Shahrukh And Salman Khan Team Up After 27 Years With AR Murugadoss Details Inside - Sakshi
Sakshi News home page

Shahrukh And Salman Khan: ఒకే సినిమాలో ఖాన్‌ త్రయం !.. సౌత్‌ డైరెక్టర్‌తో చిత్రం..

Published Wed, Jul 20 2022 7:34 AM | Last Updated on Wed, Jul 20 2022 8:41 AM

Shahrukh And Salman Khan Team Up After 27 Years With AR Murugadoss - Sakshi

ఖాన్‌ త్రయం (సల్మాన్, షారుక్, ఆమిర్‌) కలిసి సినిమా చేస్తే.. ఫ్యాన్స్‌ తీన్‌ మార్‌ డ్యాన్స్‌ వేయడం ఖాయం. అలాంటి ఓ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట. ఖాన్‌ త్రయం కాంబినేషన్‌లో సౌత్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగ దాస్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. ఆ విశేషాల్లోకి వెళదాం.

గజిని, తుపాకీ, కత్తి, సర్కార్‌.. ఇలా తమిళంలో మురుగదాస్‌ భారీ చిత్రాలనే తెరకెక్కించారు. ఆయన ఇచ్చిన భారీ హిట్స్‌లో ఈ నాలుగుతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ‘గజిని’ చిత్రాన్ని హిందీలో ఆమిర్‌ ఖాన్‌తో తెరకెక్కించి, బాలీవుడ్‌లోనూ హిట్‌ సాధించారు మురుగదాస్‌. ఆ తర్వాత హిందీలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సల్మాన్, షారుక్‌లతో ఓ పాన్‌ ఇండియా సినిమా ప్లాన్‌ చేస్తున్నారట. ‘గజిని’ ద్వారా ఆమిర్‌తో ఏర్పడిన అనుబంధంతో ఈ విషయాన్ని ఆయనకు చెప్పారట మురుగదాస్‌. దాంతో షారుక్, సల్మాన్‌లను మురుగదాస్‌ కలిసే ఏర్పాటు ఆమిర్‌ చేశారని బాలీవుడ్‌ టాక్‌. ఇద్దరు ఖాన్లకు మురుగదాస్‌ స్టోరీ లైన్‌ చెబితే, నచ్చి, కథ డెవలప్‌ చేయమన్నారని భోగట్టా..  

27 ఏళ్ల తర్వాత.. 1995లో వచ్చిన ‘కరణ్‌ – అర్జున్‌’లో సల్మాన్, షారుక్‌ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అలరించింది. అప్పటినుంచి ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుండు అని కోరుకుంటున్నవాళ్లు లేకపోలేదు. అయితే మధ్యలో మనస్పర్థల వల్ల ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయి, ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు చేస్తున్నారు. సెట్స్‌లో ఉన్న సల్మాన్‌ ‘టైగర్‌ 3’లో షారుక్‌ అతిథిగా, షారుక్‌ ‘పఠాన్‌’లో సల్మాన్‌ గెస్ట్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో సినిమా అంటే ఫ్యాన్స్‌కి పండగే. 

‘కరణ్‌ – అర్జున్‌’ రిలీజైన 27 ఏళ్లకు సల్మాన్, షారుక్‌ చేసే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆమిర్‌ ఖాన్‌కి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర రాస్తున్నారట మురుగదాస్‌. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఆరంభమవుతుందని బాలీవుడ్‌ అంటోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement