లుడి హాజరు తప్పని సరిగా ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి శాస్త్రం విశిష్టమైన స్థానాన్ని ఇచ్చింది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదేవిధంగా సూర్యుడిని సూర్య నారాయణ మూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడి మకర రాశి ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకరరాశి పదో రాశి. ఇది అత్తగారిల్లు అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంటిలోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పని సరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. ఈ రోజున అల్లుడి చేత గడ్డపెరుగును తినిపిస్తారు. ఇలా చేయడం వలన అల్లుడి వంశం వృద్ధి చెందుతుందని, అల్లుడు లేని వారు ఈ రోజున పండితులకి పెరుగును దానం చేయాలని పరాశర సంహిత చెబుతోంది. పూలూ–పిండి వంటల వెనుక సైతం సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్ర వచనం. ఎందుకు చెప్పిందంటే, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు కనుక. ఇందులో ఒక్క గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరచి పుష్యమాసపు చలి నుంచి శరీరాన్ని రక్షించే పదార్థాలు. ఇక గుమ్మడికాయ స్త్రీ–పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్యదోషాలను నివారించే గొప్ప ఔషధం. ఈ కాలంలో స్త్రీలు వాడే బంతి, చేమంతి, డిసెంబర్ పూలు, మునిగోరింట పూలు అన్నీ చలిని తట్టుకునే వేడిని ఇచ్చేవే. సంక్రాంతి సందర్భంగా చేసుకునే పిండివంటలు అన్నీ ఆరోగ్యాన్ని, ఒంటికి సత్తువనూ ఇచ్చేవే. కనుమ రోజు ప్రయాణం ఎందుకు చేయకూడదంటే..? సంక్రాంతి అంటే పంటల పండుగ కదా! కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులను వేలాడదీస్తారు. ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున చనిపోయిన పెద్దలను తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చే మినుములతో తయారు చేసిన గారెలు తినాలంటారు. గారెలు, మాంసంతో ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలని నియమం. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. కొన్ని పల్లెటూళ్లలో కనుమరోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడంలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ రోజు కూడా ఆగి, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని, మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. సంక్రాంతి రోజున శబరిమలలో జరిగే మకర జ్యోతి దర్శనం, తిరుమలలో జరిగే పారువేట, శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలు గోదావరి జిల్లాలో జరిగే ప్రభల తీర్థం ఈ పండుగ ప్రత్యేకతను చాటి చెబుతాయి. ఈ ఉత్తరాయణంలో అందరికీ శుభాలు జరగాలని ఆశిద్దాం. -డి.వి.ఆర్. భాస్కర్ కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయడం ఆచారం. దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతి నెల రోజులూ నాడు దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. అందుకే వారికి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు ఈ పండగ సమయంలో గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. చాకచక్యంగా గాలిపటాన్ని ఎగురవేసిన వారికి జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించే సామర్థ్యం కలుగుతుందని, తెగిన గాలిపటాలతో పాటే దురదృష్టం కూడా మనల్ని వీడి వెళ్లిపోతుందనీ పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువు సంక్రాంతి సంబరాలలో భాగమే బొమ్మల కొలువు కూడా. బొమ్మల కొలువును దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా పెడతారు. ఇళ్లలో, ఆలయాలలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. గృహిణులు తమ వద్దనున్న బొమ్మలననుసరించి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మెట్ల వరసలలో బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. ఇలా బొమ్మల కొలువులు పేర్చడంలో కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నాయి. భగవంతుడి దశావతారాల సూత్ర ప్రకారం ఈ సృష్టి పరిణామ క్రమాన్ని మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కింది మెట్టునుంచి పై మెట్టువరకు వివిధ వర్ణాలు, వివిధ ప్రమాణాలలో బొమ్మలను అమరుస్తారు. గంగిరెడ్లు ‘అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు! బాబుగారికి దండంపెట్టు! పాపగారికి దండం పెట్టు!’ అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి, రైతు బతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటిముంగిట్లో ఎడ్లను ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించే గంగిరెద్దుల వాళ్ళు ఊదే సన్నాయి సన్నాయి కూడా మంగళవాద్యమే. -
గుడ్‌న్యూస్: ఈ రూట్లలో సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ–శ్రీకాకుళం రోడ్–వికారాబాద్ మధ్య వయా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ►కాచిగూడ–శ్రీకాకుళం రోడ్(07611) రైలు: కాచిగూడలో ఈ నెల 10న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–వికారాబాద్(07612) రైలు: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయత్రం 5.10కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.47కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ►వికారాబాద్–శ్రీకాకుళంరోడ్(07613) స్పెషల్: వికారాబాద్‌లో ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–కాచిగూడ(07614) స్పెషల్: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.22కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రైళ్ల గమ్యం కుదింపు, దారి మళ్లింపు.. ►వాల్తేర్ డివిజన్ కే–ఆర్ లైన్ కోరాపుట్–మనబర్, కోరాపుట్–దుమురిపుట్ సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ ఆధునికీకరణ, రెండో ట్రాక్ పనుల నిమిత్తం పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ►విశాఖపట్నం–కోరాపుట్(08546) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 10 వరకు లక్ష్మీపూర్ రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08545) పాసింజర్ స్పెషల్ ఈ నెల 6 నుంచి 11 వరకు లక్ష్మీపూర్ రోడ్ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►విశాఖపట్నం–కోరాపుట్(08512) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 6, 9 తేదీల్లో దమన్‌జోడి వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08511) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7, 10 తేదీల్లో దమన్‌జోడి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►ఈ నెల 6న విశాఖలో బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్ అరకు వరకు మాత్రమే నడుస్తుంది. ►ఈ నెల 6న కిరండూల్‌లో బయలుదేరే కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ జయపూర్ వరకు మాత్రమే నడుస్తుంది. -
గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రద్దీని మరింత తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి విజయవాడ మీదుగా నర్సాపూర్, కాకినాడ టౌన్, తిరుపతి మధ్య మరో 16 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నారు. జనవరి 7న తిరుపతి–వికారాబాద్ (07050), 8న వికారాబాద్–కాకినాడ టౌన్ (07051), 9న కాకినాడ టౌన్–కాచిగూడ (07057), 10న కాచిగూడ–తిరుపతి (07058), 11న తిరుపతి–వికారాబాద్ (07070), 12న వికారాబాద్– నర్సాపూర్ (07071), 13న నర్సాపూర్–కాచిగూడ (07072), 14న కాచిగూడ–తిరుపతి (07073), 12న హైదరాబాద్–తిరుపతి (07083), 13న తిరుపతి–హైదరాబాద్ (07084), 14న హైదరాబాద్–నర్సాపూర్ (07085), 15న నర్సాపూర్–హైదరాబాద్ (07086), తిరుపతి–వికారాబాద్ (07079), 16న వికారాబాద్–నర్సాపూర్ (07080), 17న నర్సాపూర్–కాచిగూడ (07081), జనవరి 18న కాచిగూడ తిరుపతి (07082) నడపనున్నారు. -
గరం టీమ్ సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival Celebrations 2022 : సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival 2022 Celebrations: ఊరంతా సంక్రాంతి
-
Sankranti 2022: సంక్రాంతి శోభ
-
సాక్షి: సంక్రాంతి స్పెషల్ సాంగ్
-
క్రికెట్ సంక్రాంతి
రావినూతల(మేదరమెట్ల): రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న 27వ అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన యువకులు అసోసియేషన్ ఏర్పాటు చేసి గత 27 ఏళ్లుగా క్రమం తప్పకుండా క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తుండటం విశేషం. ఏటా సంక్రాంతి పండుగకు ముందు నిర్వహిస్తున్న ఈ టోర్నీకి విశేష ఆదరణ లభిస్తోంది. తొలుత మండల, జిల్లా స్థాయికే పరిమితమైన పోటీలను గత 18 ఏళ్లుగా అంతర్ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌కు పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు సహాయ సహకారాలు అందించడంతో క్రికెట్ పోటీలు ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు రావినూతల స్టేడియంలో 2004 నుంచి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టారు. టర్ఫ్ పిచ్‌పై పోటీలు నిర్వహించడమే కాకుండా పక్కనే మరో పిచ్‌ను అదే ప్రమాణాలతో ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా రెండు పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో టీ–20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. బీసీసీఐ జాతీయ సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాలరావు, రంజీ, ఐపీఎల్ క్రీడాకారులు ఎందరో రావినూతల స్టేడియంలో ఆడారు. పోటీలు జరిగే రోజుల్లో తమ సొంత గ్రామంలోనే ఉన్నట్టుంటుందని ఇతర రాష్ట్రాల క్రీడాకారులు పేర్కొనడం గమనార్హం. నేడు టోర్నీ ప్రారంభం రావినూతలలో సంక్రాంతి కప్–2018ను మంగళవారం ఉదయం 9 గంటలకు బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ప్రముఖ సినీనటుడు యర్రా గిరిబాబు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వితలకు ప్రథమ బహుమతిగా కీర్తిశేషులు కారుసాల తాతారావు స్మారక కప్, రూ.75 వేల నగదు, ద్వితీయ బహుమతిగా క్రీ.శే. యర్రా శ్రీదేవి, ముప్పవరపు రఘురామ్ స్మారక కప్, రూ.50 వేల నగదు, తృతీయ బహుమతిగా ఎలైన్ డైరీ కప్, రూ.25 వేల నగదు, చతుర్థ బహుమతిగా చప్పిడి హనుమంతరావు స్మారక కప్, రూ.10 వేల నగదు అందజేస్తామని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ కారుసాల బాపయ్య జ్ఞాపకార్థం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ ఫీల్డర్ అవార్డులు రామినేని ప్రసాద్, దామా రమేష్ స్మారకార్థం బహుకరించనున్నట్లు సభ్యులు తెలిపారు. తొలిరోజు మ్యాచ్‌లు మొదటి మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు అరుణ ఇన్ఫ్రా, ఒంగోలు– సీడీసీఏ లెవెన్, తిరుపతి జట్ల మధ్య, రెండో మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్మీ సర్వీసెస్ కాప్స్, బెంగలూరు– సౌత్‌సెంట్రల్ రైల్యేస్ విజయవాడ జట్ల మధ్య జరుగనున్నాయి. -
ముగ్గుశాస్త్రం
కోడికూతతో నిద్రలేచి, వాకిలూడ్చి, పేడనీటితో కళ్లాపిచల్లి ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం భారతీయ సంస్కృతి. స్పష్టంగా చెప్పాలంటే హైందవ సంప్రదాయం. సాధారణంగా పల్లెటూళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అలవాటు. పట్టణీకరణ, నగరీకరణ పెరిగాక, అపార్ట్మెంట్ సంస్కృతి, సిమెంటు గచ్చులు, పాలిష్‌బండల మోజు పెరిగాక ఇప్పుడు నగరాల్లోనే కాదు, పల్లెటూళ్లలోనూ ముగ్గులు వేయడానికి చారెడు చోటు మిగలడం కూడా గగనమయిపోతోంది. అయినా సరే, కళ్లాపిచల్లడం కుదరకపోయినా, రంగవల్లులు తీర్దిదిద్డడం రాకపోయినా, కనీసం చాక్‌పీస్‌తో అయినా సరే, ఉన్నచోటులోనే వాకిలిముందు ముగ్గేసేమనిపించుకునే అలవాటును ముదితలింకా మరచిపోలేదు. ముగ్గులు ఎందుకు వేస్తారనే దానికి ఇతమిత్థంగా ఇదీ అని కారణాలు తేల్చిచెప్పలేకపోయినా, ఏ ఇంటిముందయినా ముగ్గు పడలేదంటే, ఆ ఇంటిలో ఏదో అశుభం జరుగుతోందని అర్థం. అంటే ఏ ఇంటిలోనైనా ఇంటిలోని వాళ్లు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ, ముగ్గు మాత్రం వెయ్యరు. అలా ముగ్గు లేని ఇంటికి భిక్షకులు, సాధుసన్యాసులు భిక్షకు కూడా వెళ్లరు. అందుకనే రోజూ పొద్దునా సాయంత్రం వాకిలి ఊడ్చి ముగ్గువెయ్యడమనేది విధిగా భావిస్తారు ముదితలు. ముగ్గుల చరిత్ర: ముగ్గులు ఎప్పటినుంచి వేస్తున్నారనేందుకు చారిత్రక ఆధారాలు లేకపోవచ్చు కానీ, పురాణ కాలనుంచే వేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రసక్తి, ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేమంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక గురువున్నాడు. ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన గురువు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరిన రాజగురువుతో బ్రహ్మదేవుడు, నీతో సహా రాజ్యప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి, శుభ్రం చేసి, ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు. రాజాజ్ఞమేరకు రాజ్యప్రజలంతా కలసి వాకిళ్లు ఊడ్చి, వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. రాజగురువు తన ఇంటిముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి, అతని కుమారుని బతికిస్తాడు. అప్పటినుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి, ముగ్గులు గీయడం అలవాటు చేసుకుంటారు. ముగ్గువేసి దానికి రెండువైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి బయటకెళ్లి పోతుందని పెద్దలు చెబుతారు. దేవతాపూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డు గీతలు తప్పనిసరి. ముగ్గులు.. గొబ్బెమ్మలూ... సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బిళ్ల మీద ముళ్లగోరింట, గుమ్మడిపూలు... ఇవీ పల్లెటూళ్లలో ప్రతి ఇంటా కనిపించే దృశ్యాలు. ముగ్గుల మధ్యన ఆవుపేడతో ముద్దలు చేసి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చేమంతి వంటి పూవులను గుచ్చుతారు. వాటినే గొబ్బెమ్మలంటారు. ఆ తర్వాత ఆడపిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గొబ్బిపాటలు పాడుతూ నృత్యం చేస్తారు. దీని వెనుక ఎంతో అÆ తరార్థం ఉంది. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన ధారణశక్తి పెరుగుతుంది. ముగ్గుల గురించి ఇరుగు పొరుగు ఒకరితో ఒకరు చర్చించుకోవడం వల్ల వారిమధ్య స్నేహం పెంపొందుతుంది. అలనాటి గోపికే నేటి గొబ్బిగా... గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా, గొబ్బెమ్మ (గోపెమ్మ)లను గోపికలుగా భావిస్తూ వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మను కృష్ణునిగా, తక్కిన ఎనిమిది గొబ్బెమ్మలను ఆయన అష్టభార్యలుగా గుర్తించాలంటారు. మరికొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యుడని, మిగతా గొబ్బెమ్మలూ గ్రహాలకూ సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరిరోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని నమ్మకం. రంగురంగులుగా తీర్చిదిద్దిన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్లేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటినో తెలియ చేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని విశ్వాసం. ముగ్గులు... నమ్మకాలు ముగ్గుల వెనక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలున్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్థాలు, పరమార్థాలు, నమ్మకాలతో కూడినవి. అందులో కొన్నింటిని చూద్దాం... నక్షత్రం ఆకారం వచ్చేలా గీసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ వైపు రాకుండా నిరోధిస్తుంది. ముగ్గు అంటే దేవతలకు మానవులు పలికే ఆహ్వానం. అందుకే ముగ్గులు తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిఫ్ణువు ముందు నిత్యం మనోజ్ఞమైన ముగ్గులు వేస్తుందో, ఆమెకు ఏడుజన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే జీవిస్తుందని దేవీ భాగవతం చెబుతోంది. నిత్యం ఇంటిముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేస్తే, ఆ ఇంట దుష్టశక్తులు, నకారాత్మక ఆలోచనలు ప్రవేశించవని నమ్మకం. దుష్టమాంత్రికులు కూడా ముగ్గులు వేస్తారు. అయితే వారు వేసేది అష్టదిగ్బంధన ముగ్గులు. తాము ఎవరినైతే వశీకరించదలచుకున్నారో, వారిని ముగ్గులో కూర్చుండబెట్టి, అష్టదిగ్బంధన మంత్రాలు చదువుతారు. అప్పుడు వారు మాంత్రికులకు వశం అవుతారనీ, చెప్పిన పనల్లా చేస్తారనీ నమ్ముతారు. దృష్టిదోషం తొలగడానికి ఇంటిముందు వేలాడదీసే గుమ్మడికాయకు కూడా ముగ్గులు వేస్తారు. గుమ్మడికాయకు పసుపు పూసి, ఎరుపు, తెలుపు బొట్లు పెట్టి, సూర్యుడు, చంద్రుడు, చిన్న చిన్న నక్షత్రాల ముగ్గులు పెట్టడం ఆచారం. అలా చేయడం వల్ల ఆ ఇంటిని ప్రకృతి విపత్తులైన తుపాను, ఈదురుగాలులు, పిడుగుపాటు, అగ్నిప్రమాదం వంటివి ఏమీ చేయలేవని నమ్మకం. ముగ్గులు– మనస్తత్వాలు ముగ్గు వేసే గీతలను బట్టి వారు ఎలాంటివారో చెప్పవచ్చు. ముగ్గు గీతలు సన్నగా ఉంటే వారు పొదుపరులని, అందానికి ప్రాధాన్యత ఇస్తారని, లావుగా ఉంటే నిష్కల్మషంగా ఉంటారని, లతలు, తీగలు, పద్మాలు, జంతువుల ముగ్గులు వేస్తూ ఉంటే వారు స్నేహశీలురని, ప్రకృతి ప్రేమికులని, హాస్యచతురులని చ్పెపవచ్చు. సూర్యుడు, చంద్రుడు, తామరపూలు తదితర ముగ్గులు వేస్తూ ఉండే వారయితే వారు సంప్రదాయాన్ని ఇష్టపడతారని, ఖగోళ శాస్త్రప్రేమికులనీ చెప్పవచ్చు. ఏ ముగ్గు.. ఎప్పుడు? నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతారూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. మంగళహారతి ముగ్గు, పీటల ముగ్గు వంటివి వేయవచ్చు. శివాలయాలలో, ఆలయం ముంగిళ్లలో, శివార్చన చేసే సమయంలోనూ ఎనిమిది పలకల ముగ్గులో అష్టలింగ ముగ్గు వేస్తారు. కుంకుమ రంగు పొడితో మందిరాలలో ఎంతో అందంగా పసుపురంగుపైన వీటిని చిత్రీకరిస్తారు. అమ్మవారి ఆలయాలలో, విష్ణ్వాలయాలలో అష్టదళ ముగ్గులు, శ్రీచక్రాల ముగ్గులు వేస్తారు. పండగ రోజుల్లో రథం ముగ్గు వేస్తారు. నాగుల చవితి, నాగపంచమి, సుబ్బరాయ షష్ఠి సమయాలలో నాగులను లేదా జంట సర్పాలను సూచించే ముగ్గులు వేస్తారు. అమ్మవారి పూజలు చేసేటప్పుడు సాధారణంగా శ్రీచక్రాలకు ప్రతీకగా ఉండే ముగ్గు వేస్తారు. శుభకార్యాలు చేసేటప్పుడు ఇంటిముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. గృహప్రవేశ సమయంలో గడపలకు ఖగోళశాస్త్ర ఆధారంగా చుక్కలు, ఖగోళంలో ఉండే నక్షత్రాల రంగులు వివిధ రకాల నక్షత్రాల్లాంటి చుక్కలని గడపలకు పెడుతుంటారు. పూర్వులు పొయ్యిమీద ముగ్గు వేసిన తర్వాతనే వంట చేసేవారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత అలికి ముగ్గు పెట్టేవారు. దాంతో ఆ ప్రదేశం శుద్ధి అయినటు! శ్రీచక్రం కూడా ముగ్గే! శ్రీచక్రాన్ని సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపంగా భావిస్తారు. పరమ పవిత్రమైనదిగా పేర్కొంటారు. అలాంటి శ్రీచక్రం కూడా ముగ్గులాగే ఉంటుంది. ఇందులో 72 త్రికోణాలుంటాయి. అంతరంగా అనేక కోణాలుంటాయి. ఈ త్రికోణాలు ఒకదానినొకటి ఖండించుకున్నప్పుడు వాటికి కుండలినీ శక్తి వస్తుందని శాస్త్రం చెబుతోంది. ముగ్గు మధ్యలో ఉండే కేంద్రబిందువుకు సహస్రారమని పేరు. అందుకే శ్రీచక్రాన్ని గుమ్మంలో వేయరు. దానికి బదులుగా చిన్న చిన్న త్రికోణాలుగా ముగ్గులు వేస్తారు. కొమురవెల్లి మల్లన్నకు ముగ్గులంటే ప్రీతి. అందుకే ఆయన సన్నిధిలో ముగ్గులు వేస్తామని మొక్కుకుంటారు. ఈ ముగ్గులను పట్నాలని పిలుస్తారు. పట్నాలంటే ఇష్టం కాబట్టి ఆయనకు పట్నాల మల్లన్న అని పేరు. ముగ్గులు... మగవారూ ముగ్గులు వేసేది సాధారణంగా మగువలే అయినప్పటికీ, ఒకోసారి మగవారు కూడా వేస్తుంటారు. అయితే అది ఇంటిముంగిళ్లలో మాత్రం వేయరు. ఏ డ్రాయింగ్పుస్తకాల్లోనో, ఇంజనీరింగ్ పుస్తకాలలోనో తప్ప. అయితే ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ మాత్రం బహిరంగంగా ముగ్గులను గీసేవాడట. డావిన్సీ చిత్రకారుడే కాదు, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా! దుస్తులపై ఆయన గీసే డిజైన్లలో ముగ్గులు తరచు కనిపించేవి. అదీ రకరకాల అందమైన ముగ్గులు... అన్నట్లు ఇంజినీర్లు గీసే రేఖాచిత్రాలు అదేనండీ, ప్లాన్లు కూడా ముగ్గుల కిందికే వస్తాయి మరి. అటువంటప్పుడు సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్చరల్ ఇంజినీర్లు కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ముగ్గులు వేయడం నేర్చుకున్నట్లే కదా! సంక్రాంతికి రథం ముగ్గు ఎందుకు వేస్తారు? మూడు రోజుల పాటు çసంబరాలను పూర్తి చేసుకుని అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడు ఉంటూ సహజీవనం సాగించాలనే సంకేతాలతో ఒకరి ఇంటి ముందరి రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు. మకర సంక్రాంతి నుంచి సూర్యరశ్మిలో వేడిమి పెరిగి మంచు తొలగుతుంది. ఇన్ని రోజుల పాటు తీవ్రమైన చలిని ఎదుర్కొన్న ప్రజలు సూర్యుని ఆహ్వానిస్తూ రథం ముగ్గు వేస్తారు. ముగ్గుచరిత్ర సాంప్రదాయమైన పూజలు, మతపరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు తదితరాలలో తప్పనిసరిగా ముగ్గులు వేసేవారు మన పూర్వీకులు. ఎప్పటినుంచి అంటే క్రీ.పూ. 8వ శతాబ్దంనుంచి అన్నమాట. హరప్పా, మొహంజదారో, సింధునాగరకత కాలంలో కూడా ముగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఈ గుహలలో ఉన్న రంగురాళ్లను సున్నం పిండిరూపంలో కొట్టి, వీటిద్వారా కొన్ని పనిముట్లను, పాత్రలను, ఆయుధాలను తయారు చేసుకునేవారు. ఆ వస్తువులు తయారు చేసుకోగా మిగిలిన పొడి లేదా రజనుతో తాము నివసించే గోడలపైన రంగుపొడులతో చిత్రాలను, జంతువుల బొమ్మలను చిత్రించేవారు. నలుపు తెలుపు అలాగే పసుపు, ఎరుపు, పచ్చని రంగులతో చిత్రీకరించేవారు. దీనికి మూలమైన రాతిపొడే ముగ్గు అని పిలుస్తున్నాము. మధ్యభారతంలో ముగ్గుల సంస్కృతి భారతదేశ మధ్యభాగమైన ఛత్తీస్‌గఢ్‌లో రంగోలీని చావోక అని అంటారు. సాధారణంగా వీరు బియ్యపు పిండితో లేదా తెలుపురంగు దుమ్ముపొడితో ఈ ఛాక్ని ఇళ్లలో డ్రాయింగ్స్‌తో నింపుతారు. ముగ్గులతో అలంకరించిన ఇంటిని అదృష్టం వరిస్తుందని, ముగ్గులను తీర్చిదిద్దినవారికి శుభాలు చేకూరతాయనీ వీరి విశ్వాసం. మహారాష్ట్ర: ఇక్కడివారు మనలా ఇంటిముంగిళ్లలో కాకుండా ఇంటి ద్వారాల మీద ముగ్గులతో అలంకరిస్తారు. ఇంటి ముంగిళ్లలో ఆవుపేడ కళ్లాపు చల్లుతారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంటిలో ప్రవేశించవని నమ్ముతారు. కేరళ: ఓనం పండుగ సమయంలో కేరళలో పదిరోజులపాటు ముగ్గు తప్పనిసరిగా వేస్తారు. వీరు ముగ్గులను భారీ అలంకరణలతో అందంగా గీస్తారు. అయితే వీరి ముగ్గులు రేఖాగణితంలా ఉంటాయి. బియ్యంపిండి, సుద్దముక్కతో ఇంటి అరుగులమీద కూడా ముగ్గులు వేస్తారు. ముగ్గు వేసేటప్పుడు అందులో శంఖువు ఆకారం, చక్రం ఆకారం ఉండేలా చూస్తారు. ముగ్గుల్లో ఖగోళం: ఖగోళం అంటే సూర్యుని కుటుంబం. ఖగోళం అంటే అనంతమైన విశ్వం. 5వ శతాబ్దంలోనే ఆర్యభట్ట ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి, వాటిని ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత వచ్చిన టాలెమీ, డమాస్కస్లు కూడా ఖగోళశాస్త్ర రహస్యాలను ముగ్గులరూపంలో ముంగిళ్లలో ఉంచారు. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాలలో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని అంటారు. అంతరిక్షంలో ఒక్కో నక్షత్రం ఒక్కో ఆకారంలో ఉంటుంది. మనకు తెలిసింది 27 నక్షత్రాలే కాబట్టి, 27 నక్షత్రాలూ ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో ముంగిళ్లలో ముగ్గు పెట్టడం పరిపాటి అయింది. మధుబని ముగ్గులు: మధుబని ముగ్గులంటే ఇంటిగోడలని ఎర్రమట్టితో అలికి, దాని మీద చక్కటి పువ్వులు, లతలతో కూడిన ముగ్గులు పెట్టడం. ఈ రకం ముగ్గులు గ్రామీణ సంస్కృతికి ఆనవాళ్లు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సీజన్లో ఇటువంటి ముగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని ఆటవిక తెగలలో వారి పూరిళ్ల చుట్టూ రకరకాల రాతిపొడులతోనూ, ఆకులను ఎండబెట్టి తయారు చేసిన పసరు పొడితోనూ ముగ్గులు పెడతారు. ఈ విధంగా చేయడం వల్ల విషకీటకాలు, పాములు, తేళ్లవంటివి ఆ ఇంటిలోకి ప్రవేశించవని వారి నమ్మకం. ముగ్గులోకి దింపడం, తలముగ్గుబుట్టలా నెరవడం అనే సామెతలు కూడా ఉన్నాయి. ఎవరినైనా ముగ్గులోకి దింపుతున్నారంటే వారిని తమ మార్గంలోకి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని లేదా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. తల ముగ్గుబుట్టలా నెరిసింది అంటే అనుభవజ్ఞులని అర్థం. ఇంక ఈ ముగ్గుశాస్త్రానికి ముగ్గింపు పలికి, సంక్రాంతి ముగ్గులు వేసేందుకు చుక్కలు పెడదామా మరి! డి.వి.ఆర్. భాస్కర్ ఇన్పుట్స్: ముప్పిడి రాంబాబు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్, కె.ఎల్.విశ్వవిద్యాలయం. -
సినిమాల పందెం కోళ్లు
సినిమా సంక్రాంతి తెలుగు సినిమాకీ, సంక్రాంతికీ అవినా భావ సంబంధం ఉంది. 1955లో కమర్షియల్‌గా సంక్రాంతి సీజన్లో మార్కెట్‌ని కొల్లగొట్టిన కోడి ‘మిస్సమ్మ’. అందులో అన్న ఎన్టీఆర్, మహానటుడు ఏఎన్ఆర్ కలిసి నటించడంతో హీరోలుగా పోటీ లేకుండా సినిమా గెలిచేసింది. అప్పట్నుంచి ప్రతి యేడూ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా సంక్రాంతికి ఒక సినిమా తనకుండేలా చూసుకున్నారు. 56లో ‘తెనాలి రామకృష్ణ’, 59లో ‘అప్పుచేసి పప్పుకూడు’, 60లో ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’, 61లో ‘సీతారామ కల్యాణం’, 62లో ‘గులేబకావళి కథ’, 63లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, 64లో ‘గుడి గంటలు’, 65లో ‘పాండవ వనవాసం’, 66లో ‘శ్రీకృష్ణ పాండవీయం’, 67లో ‘గోపాలుడు- భూపాలుడు’, 68లో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’, 69లో ‘వరకట్నం’, 70లో ‘తల్లా, పెళ్లామా’,71 నుంచి 76 వరకూ హిట్లు తగల్లేదు కానీ సినిమాలు పోటీలో ఉన్నాయి. మళ్లీ 77లో ‘దానవీరశూరకర్ణ’ తో విజృంభించి సంక్రాంతి పందెంలో ఫస్ట్ బెస్ట్ కోడి తనదేనని నిరూపించారు. 82లో ‘అనురాగ దేవత’ వరకు అన్నగారే సంక్రాంతికి తెలుగువాళ్ల అభిమాన గెలుపు కోడి. తర్వాత ఆ వారసత్వాన్ని సూపర్‌స్టార్ కృష్ణ అందుకున్నారు. 1976లో ‘పాడిపంటలు’తో ప్రారంభించి, 1997 తప్ప, వరుసగా 76 నుంచి 99 వరకూ అంటే 22 ఏళ్లు నిరాటంకంగా సంక్రాంతి బరిలో నిలబడ్డ స్టార్ కోడి తనదే అయ్యేలా చూసుకున్నారు. తెలుగువారితో ఎక్కువసార్లు గెలిపించుకున్నారు. 87లో ‘ఊరికి మొనగాడు’, 82లో ‘బంగారు భూమి’, 84లో ‘ఇద్దరు దొంగలు’, 85లో ‘అగ్నిపర్వతం’, 93లో ‘పచ్చని సంసారం’, 94లో ‘నంబర్ వన్’, 95లో ‘అమ్మదొంగ’... ఇవన్నీ కృష్ణ ప్రైజ్ విన్నింగ్ గెలుపు కోళ్లు - ఆయా సంవత్సరాల సంక్రాంతి పందాల్లో. మెగాస్టార్ చిరంజీవి 87లో ‘దొంగ మొగుడు’తో, 89లో ‘అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు’తో, 97లో ‘హిట్లర్’తో, 2000లో ‘అన్నయ్య’తో సంక్రాంతి బరిలో భారీగా గెలిచినా, 2001 ‘మృగరాజు’, 2004 ‘అంజి’ తేడా కొట్టేశాయి. అయినా మెగాస్టార్ సంక్రాంతిని కంపల్సరీ రిలీజ్ డేటుగా చూసుకున్న దాఖలాలు లేవు. ఇలా అడపాదడపా వచ్చి పందెం గెలిచిన చుట్టం ‘కోడే’ ఆయన. నందమూరి అన్న ఎన్టీఆర్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్యబాబు, సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వీళ్లిద్దరూ మాత్రం వీలైనంత వరకూ గెలుపోటములతో సంబంధం లేకుండా సంక్రాంతి బరిలో పందెంలో దిగడానికే ప్రయత్నం చేసే రసవత్తరమైన ఛాంపియన్ ‘కోళ్లు’ - 1985 నుంచి బాలకృష్ణ దాదాపు ప్రతి ఏడూ సంక్రాంతి బరిలో నిలబడ్డారు. క్రమం తప్పకుండా ఈ ఏడాది 2016 వరకూ... ఈ ఏడు ‘డిక్టేటర్’తో మళ్లీ బలంగా పందెంలో నిలుచున్నారంటే అర్థమౌతోంది - సంక్రాంతిని అభిమానుల కోసం ఎలా సందడిగా మారుస్తున్నారో అని. 1985 నుంచి 2016 వరకూ అంటే దాదాపు ముప్ఫైఏళ్లకు పైగా అయిదుసార్లు మినహాయించి పందెంలో నిలబడ్డ కోడి నిజంగా గొప్ప కోడి. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, వంశోద్ధారకుడు, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ ఈ కోడి విజయాలు. సంక్రాంతి పందెంలో కన్సిస్టెంట్గా నిలబడుతున్న మరో ఛాంపియన్ పందెం కోడి మహేశ్‌బాబు. 1979 నుంచి 1990 వరకూ బాలనటుడిగానే బాక్సాఫీసుని బద్దలు కొట్టిన విజయాలనిచ్చిన ఈ సూపర్‌స్టార్ 2002లో ‘టక్కరిదొంగ’తో సంక్రాంతి బరిలోకి దిగారు. 2003లో ‘ఒక్కడు’తో ఆ ఏటి మేటిగా నిలిచారు. మళ్లీ 2012లో ‘బిజినెస్‌మ్యాన్’గా అలరించారు. 2013లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో తమ్ముడిగా గెలిచారు. 2003లో ‘నాగ’తో, 2004లో ఆంధ్రావాలాతో, 2005లో ‘నా అల్లుడు’తో సంక్రాంతి బరిలో పోటీచేసిన నందమూరి స్టార్ హీరో తారక్ 2010లో ‘అదుర్స్’తో సంక్రాంతి పందెంలో గెలుపు రుచి చవిచూశారు. 2004లో వర్షంతో ప్రభాస్ సంక్రాంతి పందెంలో బాలయ్యతోను, మెగాస్టార్ తోను పోటీపడి మరీ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. రామ్ 2006లో వై.వి.ఎస్. చౌదరి నిర్మాత, దర్శకుడుగా సంక్రాంతి బరిలోనే ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసి ‘చుక్కల్లో చంద్రుడు’గా వచ్చిన సిద్ధార్థతో ఢీకొని ఆ ఏడాది ఛాంపియన్ కోడిగా ముద్రేయించుకున్నారు. 2011లో రవితేజ ‘మిరపకాయ్’తోను, 2013లో రామ్‌చరణ్ ‘నాయక్’తోను, 2014లో అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తోను, 2015లో పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‘గోపాల గోపాల’తోను, అదే ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్ ‘పటాస్’గా వచ్చి పందాల్లో నిర్మాతలు పెట్టిన డబ్బులు పోకుండా గెలిపించేశారు. చాలా అరుదుగా ఒక్కో ఏడు రెండు, మూడు కోళ్లు గెలుస్తాయి. అది ఈ పందాల్లో ప్రత్యేకత. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 2009లో నిర్మించిన ‘అరుంధతి’ ఆ ఏడాది సంక్రాంతి గెలుపు కోడిగా అనుష్కని నిలబెట్టింది. మొదటిసారి పందెం గెలిచిన ఆడ కోడి అనుష్క. విక్టరీ వెంకటేష్ తన సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2000లో ‘కలిసుందాం రా’ అంటూ, చిరంజీవి ‘అన్నయ్య’తోను, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’తోనూ కలిసి ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఒక రకంగా సోలోగానూ, మల్టీస్టారర్తోను కలిపి సంక్రాంతికి ఘన విజయాలు దక్కించుకున్న హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, వెంకటేష్, మోహన్‌బాబు, కృష్ణంరాజులనే చెప్పాలి. 2002లో ‘సీమసింహం’, ‘టక్కరి దొంగ’ల భారీ పోటీ మధ్య తరుణ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ వై.కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘నువ్వు లేక నేను లేను’ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో పందెంలో గెలిచేసింది. 2003లో ఒక్కడు ప్రభంజనంతో కూడా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోని ‘పెళ్లాం ఊరెళ్తే’ బాగానే కాసులు రాబట్టింది. 2008లో ‘కృష్ణ’ సినిమాతో రవితేజ మరోసారి సంక్రాంతి సూపర్‌హిట్టు కోడిగా నిలబడినా ఆ దర్శకుడు వి.వి.వినాయక్ మళ్లీ 2010లో తారక్‌తో ‘అదుర్స్’ని కూడా సంక్రాంతి బరిలో విజేతగా నిలబెట్టారు. ఎన్టీఆర్‌తో మొదలైన సంక్రాంతి సినిమాల పండుగ సందడి రేపు రానున్న 2016 సంక్రాంతికి నందమూరి అభిమానుల మధ్యే పెద్ద పోటీకి తెరతీసింది. నందమూరి తారక్ ‘నాన్నకు ప్రేమతో’ అని సుకుమార్ దర్శకత్వంలో వస్తూండగా, నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా బరిలో ముందే ఉండడం ఈ సంక్రాంతికి బాగా ఆసక్తి రేపిన విషయం. మామూలుగా హిట్ అయ్యే సినిమాలు వేలకు వేలున్నా, సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలు, వాటి గురించిన చర్చలు, వాటి కలెక్షన్ల తీరే మిగిలిన సీజన్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు రిలీజయ్యే సినిమాలకి మాత్రమే పోటీ అని ఫీలౌతాం. మిగిలిన సమయాల్లో ఏ రెండు సినిమాలున్నా సంక్రాంతికి ఉన్న చర్చ ఉండదు. కాబట్టి పోటీ గెలిచిన హీరోల అభిమానులు ఏడాదంతా కాలరెగరేసుకుని తిరుగుతారు. పైగా క్యాలెండర్ సంవత్సరం మొదలయ్యేది జనవరి కాబట్టి సంక్రాంతికి ప్రేక్షకుడు ఏ టైప్ చిత్రానికి పందెంలో గెలుపు పట్టం కడతాడో, ఆ ఏడాదంతా ఆ టైపు చిత్రాల నిర్మాణం బలవంతంగా జరిగిపోతుంది. అయితే, సంక్రాంతి నేపథ్యంలోని కథాంశంతో రూపొందిన సినిమాలు చాలా తక్కువే. దర్శకరత్న దాసరి నారాయణరావు ‘ఊరంతా సంక్రాంతి’ అనే మల్టీస్టారర్‌లో అక్కినేని, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. అదొక్కటే సహజమైన తెలుగు స్వాభావిక సంక్రాంతి చిత్రం అయితే, హీరో వెంకటేష్ ‘సంక్రాంతి’ అనే సూపర్‌గుడ్ చిత్రంలో శ్రీకాంత్, శర్వానంద్‌లతో కలిసి నటించారు. ఇది తమిళ ‘ఆనందం’ చిత్రానికి రీమేక్. అరవ సాంబారు, పొంగల్ లాంటి కథా కథనాలు తప్ప తెలుగు పులిహోరలు, బొబ్బట్లు ఈ సంక్రాంతిలో మృగ్యం. అందుకే ఈ సంక్రాంతి, జనవరిలో రిలీజవ్వలేదు. కానీ మంచి హిట్ చిత్రం అయింది. సంక్రాంతి అంటే కొత్త సంవత్సరం రాక. కొత్త చుట్టాల, అల్లుళ్ల రాక. కొత్త సినిమాల రాక. ‘పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే’ అన్న మహాకవి గురజాడవారిని గుర్తుచేసుకుంటూ, ఆ పండగలో పోటీని ఆస్వాదిద్దాం. ఆ పండుగని ఆనందంగా అనుభవించి ఈ ఏడాది ప్రారంభిద్దాం. అందరికీ నూతన సంవత్సర, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. - వి.ఎన్.ఆదిత్య -
ఒక గంగిరెద్దు ఆత్మకథ!
స్వగతం ఎప్పటిలాగే... ‘అయ్యగారికి దండం అమ్మగారికి దండం. అన్నగారికి దండం... అక్కగారికి దండం అటు పోయేవాళ్లకు దండం...ఇటు వచ్చేవాళ్లకు దండం’ పాపం కిషన్ చందర్ ఎంత మంచివాడు. మనం తిట్టుకు పర్యాయ పదంగా వాడుతున్న ‘గాడిద’కు కూడా ఒక మనసు ఉందని, దానికీ ఒక ఆత్మ ఉందని గ్రహించి ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ డాంకీ’ పుస్తకం రాశాడు. గాడిద కంటే నేను ఏ రకంగానూ తీసిపోను. మరి నా ఆత్మకథను ఏ ఒక్కరూ ఎందుకు రాయలేదో తెలియదు. ఆత్మకథ భాగ్యం ఎప్పుడో తెలియదుగానీ...ముందైతే నా కడుపులో బాధ చెప్పుకుంటా... గంగిరెద్దు అవతారం ఎత్తిన నాటి నుంచి అవసరమైన వారికి అవసరం లేనివారికి, అర్హత ఉన్నవారికి అర్హత లేని వారికి దండాలు పెడుతూనే ఉన్నాను. దండాలు పెట్టి పెట్టీ మెడంతా ఒకటే నొప్పులు. ‘బాస్...ఆస్పత్రికి తీసుకెళ్లు’ అని అడుగుదామనుకున్నా....వారం రోజుల నుంచి చలి జ్వరంతో ఊగిపోతున్నాడు మా బాసు బంగారయ్య...పేరుకు బంగారయ్యేగానీ చేతిలో చిల్లిగవ్వలేక ఆస్పత్రికి వెళ్లలేకుండా ఉన్నాడు. అతనికే దిక్కు లేదు. ఇక నన్నేం తీసుకువెళతాడు?! ‘మన సంస్కృతి గొప్పది. గంగిరెద్దుల ఆట మన సంస్కృతిలో భాగం’ అని చాలామంది పెద్దోళ్లు మైకు ముందు కోస్తుంటారు. మన సంస్కృతి గొప్పదే కావచ్చు. కానీ మా గంగిరెద్దోళ్ల పరిస్థితి గొప్పగా లేదు సరికదా....తిప్పలే తిప్పలు. తాతల కాలంలో ఉన్న పెద్ద గుడిసెలు, బంగారయ్య నాయిన కాలానికి చిన్న గుడిసెలయ్యాయి. ఇక మా బంగారయ్యకు ఆ చిన్న గుడిసె కూడా మిగల్లేదు. ఒంటి మీద చిరుగుల నల్లటి కోటే ఆస్తైపోయింది. సన్నాయి పాటే జీవనరాగమైంది. సంచారమే లోకమైపోయింది. మీకో వింత విషయం తెలుసా? భారతీయ సంస్కృతిలో భాగమైన ఒక జానపదకళకు ప్రతినిధి అయిన బంగారయ్యకు...ఓటు హక్కు కూడా లేదు. నా మీద తప్ప....అసలు అతనికి ఏ హక్కు ఉందని? ఆరోజులు ఎలా ఉండేవి? కొండంత విజయగర్వంతో పంటలన్నీ ఇంటికొచ్చేవి. పంట కళ రైతు ఇంటికళను రెట్టింపు చేసేది. ‘అయ్యవారికి దండం’ అన్నామో లేదో మా బాసుల జోలెలు నవధాన్యాలతో నిండేవి. ఇది చూసి మేము సంతోషంగా ఎన్నెన్ని డ్యాన్సులు చేసేవాళ్లమో. చుట్టూ చూసేవాళ్లు చప్పట్లు కొట్టడానికి మా బాసు నన్ను తన గుండెల మీదికి ఎక్కించుకొని-‘ఆడర బసవా’ అని అరుస్తుంటాడు. నలభై నాలుగు కిలోలు కూడా లేని బంగారయ్య గుండెల మీదికి ఎక్కాలంటే మనసు రంపపు కోతకు గురవుతుంది. బాధతో దూరంగా నిల్చొంటే, నేను తన మాట వినడంలేదన్నట్లు కళ్లెర్రజేస్తాడుగానీ నా కడుపులో బాధ అయితే పట్టించుకోడు. అందుకే మనసు చంపుకొని అతని గుండెలపై నృత్యం చేస్తాను. గుండెల మీద ఉన్నందుకేమో...అతడి గుండెల్లో బాధ చాలా దగ్గరి నుంచి చూడగలుగుతాను. ఆరోజులు- ఈరోజులు అంటూ బేరీజు వేసుకుంటాను. ఇప్పుడు వర్షాలే లేవు. పంట ఇంటి ముఖం చూడక ఎంత కాలమవుతుందో. రైతు కంట్లో కళ లోపించి ఎంత కాలం అవుతుందో! ‘అయ్యవారికి దండం పెట్టు’ అని మా బాసు అన్నాడో లేదో ‘వెళ్లవయ్య వెళ్లు’ అంటున్నాడు రైతు. పచ్చని పల్లె ఎడారై పోయింది. అందుకే తల్లిలాంటి పల్లెని విడిచి మా బంగారయ్య నన్ను పట్నానికి తీసుకువచ్చాడు. ఊళ్లో ప్రతి ఇంటికి మేము పండగ చుట్టమే. ఈ సిటీలో పేవ్మెంట్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలే మాకు దిక్కయ్యాయి. ఐటమ్ సాంగ్‌లకు అలవాటు పడిపోయిన కళ్లు... నేను డ్యాన్స్ చేస్తుంటే ‘ఐతే ఏంటి?’ అని వెక్కిరిస్తున్నాయి. గంగ్నమ్ డ్యాన్స్‌ల కాలంలో గంగిరెద్దుల డ్యాన్స్ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేకపోయినా, నాకోసం కాకపోయినా, మా అయ్యవారి కోసం, పండగ రోజుల్లోనైనా అతను పస్తులు ఉండకుండా చూడడం కోసం.... డ్యాన్స్ చేస్తూనే ఉంటాను....ప్లీజ్ ఇప్పటికైనా నా ఆత్మకథ ఎవరైనా రాయరూ! - యాకుబ్ పాషా -
సంక్రాంతి పాటల పల్లకి
వీనుల విందు వెండితెరపై బంగారంలా మెరిసిన సంక్రాంతి పాటలను పాడుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ మూడు పాటలు ఉన్నాయి. మురిపెంగా పాడుకోండి... గాలిపటాన్ని ఆట పట్టించండి. ‘బావల వీపులు తప్పెట్లోయ్’ అంటూ పల్లెల్లోని అల్లరిని గుర్తు తెచ్చుకోండి. మురిపాల సంక్రాంతిని ముంగిట్లోకి తీసుకురండి. ఇక మీదే ఆలస్యం. గొంతు సవరించండి... 1 పల్లవి: పదపదవే వయ్యారి గాలిపటమా (2) పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్కచూపు చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా పదపదవే వయ్యారి గాలిపటమా చరణం : 1 ప్రేమగోలలోన చిక్కిపోయినావా నీ ప్రియుడున్న చోటుకై పోదువా ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా నీ ప్రియుడున్న చోటుకై పోదువా నీ తళుకంతా నీ కులుకంతా అది ఎందుకో తెలుసును అంతా ॥ చరణం : 2 నీకు ఎవరిచ్చారే బిరుదు తోక కొని తెచ్చావేమో అంతేగాక ఆ... నీకు ఎవరిచ్చారో బిరుదు తోక కొని తెచ్చావేమో అంతేగాక రాజులెందరూడినా మోజులె ంత మారినా తెగిపోక నిల్చె నీ తోక ॥ చరణం : 3 నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ॥ వగలాడివిలే జగదంతవులే దిగిరాకుండా ఎటులుందువులే ॥ చిత్రం : కులదైవం (1960) రచన : కొసరాజు సంగీతం : మాస్టర్ వేణు గానం : ఘంటసాల, జమునారాణి 2 పల్లవి : భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో చరణం : 1 గుమ్మడంటి గుమ్మడు మాయదారి గుమ్మడు కొప్పులో పూలెట్టి తుప్పర్లోకి లాగాడు గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో కుప్పల్లో ఇల్లుందా అల్లుణ్ణే కుప్పమ్మా అత్తంటికెళదాము రమ్మంటే తప్పమ్మా తప్పొప్పులిప్పుడై తలబోసుకుందామా తలలంటుకున్నాక తలబోసుకుందామా గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో హరిలో... రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరి కోసమైతే తపస్సులు హరి హరి హరిదాసుకైతే కాసుల హరి హరి దాసుని తప్పులు దండనతోసరి హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి... దండం అంటే రెండర్థాలు చేతులు రెండు కలిపేదొకటి వాతలు నిండుగా వేసేదొకటి హొయ్... చేతులు రెండు కలిపేదొకటి వాతలు నిండుగా వేసేదొకటి సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరా హరా సరా హరా మ్మ్... సరి సరి హరిలో... రంగహరి... భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో చరణం : 2 బావల వీపులు తప్పెట్లోయ్ తాగినకొద్ది తప్పట్లోయ్ బావల వీపులు తప్పెట్లోయ్ తాగినకొద్ది తప్పట్లోయ్ అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్ అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్ మరదళ్ల బుగ్గలు బొబ్బట్లోయ్ కొరికినకొద్దీ దిబ్బట్లోయ్ మరదళ్ల బుగ్గలు బొబ్బట్లోయ్ కొరికినకొద్దీ దిబ్బట్లోయ్ అవి దొరికేదాకా ఇక్కట్లోయ్ దిబ్బట్లోయ్ బొబ్బట్లోయ్ భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో చిత్రం : భోగిమంటలు (1981) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : రమేష్‌నాయుడు గానం : బాలు, సుశీల, బృందం 3 సాకీ : కలికి దిద్దిన ముగ్గు తళతళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెద ఓ తుమ్మెద పల్లవి : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా... ఆ... పేరంటం ఊరంతా... ఆ... ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో పొంగే హేమంత సిరులు చరణం : 1 మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ నమ్మే మన పల్లెటూళ్లు న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ చెబుతాయి స్వాగతాలు బీద గొప్పోళ్లనే మాటలేదు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు... ॥ చరణం : 2 పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్లు జల్లు మాటే మకరందము చూపే సిరి గంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేజువాణి జోడు మద్దెళ్లనీ మోగుపోనీ చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే... ॥ చిత్రం : సోగ్గాడి పెళ్లాం (1996) రచన : భువనచంద్ర సంగీతం : కోటి గానం : ఎస్.పి.బాలు, చిత్ర కూర్పు : డి. నాగేష్ -
ఊరంతా సంక్రాంతి జగమంతా క్రాంతి
ఇంటి ముంగిళ్లను అలరించే రంగవల్లులు... హరిలో రంగ హరీ... అంటూ శ్రావ్యంగా సాగే హరినామ సంకీర్తనలతో చిరుచీకట్లలో దర్శనమిచ్చే హరిదాసులు... అంబపలుకు జగదంబ పలుకు అంటూ డమరుకంతో బుడబుక్కల వాళ్లు... అయ్యవారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ బసవన్నతో విన్యాసాలు చేయించే గంగిరెద్దుల వాళ్లు... కొత్తల్లుళ్ల వైభోగాలు... ముగ్గులుదిద్దే ముద్దుగుమ్మలు ఒక పక్క, కోడి పందాలు, పేకాటలు, భోగి మంటల సంరంభాలు ఇంకోపక్క, అరిసెలు, జంతికలు, నువ్వుండలు తదితర పిండి వంటల ఘుమఘుమలు వేరొకపక్క... మనోజ్ఞమైన ఈ దృశ్యాలన్నీ కళ్లకు కట్టేది ఒక్క సంక్రాంతి సమయంలోనే. సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు... ముందుగా వాకిళ్లు ఊడ్చి, అందమైన రంగవల్లికలు తీర్చిదిద్ది... వాటిలో గొబ్బెమ్మలను పెట్టడం తెలుగింటి సంప్రదాయం. దీనినే సంక్రాంతి నెలపట్టడమంటారు. సంక్రాంతి ముగ్గులు... గొబ్బెమ్మలు హేమంత రుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం వల్ల సున్నంలోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఆడపిల్లలు ఎంతో ఒద్దికగా వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన వారిలో ధారణశక్తి పెరుగుతుంది. గొబ్బి శబ్దం పుట్టిందిలా... గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. గోపి, గోపిక, గోపియ, గోబియ, గొబ్బియ, గొబ్బిగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా, గొబ్బెమ్మ (గోపెమ్మ)లను గోపికలుగా భావిస్తూ వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మను కృష్ణునిగా, తక్కిన ఎనిమిది గొబ్బెమ్మలను ఆయన అష్టభార్యలుగా గుర్తించాలంటారు. మరికొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యుడికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకు సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరిరోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని ఒక నమ్మకం. రంగురంగులుగా తీర్చిదిద్దిన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్లేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటినో తెలియ చేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని కొందరు చెబుతారు. ఇలా గొబ్బెమ్మల వెనుక అంతరార్థాలెన్నో! సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు. అటు కుర్రకారును, ఇటు నడికారును ఉత్సాహపరుస్తూ మూడుకాళ్ల ముదుసలి వాళ్లు చేసే సందడి భోగిమంటలు. పాతదనాన్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తేనే కొత్తదనపు సొబగులు సమకూరుతుంటాయి. అందుకు ప్రతీకగానే తెల్లవారు ఝామునుంచే ఇంటిలో ఉన్న పాత కలపను, పనికిరాని సామగ్రిని తీసుకుని నాలుగురోడ్ల కూడలికి పరుగులు తీస్తారు కుర్రకారు. కణకణ మండే భోగిమంటలలో ఆ పాతవాసనలు కొట్టే పనికిరాని, విరిగిపోయిన సామగ్రిని దగ్ధం చేసి, ఎముకలను కొరికే చలిని తరిమికొట్టే ఆ వెచ్చదనపు వైభోగాన్ని ఆస్వాదించడం ఎప్పటికీ చెరిగిపోని ఓ నులివెచ్చటి జ్ఞాపకం. బూజుపట్టిన పాత ఆలోచనలను, ఇతరుల మీద పెంచుకున్న పగ, ఈర్ష్య, అసూయ, కుళ్లు, కుత్సితం, కుతంత్రం మొదలైన వాటిని కూడా ఆ మంటలలో కాల్చి వేసి, హృదయాన్ని ప్రేమతో నింపుకోమని చెప్పడం అందులోని అంతరార్థం.ఇక భోగిపళ్లు అంటే పిల్లలకు దృష్టిదోషం, అనారోగ్యం తదితర దోషాలు తొలగిపోవడానికి పెద్దవాళ్లు చేసే ఓ వేడుక. పిల్లలకు ఉదయమే తలంటిస్నానం చేయించి, కొత్తబట్టలు కట్టబెట్టి, నుదుట కుంకుమ బొట్టుపెట్టి చక్కగా ముస్తాబు చేస్తారు. ఇక సాయంకాలం వేళ అమ్మలక్కలను పిలిచి, పేరంటం చేస్తారు. ఇంటిలోని పెద్దలు, పేరంటానికి వచ్చిన వారందరూ ఒక్కొక్కరుగా వచ్చి మూడేసి పిడికిళ్ల రేగుపళ్లు, పూలరెక్కలు, చిల్లరపైసలను దిష్టి తీసినట్టుగా వారి తలచుట్టూ ముమ్మారు తిప్పి, తలమీద నుంచి కిందికి దొర్లేలా పోస్తారు. ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడికి రేగుపళ్లంటే చాలా ఇష్టం. అంతేగాక, రేగుపళ్లలో ఎన్నో ఔషధగుణాలుంటాయట. సూర్యభగవానుడి ఆశీస్సులతోబాటు, అర్కఫలాల్లోని ఔషధగుణాలు కూడా పిల్లలకు అందాలన్నది పెద్దల ఆకాంక్ష. రెండవ రోజు మకరసంక్రాంతి లేదా మకర సంక్రమణం. సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించించడమే ఉత్తరాయణ పుణ్యకాలమంటారు. ఎందుకంటే ఉత్తరాయణమనేది దేవతలకు పగటికాలం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే పర్వకాలం. అందుకే ఉత్తరాయనానికి అంతటి ప్రాధాన్యత. పెద్ద పండుగ అని ఎందుకంటారు? సంక్రాంతిని పెద్ద పండుగ అనటానికి మరో కారణమేమిటంటే తొలిపంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. బుడబుక్కలవాళ్లు చక్కటి తత్వాలు చెబుతారు. హరిదాసులు దైవభక్తిని ప్రబోధిస్తారు. పంటలు పండి, ధాన్యంతో గాదెలు నిండిన రైతులు హరిదాసులకు, బుడబుక్కలవాళ్లకు, విప్రవినోదులకు, అందరికీ ధాన్యం కొలుస్తారు. కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు వంటి వాటిని కూడా సంతోషంగా వారికి సమర్పించుకుంటారు. ఇక గంగిరెద్దులు తమ విన్యాసాలతో అందరికీ ఆనందాన్ని పంచుతాయి. సాక్షాత్తూ శివుడి వాహనమే తమ ఇంటి ముంగిటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తాయి. ఆ ఆనందానుభూతులతో ఇంటిలోని పాత, కొత్తబట్టలు వాటి మూపురానికి కప్పి, వాటిని ఆడించే వారికి ధాన్యాన్ని, డబ్బును కానుకగా ఇస్తారు. దానితో ఆ మూగజీవాల కడుపు నిండుతుంది, వాటిని ఆడించే వారికి గ్రాసం లభిస్తుంది.గాలిపటాలు: కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎగరవేయడాన్ని పిల్లల ఆటగా భావిస్తారు కానీ, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదులో సంక్రాంతిని పతంగుల పండుగగానే పేర్కొంటూ పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేసే క్రమంలో గాలివాలు ఎటునుంచి ఎటువైపు వీస్తోందో తెలుస్తుంది. తద్వారా వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి అనే విషయం అనుభవజ్ఞులైన రైతులకు అవగతం అవుతుంది. అదేవిధంగా గాలిపటాల ఆట వల్ల ఏకాగ్రత అలవడుతుంది. బాధలు, కష్టాలు, దిగుళ్లు అన్నీ మర్చిపోయి మనసులో ఉల్లాసం, ఉత్సాహం పరవళ్లు తొక్కుతాయి. గాలిపటాలను ఎగుర వేసేటప్పుడు తెగిన గాలిపటంతోపాటే మన దురదృష్టం కూడా గాలి వాలుకి కొట్టుకుపోతుందన్నది తాత్వికుల భావన. సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఇది సూర్యభగవానుడికి, విష్ణుదేవుడికి సంబంధించిన పండుగ. ఈ రోజు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫల దాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి. ఈ కాలంలో నువ్వుల వాడకం శుభప్రదం. రుతుపరంగా కూడా చల్లటి చలికాలం కాబట్టి, వేడి చేసే వస్తువైన నువ్వులు తినడం ఆరోగ్యపరంగా మంచిది. అందుకే సంక్రాంతినాడు చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన ఉండలను భుజించడం, చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మంచిగుమ్మడి కూర వాతం కలిగిస్తుంది కాబట్టి, దానికి విరుగుడుగా నువ్వుండలు తినడం మంచిదంటారు. మూగజీవుల ఆనందాన్ని కనుమా... సంక్రాంతి మరునాడు జరుపుకునే పండుగ కనుమ. దీనికి రైతుల పండుగ అనిపేరు. కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేసి, పేడతో అలికి బియ్యప్పిండితో అందంగా ముగ్గులు పెడతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులను, వ్యవసాయంలో తమకెంతగానో తోడ్పడే ఎడ్లను శుభ్రంగా కడిగి గిట్టలను, కొమ్ములను కుంకుమతోటీ, పూలతోటి అలంకరించి, కృతజ్ఞతాపూర్వకంగా పూజిస్తారు. వ్యవసాయ పనిముట్లను కూడా పూజలో ఉంచుతారు. అనంతరం పశువుల కొట్టాలలోనే పొంగలి వండి నైవేద్యం పెడతారు. ఆ పొంగలిలో పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో ‘పొలి’ చల్లుతారు. అనంతరం బాగా పండి ఉన్న పొలాలకు మంచి గుమ్మడికాయ పగలగొట్టి దిష్టితీస్తారు. ఆ తరువాతు ఇంతకు ముందే సిద్ధం చేసి ఉంచిన పొంగలిని పశువులకు తినిపిస్తారు. సాయంత్రం పశువులను అలంకరించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. కోడిపందాలు, ఎడ్లపందాలు నిర్వహిస్తారు. కనుమ తరువాతి రోజు ముక్కనుమ. ఈ రోజు కూడా పశువులను అలంకరించి ఊరేగిస్తారు. ఈవేళ మాంసాహారులు తప్పనిసరిగా మాంసాహార వంటకాలను భుజిస్తారు. మాంసం తిననివారు మినుములతో వండిన గారెలను కడుపారా ఆరగిస్తారు. కనుమనాడు కాకి కూడా తలను నీటిలో ముంచి స్నానం చేస్తుందంటారు. అంటే కనుమనాటి స్నానం ఫలప్రదమన్న మాట. అదేవిధంగా కనుమనాడు కాకికూడా ప్రయాణం చేయదని సామెత. అంటే కనుమనాడు శుభ్రంగా స్నానం చేసి, ఇంటిపట్టునే ఉండి కడుపునిండా భుజించడం మంచిదని పెద్దలు చెప్పిన మాటగా అర్థం చేసుకోవచ్చు. పండుగలనేవి మనుషులకే కాదు... మన పోషణలో చేదోడువాదోడుగా ఉన్న మూగజీవాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనేది కనుమ సంప్రదాయం. - డి.వి.ఆర్.భాస్కర్ గుమ్మడి కాయ దానం ఎందుకంటే..? సంక్రమణ కాలంలో లేదా ఉత్తరాయణ పుణ్యకాలంలో కూష్మాండ దానం చేయడం సంప్రదాయం. ఎందుకంటే శ్వేత వరాహకల్పం ఆరంభంలో యజ్ఞ వరాహమూర్తి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా ఈ పుణ్యకాలంలో కూష్మాండం (గుమ్మడి పండును) దానం చేయాలని, అలా దానం చేస్తే సకల బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసినట్టవుతుందని పురాణాలు చెబుతున్నాయి. బొమ్మల కొలువు సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడం తెలుగునాట కొన్ని ప్రాంతాలలో ఆచారం. బ్రహ్మకొలువునే బొమ్మల కొలువుగా చెప్పుకుంటున్నాము. ఇంటిలోని దేవుళ్లు, దేవతల ప్రతిమలను ఒక వరుసలోనూ, ఇతర బొమ్మలను మరో వరుసలోనూ అందంగా పేర్చి, పేరంటం చేస్తారు. చూడవచ్చిన వారందరికీ పండు, తాంబూలం, శనగలు ఇచ్చి ఆశీర్వాదాలు అందుకుంటారు. ఉత్తరాయన దానాలు... ఉత్తమ ఫలాలు... అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలంలో కన్యాదానం, వస్త్రదానం, ధాన్యం, ఫలాలు, విసనకర్ర, సువర్ణం, కాయగూరలు, దుంపలు, తిలలు (నువ్వులు), చె రుకు, గోవులను దానం చేస్తే మంచిది. ఉత్తరాయణం ఉండే ఆరు నెలల్లో (186 రోజులు) పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, యమున తదితర పుణ్యనదుల్లో స్నానమాచరించి దీపం, నువ్వులు, బియ్యం వంటి వాటిని పండితులకు, బీదవారికి దానం చేయటం వల్ల ఉత్తమగతులు కలుగుతాయని, కన్నెపిల్లలకు కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడని, ఉద్యోగులు, వ్యాపారులు, చేతివృత్తిదారులకు రాణింపు లభించడంతోబాటు సకల శుభాలు కలుగుతాయని పురాణోక్తి. ఉత్తరాయణ పుణ్య కార్యాలు... నదీస్నానం, సూర్య నమస్కారాలు, భూమి పూజలు, నూతన గృహప్రవేశాలు, వేదాధ్యయనం, ఉపనయనం, వివాహం, విద్యారంభం తదితర శుభకార్యాలు చేయటం, ఆయా కార్యక్రమాలు తలపెట్టిన వారికి సహకరించటం వల్ల ఆయుష్షు పెరిగి ఆరోగ్య భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. -
సందేశ సంక్రాంతి
స్టేట్స్ సెలబ్రేట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు...ఇతర రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండగ ఘనంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఏ రకంగా జరుపుకున్నా సారాంశంలో మాత్రం సంక్రాంతి అక్షరాల పంటల పండగే. గ్రామానికి పెద్ద పీట వేసే పండగే. వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారంటే... లోహ్రి: పంజాబ్ పిల్లలు ఇంటింటికీ వెళుతూ జానపద పాటలు పాడుతారు. కొత్తగా పెళ్లయిన దంపతులను ఇంటికి ఆహ్వానిస్తారు. లోహ్రి తరువాత రోజు నుంచి ‘ఆర్థిక నూతన సంవత్సరం’ మొదలవుతుంది. మాఘ్ బిహు: అసోం ‘మేజీ’ పేరుతో వెదురు కర్రలతో పందిళ్లు వేసుకొని అందులో విందులు చేసుకుంటారు. మరుసటి రోజు సాయంత్రం ఈ మేజీలను తగలేసి అగ్నిదేవుడిని పూజిస్తూ, శ్లోకాలు చదువుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీన్ని చూస్తారు. మన దగ్గర కోడిపందేలలాగే ఇక్కడ ‘బర్రెల పందేలు’ జరుగుతాయి. మకర్ సంక్రాత్: మహారాష్ట్ర ఉదయాన్నే నువ్వు గింజలు నానబెట్టిన నీళ్లతో స్నానం చేస్తారు. నలుపు దుస్తులు ధరిస్తారు. పిల్లలకు చెరుకు ముక్కలు, బియ్యంతో కలిపిన నీళ్లలో స్నానం చేయిస్తారు. లడ్డూలు పంచుతారు. మాఘ సాజ: హిమాచల్‌ప్రదేశ్ హిమాచల్‌ప్రదేశ్‌లో ‘మాఘ సాజ’ పేరుతో మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండగలో కనిపించే ప్రత్యేకత ‘తులాదాన్’. పూజారులను ఇంటికి పిలిచి ధాన్యాలతో తులాభారం చేస్తారు. సక్రాత్: హర్యానా హల్వా, ఖీర్లాంటి తీపి వంటకాలను తయారు చేస్తారు. పెళ్లయిన అక్కల ఇంటికి తమ్ముళ్లు వెళతారు. అక్కాబావలకు కొత్తబట్టలు కానుకగా ఇస్తారు. ఈ సంప్రదాయాన్ని ‘సిడ్హా’ అంటారు. -
హరిలో రంగ హరి...
పరమార్థం తెల్లవారు జామున ధనుర్మాసపు చలి... వెచ్చదనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. మంచు బిందు కిరీటాలతో బంతి చామంతులు దర్పంగా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ చెబుతున్నట్లుగా ఉంటుంది. ‘ఈ చలికి నేనే లేవలేకుండా ఉన్నాను... మిమ్మల్నేం లేపగలను’ అంటున్నట్లు కనిపిస్తుంది కూత మరచి రెక్కలు ముడుచుకుంటున్న కోడి. కుంచెను మంచులో ముంచి గీసినట్లుగా ఉంటుంది ప్రకృతి సుందర చిత్రం. ఆ నిశ్చల చిత్రంలో చలనం వచ్చేలా చేస్తుంది హరిదాసు చిడతల శబ్దం. దీంతో పాటే పాట వినిపిస్తుంది... ‘తక్కువేమీ మనకు రాముడొక్కడుండు వరకు’... భక్త రామదాసు కీర్తన హరిదాసు నోటి నుంచి వినిపిస్తూ పరిసరాలకు మేలుకొలుపు పాడుతుంది. ఉదయాన్నే పదాల రూపంలో, పాటల రూపంలో పాజిటివ్ ఎనర్జీ మనసులోకి వచ్చి చేరితే అంత కంటే సంతోషం ఏముంటుంది? ‘సురుల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగ... తక్కువేమీ మనకు’ ‘నాకేముంది... ఏమీ లేదు, అన్నీ తక్కువే’ అనుకోవడంలో అన్ని శక్తులూ ఉన్నా సరే, ఆత్మవిశ్వాసం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ‘నాకేమీ లేకపోవచ్చు. కానీ నేను ఆరాధించే దేవుడున్నాడు. నాకేం తక్కువ? ఏమీ లేకున్నా నాకు అన్నీ ఉన్నట్లే’ అనుకోవ డంలో కొండంత ఆత్మవిశ్వాసం దాగుంది. ప్రేమ, అభిమానం, ఆరాధనలో పవిత్రత ఉన్నప్పుడు.. అది మహత్తరమైన శక్తిగా మారుతుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది అనే భావాన్ని చెప్పకనే చెబుతుంది ఈ కీర్తన. ప్రేమ, భక్తి ఉన్న చోట అలక అందమైన అలంకార మవుతుంది. ‘పలుకే బంగారమాయెనా?’ అని ప్రశ్నిస్తుంది. ఆ అలక తీవ్రతను పెంచుతూ- ‘ఎంత పని చేసితివి రామా/ నిన్నేమందు సార్వభౌమ రామా/పంతమా నా మీద పరమ పావన నామ’ అంటుంది. ‘ఉన్నాడో లేడో భద్రాద్రియందు’ అనే వ్యూహాత్మక సందేహమవుతుంది. ‘నను గన్న తండ్రి నా విన్నపము విని తానెన్నడు రాడాయె’ అని విచారమవుతుంది. ‘అబ్బబ్బా రామనామం అత్యద్భుతము’ నుంచి ‘దినమే సుదినము సీతారామ స్మరణమే పావనము’ వరకు హరిదాసు నోటి నుంచి ఎక్కువగా రామదాసు కీర్తనలు వినిపిస్తాయి. రామదాసు కీర్తనలు ‘భక్తుడు భగవంతుడికి చేసిన విన్నపాలు’ మాత్రమే అన్నట్లుగా అనిపించినా... వాటి సారాశంలో మాత్రం జీవితానికి అవసరమయ్యే ధార్మికనీతిని అందిస్తాయి. భౌతిక సుఖాల కంటే భగవంతుడి ఆరాధనలోని గొప్పదనం ఏమిటో ఈ కీర్తనలు తెలుపుతాయి. కేవలం రామదాసు కీర్తనలు మాత్రమే కాదు. క్షేత్రయ్య పదాలు, విష్ణునామ సంకీర్తనలు, భాగవత పద్యాల వరకు వీనుల విందుగా పాడుతూ సంక్రాంతి పర్వదిన అందాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాడు హరిదాసు. ‘నుదుటి కుంకుమ రవి బింబముగా కన్నులు నిండుగా కాటుక మెరియగా కాంచన హారము గళమున మెరియగా పీతాంబరములు శోభలు నిండగ’ అంటూ ఇంటింటికీ లక్ష్మీదేవిని ఆహ్వా నించే హరిదాసు పాటకు మాత్రమే పరిమితమైపోడు. ఈ మాసంలో కఠిన ఉపవాసాలు చేస్తాడు. ఎన్నో కిలోమీటర్లు కాలినడకన వెళతాడు. తాను సేకరించిన దానంలో ఎంతో కొంత ఇతరులకు పంచి పెడతాడు. హరికి నిజమైన దాసుడు అనిపించుకుంటాడు. పిట్టకథ: విలువైన అక్షయ పాత్రను ఎవరికి ప్రదానం చేయాలనే విషయంపై దేవతలు, త్రిమూర్తులు తర్జన భర్జన పడి, ‘గాన కచేరి’లో గెలిచిన వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పోటీలో నారదుడు, తుంబు రుడు, గాన గంధర్వులు, సప్త రుషులు పాల్గొన్నారు. వీరితో పాటు హరిదాసు కూడా పాల్గొ న్నాడు. హరిదాసు పాడి నప్పుడు శ్రీవిష్ణువు ఉండే వైకుంఠంలోని ఏడు గంటలూ ఉప్పొంగిపోయి సరి గమలు పలికాయట. అప్పుడు విష్ణువు అక్షయపాత్రను హరిదాసుకు ఇస్తూ... ‘ఇందులో బియ్యం వేసినవారు అష్టైశ్వ ర్యాలు, భోగభాగ్యాలు, సుఖసంతోషా లతో వర్థిల్లుతారు’ అని వరం ఇచ్చాడట. అందుకే హరిదాసు మనకంత ఆప్తుడు అయ్యాడు. -
3భాగాలు 4శక్తులు
ఆకారం ఒక శక్తిని ప్రేరేపిస్తే... మాంజా కట్టే స్థానం గాలిపటంపై పనిచేసే మిగిలిన మూడు శక్తులను నియంత్రించేందుకు పనికొస్తుంది. ఒకటేమో పైపైకి వెళ్లమంటుంది... ఇంకోటి నేలకేసి లాగుతూంటుంది. ముచ్చటగా మూడోది ముందుకు తోస్తూంటే... చిట్టచివరిదైన నాలుగోది వెనక్కు లాగేస్తూ ఉంటుంది. ఏంటీ ఈ ఒకటి, రెండు, మూడు, నాలుగు? సంక్రాంతికి ఆకాశానికి శోభనిచ్చే పతంగులు అలా గాల్లో ఎగిరేందుకు... ఎగురుతూనే ఉండేందుకు అవసరమైన శక్తుల గురించి ఈ వర్ణనంతా! సంక్రాంతి వచ్చిందంటే చాలు... పతంగులు పుచ్చుకుని మిద్దెలెక్కేసి ఆనందించడం బాగానే ఉంటుంది గానీ... దాని వెనుక ఎంత తంతు ఉందన్నది మాత్రం తక్కువ మందికి తెలుసు. గాలిపటాలు రకరకాల ఆకారాల్లో సైజుల్లో ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ఉన్న సూత్రం మాత్రం ఒక్కటే... ఆకారం మొదలుకొని, గాలిపటానికి దారం ఎక్కడ కట్టాలి? దానికి మాంజా ఎలా తగిలించాలి? అన్న అంశాలన్నీ కీలకమే. ఆకారం ఒక శక్తిని ప్రేరేపిస్తే... మాంజా కట్టే స్థానం గాలిపటంపై పనిచేసే మిగిలిన మూడు శక్తులను నియంత్రించేందుకు పనికొస్తుంది. గాలిపటంలో ఉండే భాగాలు స్థూలంగా మూడు. కొబ్బరిచెట్టు ఈనెలతో లేదంటే వెదురుతో తయారయ్యే చట్రం ఒకటైతే... ఈ చట్రాన్ని మాంజాతో కలిపే భాగం రెండోది. ఇంగ్లీషులో దీన్ని బ్రిడిల్ అంటారు. ఇక మూడోభాగం... గాలిపటాన్ని నియంత్రించేందుకు మన చేతుల్లో ఉండే మాంజా! చిత్రమైన విషయం రంగు రంగుల కాగితాలు అతికించిన చట్రం గాల్లో పైకి ఎగిస్తే... బ్రిడిల్, మాంజాలతో దాని వేగాన్ని, దిశను మనం నియంత్రిస్తూంటాం అన్నమాట! గాలిపటం ఆకారం ఏదైనప్పటికీ అది గాల్లో సక్రమంగా ఎగరాలంటే... నాలుగు శక్తులను నియంత్రించాల్సి ఉంటుంది. మొదటిది లిఫ్ట్. గాలిపటంపై కదిలే గాలి దాన్ని పైకి తోస్తూంటుంది కదా... దాన్నే లిఫ్ట్ అంటారు. గాలిపటం పైభాగంలో ఎక్కువ, కిందిభాగంలో తక్కువ గాలి తగులుతూ ఉంటే దానికి లిఫ్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడర్థమైందా? గాలిపటాలు పైన వెడల్పుగా, కింద చిన్నసైజులో ఎందుకుంటాయో? ఇక రెండో శక్తి గురించి చూద్దాం. దీన్ని వెయిట్ అని పిలుస్తారుగానీ... గురుత్వాకర్షణ శక్తి అని కూడా అనవచ్చు. ఈ శక్తి కారణంగా ఎంత తేలికగా ఉన్న గాలిపటమైనా... కొంత సమయానికి నేలపైకి వచ్చి చేరుతుంది. ఇక మూడో శక్తి డ్రాగ్ లేదా వెనక్కు లాగేసే శక్తి. ఇది తిరోగమన శక్తి. గాలిపటం ముందు, వెనుకవైపులపై ఉండే గాలి ఒత్తిడిలోని తేడా, గాలిపటం ఉపరితలంపై గాలి తాలూకూ ఘర్షణల ఫలితంగా పుడుతుంది. ఇక చివరగా చెప్పుకోవాల్సింది థ్రస్ట్ గురించి. గాలి కదిలే దిశలో గాలిపటాన్ని కదిలించే శక్తి ఇదే. ఎగరేసే వ్యక్తి మాంజా ద్వారా చేసే కదలికలు, మాంజా తాలూకూ టెన్షన్ (వదులుగా ఉందా? గట్టిగా ఉందా? అన్నది)లపై ఇది ఆధారపడుతుంది. ఎగరేసే వ్యక్తి కొంచెం కొంచెం ముందుకు కదులుతూ మాంజాను బిగువుగా ఉంచితే థ్రస్ట్ లభిస్తుందన్నమాట. గాల్లోకి ఎగరేసేందుకు గాలిపటాన్ని మోసుకుని పరుగెత్తుకు వస్తామే... అది కూడా థ్రస్ట్‌ను సృష్టించేందుకు జరిగే ప్రయత్నమే! మొత్తమ్మీద చూస్తే.. గాలిపటం సక్సెస్‌ఫుల్‌గా గాల్లోకి ఎగరాలంటే వెయిట్ కంటే లిఫ్ట్ ఎక్కువగా ఉండాలి. అలా ఎగురుతూ ఉండాలంటే ఈ నాలుగు శక్తుల మధ్య బ్యాలెన్స్ అవసరం. అంటే లిఫ్ట్‌తో సమానమైన వెయిట్, డ్రాగ్‌కు సరిసమానమైన థ్రస్ట్ ఉండాలి. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
ప్రేమ కాచుకున్నారు...
లవ్ ఇంకో రెండు రోజుల్లో సంక్రాంతి. పండగకళ ముందస్తుగానే మా ఊరికి చేరింది. నా ముఖంలోనేతై ఏ కళా లేదు. అది దారి తప్పి ఎన్ని రోజులవుతుందో? కిటికీ దగ్గర కూర్చొని షెల్లీ పుస్తకంలో ‘ది క్లౌడ్’ కవితను చదువుకుంటున్నాను. చావుపుట్టుకల గురించి రాసిన కవి ‘ఐ చేంజ్ బట్ కాంట్ డై’ అంటున్నాడు. పుస్తకం టేబుల్ మీద పెట్టి కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తున్నాను. మేఘం కనిపిస్తుంది. సందేశం పంపనా? ఎక్కడుందని పంపేది? ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో నాకే తెలియదు. పోయిన సంక్రాంతి రోజు ఆమె భోగిమంటల దగ్గర పరిచయం అయింది. పండగ సెలవుల్లో పట్నం నుంచి వాళ్ల తాతగారి ఇంటికి వచ్చింది. గలగలా మాట్లాడేది. పది రోజుల మా పరిచయం ప్రేమగా మారింది. ఆమె సిటీకి వెళ్లిన రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. అయితే ఆ బాధను లేఖలు తీర్చాయి. ఒకరికొకరం తరచుగా ప్రేమలేఖలు రాసుకునేవాళ్లం. అంతేకాదు...సిటీకెళ్లి కాలేజీలో ఆమెను కలిసేవాడిని. మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో తెలిసిపోయింది. ఉన్నట్టుండీ ఆమె మాయమైపోయింది. పిచ్చిపట్టినట్లు రోజూ కాలేజికి వెళ్లేవాడిని... ఆమె వస్తుందని ఆశ.... ఆ ఆశ రోజూ అడియాసే అవుతున్న రోజుల్లో ఒకరోజు...ఆమె నుంచి ఫోన్ వచ్చింది. ‘సారీ’ చెప్పింది. ‘మన ప్రేమ మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ల మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. ఇంటికే కాదు మా సిటీకే కాదు, రాష్ట్రానికి చాలా దూరంగా మా అక్కయ్య వాళ్ల ఇంట్లో ఉంటున్నాను. అక్కడే చదువుకుంటున్నాను. ప్లీజ్...నన్ను మరిచిపో’’ అని చెప్పింది. ‘‘మీ అక్కయ్య ఎక్కడ ఉంటారు?’’ అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఆ తరువాత తన ఫోన్ నంబర్ మార్చేసింది. సృష్టిలోని చీకటంతా నా కళ్లలో చేరినట్లు అనిపించింది. చావాలని కూడా అనిపించింది. ఏదో గుర్తొచ్చినట్లు ‘ఐ చేంజ్ బట్ కాంట్ డై’ వాక్యాన్ని వందోసారి చదువుకున్నాను. అవును. నేను మారాలి. ఒక అమ్మాయి కోసం నేను జీవితాన్ని చీకటి చేసుకోవడం కంటే మూర్ఖత్వం ఉంటుందా? అందుకే నేను మారుతాను. తప్పకుండా మారుతాను. ఆమెను మరచిపోవడానికి, నేను మారడానికి ఎన్నో నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. విఫలమవుతూనే ఉన్నాను. విరాగినవుతూనే ఉన్నాను. ఈరోజు భోగి. అదిగో భోగిమంట. గత సంవత్సరం పవిత్రంగా, అందంగా కనిపించిన భోగిమంట...ఇప్పుడు నా గుండెలో మంటై దర్శనమిస్తుంది. ఏదో గుర్తొచ్చింది. నాకు. ప్రేమలేఖలు! ఒక లేఖలో- ‘‘సూర్యుడు రోజూ ఉదయిస్తాడట...కానీ నీ కంటి వెలుగులో తప్ప....ఎక్కడా చూడలేదు. నీ నవ్వుల మెరుపుల్లో తప్ప చంద్రుడి వెన్నెలను ఎక్కడా చూడలేదు’ అని రాశాను. ఎంత పిచ్చివాడిని! ఇప్పుడు వెలుగూ లేదు. వెన్నెలా లేదు. నా బాధ ఆమె పట్ల ద్వేషంగా మారకముందే...ఆమెను పూర్తిగా మరచిపోవాలి. ఈ ప్రేమలేఖలు నా దగ్గర ఉన్నంత వరకు ఆమెను మరిచిపోదా మనుకున్నా మరువలేకుండా ఉన్నాను. అందుకే భోగిమంటల్లో వీటిని కాల్చేయాలి. ఆమెను నా మనసు నుంచి తుడిచేయాలి. ప్రేమలేఖలను తీసుకొని భోగి మంట దగ్గరకు వెళ్లాను. కొద్దిసేపట్లో వాటిని మంటల్లో వేయబోతుంటే... భోగిమంటల దివ్యవెలుగుల్లో ఒక మోము నా ప్రాణమై కనిపించింది...కలా నిజామా? అనుకునేలోపే ఆమె నా దగ్గరికి వచ్చింది. ‘నేను నీకు దూరంగా ఎక్కడికో వెళ్లిపోయాననుకున్నానేగానీ... నన్ను నేను ఇక్కడే మరిచిపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. నువ్వు లేకుండా బతకలేనన్న విషయాన్ని తెలుసుకున్నాను. అదే విషయం మా అమ్మానాన్నలకు సున్నితంగా చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. ఆశీర్వదించారు. ఇక నేను నిన్ను ఎప్పటికీ విడిచి వెళ్లను. మన ప్రేమకు ఈ భోగిమంటే సాక్షి’ అంది ఆమె. మాట రాని మౌనమిది. మౌనమే గానమై... భోగిమంట నా కన్నుల పంటైన పర్వదినమిది! ఈ మంట దగ్గరే మేమిద్దరం ‘ప్రేమ’ కాచుకున్న సువర్ణదినమిది. - సుహాస్ -
తెలుగిళ్లు... తియ్యని లోగిళ్లు
స్వీట్ సంక్రాంతి వరుసగా మూడు పండుగలు! భోగి-సంక్రాంతి-కనుమ. భోగి వెచ్చగా.. సంక్రాంతి పచ్చగా.. కనుమ ‘పశు’పచ్చగా! కామన్‌గా... మూడూ... తియ్యతియ్యగా! నాలుగు రోజుల ముందే... తియ్యదనాన్ని ఆస్వాదించండి. పండగల్ని తియ్యగా ఆహ్వానించండి. కొబ్బరి బూరెలు కావలసినవి: బియ్యం - 1 కిలో, బెల్లం - అర కిలో, కొబ్బరి చిప్పలు - 2, నెయ్యి - 2 చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: బియ్యాన్ని ఓ రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి, తడి పోయేదాకా ఆరబెట్టి పిండి చేసుకోవాలి. కొబ్బరి తీసి సన్నగా తురుముకోవాలి. బెల్లంలో నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. ఇందులో నెయ్యి వేసి, కరిగాక కొబ్బరి, పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫొటోలో చూపినట్టుగా ఒత్తుకుని నూనెలో వేయించాలి. రవ్వలడ్డు కావలసినవి: బొంబాయి రవ్వ - అర కిలో, చక్కెర - అర కిలో, ఎండు కొబ్బరి తురుము - 1 కప్పు, పాలు - 1 కప్పు, యాలకుల పొడి - 1 చెంచా, డ్రై ఫ్రూట్స్ - కావలసినన్ని, నెయ్యి - తగినంత తయారీ: డ్రై ఫ్రూట్స్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వను ఎక్కువ రంగు మారనీకుండా కొద్దిగా వేయించుకోవాలి. కొబ్బరిని కూడా వేయించి పెట్టుకోవాలి. చక్కెరను మిక్సీలో వేసి పొడి చేయాలి. పాలు వేడి చేసుకోవాలి. ఓ గిన్నెలో బొంబాయి రవ్వ, చక్కెర పొడి, కొబ్బరి, యాలకుల పొడి వేయాలి. వేడి పాలను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండ కట్టకుండా కలుపుకోవాలి. చివరగా చేతులకు నెయ్యి రాసుకుని, లడ్డూలు ఒత్తుకుని, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి. జంతికలు కావలసినవి: బియ్యపు పిండి - 2 కప్పులు, శనగపిండి - 1 కప్పు, నువ్వులు - 2 చెంచాలు, వాము - 1 చెంచా, కారం - 1 చెంచా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా తయారీ: ఓ గిన్నెలో బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు, వాము, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో గోరు వెచ్చని నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను జంతికల కుడక (మురుకుల గొట్టం)లో వేసుకుని, ఒత్తి, కాగిన నూనెలో వేయించుకోవాలి. తీపి గవ్వలు కావలసినవి: మైదా - అరకిలో, నెయ్యి - 25 గ్రా., చక్కెర - పావు కిలో, యాలకుల పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా తయారీ: మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వీటిని గవ్వల్లాగా చేసుకుని, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కెరలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక యాలకుల పొడి చల్లి తీసేయాలి. ఈ పాకాన్ని వేయించి పెట్టుకున్న గవ్వల మీద పోయాలి. (పాకం ఇష్టం లేనివాళ్లు చక్కెరను పొడి చేసి, మైదా పిండిలో వేసి కలిపేసుకోవచ్చు.) కజ్జికాయలు కావలసినవి: మైదా - అర కిలో, నెయ్యి - 4 చెంచాలు, నీళ్లు - తగినన్ని, కొబ్బరి తురుము - 1 కప్పు, బొంబాయి రవ్వ - 1 కప్పు, చక్కెర - 1 కప్పు, యాలకుల పొడి - 1 చెంచా, జీడిపప్పులు - 10 తయారీ: మైదాలో నెయ్యి, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిమీద తడిగుడ్డను కప్పి పది నిమిషాలు పక్కన ఉంచితే మృదువుగా అవుతుంది. బొంబాయి రవ్వ, కొబ్బరి తురుములను వేర్వేరుగా వేయించుకోవాలి. ఓ బౌల్లో రవ్వ, కొబ్బరి, చక్కెర, యాలకుల పొడి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు వేసి మిక్స్ చేయాలి. మైదా పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల్లా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి, కజ్జికాయల్లాగా ఒత్తుకోవాలి. (కొన్ని ప్రాంతాల్లో ఫిల్లింగ్ కోసం... వేరుశెనగలు, బెల్లం సమపాళ్లలో తీసుకుని, రెండిటినీ వేర్వేరుగా పొడి చేసుకుంటారు. తర్వాత ఈ రెండిటినీ కలిపి మెత్తగా దంచుకుని, ఈ మిశ్రమంతో కజ్జికాయలు చేసుకుంటారు. నువ్వులు, బెల్లం మిశ్రమంతో కూడా చేసుకుంటారు). బూందీ అచ్చు కావలసినవి: శనగపిండి - 1 కప్పు, బియ్యపు పిండి - అర కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - చిటికెడు, నెయ్యి - 1 చెంచా, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: శనగపిండి, బియ్యపు పిండులను ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లు పోసి, జారుడుగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. చిల్లుల గరిటె ద్వారా పిండిని నూనెలో పోస్తే బూందీలా వస్తుంది. దాన్ని బాగా వేయించి తీసేయాలి. ఆపైన బెల్లంలో ఓ కప్పు నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. ఇందులో నెయ్యి వేసి కలిపి, తర్వాత బూందీ, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ప్లేటుకు నెయ్యి కానీ నూనె కానీ రాసి, మొత్తం మిశ్రమాన్ని అందులో పోయాలి. దాన్ని అచ్చులాగా చేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. నువ్వుల లడ్డూ కావలసినవి: నువ్వులు - పావు కిలో, బెల్లం - అర కిలో, నీళ్లు - అర కప్పు తయారీ: నువ్వుల్లో రాళ్లు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వాటిని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి... బెల్లం, నీళ్లు వేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం అయ్యేవరకూ మరిగించాలి. ఇందులో నువ్వులు వేసి దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకోవాలి. అరిసెలు కావలసినవి: బియ్యం - 2 కిలోలు, బెల్లం - 1 కిలో, నువ్వులు - 100 గ్రా., నూనె లేక నెయ్యి - 1 కిలో తయారీ: బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టాలి. తర్వాత నీళ్లు తీసేసి, పది నిమిషాల పాటు ఓ శుభ్రమైన బట్ట మీద వేసి ఆరబెట్టాలి. తర్వాత వాటిని పిండి చేసుకోవాలి. నువ్వుల్ని దోరగా వేయించి పక్కనుంచాలి. అడుగు మందంగా ఉన్న ఓ గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి ఉండ కట్టేవరకూ పాకం పట్టాలి. ఆపైన అందులో పిండిని కొద్దికొద్దిగా వేసి కలపాలి. తర్వాత దించేసి చల్లారబెట్టి, అరిసెలా ఒత్తుకుని, నువ్వులు అద్ది నూనె లేక నేతిలో వేయించాలి. పప్పు చెక్కలు కావలసినవి: బియ్యపు పిండి - 2 కప్పులు, శనగపప్పు - 2 చెంచాలు, కారం - 1 చెంచా, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: శనగపప్పును గంటసేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత తీసేసి తడిపోయేలా ఆరబెట్టాలి. బియ్యపు పిండిలో ఉప్పు, కారం వేసి కలపాలి. తర్వాత రెండు చెంచాల వేడి నూనె వేసి బాగా కలపాలి. ఆపైన శనగపప్పు, నీళ్లు, ఇంగువ వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దమీద ఓ తడిబట్టను వేసి పావుగంట పక్కన ఉంచితే, మృదువుగా అవుతుంది. తర్వాత చెక్కల్లా ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి. సంపెంగ మొగ్గలు కావలసినవి: గోధుమ పిండి - 1 కప్పు, మైదా - 1 కప్పు, చక్కెర - 200 గ్రా., బొంబాయి రవ్వ - అర కప్పు, డాల్డా - 25 గ్రా., ఉప్పు - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: ఓ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, డాల్డా వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, వాటిని చపాతీల్లా ఒత్తి, చాకుతో గాట్లు పెట్టాలి. తర్వాత వాటిని చుట్టి, రెండు చివరలూ గట్టిగా ఒత్తి కాస్త ముడిస్తే, ఇలా మొగ్గల్లా తయారవుతాయి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక, దాన్ని వేయించి పెట్టుకున్న సంపెంగ మొగ్గల మీద పోయాలి. పెసర సున్నుండలు కావలసినవి: పెసర పిండి - 1 కప్పు, మినప్పిండి - పావు కప్పు, బెల్లం - 1 కప్పు, నెయ్యి - అర కప్పు తయారీ: ఓ బౌల్లో పెసర పిండి, మినప్పిండి వేసి కలపాలి. బెల్లాన్ని బాగా మెత్తగా తురమాలి. దీన్ని కూడా పిండిలో వేసి బాగా కలపాలి. తర్వాత కరిగించిన నేతిని కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో పోసి కలుపుతూ ఉండలు చుట్టుకోవాలి. సకినాలు కావలసినవి: బియ్యం - 4 కప్పులు, నువ్వులు - అర కప్పు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లు తీసేసి, శుభ్రమైన బట్ట మీద వేసి, తడి పోయేదాకా ఆరబెట్టాలి. వీటిని పిండి పట్టాలి. ఈ పిండిలో ఉప్పు, దోరగా వేయించిన నువ్వులు, నీళ్లు వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, ఓ ప్లాస్టిక్ షీటు మీద చక్రాల్లాగా చేతితో వేయాలి. తర్వాత వీటిని నూనెలో వేయించాలి. గులాబీ పూలు (అచ్చు మురుకులు) కావలసినవి: బియ్యపు పిండి - 2 కప్పులు, మైదా - 4 చెంచాలు, చక్కెర - 1 కప్పు, కొబ్బరి పాలు - అర కప్పు, ఉప్పు - చిటికెడు, యాలకుల పొడి - 1 చెంచా, బేకింగ్ సోడా - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, నూనె - సరిపడా. తయారీ: చక్కెరను పొడిలా చేసుకోవాలి. ఓ బౌల్లో బియ్యపు పిండి, చక్కెర పొడి, మైదా, ఉప్పు, యాలకుల పొడి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాసిన్ని నీళ్లు కూడా పోసి జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మురుకులు చేసే అచ్చుకు నూనె రాసి ఉంచాలి. నూనె కాగాక, దీన్ని ఓ నిమిషం పాటు ఆ నూనెలో ఉంచి తీయాలి. తర్వాత దీన్ని పిండిలో ఉంచి తీసి నూనెలో పెడితే పూలు పూలుగా మురుకులు వస్తాయి. (కోడిగుడ్డు తినేవాళ్లు ఒక గుడ్డు వేసుకుంటే ఇంకా ఎక్కువ గుల్లగా వస్తాయి) -
ముగ్గుగుమ్మ
కలర్స్ నాకు పండగలంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్... ఇష్టపడనివారెవరు ఉంటారు చెప్పండి! కాకపోతే నాకు సంక్రాంతి అంటే ఎక్కువ ఇష్టం. ఆ పండుగ పేరు చెబితేనే చాలా సంబర పడిపోతాను నేను. ఎందుకంటే అది సంవత్సరంలో వచ్చే తొలి పండగ కాబట్టి. ఆ పండగ అంటే నాకు ఎక్కువ ఇష్టం ఏర్పడటానికి మరో ముఖ్యమైన కారణం... ముగ్గులు. చిన్నప్పుడు మా అమ్మగారు వాకిట్లో రకరకాల ముగ్గులు వేస్తుంటే పక్కనే కూర్చుని చూసి మురిసిపోయేదాన్ని. వాటికి అమ్మతో పాటు నేను కూడా రంగులు అద్దేదాన్ని. కొంచెం పెద్దయ్యాక నేనూ ముగ్గులు వేయడం నేర్చుకున్నాను. అమ్మ అంత బాగా కాకపోయినా బాగానే వేస్తాను. సినిమాల్లోకి రాకముందు కావాల్సినంత తీరిక చిక్కేది కాబట్టి, సంక్రాంతి దగ్గర పడుతోందనగానే ముగ్గులు వేయడం మొదలు పెట్టేసేదాన్ని. కొత్త కొత్త ముగ్గులు నేర్చుకుని మరీ వేసేదాన్ని. కానీ హీరోయిన్ అయిన తర్వాత షూటింగుల్లో బిజీ అయిపోయి... అప్పుడప్పుడూ పండగ సందడిని మిస్ అయిపోతున్నాను. ముగ్గుల సంగతి పక్కన పెడితే పండగ రోజు ఇల్లంతా డెకరేట్ చేయడమంటే మహా ఇష్టం నాకు. ఇల్లంతా పూలదండలతో బాగా అలంకరించేస్తాను. పొద్దున్నే అమ్మతో కలిసి పూజ చేస్తాను. ఆ తర్వాత పిండి వంటల మీద పడిపోతాను. అసలు చక్కెర పొంగలిని తలచుకుంటేనే నోరూరిపోతుంది నాకు. మా అమ్మ చేసే పొంగలి మరీ టేస్టీగా ఉంటుందేమో... ఓ పట్టు పడతా. ఇక సంక్రాంతి స్పెషల్ అరిసెలు, కజ్జికాయల్ని కూడా కడుపు నిండా లాగించేస్తా. -
సంక్రాంతి సంబురాలు