ఇంటెలిజెంట్ ఇడియట్స్ | Ded Kahani - 3 Idiots | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెంట్ ఇడియట్స్

Published Sat, Feb 27 2016 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ఇంటెలిజెంట్ ఇడియట్స్

ఇంటెలిజెంట్ ఇడియట్స్

దేడ్ కహానీ - త్రీ ఇడియట్స్
ప్రతి సినిమాకీ మూలస్తంభాల్లా, త్రిమూర్తుల్లా ముగ్గురు నిర్ణయాత్మక శక్తులుంటారు. సినిమా హిట్టయితే వాళ్లని లోకమంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, కర్త, కర్మ, క్రియలని తెగ ఆరాధిస్తారు. సినిమా ఫ్లాపయితే వాళ్లని త్రీ ఇడియట్స్ అని తిడతారు. అలాంటిది ఏకంగా ‘త్రీ ఇడియట్స్’ అనే టైటిల్‌నే పెట్టి ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న త్రిమూర్తులున్నారు. వాళ్లే రాజ్‌కుమార్ హిరానీ, విధూ వినోద్ చోప్రా, ఆమిర్ ఖాన్. ఒక అద్భుతమైన సృష్టి‘కర్త’, క్రమశిక్షణ గల ‘క్రియా’స్రష్ట, కలిసి ఒకే సినిమాకి పనిచేయడం ఆ నిర్మాత చేసుకున్న మంచి ‘కర్మ’ల పుణ్యం అన్నమాట.

అందుకే 60 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ప్రేక్షకులు ‘త్రీ ఇడియట్స్’ సినిమాని హారతిలా ‘కళ్ల’కద్దుకుని, పళ్లెంలో మూడు వందల కోట్ల రూపాయలు భక్తిగా వేసేశారు. భారతీయ సినిమాలో ఆ రోజుకి ఎవ్వరూ అందుకోని వాణిజ్యపరమైన ల్యాండ్ మార్కులన్నీ ఈ సినిమా సెట్ చేసింది. రికార్డుల్లో కొత్త పుంతలు తొక్కింది. కథకి, కథనానికి, మాటలకి, పాటలకి, కామెడీకి, సున్నితమైన భావోద్వేగాలకి, యువతరం తాలూకు ఆలోచనలకి, జీవన శైలికి, ఆశయాలకీ, రొమాన్స్‌కీ, ఆకతాయితనాలకీ, ర్యాగింగులకీ, విద్యావ్యవస్థని ప్రశ్నించ గలిగిన సామాజిక బాధ్యతల రెబెలిజానికి, పరిష్కారాన్ని కూడా చూపించగల మేధస్సుకి... అన్నిటికీ ఒక బెంచ్ మార్క్ ‘త్రీ ఇడియట్స్’.
 
స్కూల్లో నాతో చదువుకున్న బాల్య స్నేహితుడు సత్యన్నారాయణకి ప్రముఖ మాటల, పాటల రచయిత లక్ష్మీ భూపాల్ మంచి స్నేహితుడు. ఆయన రాసిన కృష్ణవంశీగారి ‘చందమామ’ సినిమా సంభాషణలు నాకు బాగా నచ్చాయి. మా మిత్రుడి ప్రోద్బలం కూడా తోడై ఆయనతో ఒక సినిమాకి వర్క్ చేద్దాం అని అనుకున్నాను. ఆ సందర్భంగా మా సత్యం మీటింగ్ ఏర్పాటు చేశాడు. లక్ష్మీభూపాల్ అడిగిన మొదటి ప్రశ్న ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూశారా? నేను, ‘లేదండీ... రిలీజ్ రోజున ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నాను.

నిదానంగా చూస్తాను’ అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. ‘ఆ సినిమా చూశాకే కలిసి మాట్లాడుకుందాం. మన మీటింగ్ రాఘవేంద్రరావుగారి సినీమ్యాక్స్ థియేటర్‌కి షిఫ్ట్’ అని చెప్పి టిక్కెట్లు బుక్ చేసేసి బలవంతంగా తీసుకెళ్లి థియేటర్‌లో కూర్చోపెట్టేశారు. సినిమాని ఇద్దరు స్నేహితులు కలిసి చూసినట్టు చూడలేదు మేం. ఇద్దరు వేర్వేరు ప్రేక్షకులు చూసినట్టు లీనమైపోయాం. సినిమా అయిపోయాక కూడా చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు.

ముక్కూ మొహం తెలీని ప్రేక్షకుల్లా ఎవరి దారిన వాళ్లు పార్కింగ్ దగ్గరికి వచ్చేశాం.  ఎవరన్నా దర్శకుడు సినిమాని బాగా తీస్తే వెంటనే ఫస్ట్ మైండ్‌లోకొచ్చే ఆలోచన ఎక్కడో మంచి ఫారెన్ ఫిల్మ్ పట్టుంటాడు లేదా, ఎవడో మంచి రైటర్ పాపం డెరైక్టర్ అవుదామని ఏళ్ల తరబడి స్క్రిప్టు రాసుకుని ఉంటే, డబ్బులిచ్చి లాగేసి ఉంటాడు. నా కన్నా ఇంకో హ్యూమన్ బ్రెయిన్‌కి నాలాగే ఒకటికి మించి రెండు, మూడు, నాలుగైదు సార్లు మంచి ఆలోచనలొస్తాయంటే ఎందుకో అంతరాత్మ ఓ పట్టాన అంగీక రించదు.

ఈ ఆలోచనలన్నీ మున్నాభాయ్ పార్ట్ 1, పార్ట్ 2లకే వచ్చేశాయి. కొత్తగా ఈ మూడో సినిమా ఇంత బాగా, వాటిని మించి తీశాడంటే కారణం ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఆ కారణం వెతికే ప్రయత్నమే ఆ సెలైన్స్. చివరికి లక్ష్మీ  భూపాల్‌గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పి ఇంటికొచ్చేశాను.

ఎవడీ డెరైక్టరు? క్షీర సాగర మథనంలో కూడా ఓసారి విషం, ఓసారి అమృతం వచ్చాయి. నాలాంటి దర్శకులందరికీ ఓసారి మంచి మంచి ఆలోచనలు, ఒక్కోసారి చెత్త చెత్త ఆలో చనలు వస్తుంటాయి సినిమా విషయంలో. అలాంటిది ఎప్పుడు మెదడుని చిలికినా అమృతం లాంటి ఆలోచనలే ఒక దర్శకుడికి వస్తాయంటే నాకు నచ్చడం లేదు. ఆ ద్వేషంలోంచి ప్రేమించాను రాజ్‌కుమార్ హిరానీని. ఆ ప్రేమ ఆరాధనైంది. భక్తిగా మారింది. ఆలో చించడం నేర్చుకున్నాను. ఓ దర్శకుడిగా, ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా.

ఈ రోజు వరకూ ‘షోలే’ తర్వాత అన్ని విభాగాల్లోనూ పెర్‌ఫెక్ట్, వెల్ మేడ్ సోషల్ సినిమా అండ్  బెస్ట్ ఎంటర్‌టైనర్  అంటే ‘త్రీ ఇడియట్స్’నే చెప్పొచ్చు.  : కరీనా కపూర్

దటీజ్ రాజ్‌కుమార్ హిరానీస్ త్రీ ఇడియట్స్. ‘ఆల్ ఈజ్ వెల్’ అన్న మాటని కాయిన్ చేసి, ఏ కష్టంలో ఉన్నా, ఎవడి గుండెని వాడే తడుముకుని ‘ఆల్ ఈజ్ వెల్’ అని మూడు సార్లు అనుకోవాలని హీరో పాత్రతో చెప్పిం చడం ఒక అద్భుత సృష్టి. మున్నాభాయ్‌లో రుగ్మత పోగొట్టడం కోసం ‘జాదూకీ జప్పి’ అనే మందుని, త్రీ ఇడియట్స్‌లో బాధని పోగొట్టడం కోసం ‘ఆల్ ఈజ్ వెల్’ అనే మంత్రాన్ని కనిపెట్టిన రాజ్‌కుమార్ హిరానీని... భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ వైద్య సంపదైన ఆయుర్వేదాన్ని కనిపెట్టిన ధన్వంతరో, అతని వారసుడో అనుకోవాలి.
 
చేతన్ భగత్ అనే యంగ్, భారతీయ మేధావి నవలా రచయిత రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఆధారంగా... అభిజిత్ జోషి, విధూ వినోద్ చోప్రాలతో కలిసి స్క్రీన్‌ప్లే రాసుకుని, సహ రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా త్రీ ఇడియట్స్ చిత్రాన్ని రూపొందించాడు రాజ్‌కుమార్ హిరాణీ. ఒక సినిమా సూపర్‌హిట్టు రెండు టేబుల్స్ మీద నిర్ణయించబడుతుంది అన్న ప్రాథమిక ఫార్ములా ప్రకారం, రైటర్స్ టేబుల్, ఎడిటర్స్ టేబుల్ రెండింటి మీదా కూర్చో గలిగిన దర్శకుడు, సినిమాని అంతలా శాసించగలిగిన దర్శకుడు భారతీయ దర్శకులలో ఈ తరంలో ఎవ్వరూ లేరు.

డిసెంబర్ 25, 2009న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుత భారతీయ విద్యా విధాన రూపకల్పనకి ‘బైబిల్’ లాంటిది. ఫర్హాన్ ఖురేషి అనే ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన ఇంజినీరింగ్ కాలేజీ స్నేహితుడు రాంచోని వెతకడంతో సినిమా మొదలౌతుంది. తన మరో స్నేహితుడు రాజు రస్తోగితో కలిసి తమ కాలేజీ రోజుల్లో బాగా ఏడిపించిన ఓ దద్దోజనం లాంటి కామిక్ విలన్ చతుర్ రామ లింగంని కట్టి పడేసి, దారిలో కాలేజీ డీన్ ‘వైరస్’గారమ్మాయి పియకి పెళ్లి జరగ బోతోందని తెల్సుకుని ఆమెని పీటల మీద నుంచి తప్పించి, రాంచోని చేరుకుంటారు.

ఆ ప్రయాణంలో అసలు రాంచో ఎవరు? కాలేజీలో ఎలా పరిచయం అయ్యాడు? పియకి అతనికి ప్రేమ ఎలా పుట్టింది? చతుర్ రామలింగం అలియాస్ సెలైన్సర్ రాంచోతో చేసిన చాలెంజ్ ఏమిటి? అందులో ఎవరు గెలిచారు? ‘వైరస్’ అనే డీన్‌కి రాంచోకి నడిచిన వార్ ఎలాంటి పరిణామాలకి దారి తీసింది? భారతీయ విద్యా విధానాన్ని రాంచో ఎలా ప్రశ్నిం చాడు? ఎలాంటి మంచి పరిష్కారాలు చూపించాడు? తీరా వీళ్లంతా క్లైమాక్స్‌లో కలుసుకునేసరికి రాంచో ఏం చేస్తు న్నాడు? పియ, రాంచో కలుసుకున్నారా? ముక్కుకి ముక్కు తగలకుండా ముద్దు పెట్టుకున్నారా లేదా?... ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు తెలుస్తాయి.

ఈ కథని క్లుప్తంగా ఎలా రాయాలో నాకు తెలీలేదు. ప్రతి మాటనీ ప్రస్తావించాలి. ప్రతి సీన్ లోనూ నటీనటుల హావభావాల్ని అనలైజ్ చేసి డీటైల్డ్‌గా రాయాలి. సంగీతం గురించి, ఫోటోగ్రఫీ గురించి, కాస్ట్యూమ్స్ గురించి ప్రతి అంశం గురించీ క్లుప్తంగా చర్చించాలి. ఈ రోజు వరకూ ‘షోలే’ తర్వాత అన్ని విభాగాల్లోనూ పర్‌ఫెక్ట్, వెల్ మేడ్ సోషల్ సినిమా అండ్ బెస్ట్ ఎంటర్ టైనర్ అంటే ‘త్రీ ఇడియట్స్’నే చెప్పచ్చు.

వైరస్ పెద్ద కూతురికి బిడ్డ పుట్టే సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం, అది చూసినప్పుడు కలిగే ఉత్కంఠ గురించి ఎంత రాసినా తక్కువే. పర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ అతికినట్టు సరిపోయాడు రాంచో పాత్రలో. పుస్తకం గురించి లెక్చెరర్‌కి రాంచో క్లాస్ పీకి నప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. రాజు పాత్ర క్యాంపస్ ఇంటర్వ్యూలో చూపించే కాన్ఫిడెన్స్‌కి ఫిదా అవ్వకుండా ఉండలేం.
 
పిల్లలని ఇంజినీర్లో, డాక్టర్లో చెయ్యా లని బలవంతపెట్టి వారి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా వాళ్లని ఒత్తిడిలోకి నెట్టే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మొత్తం విద్యావ్యవస్థకి సూటిగా చెప్పిన రెండున్నర గంటల మంచి పాఠం త్రీ ఇడియట్స్. టైటిల్‌ని బట్టి ఇందులో ముగ్గురు స్నేహి తుల్నీ త్రీ ఇడియట్స్ అనుకుంటే తప్పు. చతుర్ రామలింగం, వైరస్, ఖురేషీ (మాధవన్) తండ్రి - ఈ ముగ్గురూ సమాజంలోని మూడు పాత్రలకి చిహ్నాలు. విద్యార్థుల్లో ఉండకూడని యాటిట్యూడ్ చతుర్, ఉపాధ్యాయుల్లో ఉండకూడని యాటిట్యూడ్ ‘వైరస్’, తల్లిదండ్రుల్లో ఉండకూడని యాటిట్యూడ్ ఖురేషి తండ్రి - వీళ్లల్లా నిజ జీవితంలో ఎవరున్నా వాళ్లే ఇడియట్స్.                         
 
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement