
రావినూతల(మేదరమెట్ల): రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న 27వ అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన యువకులు అసోసియేషన్ ఏర్పాటు చేసి గత 27 ఏళ్లుగా క్రమం తప్పకుండా క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తుండటం విశేషం. ఏటా సంక్రాంతి పండుగకు ముందు నిర్వహిస్తున్న ఈ టోర్నీకి విశేష ఆదరణ లభిస్తోంది. తొలుత మండల, జిల్లా స్థాయికే పరిమితమైన పోటీలను గత 18 ఏళ్లుగా అంతర్ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌కు పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు సహాయ సహకారాలు అందించడంతో క్రికెట్ పోటీలు ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలు
రావినూతల స్టేడియంలో 2004 నుంచి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టారు. టర్ఫ్ పిచ్‌పై పోటీలు నిర్వహించడమే కాకుండా పక్కనే మరో పిచ్‌ను అదే ప్రమాణాలతో ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా రెండు పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో టీ–20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. బీసీసీఐ జాతీయ సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్, వేణుగోపాలరావు, రంజీ, ఐపీఎల్ క్రీడాకారులు ఎందరో రావినూతల స్టేడియంలో ఆడారు. పోటీలు జరిగే రోజుల్లో తమ సొంత గ్రామంలోనే ఉన్నట్టుంటుందని ఇతర రాష్ట్రాల క్రీడాకారులు పేర్కొనడం గమనార్హం.
నేడు టోర్నీ ప్రారంభం
రావినూతలలో సంక్రాంతి కప్–2018ను మంగళవారం ఉదయం 9 గంటలకు బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ప్రముఖ సినీనటుడు యర్రా గిరిబాబు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వితలకు ప్రథమ బహుమతిగా కీర్తిశేషులు కారుసాల తాతారావు స్మారక కప్, రూ.75 వేల నగదు, ద్వితీయ బహుమతిగా క్రీ.శే. యర్రా శ్రీదేవి, ముప్పవరపు రఘురామ్ స్మారక కప్, రూ.50 వేల నగదు, తృతీయ బహుమతిగా ఎలైన్ డైరీ కప్, రూ.25 వేల నగదు, చతుర్థ బహుమతిగా చప్పిడి హనుమంతరావు స్మారక కప్, రూ.10 వేల నగదు అందజేస్తామని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ కారుసాల బాపయ్య జ్ఞాపకార్థం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ ఫీల్డర్ అవార్డులు రామినేని ప్రసాద్, దామా రమేష్ స్మారకార్థం బహుకరించనున్నట్లు సభ్యులు తెలిపారు.
తొలిరోజు మ్యాచ్‌లు
మొదటి మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు అరుణ ఇన్‌ఫ్రా, ఒంగోలు– సీడీసీఏ లెవెన్, తిరుపతి జట్ల మధ్య, రెండో మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్మీ సర్వీసెస్ కాప్స్, బెంగలూరు– సౌత్‌సెంట్రల్ రైల్యేస్ విజయవాడ జట్ల మధ్య జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment