ముగ్గుశాస్త్రం | sankranti special | Sakshi
Sakshi News home page

ముగ్గుశాస్త్రం

Published Sun, Jan 8 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

ముగ్గుశాస్త్రం

ముగ్గుశాస్త్రం

కోడికూతతో నిద్రలేచి, వాకిలూడ్చి, పేడనీటితో కళ్లాపిచల్లి ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం  భారతీయ సంస్కృతి. స్పష్టంగా చెప్పాలంటే హైందవ సంప్రదాయం. సాధారణంగా పల్లెటూళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అలవాటు. పట్టణీకరణ, నగరీకరణ పెరిగాక, అపార్ట్‌మెంట్‌ సంస్కృతి, సిమెంటు గచ్చులు, పాలిష్‌బండల మోజు పెరిగాక ఇప్పుడు నగరాల్లోనే కాదు, పల్లెటూళ్లలోనూ ముగ్గులు వేయడానికి చారెడు చోటు మిగలడం కూడా గగనమయిపోతోంది. అయినా సరే,  కళ్లాపిచల్లడం కుదరకపోయినా, రంగవల్లులు తీర్దిదిద్డడం రాకపోయినా, కనీసం చాక్‌పీస్‌తో అయినా సరే, ఉన్నచోటులోనే వాకిలిముందు ముగ్గేసేమనిపించుకునే అలవాటును ముదితలింకా మరచిపోలేదు.

ముగ్గులు ఎందుకు వేస్తారనే దానికి ఇతమిత్థంగా ఇదీ అని కారణాలు తేల్చిచెప్పలేకపోయినా, ఏ ఇంటిముందయినా ముగ్గు పడలేదంటే, ఆ ఇంటిలో ఏదో అశుభం జరుగుతోందని అర్థం. అంటే ఏ ఇంటిలోనైనా ఇంటిలోని వాళ్లు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ, ముగ్గు మాత్రం వెయ్యరు. అలా ముగ్గు లేని ఇంటికి భిక్షకులు, సాధుసన్యాసులు భిక్షకు కూడా వెళ్లరు. అందుకనే రోజూ పొద్దునా సాయంత్రం వాకిలి ఊడ్చి ముగ్గువెయ్యడమనేది విధిగా భావిస్తారు ముదితలు.


ముగ్గుల చరిత్ర: ముగ్గులు ఎప్పటినుంచి వేస్తున్నారనేందుకు చారిత్రక ఆధారాలు లేకపోవచ్చు కానీ, పురాణ కాలనుంచే వేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రసక్తి, ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేమంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక గురువున్నాడు. ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన గురువు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరిన రాజగురువుతో బ్రహ్మదేవుడు, నీతో సహా రాజ్యప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి, శుభ్రం చేసి, ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు.


 రాజాజ్ఞమేరకు రాజ్యప్రజలంతా కలసి వాకిళ్లు ఊడ్చి, వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. రాజగురువు తన ఇంటిముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి, అతని కుమారుని బతికిస్తాడు. అప్పటినుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి, ముగ్గులు గీయడం అలవాటు చేసుకుంటారు. ముగ్గువేసి దానికి రెండువైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి బయటకెళ్లి పోతుందని పెద్దలు చెబుతారు. దేవతాపూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డు గీతలు తప్పనిసరి.


ముగ్గులు.. గొబ్బెమ్మలూ...
సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బిళ్ల మీద ముళ్లగోరింట, గుమ్మడిపూలు... ఇవీ పల్లెటూళ్లలో ప్రతి ఇంటా కనిపించే దృశ్యాలు. ముగ్గుల మధ్యన ఆవుపేడతో ముద్దలు చేసి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చేమంతి వంటి పూవులను గుచ్చుతారు. వాటినే గొబ్బెమ్మలంటారు. ఆ తర్వాత ఆడపిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గొబ్బిపాటలు పాడుతూ నృత్యం చేస్తారు. దీని వెనుక ఎంతో అÆ తరార్థం ఉంది. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన ధారణశక్తి పెరుగుతుంది. ముగ్గుల గురించి ఇరుగు పొరుగు ఒకరితో ఒకరు చర్చించుకోవడం వల్ల వారిమధ్య స్నేహం పెంపొందుతుంది.


అలనాటి గోపికే నేటి గొబ్బిగా...
గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా, గొబ్బెమ్మ (గోపెమ్మ)లను గోపికలుగా భావిస్తూ వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మను కృష్ణునిగా, తక్కిన ఎనిమిది గొబ్బెమ్మలను ఆయన అష్టభార్యలుగా గుర్తించాలంటారు. మరికొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యుడని, మిగతా గొబ్బెమ్మలూ గ్రహాలకూ సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరిరోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని నమ్మకం. రంగురంగులుగా తీర్చిదిద్దిన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్లేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటినో తెలియ చేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని విశ్వాసం.


ముగ్గులు... నమ్మకాలు
ముగ్గుల వెనక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలున్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్థాలు, పరమార్థాలు, నమ్మకాలతో కూడినవి. అందులో కొన్నింటిని చూద్దాం...

నక్షత్రం ఆకారం వచ్చేలా గీసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ వైపు రాకుండా నిరోధిస్తుంది.

ముగ్గు అంటే దేవతలకు మానవులు పలికే ఆహ్వానం. అందుకే ముగ్గులు తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిఫ్ణువు ముందు నిత్యం మనోజ్ఞమైన ముగ్గులు వేస్తుందో, ఆమెకు ఏడుజన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే జీవిస్తుందని దేవీ భాగవతం చెబుతోంది. నిత్యం ఇంటిముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేస్తే, ఆ ఇంట దుష్టశక్తులు, నకారాత్మక ఆలోచనలు ప్రవేశించవని నమ్మకం.

దుష్టమాంత్రికులు కూడా ముగ్గులు వేస్తారు. అయితే వారు వేసేది అష్టదిగ్బంధన ముగ్గులు. తాము ఎవరినైతే వశీకరించదలచుకున్నారో, వారిని ముగ్గులో కూర్చుండబెట్టి, అష్టదిగ్బంధన మంత్రాలు చదువుతారు. అప్పుడు వారు మాంత్రికులకు వశం అవుతారనీ, చెప్పిన పనల్లా చేస్తారనీ నమ్ముతారు.

దృష్టిదోషం తొలగడానికి ఇంటిముందు వేలాడదీసే గుమ్మడికాయకు కూడా ముగ్గులు వేస్తారు. గుమ్మడికాయకు పసుపు పూసి, ఎరుపు, తెలుపు బొట్లు పెట్టి, సూర్యుడు, చంద్రుడు, చిన్న చిన్న నక్షత్రాల ముగ్గులు పెట్టడం ఆచారం. అలా చేయడం వల్ల ఆ ఇంటిని ప్రకృతి విపత్తులైన తుపాను, ఈదురుగాలులు, పిడుగుపాటు, అగ్నిప్రమాదం వంటివి ఏమీ చేయలేవని నమ్మకం.  


ముగ్గులు– మనస్తత్వాలు
ముగ్గు వేసే గీతలను బట్టి వారు ఎలాంటివారో చెప్పవచ్చు. ముగ్గు గీతలు సన్నగా ఉంటే వారు పొదుపరులని, అందానికి ప్రాధాన్యత ఇస్తారని, లావుగా ఉంటే నిష్కల్మషంగా ఉంటారని, లతలు, తీగలు, పద్మాలు, జంతువుల ముగ్గులు వేస్తూ ఉంటే వారు స్నేహశీలురని, ప్రకృతి ప్రేమికులని, హాస్యచతురులని చ్పెపవచ్చు. సూర్యుడు, చంద్రుడు, తామరపూలు తదితర ముగ్గులు వేస్తూ ఉండే వారయితే వారు సంప్రదాయాన్ని ఇష్టపడతారని, ఖగోళ శాస్త్రప్రేమికులనీ చెప్పవచ్చు.


ఏ ముగ్గు.. ఎప్పుడు?
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతారూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. మంగళహారతి ముగ్గు, పీటల ముగ్గు వంటివి వేయవచ్చు.

శివాలయాలలో, ఆలయం ముంగిళ్లలో, శివార్చన చేసే సమయంలోనూ ఎనిమిది పలకల ముగ్గులో అష్టలింగ ముగ్గు వేస్తారు. కుంకుమ రంగు పొడితో మందిరాలలో ఎంతో అందంగా పసుపురంగుపైన వీటిని చిత్రీకరిస్తారు.

అమ్మవారి ఆలయాలలో, విష్ణ్వాలయాలలో అష్టదళ ముగ్గులు, శ్రీచక్రాల ముగ్గులు వేస్తారు.

పండగ రోజుల్లో రథం ముగ్గు వేస్తారు.  

నాగుల చవితి, నాగపంచమి, సుబ్బరాయ షష్ఠి సమయాలలో నాగులను లేదా జంట సర్పాలను సూచించే ముగ్గులు వేస్తారు.

అమ్మవారి పూజలు చేసేటప్పుడు సాధారణంగా శ్రీచక్రాలకు ప్రతీకగా ఉండే ముగ్గు వేస్తారు.

శుభకార్యాలు చేసేటప్పుడు ఇంటిముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. గృహప్రవేశ సమయంలో గడపలకు ఖగోళశాస్త్ర ఆధారంగా చుక్కలు, ఖగోళంలో ఉండే నక్షత్రాల రంగులు వివిధ రకాల నక్షత్రాల్లాంటి చుక్కలని గడపలకు పెడుతుంటారు. పూర్వులు పొయ్యిమీద ముగ్గు వేసిన తర్వాతనే వంట చేసేవారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత అలికి ముగ్గు పెట్టేవారు. దాంతో ఆ ప్రదేశం శుద్ధి అయినటు!


శ్రీచక్రం కూడా ముగ్గే!
శ్రీచక్రాన్ని సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపంగా భావిస్తారు. పరమ పవిత్రమైనదిగా పేర్కొంటారు. అలాంటి శ్రీచక్రం కూడా ముగ్గులాగే ఉంటుంది. ఇందులో 72 త్రికోణాలుంటాయి. అంతరంగా అనేక కోణాలుంటాయి. ఈ త్రికోణాలు ఒకదానినొకటి ఖండించుకున్నప్పుడు వాటికి కుండలినీ శక్తి వస్తుందని శాస్త్రం చెబుతోంది. ముగ్గు మధ్యలో ఉండే కేంద్రబిందువుకు సహస్రారమని పేరు. అందుకే శ్రీచక్రాన్ని గుమ్మంలో వేయరు. దానికి బదులుగా చిన్న చిన్న త్రికోణాలుగా ముగ్గులు వేస్తారు. కొమురవెల్లి మల్లన్నకు ముగ్గులంటే ప్రీతి. అందుకే ఆయన సన్నిధిలో ముగ్గులు వేస్తామని మొక్కుకుంటారు. ఈ ముగ్గులను పట్నాలని పిలుస్తారు. పట్నాలంటే ఇష్టం కాబట్టి ఆయనకు పట్నాల మల్లన్న అని పేరు.


ముగ్గులు... మగవారూ
ముగ్గులు వేసేది సాధారణంగా మగువలే అయినప్పటికీ, ఒకోసారి మగవారు కూడా వేస్తుంటారు. అయితే అది ఇంటిముంగిళ్లలో మాత్రం వేయరు. ఏ డ్రాయింగ్‌పుస్తకాల్లోనో, ఇంజనీరింగ్‌ పుస్తకాలలోనో తప్ప. అయితే ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ మాత్రం బహిరంగంగా ముగ్గులను గీసేవాడట. డావిన్సీ చిత్రకారుడే కాదు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా! దుస్తులపై ఆయన గీసే డిజైన్లలో ముగ్గులు తరచు కనిపించేవి. అదీ రకరకాల అందమైన ముగ్గులు... అన్నట్లు ఇంజినీర్లు గీసే రేఖాచిత్రాలు అదేనండీ, ప్లాన్లు కూడా ముగ్గుల కిందికే వస్తాయి మరి. అటువంటప్పుడు సివిల్‌ ఇంజినీర్లు, ఆర్కిటెక్చరల్‌ ఇంజినీర్లు కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ముగ్గులు వేయడం నేర్చుకున్నట్లే కదా!


సంక్రాంతికి రథం ముగ్గు ఎందుకు వేస్తారు?
మూడు రోజుల పాటు çసంబరాలను పూర్తి చేసుకుని అందరికీ ఆనందాన్ని పంచే పండుగను  ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడు ఉంటూ సహజీవనం సాగించాలనే సంకేతాలతో ఒకరి ఇంటి ముందరి రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు. మకర సంక్రాంతి నుంచి సూర్యరశ్మిలో వేడిమి పెరిగి మంచు తొలగుతుంది. ఇన్ని రోజుల పాటు తీవ్రమైన చలిని ఎదుర్కొన్న ప్రజలు సూర్యుని ఆహ్వానిస్తూ రథం ముగ్గు వేస్తారు.

ముగ్గుచరిత్ర
సాంప్రదాయమైన పూజలు, మతపరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు తదితరాలలో తప్పనిసరిగా ముగ్గులు వేసేవారు మన పూర్వీకులు. ఎప్పటినుంచి అంటే క్రీ.పూ. 8వ శతాబ్దంనుంచి అన్నమాట. హరప్పా, మొహంజదారో, సింధునాగరకత కాలంలో కూడా ముగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఈ గుహలలో ఉన్న రంగురాళ్లను సున్నం పిండిరూపంలో కొట్టి, వీటిద్వారా కొన్ని పనిముట్లను, పాత్రలను, ఆయుధాలను తయారు చేసుకునేవారు. ఆ వస్తువులు తయారు చేసుకోగా మిగిలిన పొడి లేదా రజనుతో తాము నివసించే గోడలపైన రంగుపొడులతో చిత్రాలను, జంతువుల బొమ్మలను చిత్రించేవారు. నలుపు తెలుపు అలాగే పసుపు, ఎరుపు, పచ్చని రంగులతో చిత్రీకరించేవారు. దీనికి మూలమైన రాతిపొడే ముగ్గు అని పిలుస్తున్నాము.

మధ్యభారతంలో ముగ్గుల సంస్కృతి
 భారతదేశ మధ్యభాగమైన ఛత్తీస్‌గఢ్‌లో రంగోలీని చావోక అని అంటారు. సాధారణంగా వీరు బియ్యపు పిండితో లేదా తెలుపురంగు దుమ్ముపొడితో ఈ ఛాక్‌ని ఇళ్లలో డ్రాయింగ్స్‌తో నింపుతారు. ముగ్గులతో అలంకరించిన ఇంటిని అదృష్టం వరిస్తుందని, ముగ్గులను తీర్చిదిద్దినవారికి శుభాలు చేకూరతాయనీ వీరి విశ్వాసం.

మహారాష్ట్ర: ఇక్కడివారు మనలా ఇంటిముంగిళ్లలో కాకుండా ఇంటి ద్వారాల మీద ముగ్గులతో అలంకరిస్తారు. ఇంటి ముంగిళ్లలో ఆవుపేడ కళ్లాపు చల్లుతారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంటిలో ప్రవేశించవని నమ్ముతారు.

కేరళ: ఓనం పండుగ సమయంలో కేరళలో పదిరోజులపాటు ముగ్గు తప్పనిసరిగా వేస్తారు. వీరు ముగ్గులను భారీ అలంకరణలతో అందంగా గీస్తారు. అయితే వీరి ముగ్గులు రేఖాగణితంలా ఉంటాయి. బియ్యంపిండి, సుద్దముక్కతో ఇంటి అరుగులమీద కూడా ముగ్గులు వేస్తారు. ముగ్గు వేసేటప్పుడు అందులో శంఖువు ఆకారం, చక్రం ఆకారం ఉండేలా చూస్తారు.

ముగ్గుల్లో ఖగోళం: ఖగోళం అంటే సూర్యుని కుటుంబం. ఖగోళం అంటే అనంతమైన విశ్వం. 5వ శతాబ్దంలోనే ఆర్యభట్ట ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి, వాటిని ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత వచ్చిన టాలెమీ, డమాస్కస్‌లు కూడా ఖగోళశాస్త్ర రహస్యాలను ముగ్గులరూపంలో ముంగిళ్లలో ఉంచారు. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాలలో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని అంటారు. అంతరిక్షంలో ఒక్కో నక్షత్రం ఒక్కో ఆకారంలో ఉంటుంది. మనకు తెలిసింది 27 నక్షత్రాలే కాబట్టి, 27 నక్షత్రాలూ ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో ముంగిళ్లలో ముగ్గు పెట్టడం పరిపాటి అయింది.

మధుబని ముగ్గులు: మధుబని ముగ్గులంటే ఇంటిగోడలని ఎర్రమట్టితో అలికి, దాని మీద చక్కటి పువ్వులు, లతలతో కూడిన ముగ్గులు పెట్టడం. ఈ రకం ముగ్గులు గ్రామీణ సంస్కృతికి ఆనవాళ్లు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సీజన్‌లో ఇటువంటి ముగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని ఆటవిక తెగలలో వారి పూరిళ్ల చుట్టూ రకరకాల రాతిపొడులతోనూ, ఆకులను ఎండబెట్టి తయారు చేసిన పసరు పొడితోనూ ముగ్గులు పెడతారు. ఈ విధంగా చేయడం వల్ల విషకీటకాలు, పాములు, తేళ్లవంటివి ఆ ఇంటిలోకి ప్రవేశించవని వారి నమ్మకం.

ముగ్గులోకి దింపడం, తలముగ్గుబుట్టలా నెరవడం అనే సామెతలు కూడా ఉన్నాయి. ఎవరినైనా ముగ్గులోకి దింపుతున్నారంటే వారిని తమ మార్గంలోకి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని లేదా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. తల ముగ్గుబుట్టలా నెరిసింది అంటే అనుభవజ్ఞులని అర్థం. ఇంక ఈ ముగ్గుశాస్త్రానికి ముగ్గింపు పలికి, సంక్రాంతి ముగ్గులు వేసేందుకు చుక్కలు పెడదామా మరి!

డి.వి.ఆర్‌. భాస్కర్‌
ఇన్‌పుట్స్‌: ముప్పిడి రాంబాబు
అసిస్టెంట్‌ ప్రొఫెసర్,
ఫైన్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్, కె.ఎల్‌.విశ్వవిద్యాలయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement