తెలుగిళ్లు... తియ్యని లోగిళ్లు | Funday Sankranti Special | Sakshi
Sakshi News home page

తెలుగిళ్లు... తియ్యని లోగిళ్లు

Published Sun, Jan 10 2016 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

తెలుగిళ్లు... తియ్యని లోగిళ్లు

తెలుగిళ్లు... తియ్యని లోగిళ్లు

స్వీట్ సంక్రాంతి
వరుసగా మూడు పండుగలు! భోగి-సంక్రాంతి-కనుమ.
 భోగి వెచ్చగా.. సంక్రాంతి పచ్చగా..
 కనుమ ‘పశు’పచ్చగా! కామన్‌గా... మూడూ... తియ్యతియ్యగా!
 నాలుగు రోజుల ముందే... తియ్యదనాన్ని ఆస్వాదించండి.
 పండగల్ని తియ్యగా ఆహ్వానించండి.
 

 
కొబ్బరి బూరెలు

కావలసినవి: బియ్యం - 1 కిలో, బెల్లం - అర కిలో, కొబ్బరి చిప్పలు - 2, నెయ్యి - 2 చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: బియ్యాన్ని ఓ రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి, తడి పోయేదాకా ఆరబెట్టి పిండి చేసుకోవాలి. కొబ్బరి తీసి సన్నగా తురుముకోవాలి. బెల్లంలో నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. ఇందులో నెయ్యి వేసి, కరిగాక కొబ్బరి, పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫొటోలో చూపినట్టుగా ఒత్తుకుని నూనెలో వేయించాలి.
 
రవ్వలడ్డు
కావలసినవి: బొంబాయి రవ్వ - అర కిలో, చక్కెర - అర కిలో, ఎండు కొబ్బరి తురుము - 1 కప్పు, పాలు - 1 కప్పు, యాలకుల పొడి - 1 చెంచా, డ్రై ఫ్రూట్స్ - కావలసినన్ని, నెయ్యి - తగినంత
తయారీ: డ్రై ఫ్రూట్స్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వను ఎక్కువ రంగు మారనీకుండా కొద్దిగా వేయించుకోవాలి. కొబ్బరిని కూడా వేయించి పెట్టుకోవాలి. చక్కెరను మిక్సీలో వేసి పొడి చేయాలి. పాలు వేడి చేసుకోవాలి. ఓ గిన్నెలో బొంబాయి రవ్వ, చక్కెర పొడి, కొబ్బరి, యాలకుల పొడి వేయాలి. వేడి పాలను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండ కట్టకుండా కలుపుకోవాలి. చివరగా చేతులకు నెయ్యి రాసుకుని, లడ్డూలు ఒత్తుకుని, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి.
 
జంతికలు
కావలసినవి: బియ్యపు పిండి - 2 కప్పులు, శనగపిండి - 1 కప్పు, నువ్వులు - 2 చెంచాలు, వాము - 1 చెంచా, కారం - 1 చెంచా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా
 తయారీ: ఓ గిన్నెలో బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు, వాము, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో గోరు వెచ్చని నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను జంతికల కుడక (మురుకుల గొట్టం)లో వేసుకుని, ఒత్తి, కాగిన నూనెలో వేయించుకోవాలి.  
 
తీపి గవ్వలు
కావలసినవి: మైదా - అరకిలో, నెయ్యి - 25 గ్రా., చక్కెర - పావు కిలో, యాలకుల పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా
తయారీ: మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వీటిని గవ్వల్లాగా చేసుకుని, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కెరలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక యాలకుల పొడి చల్లి తీసేయాలి. ఈ పాకాన్ని వేయించి పెట్టుకున్న గవ్వల మీద పోయాలి.
(పాకం ఇష్టం లేనివాళ్లు చక్కెరను పొడి చేసి, మైదా పిండిలో వేసి కలిపేసుకోవచ్చు.)
 
కజ్జికాయలు
కావలసినవి: మైదా - అర కిలో, నెయ్యి - 4 చెంచాలు, నీళ్లు - తగినన్ని, కొబ్బరి తురుము - 1 కప్పు, బొంబాయి రవ్వ - 1 కప్పు, చక్కెర - 1 కప్పు, యాలకుల పొడి - 1 చెంచా, జీడిపప్పులు - 10
తయారీ: మైదాలో నెయ్యి, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిమీద తడిగుడ్డను కప్పి పది నిమిషాలు పక్కన ఉంచితే మృదువుగా అవుతుంది. బొంబాయి రవ్వ, కొబ్బరి తురుములను వేర్వేరుగా వేయించుకోవాలి. ఓ బౌల్‌లో రవ్వ, కొబ్బరి, చక్కెర, యాలకుల పొడి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు వేసి మిక్స్ చేయాలి. మైదా పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల్లా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి, కజ్జికాయల్లాగా ఒత్తుకోవాలి.
 
(కొన్ని ప్రాంతాల్లో ఫిల్లింగ్ కోసం... వేరుశెనగలు, బెల్లం సమపాళ్లలో తీసుకుని, రెండిటినీ వేర్వేరుగా పొడి చేసుకుంటారు. తర్వాత ఈ రెండిటినీ కలిపి మెత్తగా దంచుకుని, ఈ మిశ్రమంతో కజ్జికాయలు చేసుకుంటారు. నువ్వులు, బెల్లం మిశ్రమంతో కూడా చేసుకుంటారు).
 
బూందీ అచ్చు
కావలసినవి: శనగపిండి - 1 కప్పు, బియ్యపు పిండి - అర కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - చిటికెడు, నెయ్యి - 1 చెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: శనగపిండి, బియ్యపు పిండులను ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లు పోసి, జారుడుగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. చిల్లుల గరిటె ద్వారా పిండిని నూనెలో పోస్తే బూందీలా వస్తుంది. దాన్ని బాగా వేయించి తీసేయాలి. ఆపైన బెల్లంలో ఓ కప్పు నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. ఇందులో నెయ్యి వేసి కలిపి, తర్వాత బూందీ, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ప్లేటుకు నెయ్యి కానీ నూనె కానీ రాసి, మొత్తం మిశ్రమాన్ని అందులో పోయాలి. దాన్ని అచ్చులాగా చేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 
నువ్వుల లడ్డూ
కావలసినవి: నువ్వులు - పావు కిలో, బెల్లం - అర కిలో, నీళ్లు - అర కప్పు
 తయారీ: నువ్వుల్లో రాళ్లు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వాటిని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి... బెల్లం, నీళ్లు వేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం అయ్యేవరకూ మరిగించాలి. ఇందులో నువ్వులు వేసి దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకోవాలి.
 
అరిసెలు
కావలసినవి: బియ్యం - 2 కిలోలు, బెల్లం - 1 కిలో, నువ్వులు - 100 గ్రా., నూనె లేక నెయ్యి - 1 కిలో
 తయారీ: బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టాలి. తర్వాత నీళ్లు తీసేసి, పది నిమిషాల పాటు ఓ శుభ్రమైన బట్ట మీద వేసి ఆరబెట్టాలి. తర్వాత వాటిని పిండి చేసుకోవాలి. నువ్వుల్ని దోరగా వేయించి పక్కనుంచాలి. అడుగు మందంగా ఉన్న ఓ గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి ఉండ కట్టేవరకూ పాకం పట్టాలి. ఆపైన అందులో పిండిని కొద్దికొద్దిగా వేసి కలపాలి. తర్వాత దించేసి చల్లారబెట్టి, అరిసెలా ఒత్తుకుని, నువ్వులు అద్ది నూనె లేక నేతిలో వేయించాలి.
 
పప్పు చెక్కలు
కావలసినవి: బియ్యపు పిండి - 2 కప్పులు, శనగపప్పు - 2 చెంచాలు, కారం - 1 చెంచా, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
 తయారీ: శనగపప్పును గంటసేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత తీసేసి తడిపోయేలా ఆరబెట్టాలి. బియ్యపు పిండిలో ఉప్పు, కారం వేసి కలపాలి. తర్వాత రెండు చెంచాల వేడి నూనె వేసి బాగా కలపాలి. ఆపైన శనగపప్పు, నీళ్లు, ఇంగువ వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దమీద ఓ తడిబట్టను వేసి పావుగంట పక్కన ఉంచితే, మృదువుగా అవుతుంది. తర్వాత చెక్కల్లా ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి.
 
సంపెంగ మొగ్గలు
కావలసినవి: గోధుమ పిండి - 1 కప్పు, మైదా - 1 కప్పు, చక్కెర - 200 గ్రా., బొంబాయి రవ్వ - అర కప్పు, డాల్డా - 25 గ్రా., ఉప్పు - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: ఓ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, డాల్డా వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, వాటిని చపాతీల్లా ఒత్తి, చాకుతో గాట్లు పెట్టాలి. తర్వాత వాటిని చుట్టి, రెండు చివరలూ గట్టిగా ఒత్తి కాస్త ముడిస్తే, ఇలా మొగ్గల్లా తయారవుతాయి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక, దాన్ని వేయించి పెట్టుకున్న సంపెంగ మొగ్గల మీద పోయాలి.
 
పెసర సున్నుండలు
కావలసినవి: పెసర పిండి - 1 కప్పు, మినప్పిండి - పావు కప్పు, బెల్లం - 1 కప్పు, నెయ్యి - అర కప్పు
తయారీ: ఓ బౌల్‌లో పెసర పిండి, మినప్పిండి వేసి కలపాలి. బెల్లాన్ని బాగా మెత్తగా తురమాలి. దీన్ని కూడా పిండిలో వేసి బాగా కలపాలి. తర్వాత కరిగించిన నేతిని కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో పోసి కలుపుతూ ఉండలు చుట్టుకోవాలి.
 
సకినాలు
కావలసినవి: బియ్యం - 4 కప్పులు, నువ్వులు - అర కప్పు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లు తీసేసి, శుభ్రమైన బట్ట మీద వేసి, తడి పోయేదాకా ఆరబెట్టాలి. వీటిని పిండి పట్టాలి. ఈ పిండిలో ఉప్పు, దోరగా వేయించిన నువ్వులు, నీళ్లు వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, ఓ ప్లాస్టిక్ షీటు మీద చక్రాల్లాగా చేతితో వేయాలి. తర్వాత వీటిని నూనెలో వేయించాలి.
 
గులాబీ పూలు (అచ్చు మురుకులు)
కావలసినవి: బియ్యపు పిండి - 2 కప్పులు, మైదా - 4 చెంచాలు, చక్కెర - 1 కప్పు, కొబ్బరి పాలు - అర కప్పు, ఉప్పు - చిటికెడు, యాలకుల పొడి - 1 చెంచా, బేకింగ్ సోడా - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, నూనె - సరిపడా.
 తయారీ: చక్కెరను పొడిలా చేసుకోవాలి. ఓ బౌల్‌లో బియ్యపు పిండి, చక్కెర పొడి, మైదా, ఉప్పు, యాలకుల పొడి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

కాసిన్ని నీళ్లు కూడా పోసి జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మురుకులు చేసే అచ్చుకు నూనె రాసి ఉంచాలి. నూనె కాగాక, దీన్ని ఓ నిమిషం పాటు ఆ నూనెలో ఉంచి తీయాలి. తర్వాత దీన్ని పిండిలో ఉంచి తీసి నూనెలో పెడితే పూలు పూలుగా మురుకులు వస్తాయి.
 (కోడిగుడ్డు తినేవాళ్లు ఒక గుడ్డు వేసుకుంటే ఇంకా ఎక్కువ గుల్లగా వస్తాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement