‘పీకే’ మేకింగ్ శ్రమయేవ జయతే | Making Of 'PK': | Sakshi
Sakshi News home page

‘పీకే’ మేకింగ్ శ్రమయేవ జయతే

Published Mon, Jan 19 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

‘పీకే’ మేకింగ్ శ్రమయేవ జయతే

‘పీకే’ మేకింగ్ శ్రమయేవ జయతే

 ‘పీకే’ సినిమాకు 635 కోట్ల రూపాయల వసూళ్లు!ఇది నిజంగా షాకింగ్ న్యూస్! బ్రేకింగ్ న్యూస్!!ఒక భారతీయ చిత్రానికి  ఇంతటి స్థాయి వసూళ్లంటే కలో నిజమోసినిమా పండితులకే అర్థం కావడం లేదు.భారతీయ సినిమాకు మున్ముందు ఇంకా మంచి రోజులు రానున్నాయనడానికి ‘పీకే’ ఓ ఆశాదీపం.అసలు ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది? ఈ వసూళ్లకు కారణాలేంటి?ఆమిర్‌ఖాన్‌తో రాజ్‌కుమార్ హిరానీ దీన్ని తెరకెక్కించడానికి ఎన్ని కసరత్తులు చేశారు?‘పీకే’ స్పెషల్ స్టోరీ మీకోసం...
 
 ఆమిర్ ఖాన్‌తో ‘3 ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ తీశాక రాజ్‌కుమార్ హిరానీ వెంటనే మరో సినిమా మొదలుపెట్టేయలేదు. కథ కోసం నెలల తరబడి శ్రమించి, ఫైనల్‌గా దాన్ని తన సన్నిహితులకు చెప్పారు. కథ మొత్తం విని వాళ్లు... హాలీవుడ్ చిత్రం ‘ఇన్‌సెప్షన్’లా ఉందనడంతో హిరానీ ఖంగుతిన్నారు. దాంతో ఆ  కథను పక్కనపెట్టేశారు. మళ్లీ ఇంకో కథ మొదలుపెట్టారు. అదే ‘పీకే’. కథ విన్న హిరానీ సన్నిహితులు బ్రహ్మాండం అన్నారు.. కానీ  వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువు కాదని హెచ్చరించారు.
 
  మామూలు వ్యక్తుల పాత్రలంటే, ఇలా ప్రవర్తిస్తారనీ, వేషధారణ ఇలా ఉంటుందని ఊహించవచ్చు. కానీ, ఈ చిత్రంలో పీకే ఓ గ్రహాంతరవాసి. ఆ పాత్ర ‘ఇలా ఉంటుంది’ అని ఓ ఊహకు రావడం కష్టమే. పోనీ.. ఈ పాత్రకు రిఫరెన్స్ తీసుకుందామా? అంటే.. ఏ పుస్తకంలోనూ లేదు. నిజజీవితంలో కూడా హిరానీకి ఈ లక్షణాలున్న వ్యక్తులు తారసపడలేదు. దాంతో పాత్ర తీరుతెన్నులు, శారీరక భాష ఎలా ఉండాలి? అనే విషయమై ఆయన చాలా రోజులు తర్జన భర్జన పడ్డారు. ఈ పాత్ర అమాయకంగా కనిపించాలి.. చిన్నపిల్లాడి తరహాలో ఉండాలి. ఈ లక్షణాలను ఆవిష్కరించగల నటుడు ఎవరు? ఇంకెవరూ..     ‘ఆమిర్‌ఖాన్’ అని ఫిక్స్ అయిపోయారు. ఆమిర్ మొత్తం కథ విని, ఉద్వేగానికి గురయ్యారు. అప్పటికప్పుడు పీకేగా మారిపోవాలన్నంత ఉద్వేగం.
 
  ఆ తర్వాత పీకే లుక్ ఎలా ఉండాలి? అనే విషయంపై బోల్డన్ని చర్చలు. ఆకుపచ్చరంగు కళ్లు, తమలపాకుతో ఎర్రబడిన పెదాలు, సాదాసీదా దుస్తులు, చెప్పులు... షూటింగ్ ఆరంభించకముందే ఆమిర్‌పై మేకప్ టెస్ట్ చేశారు. ఆమిర్ దుస్తుల కోసం మనోషి నాథ్,  రుచీ శర్మ అనే ఇద్దరు కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించారు. అయితే  ఈ ఇద్దరూ ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయలేదు. ఈ చిత్రంలో ఆమిర్ రాజస్థాన్ ప్రింట్ చొక్కాల్లో కనిపిస్తారు. వాటిని, రాజస్థాన్ వీధుల్లో ఫుట్‌పాత్ మీద కొన్నారు. కొన్ని చొక్కాలైతే అక్కడి స్థానికులు వాడేవి డబ్బిచ్చి మరీ కొన్నారు. కొంతమందైతే తమంతట తాము చొక్కాలివ్వడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారట.
 
  పీకే హెయిర్ స్టయిల్ వినూత్నంగా ఉండాలనుకున్నారు హిరానీ. ముందుగా హెయిర్ జెల్ రాసి ఓ రకమైన హెయిర్ స్టయిల్ చేశారు. అది అంత సంతృప్తినివ్వకపోవడంతో స్పైక్స్ (ఒక రకమైన స్టయిల్) ట్రై చేశారు. అదీ నచ్చకపోవడంతో జుత్తుని బంగారు వర్ణానికి మార్చారు. అది చూడ్డానికి స్టయిల్‌గా ఉన్నా పాత్రకు తగ్గట్టుగా లేదు. చివరకు ఆమిర్ ఒరిజినల్ హెయిర్ స్టయిల్‌నే సినిమాలో కంటిన్యూ చేయాలనుకున్నారు.
 
  ఈ చిత్రంలో ఆమిర్ చెవులు సాసర్‌లా, కళ్లు హెడ్‌లైట్స్‌ని తలపించేలా ఉంటాయి. చెవులు పెద్దగా కనిపించడం కోసం ఆమిర్ ‘బ్లూ టాక్’ వాడారు. స్పాంజ్ తరహాలో చాలా తేలికగా ఉండే బ్లూ టాక్ వల్లే ఆమిర్ చెవులు అలా కనిపించాయి. కళ్లకేమో ఆకుపచ్చ రంగు లెన్స్ వాడారు. అమాయకంగా కనిపించడం కోసం కనుబొమలను తీర్చిదిద్దారు. సినిమాలో ఆమిర్‌ఖాన్ తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చివరికి ఏడ్చే సీన్‌లో కూడా కళ్లు ఆర్పరు. ఈ పాత్రకు ఆ కళ్లు ఓ ప్లస్ పాయింట్ కాబట్టి, లెన్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు.
 
  ఆమిర్‌ఖాన్ ఎక్కువ సన్నివేశాల్లో పాన్ తింటూ కనిపిస్తారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు.. ఓ పాన్‌వాలాను నియమించుకున్నారు. ఆమిర్ పాన్ తినాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు అతను పాన్ రెడీ చేసే ఇచ్చేవాడట.  సరైన రంగు రావడంకోసం ఒక్కో సీన్ తీసే ముందు పది నుంచి పదిహేను పాన్‌లను ఆమిర్ నమిలేవారు. ఆ విధంగా రోజుకి ఏకంగా వంద పాన్‌లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
 
  ఈ చిత్రం షూటింగ్‌ను ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్‌ల్లో జరిపారు. 2013 ఫిబ్రవరి 1న ఢిల్లీలో షూటింగ్ ఆరంభించారు. 45 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో! ఢిల్లీ చాందినీ చౌక్ ఏరియాలో శివుడు పాత్రధారి ఇద్దరు ముస్లిం మహిళలున్న రిక్షా తొక్కే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. వివాదం మొదలైంది. అక్కడి స్థానికులు హిందువుల మనోభావాలు తీసే విధంగా ఈ సీన్ ఉందంటూ కేస్ పెట్టారు. కొన్ని వివాదాలు, మరికొన్ని ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు.
 
  తొలుత ఈ చిత్రానికి ‘ఏక్ థా టల్లి’ అనే టైటిల్ పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ఏక్ థా టైగర్’ విడుదలైంది. దాంతో ‘ఏక్ థా’ తీసేసి, జస్ట్ ‘టల్లి’ అని పెట్టారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ‘పీకే’ అని పెట్టారు. ఇదేం టైటిల్ విచిత్రంగా ఉంది అందరూ అన్నారు. పైగా, పీకే అంటే మందు తాగడమని అర్థం కాబట్టి, ఇందులో హీరో తాగుబోతు అయ్యుంటాడని అనుకున్నారు.
 
  ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దాదాపు 85 కోట్ల రూపాయలకు అమ్మారు. ‘పీకే’ 300 కోట్ల రూపాయలు వసూలు సాధించడం ఖాయం అనే నమ్మకంతో చిత్ర నిర్మాతలు విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ శాటిలైట్ హక్కుల విషయంలో రాజీపడలేదు. చివరకు తాము అనుకున్నట్లు 85 కోట్లు దక్కించుకున్నారు. ఈ స్థాయిలో అమ్ముడుపోయిన తొలి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం.
 
  వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. చివరికి ఆమిర్‌కి బాగా కలిసొచ్చిన డిసెంబర్‌లో తెరపైకొచ్చింది. ఆమిర్ కెరీర్‌లో సంచలనాత్మక విజయం సాధించిన ‘గజిని’, ‘3 ఇడియట్స్’ ఈ నెలలో విడుదలైనవే. ఆమిర్, హిరానీల కాంబినేషన్ వేల్యూతో పాటు విడివిడిగా వారిద్దరి ట్రాక్ రికార్డుని చూసి, బయ్యర్లు ఈ చిత్రాన్ని ఎగబడి కొన్నారు. ప్రేక్షకులు థియేటర్‌కి రావడానికి కారణం కూడా ఈ క్రేజీ కాంబినేషనే. మొత్తానికి ఆమిర్-హిరానీల మేజిక్ రిపీట్ అయ్యింది.
 
  2014 డిసెంబర్ 19న ఈ చిత్రం విడుదలైంది. ‘దేవుడు మిస్సింగ్’ అంటూ ఈ చిత్రంలో ఆమిర్ పోస్టర్లు అంటిస్తాడు. అలాగే, మత గురువులపై సెటైర్లు వేశారు. ఇవి హిందూ, ముస్లిమ్‌ల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ వివాదం మొదలైంది. అయితే, వాటికి అతీతంగా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. భారతీయ బాక్సాఫీస్ పరంగా ఈ చిత్రం 300 కోట్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికి 635 కోట్లు సాధించింది. ఆమిర్ నటించిన ‘ధూమ్ 3’ ప్రపంచవ్యాప్తంగా 540 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘పీకే’ భారీ వసూళ్లతో ఆమిర్ తన రికార్డ్‌ని తానే బద్దలు కొట్టారు.
 
  ఇప్పటివరకు పాకిస్థాన్‌లో రికార్డ్ స్థాయి వసూళ్లు కురిపించిన చిత్రం ‘వార్’. ఈ పాకిస్థానీ యాక్షన్ థ్రిల్లర్ 23 కోట్లు వసూలు చేసింది. ఏడాదిన్నర క్రితం విడుదలైన ఈ చిత్రం వసూళ్లను ఏ చిత్రమూ అధిగమించలేదు. ఆ రికార్డ్‌ని ‘పీకే’ బద్దలు కొట్టబోతోందని అక్కడి ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. ‘పీకే’ ఇప్పటివరకు 18 కోట్లకు పైగా వసూలు చేసిందనీ, ఈ నెలాఖరు వరకు ఆడుతుంది కాబట్టి, ‘వార్’ రికార్డ్‌ని బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంతో సంచలనం సృష్టించిన ఆమిర్‌ఖాన్ ‘శ్రమయేవ జయతే’ అంటూ ‘పీకే’ చేసి సంచలనాలకే సంచలనంగా మారారు!
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement