
హరిలో రంగ హరి...
పరమార్థం
తెల్లవారు జామున ధనుర్మాసపు చలి... వెచ్చదనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. మంచు బిందు కిరీటాలతో బంతి చామంతులు దర్పంగా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ చెబుతున్నట్లుగా ఉంటుంది. ‘ఈ చలికి నేనే లేవలేకుండా ఉన్నాను... మిమ్మల్నేం లేపగలను’ అంటున్నట్లు కనిపిస్తుంది కూత మరచి రెక్కలు ముడుచుకుంటున్న కోడి. కుంచెను మంచులో ముంచి గీసినట్లుగా ఉంటుంది ప్రకృతి సుందర చిత్రం. ఆ నిశ్చల చిత్రంలో చలనం వచ్చేలా చేస్తుంది హరిదాసు చిడతల శబ్దం.
దీంతో పాటే పాట వినిపిస్తుంది... ‘తక్కువేమీ మనకు రాముడొక్కడుండు వరకు’... భక్త రామదాసు కీర్తన హరిదాసు నోటి నుంచి వినిపిస్తూ పరిసరాలకు మేలుకొలుపు పాడుతుంది. ఉదయాన్నే పదాల రూపంలో, పాటల రూపంలో పాజిటివ్ ఎనర్జీ మనసులోకి వచ్చి చేరితే అంత కంటే సంతోషం ఏముంటుంది?
‘సురుల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ...
తక్కువేమీ మనకు’
‘నాకేముంది... ఏమీ లేదు, అన్నీ తక్కువే’ అనుకోవడంలో అన్ని శక్తులూ ఉన్నా సరే, ఆత్మవిశ్వాసం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ‘నాకేమీ లేకపోవచ్చు. కానీ నేను ఆరాధించే దేవుడున్నాడు. నాకేం తక్కువ? ఏమీ లేకున్నా నాకు అన్నీ ఉన్నట్లే’ అనుకోవ డంలో కొండంత ఆత్మవిశ్వాసం దాగుంది.
ప్రేమ, అభిమానం, ఆరాధనలో పవిత్రత ఉన్నప్పుడు.. అది మహత్తరమైన శక్తిగా మారుతుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది అనే భావాన్ని చెప్పకనే చెబుతుంది ఈ కీర్తన. ప్రేమ, భక్తి ఉన్న చోట అలక అందమైన అలంకార మవుతుంది. ‘పలుకే బంగారమాయెనా?’ అని ప్రశ్నిస్తుంది. ఆ అలక తీవ్రతను పెంచుతూ- ‘ఎంత పని చేసితివి రామా/ నిన్నేమందు సార్వభౌమ రామా/పంతమా నా మీద పరమ పావన నామ’ అంటుంది. ‘ఉన్నాడో లేడో భద్రాద్రియందు’ అనే వ్యూహాత్మక సందేహమవుతుంది. ‘నను గన్న తండ్రి నా విన్నపము విని తానెన్నడు రాడాయె’ అని విచారమవుతుంది.
‘అబ్బబ్బా రామనామం అత్యద్భుతము’ నుంచి ‘దినమే సుదినము సీతారామ స్మరణమే పావనము’ వరకు హరిదాసు నోటి నుంచి ఎక్కువగా రామదాసు కీర్తనలు వినిపిస్తాయి. రామదాసు కీర్తనలు ‘భక్తుడు భగవంతుడికి చేసిన విన్నపాలు’ మాత్రమే అన్నట్లుగా అనిపించినా... వాటి సారాశంలో మాత్రం జీవితానికి అవసరమయ్యే ధార్మికనీతిని అందిస్తాయి. భౌతిక సుఖాల కంటే భగవంతుడి ఆరాధనలోని గొప్పదనం ఏమిటో ఈ కీర్తనలు తెలుపుతాయి.
కేవలం రామదాసు కీర్తనలు మాత్రమే కాదు. క్షేత్రయ్య పదాలు, విష్ణునామ సంకీర్తనలు, భాగవత పద్యాల వరకు వీనుల విందుగా పాడుతూ సంక్రాంతి పర్వదిన అందాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాడు హరిదాసు.
‘నుదుటి కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక మెరియగా
కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరములు శోభలు నిండగ’ అంటూ ఇంటింటికీ లక్ష్మీదేవిని ఆహ్వా నించే హరిదాసు పాటకు మాత్రమే పరిమితమైపోడు. ఈ మాసంలో కఠిన ఉపవాసాలు చేస్తాడు. ఎన్నో కిలోమీటర్లు కాలినడకన వెళతాడు. తాను సేకరించిన దానంలో ఎంతో కొంత ఇతరులకు పంచి పెడతాడు. హరికి నిజమైన దాసుడు అనిపించుకుంటాడు.
పిట్టకథ: విలువైన అక్షయ పాత్రను ఎవరికి ప్రదానం చేయాలనే విషయంపై దేవతలు, త్రిమూర్తులు తర్జన భర్జన పడి, ‘గాన కచేరి’లో గెలిచిన వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పోటీలో నారదుడు, తుంబు రుడు, గాన గంధర్వులు, సప్త రుషులు పాల్గొన్నారు. వీరితో పాటు హరిదాసు కూడా పాల్గొ న్నాడు. హరిదాసు పాడి నప్పుడు శ్రీవిష్ణువు ఉండే వైకుంఠంలోని ఏడు గంటలూ ఉప్పొంగిపోయి సరి గమలు పలికాయట. అప్పుడు విష్ణువు అక్షయపాత్రను హరిదాసుకు ఇస్తూ... ‘ఇందులో బియ్యం వేసినవారు అష్టైశ్వ ర్యాలు, భోగభాగ్యాలు, సుఖసంతోషా లతో వర్థిల్లుతారు’ అని వరం ఇచ్చాడట. అందుకే హరిదాసు మనకంత ఆప్తుడు అయ్యాడు.