బ్యాడ్ పోలీస్ గుడ్ సన్ | ded kahani of Dabangg Movie! | Sakshi
Sakshi News home page

బ్యాడ్ పోలీస్ గుడ్ సన్

Published Sun, Mar 13 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

బ్యాడ్ పోలీస్ గుడ్ సన్

బ్యాడ్ పోలీస్ గుడ్ సన్

దేడ్ కహానీ - దబాంగ్
2015లో ముంబై బాంబ్ బ్లాస్ట్‌ల నిందితుడు యాకూబ్ మెమన్‌ని ప్రభుత్వం ఉరితీయబోయే ముందు అత్యంత ప్రజాదరణ కలిగిన సినీ హీరో, భారతీయ పౌరుడు సల్మాన్‌ఖాన్, ‘‘యాకూబ్‌ని కాదు వాళ్లన్నయ్య టైగర్ మెమన్‌ని ఉరి తీయాలి - ఇతన్ని తీయకూడదు’’ అని పబ్లిగ్గా ట్వీట్లు పెట్టాడు - ‘భయం లేదు’. సెప్టెంబర్ 26, 2011లో ముంబై వరుస బాంబుదాడుల మారణ హోమం తర్వాత, ఇదే భారతదేశ పౌరుడు, అత్యధిక ప్రజాదరణ కలిగిన టాప్ త్రీ హీరోల్లో ఒకడు, సల్మాన్‌ఖాన్ ఏకంగా పాకిస్థానీ టెలివిజన్ ఛానల్‌కి ఇంటర్‌వ్యూ ఇస్తూ, పాకిస్థాన్‌ని బ్లేమ్ చేయకూడదు, భారతదేశ రక్షణ దళాల వైఫల్యం అని పబ్లిగ్గా చెప్పగలిగాడు - ‘భయం లేదు’.
 
ప్రభుత్వ అటవీశాఖ నియమాలకి విరుద్ధంగా రాజస్థాన్‌లో షూటింగ్‌కి వెళ్లినపుడు స్నేహితులతో కలిసి కృష్ణజింకల్ని వేటాడగలిగాడు - దొరికినా, జైలుకెళ్లినా, మళ్లీ స్వేచ్ఛగా బైటికి రాగలిగాడు ఇదే నటుడు - ‘భయం లేదు’. మద్యం సేవించి, వాహనం నడిపినపుడు రోడ్డుపక్కన నిద్రిస్తున్న పౌరుల పైకి కారు పోనిచ్చి, వారి చావుకి కారణమైన అభియోగాన్ని కోర్టులో ఎదుర్కొన్న హీరో. - ‘భయం లేదు’. ఇవన్నీ బొమ్మకి అవతలవైపు బొరుసు - నిజ జీవిత పాత్ర వేసే నీచమైన వేషాలివి. అయినా ‘భయం లేదు’.
 
ఎందుకంటే భారతీయ సమాజంలో పదిమంది అభిమానుల్ని సంపాదించగలిగినా, లేదా ప్రభుత్వ అండదండలున్నా, లేదు పదిమంది రౌడీలని పోషించగలిగినా, ఏ మగాడికీ ఇంక ‘భయం లేదు’ - జనాభాలో రెండో అగ్రదేశం విచిత్రంగా ఒక వ్యక్తి వెనకాలున్న జనాన్ని చూసి భయపడడం. ఈ బొరుసుని చూస్తే నాకు భయమేస్తుంది. మన సమాజం తాలూకు సిగ్గులేనితనం మీద అసహ్యం వేస్తుంది. కానీ అవతలి వైపు బొమ్మ, వెండితెర మీద కనిపించగానే అభిమానం పుట్టేస్తుంది. ఆనందం తాండవిస్తుంది. బొమ్మ చేసే మాయ అది.

ఆ మాయ పుట్టించే భ్రమ అది. భయం లేకపోవడమే ఇంగ్లిషులో ఫియర్‌నెస్, హిందీలో ‘దబాంగ్’. అది సూపర్‌హిట్ సినిమాగా ఆడడం కేవలం సల్మాన్‌ఖాన్ చేసిన మెస్మరిజమ్. తమ్ముడు అర్బాజ్‌ఖాన్ నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ దర్శక, రచయిత అనురాగ్ కశ్యప్ సోదరుడు, అభినవ్ కశ్యప్‌ని దర్శకుడిగా తొలిసారి పరిచయం చేస్తూ, పాత తరం ప్రముఖ హీరో, మాజీ కేంద్ర మంత్రి శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హాను కథానాయికగా మొదటిసారి పరిచయం చేస్తూ, సల్మాన్‌ఖాన్ వీర సాహస, హస్య, శృంగార విన్యాసాలే తెరంతా నిండిపోయేలా, మధ్యలో తళుక్కుమని ఓ కంటిమీద నీటి చుక్క మొలకెత్తేలా కొంచెం కరుణ రసం కలిపి అల్లుకున్న పూర్తి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ దబాంగ్. అమ్మకో  కొడుకు, నాన్నకో కొడుకు.

ఈ సవతి కొడుకుల మధ్య చిన్నప్పట్నుంచి వైరం. మామూలుగా ఈ లైన్ రాగానే మనసులో ఇద్దరు హీరోల సినిమా అని బలంగా అనిపించేస్తుంది. కానీ, సింగిల్ స్టార్ సినిమాగా దీన్ని ప్యాకేజ్ చేయడమే కష్టమైన పని, కొత్త పనీ కూడా. దానికే ఈ సినిమా కొత్తదనాన్ని పుణికిపుచ్చుకుందని నేననుకుంటున్నాను. చాలా ఏళ్ల తర్వాత వినోద్ ఖన్నా, డింపుల్ కపాడియా హీరో తల్లి, సవతి తండ్రిగా నటించడం కూడా బావుంది.
 
‘రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్’ అన్నది గొప్ప వాణిజ్య సూత్రం సినిమాలకి. అది సరిగ్గా పాటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యి నిర్మాతలకి కనక వర్షం కురిపించాయి. ‘దబాంగ్’ వాటిల్లో ఒకటి. 1999 తర్వాత 11 ఏళ్లల్లో మూడే మూడు సినిమాలు చేసి, ఆ మూడూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి దాదాపు కెరీర్ అయిపోయిందనుకున్న సల్మాన్‌ఖాన్‌ని ‘దబాంగ్’ 240 కోట్ల లాభసాటి స్టార్ హీరోగా మళ్లీ నాలుగైదేళ్లు, అరడజను సినిమాల దాకా టాప్‌లో నిలబెట్టింది. బాడీ పాతది. కానీ దానికి కుట్టిన చొక్కా చాలా కొత్తది, కలర్‌ఫుల్‌ది. అదే ఆకట్టుకుంది జనాన్ని.
 
హీరోని ఎంత మాస్‌గా రాసుకున్నారో స్క్రిప్టులో, అంత క్లాస్‌గా చూపించారు లుక్స్‌లో. ఈ ఫ్యూజన్ సినిమాకి సరికొత్త ట్రెండ్‌ని తెచ్చింది. ఆ ఫ్యూజన్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేసి తెలుగులో తీసిన ‘గబ్బర్‌సింగ్’ కూడా సూపర్‌హిట్ అయింది. ఇంచుమించు సల్మాన్‌లాగే ముందు సినిమాల ఫ్లాపులతో ఉన్న పవర్‌స్టార్‌ని ఒకేసారి యాభై కోట్ల క్లబ్ దాటించేసి టాప్ హీరోగా టాలీవుడ్‌లో పోటీలో నిలబెట్టేసింది. నెగెటివ్ టచ్ ఉన్న హీరో పాజిటివ్‌గా మారడం అనే దుష్మన్ ఫార్ములా ఎప్పటికీ సూపర్‌హిట్టేనని మరోసారి మిలీనియమ్‌లో రుజువైంది.

సోనాక్షి సిన్హా చాలా అందంగా, పరిపక్వంగా నటించింది. ‘మున్నీ బద్‌నామ్ హుఈ’ పాట ఈ చిత్రాన్ని ప్రజల్లో విపరీతంగా పాపులర్ చేసింది. మలైకా అరోరాఖాన్ స్వయంగా నర్తించింది. ఆమె ఈ చిత్ర నిర్మాత, సల్మాన్ సవతి సోదరుడి పాత్రధారి అర్బాజ్‌ఖాన్ భార్య. ఆమె కూడా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇమామి సంస్థ ‘జండుబామ్’ అనే తమ ప్రొడక్ట్ పేరు ఈ ఐటమ్ సాంగ్‌లో వాడినందుకు నిర్మాతల మీద కేసు పెట్టింది. కానీ కోర్టు బైట ఈ కేసు సెటిలైపోయి, మలైకాతో జండుబామ్ ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కూడా చేసుకుంది.

చిత్రంలో కన్నా విచిత్రం భారత దేశంలో సహజంగా జరుగుతుంటుంది అనడానికి ఇదింకో ఉదాహరణ. ‘దబాంగ్’ ఓ సూత్రం. ప్రతి డైలాగులోనూ ఓ పంచ్‌గానీ, ఓ మాస్ మంత్రం గానీ, ఓ విజువల్ ఇంట్రెస్ట్ గానీ ఉంటుంది. దాన్ని పూర్తిగా, కాన్ఫిడెంట్‌గా, భయం లేకుండా క్యారీ చేశాడు కాబట్టే సల్మాన్‌ఖాన్‌కి సక్సెస్‌లో ఎక్కువ షేర్ వచ్చింది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒడిసిపట్టాడు కాబట్టే పవన్‌కల్యాణ్‌కి కూడా గబ్బర్‌సింగ్ సక్సెస్‌లో పెద్ద వాటా వచ్చింది. ఒక సినిమాని కొన్ని కోట్ల మంది చూస్తారు. కానీ పదుల మంది సరిగా అర్థం చేసుకుంటారు. మిగిలినవాళ్లు ఎంజాయ్ చేస్తారంతే. ఆ పదుల మందిలో మిత్రుడు తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఒకడు.
 
అతణ్ని ఎంచుకున్న నిర్మాత బండ్ల గణేశ్ అభినందనీయుడు, అదృష్టవంతుడు కూడా. సోనూసూద్ ఊళ్లో చిన్న సైజు విలను. అతనికింద కొంతమంది రౌడీలు. అతనిపైన కొద్దిమంది రాజకీయ నాయకులు. హీరో ఒక అసిస్టెంట్ కమిషనర్. అయినా బండగా, బాధ్యత లేకుండా పెరిగిన బాపతు కాబట్టి రౌడీలా ప్రవర్తిస్తుంటాడు. దూకుడెక్కువ. ‘నాకు దమ్ముంది, ధైర్యం ఉంది - తిక్క కూడా ఉంది’ అని అతనే చెప్పుకుంటాడు. హీరో, విలన్ల గొడవలో విలన్ హీరో తల్లిని చంపుతాడు. తమ్ముణ్ని ఇరికిస్తాడు. తండ్రిని నష్టపరుస్తాడు. చివరికి హీరో చేతిలో చస్తాడు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదనుకుంటున్నారా... సినిమగా చూడండి భయం లేదు. పక్కా పైసా వసూల్.
 
సల్మాన్‌ఖాన్ వీర సాహస, హస్య, శృంగార విన్యాసాలే తెరంతా నిండిపోయేలా, మధ్యలో తళుక్కుమని ఓ కంటిమీద నీటి చుక్క మొలకెత్తేలా కొంచెం కరుణ రసం కలిపి అల్లుకున్న పూర్తి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ దబాంగ్.
- వి.ఎన్.ఆదిత్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement