డాక్టర్లకే వైద్యం | Story image for munna bhai mbbs from The Statesman (press release) Hirani set to bring Munna Bhai's real life on big screen | Sakshi
Sakshi News home page

డాక్టర్లకే వైద్యం

Published Sun, Jul 19 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

డాక్టర్లకే వైద్యం

డాక్టర్లకే వైద్యం

దేడ్ కహానీ - మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.
* షారుఖ్ చేయాల్సిన సినిమానా?
* 700 మిలియన్ల ప్రాఫిట్?
* సంజయ్‌దత్‌కి పెద్ద మలుపు?
* చాలాకాలం తర్వాత ఫ్యాన్స్ ముందుకు మళ్లీ వచ్చిన హీరో?

1990ల మొదట్లో బజాజ్ చేతక్ స్కూటర్ల కంపెనీ ఒక అడ్వర్టయిజ్‌మెంట్ తయారుచేసింది. అందులో ‘హమార బజాజ్’ అని వచ్చే ట్యూన్ చాలా పాపులర్ అయింది.

ఆ యాడ్‌లో ఓ 35-40 మధ్య వయస్కుడైన మధ్యతరగతి తండ్రి మోడల్‌గా నటించాడు.
 అప్పటికి, అతనితో సహా ఎవ్వరికీ తెలిసుండకపోవచ్చు - ఆ నటుడు మిలీనియం తర్వాత సాంకేతిక ప్రగతి పథంలో దూసుకుపోతూ, ఆ వేగంలో కనుమరుగైపోతున్న మానవీయ విలువల్ని భారతీయ వెండితెర మీద సజీవంగా ఆవిష్కరిస్తాడని, మెటీరియల్ పైన కాకుండా మనుషుల మధ్య బంధం ఉండాల్సిన ఆవశ్యకతని చాటి చెప్తాడని.

సినిమా తీసే ప్రతి ఒక్కరి పేరు ‘దర్శకుడు’ అయితే, ఆధునిక భారతీయ సమాజానికి బతుకు విలువ తెలిపే దార్శనికుడిగా ఇతణ్ని ఆరాధిస్తారని.ఆయన పేరే రాజ్‌కుమార్ హిరానీ. రచయిత, దర్శకుడు. పలు వ్యాపార ఉత్పత్తులకి అడ్వర్జయిట్‌మెంట్లు తీసే రాజ్‌కుమార్ హిరానీని భారీ సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించి, అవి ఫ్లాపులై చేతులు బాగా కాలిన విధు వినోద్ చోప్రా పట్టుకుని దర్శకుణ్ని చేశాడు.
 
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. కానీ, ఇక్కడ ఈ ఆకు నాలుగాకులు ఎక్కువే చదివింది కాబట్టి, విధు వినోద్ చోప్రా కంపెనీని కమర్షియల్‌గా లాభాల బాట పట్టించింది. పేరులో మంచి అభిరుచి కలిగిన నిర్మాణ సంస్థగా అగ్రస్థానంలో, భారతీయ ప్రేక్షక హృదయాలలో నిలబెట్టింది. ఇద్దరూ జీవితంలో ఆ దశలో పడుతున్న అష్టకష్టాల నుంచి ఓదార్పు పొందారేమో, ఒకరి కోసం ఒకరున్నామని అనుకుని మనస్ఫూర్తిగా మైత్రీపూర్వకంగా కౌగిలించుకున్నారేమో - అదే సక్సెస్ మంత్రమైంది.

వైద్యశాస్త్రంలో మందు కన్నా రోగిని అక్కున చేర్చుకుని ధైర్యాన్నిచ్చే ఒక్క కౌగిలింత రోగం నయమవడానికి ఎక్కువ పనిచేస్తుందని చెప్పారు. ఆ డాక్టర్ పేరే మున్నాభాయ్. ఈయన డిగ్రీ ఎంబీబీఎస్. కలిపితే ఆ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే డాక్టర్ పట్టా కాదు. రోలింగ్ టైటిల్స్‌లో చెప్పినట్టు మియా, బీవీ, బచ్చే చూడదగిన చిత్రం. చూసి తీరవలసిన చిత్రం. ఇంట్లో దాచుకోదగిన దృశ్య గ్రంథం.
 
హిందీ సినిమా మొత్తం సోల్‌ని హిందీలో ఎక్కడా చెప్పలేదు గానీ, తెలుగులో చిరంజీవిగారు నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీమేక్‌లో పరుచూరి వెంకటేశ్వరరావుగారు ఒక్క డైలాగ్‌లో హీరో ద్వారా చెప్పించారు. ‘‘రోగిని ప్రేమించలేని డాక్టరు కూడా రోగితో సమానం’’. తెలుగుకి దర్శకులు శ్రీ జయంత్.సి.పరాన్జీ. హిందీ విషయానికొస్తే, నూట ఏడు మిలియన్లలో సినిమా తీస్తే, ఏడు వందల మిలియన్ల పైన వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇంత ఎబ్‌నార్మల్ మార్జినల్ ప్రాఫిట్... ఆ రోజుకి ఏ భారతీయ చిత్రానికీ లేదు.
 
ఇందులో మొదట మున్నాభాయ్ పాత్రకి షారుక్ ఖాన్‌ని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన విరమించుకున్నాడు. వివేక్ ఒబెరాయ్‌ని పరిశీలించారు. చివరికి సంజయ్‌దత్‌ని వరించింది. అయిపోయిందనుకున్న సంజయ్‌దత్ కెరీర్‌ని మలుపు తిప్పి మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టిందీ చిత్రం. హీరోయిన్‌గా గ్రేసీసింగ్, ఆమె తండ్రి డాక్టర్ అస్తాన్‌గా బోమన్ ఇరానీ, సర్క్యూట్‌గా అర్షద్ వార్సీ అందరూ అదరగొట్టారు. చాలా ఏళ్ల తర్వాత సునీల్‌దత్‌ని మళ్లీ తెరపై చూపించిందీ చిత్రం. సంజయ్‌దత్ తండ్రి పాత్రలోనే. పోస్టర్ చూడగానే, అంత క్రేజ్ ఏమీ కలగలేదు. చిన్న బడ్జెట్‌లో తీసిన హిందీ కామెడీ సినిమా అనిపించింది. అందుకే రిలీజయ్యాక, ఓ వారం, పదిరోజుల పాటు అర్జెంటుగా ఈ చిత్రాన్ని చూసెయ్యాలనిపించలేదు. కానీ టాక్ బావుందని విన్నాక, మొదటిసారి ఈ చిత్రాన్ని చూశాక, ఇక చూడకుండా ఉండాలనిపించలేదు. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.
 
‘జాదూకీ ఝప్పీ’ - మ్యాజిక్ హగ్ - కౌగిలి మాత్రం - కష్టాలో ఉన్న విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్‌దత్‌లకి ఊరటనిచ్చారు భారతీయ ప్రేక్షకులు. కలెక్షన్లతో గట్టిగా కౌగిలించుకున్నారు ఈ ముగ్గురినీ. ఓ అమాయక వీధిరౌడీ తండ్రి మనసుని కష్టపెట్టినందుకు, ప్రేమించిన అమ్మాయిని గెలుచుకునేందుకు వైద్య వ్యవస్థనే ప్రశ్నిస్తాడు. జవాబులు సూచిస్తాడు. ఆచరణలో తనే నిజమని నమ్మిస్తాడు. సినిమా అంతా సర్క్యూట్‌తో కలసి నవ్వులు పండిస్తాడు. అక్కడక్కడా కన్నీళ్లు పెట్టిస్తాడు. మనసులో తిష్ట వేసుకుని కూచుంటాడు. భారతదేశంలో సినిమా, క్రికెట్ అనేవి రెండూ రెండు అనధికారిక మతాలైతే, క్రికెట్‌లో మతగ్రంథం పేరు సచిన్ టెండూల్కర్ జీవిత కథ, సినిమాలో మత గ్రంథం రాజ్‌కుమార్ హిరానీ చిత్రాల స్క్రిప్టుల సంకలనం.
 
‘‘జీవించడానికి టైము లేనప్పుడు ప్రతి నిమిషం రెండు, మూడుసార్లు ఎక్కువ జీవించెయ్’’ - ఈ చిత్రంలోని ఓ మంచిమాట. చాలా సినిమాల్లోలాగ దర్శకుడు కార్పొ‘రేట్’ ఆసుపత్రుల మీద దాడి చేయలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్నే టార్గెట్ చేసి, దానికి ఒక వీధిరౌడీతో పాఠాలు చెప్పించాడు. మనిషికీ మనిషికీ మధ్య ఉండవలసిన ఆత్మీయతని ‘జాదూకీ ఝప్పీ’ (కౌగిలి మాత్రం) ద్వారా చూపించాడు. జీవితంలో మొదటిసారి మున్నాభాయ్ ఎంబీబీఎస్ అనే పాత్ర సినిమాలో కాకుండా నిజ జీవితంలో ఎక్కడైనా తారసపడి ఉంటే ఎంత బావుణ్ను అనిపించింది.

ఇలా ఏ సినిమాలో ఈ చిత్రం కథాసంగ్రహం నేను రాయలేను. సినిమా మొత్తం రాసేయాల్సి వస్తుంది. కానీ ఈ చిత్రాన్ని మిస్సవ్వకుండా చూసి తీరాలని మాత్రం రాయగలను. ఆంగ్లంలో ‘చికెస్ సూప్ ఫర్ ద సోల్’ అనే మంచి కథల సంకలనాలు ఉన్నాయి. పుస్తకాలలో అవి అద్భుతాలు, మానసిక బలానికి ఉత్ప్రేరకాలు. సినిమాలలో మున్నాభాయ్ అలాంటిది.
వచ్చేవారం ఆర్టికల్ వచ్చేలోపు ఈ సినిమాని అందరూ చూసేస్తారని విశ్వసిస్తూ నమస్తే.
 - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement