
సందేశ సంక్రాంతి
స్టేట్స్ సెలబ్రేట్
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు...ఇతర రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండగ ఘనంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఏ రకంగా జరుపుకున్నా సారాంశంలో మాత్రం సంక్రాంతి అక్షరాల పంటల పండగే. గ్రామానికి పెద్ద పీట వేసే పండగే. వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారంటే...
లోహ్రి: పంజాబ్
పిల్లలు ఇంటింటికీ వెళుతూ జానపద పాటలు పాడుతారు. కొత్తగా పెళ్లయిన దంపతులను ఇంటికి ఆహ్వానిస్తారు. లోహ్రి తరువాత రోజు నుంచి ‘ఆర్థిక నూతన సంవత్సరం’ మొదలవుతుంది.
మాఘ్ బిహు: అసోం
‘మేజీ’ పేరుతో వెదురు కర్రలతో పందిళ్లు వేసుకొని అందులో విందులు చేసుకుంటారు. మరుసటి రోజు సాయంత్రం ఈ మేజీలను తగలేసి అగ్నిదేవుడిని పూజిస్తూ, శ్లోకాలు చదువుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీన్ని చూస్తారు. మన దగ్గర కోడిపందేలలాగే ఇక్కడ ‘బర్రెల పందేలు’ జరుగుతాయి.
మకర్ సంక్రాత్: మహారాష్ట్ర
ఉదయాన్నే నువ్వు గింజలు నానబెట్టిన నీళ్లతో స్నానం చేస్తారు. నలుపు దుస్తులు ధరిస్తారు. పిల్లలకు చెరుకు ముక్కలు, బియ్యంతో కలిపిన నీళ్లలో స్నానం చేయిస్తారు. లడ్డూలు పంచుతారు.
మాఘ సాజ: హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్‌లో ‘మాఘ సాజ’ పేరుతో మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండగలో కనిపించే ప్రత్యేకత ‘తులాదాన్’. పూజారులను ఇంటికి పిలిచి ధాన్యాలతో తులాభారం చేస్తారు.
సక్‌రాత్: హర్యానా
హల్వా, ఖీర్‌లాంటి తీపి వంటకాలను తయారు చేస్తారు. పెళ్లయిన అక్కల ఇంటికి తమ్ముళ్లు వెళతారు. అక్కాబావలకు కొత్తబట్టలు కానుకగా ఇస్తారు. ఈ సంప్రదాయాన్ని ‘సిడ్హా’ అంటారు.