పిక్చర్ అభీ బాకీ హై!
ప్రత్యేక కృతజ్ఞతలు అన్న హెడ్డింగ్ కింద, మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, డా॥ఎం.మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగార్జున, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహరాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తెలుగు సినిమా టైటిల్స్‌లో మొదటి టైటిల్ కార్డు ఇలా ఏ తెలుగు ప్రేక్షకుడైనా చూడగలడా? వాళ్లందరూ ఓ నిర్మాత కోసమో, దర్శకుడి కోసమో, హీరో కోసమో అయిదు నిముషాలు ఓ పాటలోనో, రెండు, మూడు సీన్లలోనో కనిపించగలరా? హీరోలే కాదు. అనుష్క, కాజల్, తమన్నా, శృతిహాసన్, సమంత... వీళ్లు కూడా.
కానీ, అది హిందీలో చూడగలం. షారుఖ్ ఖాన్ సినిమాలో, ఫర్హాఖాన్ దర్శకత్వంలో, ‘ఓం శాంతి ఓం’ సినిమాలో అభిషేక్, అమితాబ్, అక్షయ్‌కుమార్, జితేంద్ర, ధర్మేంద్ర, తుషార్, రితేష్, సుభాష్ ఘయ్, రిషికపూర్, కరీనా, రాణీముఖర్జీ, రేఖ, ప్రీతి జింతా, షబానా అజ్మీ, సల్మాన్ ఖాన్... ఇలా ఒకరేమిటి? ఐఫా అవార్డులకో, ఫిల్మ్‌ఫేర్ అవార్డులకో హాజరైనట్టు తారా తోరణమంతా వచ్చి నటించారు. అభిషేక్, అక్షయ్ అయితే మరీను. ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్‌లో ఓం కపూర్ పాత్రధారి షారుఖ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఉడుక్కునే సాటి హీరోలుగా నటించారు.
ఇలా చేయాలంటే చాలా స్పోర్టివ్‌నెస్ ఉండాలి ఆర్టిస్టుకి. అలాగే తనమీద తనకి నమ్మకం కూడా ఉండాలి. ‘ఓం శాంతి ఓం’... పాప్‌కార్న్ సినిమాల స్పెషలిస్టు ఫర్హాఖాన్ (పూర్వాశ్రమంలో గొప్ప డ్యాన్స్ డెరైక్టర్ - ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద కమర్షియల్ డెరైక్టరు) ‘మై హూ నా’ తర్వాత తీసిన రెండో చిత్రం. దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా చాలా పరిణతి చెందినట్టు అనిపించి, ఆమె అభిమానిగా మారిపోవచ్చుననిపించే సినిమా ‘ఓం శాంతి ఓం’.
దీపికా పదుకొనెను హిందీ చిత్రసీమకి పరిచయం చేసిన మొదటి చిత్రం. అంతకుముందు ఆమె కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘ఐశ్వర్య’ అనే చిత్రంలో నటించింది. అది మన తెలుగు మన్మథుడు (నాగార్జున)కి రీమేక్. అయితే దాని గురించి మనకు పెద్దగా తెలియదు. షారుఖ్‌తో ‘ఓం శాంతి ఓం’లో మెరిశాకే దీపిక అందరికీ పరిచయమైంది.
1970లలో రిషికపూర్ హీరోగా ‘ఫర్జ్’ అనే సినిమా వచ్చింది. పునర్జన్మల కథలలో అదే లాస్ట్ సూపర్ హిట్. మ్యూజికల్‌గాను, ఎమోషన్స్ పరంగానూ, బాక్సాఫీసుని కొల్లగొట్టి విజయఢంకా మోగించిన చిత్రమది. అందులో రిషికపూర్ నటించిన ఓ పాటలో సిగ్నేచర్ లైనే ‘ఓం శాంతి ఓం’.
ఇది స్టేజ్ సాంగ్. ఆ పాట షూటింగ్ జరుగుతుంటే, యంగ్ రిషికపూర్ స్టేజి మీద డ్యాన్స్ చేస్తుంటే, ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్లో ఒకడిగా, అంటే జూనియర్ ఆర్టిస్టుగా షారుఖ్ ఖాన్ కనిపిస్తాడు. ఇలా మొదలౌతుంది ‘ఓం శాంతి ఓం’. గ్రాఫిక్స్‌లో మిక్స్ చేసినా కూడా ఆలోచనే అద్భుతంగా ఉన్నప్పుడు సినిమాలో లీనమవ్వకుండా ఎలా ఉంటాం?
ఓం ప్రకాశ్ అనే జూనియర్ ఆర్టిస్టుకి హీరో అయ్యి, ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవాలన్నది కల. అది తీసుకునేటప్పుడు ఇచ్చే స్పీచ్ కూడా చిన్న పిల్లల్ని కూర్చోపెట్టి మందు బాటిల్‌ని అవార్డ్‌లా పట్టుకుని ఇచ్చేస్తాడు. ‘‘నువ్వు విజయం సాధించాలని మనసులో బలంగా కోరుకున్నప్పుడు, మొత్తం విశ్వ మంతా ఏకమై నిన్ను విజేయుడిగా నిలబెడుతుంది. సినిమాల్లోలాగే, జీవితం కూడా సుఖాంతమే అవుతుంది. ఒకవేళ అలా అవ్వలేదని అనిపిస్తే - సినిమా ఇంకా అవ్వలేదు, ఇంకా ఉందని అర్థం’’ అని చెప్తాడు.
చాలా స్ఫూర్తివంతమైన డైలాగ్ ఇది. మొదటి వాక్యం ‘పాలో కొయిలో’ది. కానీ దాన్ని ఈ చిత్రంలో వాడిన విధానం సందర్భోచితం. ఇలాంటి జూనియర్ ఆర్టిస్టు శాంతిప్రియ అనే పెద్ద స్టార్ హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. ఓ షూటింగ్‌లో ఆమెని అగ్ని ప్రమాదం నుండి కాపాడతాడు కూడా. అప్పట్లో ‘మదర్ ఇండియా’ షూటింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నర్గీస్‌ని సునీల్‌దత్ కాపాడడం, ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లాడడం నిజంగా జరిగినదే. దాన్నే ఈ సీన్‌లో కూడా అసిస్టెంట్ డెరైక్టర్ హీరోతో ప్రస్తావిస్తాడు. ప్రాణాలకి తెగించి కాపాడిన హీరోకి కృతజ్ఞతలు చెప్పి, అతనితో స్నేహం చేస్తుంది శాంతిప్రియ.
కానీ, శాంతికి నిర్మాత ముఖేష్ మెహ్రాతో అప్పటికే రహస్య వివాహం అయ్యి, గర్భం కూడా దాల్చుతుంది. ఇది తెలిసి ఓం ఆవేదన చెందుతాడు. ముఖేష్ మాత్రం ఆగ్రహిస్తాడు. ‘ఓం శాంతి ఓం’ అనే భారీ సినిమా తీసి హాలీవుడ్‌కి వెళ్దాం అనుకుంటున్న అతనికి శాంతిప్రియ సెంటి మెంటల్‌గా, ఎమోషనల్‌గా ఫీలవ్వడం రుచించక, అదే సెట్‌లో శాంతిప్రియని నిప్పు పెట్టి చంపేస్తాడు.
అది చూసిన ఓం, శాంతిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేసి తానూ మరణిస్తాడు.
అయితే ఈ క్రమంలో అతడు స్టార్ హీరో రాజేష్ కపూర్ కారు కింద పడతాడు. కారులోని వాళ్లు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఆస్పత్రిలో ఓం మరణిస్తాడు. అప్పుడే పురిటి నొప్పులు పడుతూన్న రాజేష్ కపూర్ భార్య కడుపున ఓం కపూర్‌గా పుడతాడు. అక్కడ్నుంచి కొత్త కథ మొదలవుతుంది.
2000 సంవత్సరానికి ఓం కపూర్ పెద్ద స్టార్ హీరో అవుతాడు. అతణ్ని అప్పు డప్పుడూ గత జన్మ జ్ఞాపకాలు వెంటాడు తుంటాయి. ఓసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకుంటూ గత జన్మలో ఇచ్చిన స్పీచ్‌ని తనకి తెలీకుండానే ఇస్తాడు. షూటింగ్ నిమిత్తం ముప్ఫయేళ్ల క్రితం కాలిపోయిన సెట్ చూశాక గతం పూర్తిగా గుర్తుకు వస్తుంది. వెంటనే వెళ్లి తల్లిని, స్నేహితుడిని కలుస్తాడు. అదే సమయంలో హాలీవుడ్‌లో పెద్ద నిర్మాతగా మారిన ముఖేష్‌ని చూస్తాడు. అతడు శాంతి ప్రియకు చేసిన అన్యాయం గుర్తొచ్చి పగ తీర్చుకోవాలనుకుంటాడు.
ఆ క్రమంలో అతడికి శాండీ కనిపిస్తుంది. ఆమె అచ్చం శాంతిప్రియలాగే ఉండటంతో... ఆమెతో శాంతిలాగ యాక్ట్ చేయించి, ముఖేష్‌ని భయపెట్టి నిజం అతని చేతే చెప్పించాలని చూస్తాడు. అయితే ఇదంతా ముఖేష్‌కి తెలిసి పోతుంది. దాంతో ‘ఓం’ని చంపేయాలని చూస్తాడు. చివరి క్షణంలో శాంతి ఆత్మ స్వయంగా వచ్చి ముఖేష్‌ని చంపి తన పగ తీర్చుకుని వెళ్లిపోతుంది. ఓం కపూర్, శాండీ ఒకటవటంతో కథ ముగుస్తుంది.
సినిమాకి పునర్జన్మ అనేది ఓ కమర్షియల్ సూత్రం. రివెంజ్ తీర్చు కోవడం అనేది ఇంకో బల మైన కమర్షియల్ సూత్రం. ఈ రెండూ సూపర్‌హిట్ ఫార్ములాలే. వీటిని ఒకే కథలో రాసుకుంటే, మంచి మాటలతో, మంచి పాత్రలతో, కామెడీతో, సెటైర్‌తో, విజువల్‌గా చాలా రిచ్‌గా, గెస్ట్ తారాతోరణంతో కన్నుల పండువగా తీస్తే ప్రేక్షకుడికి నచ్చక చస్తుందా? ఆ కష్టమంతా పడిన నిర్మాత షారుఖ్ ఖాన్‌కి, పెట్టిన ప్రతి రూపాయికి రెండున్నర రూపాయల చొప్పున తిరిగిచ్చారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీప్రేక్షకులు. ఫరా ఖాన్ మంచి హాస్య ప్రియురాలు.
కమర్షియల్ మసాలా రుచి తెలిసిన వంటల స్పెషలిస్టు. అంతకన్నా మంచి నృత్య దర్శకురాలు. కాబట్టే కథ, కథాంశం సృజనాత్మకంగానూ, భావ ప్రేరకంగానూ లేకపోయినా మంచి పాళ్లలో సాల్ట్, పెప్పర్ చాలా వంటల్ని ఎలా కాపాడే స్తాయో, ఈవిడ సినిమాని పైన చెప్పుకున్న అంశాలు అలా కాపాడేస్తాయి. మంచి ఖాళీ సమయాల్లో రిలీజైతే సూపర్ హిట్ అవుతాయి. మార్కెట్‌కి హెల్ప్ అవుతాయి. రెవెన్యూ జనరేట్ చేస్తాయి. తేడా వచ్చినా మార్జినల్‌గా పెద్ద నష్టం కలిగించవు. ఎటు తిరిగి ఎటొచ్చినా చూసిన వాడికి టైమ్ పాస్, తీసినవాడికి నో లాస్. జియో ఫర్హాజీ... ఆప్‌కీ పిక్చర్స్ అభీ బాకీ హై!
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు