నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్‌లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.
స్పీడ్ బ్రేకర్
గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్‌లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ది బుల్ మిస్ అయ్యాడు
‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్‌తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్‌తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు.
రెండేళ్లు పూర్తయినా...
రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం.
భారీ చిత్రంతో...
‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది.
పర్సనల్ టైమ్
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్‌వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్‌వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్‌వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్‌వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,.
బిజీ బిజీ... కానీ!
‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment