
ముగ్గుగుమ్మ
కలర్స్
నాకు పండగలంటే చాలా ఇష్టం. అఫ్‌కోర్స్... ఇష్టపడనివారెవరు ఉంటారు చెప్పండి! కాకపోతే నాకు సంక్రాంతి అంటే ఎక్కువ ఇష్టం. ఆ పండుగ పేరు చెబితేనే చాలా సంబర పడిపోతాను నేను. ఎందుకంటే అది సంవత్సరంలో వచ్చే తొలి పండగ కాబట్టి. ఆ పండగ అంటే నాకు ఎక్కువ ఇష్టం ఏర్పడటానికి మరో ముఖ్యమైన కారణం... ముగ్గులు. చిన్నప్పుడు మా అమ్మగారు వాకిట్లో రకరకాల ముగ్గులు వేస్తుంటే పక్కనే కూర్చుని చూసి మురిసిపోయేదాన్ని. వాటికి అమ్మతో పాటు నేను కూడా రంగులు అద్దేదాన్ని. కొంచెం పెద్దయ్యాక నేనూ ముగ్గులు వేయడం నేర్చుకున్నాను. అమ్మ అంత బాగా కాకపోయినా బాగానే వేస్తాను.
సినిమాల్లోకి రాకముందు కావాల్సినంత తీరిక చిక్కేది కాబట్టి, సంక్రాంతి దగ్గర పడుతోందనగానే ముగ్గులు వేయడం మొదలు పెట్టేసేదాన్ని. కొత్త కొత్త ముగ్గులు నేర్చుకుని మరీ వేసేదాన్ని. కానీ హీరోయిన్ అయిన తర్వాత షూటింగుల్లో బిజీ అయిపోయి... అప్పుడప్పుడూ పండగ సందడిని మిస్ అయిపోతున్నాను.
ముగ్గుల సంగతి పక్కన పెడితే పండగ రోజు ఇల్లంతా డెకరేట్ చేయడమంటే మహా ఇష్టం నాకు. ఇల్లంతా పూలదండలతో బాగా అలంకరించేస్తాను. పొద్దున్నే అమ్మతో కలిసి పూజ చేస్తాను. ఆ తర్వాత పిండి వంటల మీద పడిపోతాను. అసలు చక్కెర పొంగలిని తలచుకుంటేనే నోరూరిపోతుంది నాకు. మా అమ్మ చేసే పొంగలి మరీ టేస్టీగా ఉంటుందేమో... ఓ పట్టు పడతా. ఇక సంక్రాంతి స్పెషల్ అరిసెలు, కజ్జికాయల్ని కూడా కడుపు నిండా లాగించేస్తా.