కోవిడ్‌కి రెండేళ్లు.. ఈ రెండేళ్లల్లో లాక్‌డౌన్ కారణంగా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ వాయిదాల వల్ల కొందరు స్టార్ హీరోలు దాదాపు రెండేళ్లు స్క్రీన్‌పై కనిపించలేదు. బాలీవుడ్‌లో ఆమిర్, షారుక్, హృతిక్, షాహిద్, రణ్‌బీర్ అయితే వెండితెరపై కనిపించి మూడు నాలుగేళ్లవుతోంది. ఎందుకింత గ్యాప్? ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్’ అని తండ్రి పాత్రధారి అంటే.. హీరో అల్లు అర్జున్ ‘ఇవ్వలా.. వచ్చింది’ అంటాడు. ఈ ఐదుగురి హీరోల విషయం కూడా అంతే.. ‘గ్యాప్‌ఇవ్వలా... వచ్చింది’. ఆ గ్యాప్‌కి కారణం, ఈ ఏడాది ఈ ఐదుగురూ కనిపించనున్నసినిమాల గురించి తెలుసుకుందాం.
ఫైటర్ కాదు... వేరే!
హృతిక్ రోషన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు కావొస్తోంది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి హృతిక్ చేసిన ‘వార్’ సినిమా 2019 అక్టోబరులో రిలీజైంది. ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తోనే ‘ఫైటర్’ సినిమా కమిటయ్యారు హృతిక్.. ఈ ఏడాది డిసెంబరులో వెండితెరపైకి రావాల్సిన ‘ఫైటర్’ కాస్త లేట్‌గా వచ్చే ఏడాది సెపె్టంబరుకు షిఫ్ట్ అయ్యాడు. అయితే వేరే సినిమా ద్వారా హృతిక్ ఈ ఏడాది తెరపై కనిపిస్తారు. తమిళంలో హిట్ సాధించిన ‘విక్రమ్ వేదా’ చిత్రంలో వేదగా నటిస్తున్నారు హృతిక్. విక్రమ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను తీస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. హృతిక్ రోషన్ తండ్రి, దర్శక – నటుడు రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడి కోలుకుంటుండటం, కోవిడ్ ఎఫెక్ట్ వంటి అంశాలు హృతిక్ షూటింగ్ షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ పడేలా చేశాయి.
మరో వారంలో...
ఒక హిట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా ఇంకో హిట్ ఇవ్వాలనే పట్టుదలతో షాహిద్ కపూర్ ‘జెర్సీ’ రీమేక్ అంగీకరించారు. తెలుగులో మంచి విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’లో టైటిల్ రోల్ చేసి, అద్భుతమైన హిట్ అందుకున్నారు షాహిద్ కపూర్. 2019లో ఈ సినిమా విడుదలైంది. వెంటనే మరో తెలుగు హిట్ మూవీ ‘జెర్సీ’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు షాహిద్. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ పడుతూ ఫైనల్‌గా మరో వారంలో ఈ నెల 14న రిలీజ్‌కు రెడీ అయ్యింది. తెలుగు ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించారు.
లాల్ వచ్చేస్తాడా?
‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ (2018)... అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి సినిమా ఇది. అది కూడా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఎన్నో అంచనాలతో ఆమిర్ ఈ సినిమా చేశారు. రిజల్ట్ షాక్ ఇవ్వడంతో తన తదుపరి చిత్రానికి ఆమిర్ ఖాన్ కాస్త టైమ్ తీసుకున్నారు. కొన్ని కథలు విన్న తరువాత ఫైనల్‌గా ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ను హిందీ (‘లాల్‌సింగ్ చద్దా’) లో రీమేక్ చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. 2019లో ఈ సినిమా షూటింగ్ ఆరంభించారు. 2020లో కోవిడ్ ఆరంభమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కరీనా కపూర్ తల్లి కావడం, కీలక పాత్ర చేయాల్సిన విజయ్ సేతుపతి తప్పుకోవడం వంటివి కూడా షూటింగ్‌కి ఆటంకం కలిగించాయి. విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రను నాగచైతన్య చేశారు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తయ్యాక విడుదల చేయాలనుకున్న ప్రతిసారీ లాక్‌డౌన్ వల్ల లాల్ రావడానికి కుదరలేదు. ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నామని ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. మరి... ఈసారి చెప్పిన తేదీకి లాల్ వచ్చేస్తాడా చూడాలి మరి.
జీరో ఎఫెక్ట్
ఆమిర్‌లానే షారుక్ ఖాన్‌ది కూడా సేమ్ స్టోరీ. షారుక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జీరో’ (2018) చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ ఎఫెక్ట్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఫైనలైజ్ చేయడం కోసం చాలా ఎక్కువ టైమే తీసుకున్నారు షారుక్. కథ నిర్ణయించుకునే విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. ఎందరో దర్శకుల దగ్గర కథలు విని, ఫైనల్‌గా ‘వార్’లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు చాన్స్ ఇచ్చారు షారుక్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘పటాన్’ చిత్రం రిలీజ్ ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది జనవరి 23కి వాయిదా పడింది. ‘‘బాగా ఆలస్యం అవుతోందని నాకు తెలుసు. కానీ ఈసారి జనవరి 23ని గుర్తుపెట్టుకోండి’’ అంటూ ‘పటాన్’ రిలీజ్ డేట్ సందర్భంగా షారుక్ అన్నారు. ఇదిలా ఉంటే.. మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’(జూలై 1 రిలీజ్), రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’ (సెప్టెంబర్ 9న రిలీజ్) చిత్రాల్లో షారుక్ అతిథిగా వెండితెరపై కనిపించనున్నారు. ఇది ఆయన అభిమానులు కాస్త హ్యాపీ ఫీలయ్యే విషయం.
బ్రహ్మాస్త్రం అంటూ...
2018లో సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’తో మంచి హిట్టే అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. కానీ ఇప్పటివరకు అంటే నాలుగు సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై రణ్‌బీర్ మిస్సయ్యారు. ‘సంజు’ తర్వాత రణ్‌బీర్ చేసిన ‘బ్రహ్మస్త్ర’ మైథాలజీ ట్రయాలజీ ఫిల్మ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ టైమ్ పట్టింది. 2020లో రణ్‌బీర్ తండ్రి, ప్రముఖ నటులు రిషి కపూర్ మరణించడం, ఇదే సమయంలో కోవిడ్ ఎఫెక్ట్ వంటి అంశాలతో ‘బ్రహ్మస్త్ర’ షెడ్యూల్స్ తారుమారయ్యాయి. ఫైనల్‌గా ఈ సినిమా తొలి భాగం ‘బ్రహ్మస్త్ర’ : శివ’ ఈ సెప్టెంబరు 9న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు చేశారు. అలాగే ‘బ్రహ్మాస్త్రం’ అంటూ తెలుగులో వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి సమర్పకులు కావడం విశేషం. (చదవండి: మానసిక వేదన, సూసైడ్ చేసుకుందామనుకున్నా)
ఈ ఐదుగురే కాదు.. కోవిడ్ కారణంగా, వేరే కారణాల వల్ల మరికొందరు బాలీవుడ్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌కు మూడు నాలుగేళ్లపాటు దూరమయ్యారు. ఇప్పుడు కోవిడ్ పోయిందోచ్ అంటున్నారు. సో... గ్యాప్ కూడా పోతుందనుకోవచ్చేమో!
Comments
Please login to add a commentAdd a comment