అన్ని మతాలను గౌరవిస్తాం: పీకే దర్శకుడు హిరాణీ
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమా ద్వారా ఏ మతాన్ని అగౌరవపరచలేదని ఆ చిత్ర దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ వివరణ ఇచ్చారు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్‌రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు.
రాందేవ్ డిమాండ్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు.
పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ చెప్పారు. అన్ని మతాలను తాము గౌరవిస్తామని హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు.
సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్‌లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్‌దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్‌లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. ఈ రోజు కూడా ఢిల్లీలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు చిత్రప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో సినిమా దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ సినిమా యూనిట్ తరపున వివరణ ఇచ్చారు. తాము అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పారు.