Dabangg
-
ఈ ‘ఐటమ్ సాంగ్’ను స్కూల్లో పాఠంగా చేర్చారు!
‘సినిమా బాగుందా?’ అనే ప్రశ్నతో పాటు ‘ఐటమ్ సాంగ్ ఉందా?’ అనే ఉపప్రశ్న కూడా ఎదురవుతుంటుంది. ‘ఈ సందర్భంలో ఇలాంటి పాట ఉండాలి’ అనేది సినిమా రూల్. అయితే ఐటమ్‌సాంగ్ మాత్రం కచ్చితంగా పక్కాగా మాస్ పాటై ఉండాలి. అలాంటి ఒక మాస్ పాటకు ఇప్పుడు మహర్దశ పట్టింది. సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ సినిమాలో ‘మున్నీ బద్నామ్ హుయి’ ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. ఈ పాటను ‘ఇంగ్లాండ్ న్యూ మ్యూజిక్ కరికులమ్’లో చేరుస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని డిపార్ట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ (డిఎఫ్యి) న్యూ కరికులమ్ గైడ్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. బ్రిటన్‌లోని టీచర్స్, ఎడ్యుకేషన్ లీడర్స్, సంగీతకారులలో నుంచి ఎంపిక చేసిన 15 మంది అత్యున్నత బృందం ‘మోడల్ మ్యూజిక్ కరికులమ్’ను అభివృద్ధి చేసింది. మన శాస్త్రీయ సంగీత పాఠాలతో పాటు భాంగ్రా బీట్, ఐటమ్‌సాంగ్స్‌ను చేరుస్తున్నారు. ‘జయహో’, సహేలిరే, ఇండియన్ సమ్మర్... మొదలైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అన్ని జానర్స్‌లోని ఈ పాటలు సంగీతం నేర్చుకునే విద్యార్థులకు పాఠాలు, కేస్స్టడీలుగా ఉపయోగపడతాయి. ‘హుషారెత్తించి సంగీతంతో పాటు కలర్‌ఫుల్ విజువల్స్ ఈ పాట ప్రత్యేకం’ అని ‘మున్నీ బద్నామ్ హుయి’ పాటకు కితాబు ఇచ్చింది బృందం. -
అది సల్మాన్ దగ్గరే నేర్చుకున్నా: సోనాక్షి
అదృష్టవశాత్తూ ఈ ఏడాది ఎంతగానో కలిసివచ్చిందంటూ సంతోషం పట్టలేకపోతుందీ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ. 2019 తనకు ఎంతో ఇచ్చిందంటూ ఈ ఏడాదికి సంతోషంగా గుడ్‌బై చెప్తోంది. ఆమె తాజాగా నటించిందిన ‘దబాంగ్ 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీనికన్నా ముందు సోనాక్షి నటించిన కళంక్, ఖాందానీ, శఫఖానా, మిషన్ మంగళ్’ విడుదలయ్యాయి. అయితే వీటన్నింటిలోనూ భిన్న రకాల పాత్రలు చేసానని సోనాక్షి చెప్పుకొచ్చింది. అయితే దబాంగ్‌లో చుల్‌బుల్‌పాండే(సల్మాన్ ఖాన్) భార్య రాజో పాత్ర తనకు ఎంతో ఇష్టమైన పాత్రగా అభివర్ణించింది. తొలిపాత్రతోనే గుర్తింపు తెచ్చుకుకోవడం మరిచిపోలేనని పేర్కొంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి చెప్తూ అతను సినిమా కోసం ఎంతగానో కష్టపడతాడని పేర్కొంది. ముఖ్యంగా సల్మాన్ దగ్గర నుంచి చేసే పని పట్ల అంకితభావాన్ని కల్గి ఉండటాన్ని నేర్చుకున్నానంది. తాను నటన కోసం ప్రత్యేకంగా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేన, షూటింగ్ సమయంలోనే నటనలో మెళకువలు నేర్చుకున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం సోనాక్షి సిన్హ యాక్షన్ మూవీ ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో అజయ్ దేవ్గన్తో జోడీ కడుతోంది. -
కత్రినాకు చేదు అనుభవం
అట్టావా : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన దురుసు ప్రవర్తన కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దబాంగ్ టూర్లో భాగంగా ప్రస్తుతం వాంకోవర్‌లో ఉన్న కత్రినా.. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో సెల్పీల కోసం అభిమానులు చుట్టుమున్నారు. తమతో సెల్పీలు దిగాల్సిందిగా కోరడంతో కొందరికి అవకాశం ఇచ్చారు. కాసేపటి తర్వాత... ‘మీరిలా చేయకండి. నేను అలసిపోయాను అని తెలుసు కదా. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ’ కత్రినా కాస్త గట్టిగానే అభిమానులను మందలించారు. కత్రినా వ్యాఖ్యలకు బాధపడిన ఓ మహిళ.. ‘ మీ ప్రవర్తను మార్చుకోండి. పెద్ద హీరోయిన్ అని చెప్పుకుంటారు కదా.. అభిమానులు ముచ్చటపడి దగ్గరికి వస్తే ఇలా కసురుకుంటారా’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో కత్రినా కూడా ఆమెతో గొడవకు సిద్ధమైపోయారు. కత్రినా సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకుని ఆమెను వారించారు. అయినప్పటికీ ఆ మహిళ ఊరుకోకుండా.. ‘మీ కోసం ఎవరూ రాలేదు. మేమంతా సల్మాన్ ఖాన్ కోసం వచ్చాం.. కేవలం ఆయన కోసమే’ అంటూ కత్రినాను హేళన చేశారు. -
సల్మాన్‌ఖాన్‌ను కలిసిన రంభ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అమెరికాలో ‘ద - బాంగ్’ షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్లూ భాయ్ షోకు ఓ అనుకోని అతిథి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ఏవరా అతిథి అనుకుంటున్నారా..? 1997 నాటి సల్మాన్ ‘జుడ్వా’లో అతనితో జత కట్టిన ముద్దుగుమ్మ.. ఇంకా గుర్తుకు రాలేదా..? ఆమె మరెవరో కాదు మన ‘హిట్లర్’ భామ రంభ. ప్రస్తుతం ఆమె తన భర్త, పిల్లలతో కలిసి అమెరికా విహారయాత్రలో ఉన్నారు. తన భర్త, పిల్లలతో కలిసి సల్మాన్ నిర్వహిస్తున్న ‘ద - బాంగ్’ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా రంభ ఒకప్పటి తన ‘జుడ్వా’ హీరోతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. సల్మాన్‌ను మాత్రమే కాక 2017 ‘జుడ్వా 2’ హీరోయిన్ జాక్వెలిన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, ప్రభుదేవా వంటి బాలీవుడ్ ప్రముఖులందరిని కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘జుడ్వా 1’, ‘జుడ్వా 2’ అనే కాప్షన్ ఇచ్చారు. 1997లో వచ్చిన ‘జుడ్వా 1’ లో కరిష్మా కపూర్‌తో పాటు రంభ కూడా నటించారు. ఆ తర్వాత 1998లో వచ్చిన ‘బంధన్’ చిత్రంలోనూ సల్మాన్‌ఖాన్‌తో జత కట్టారు. రంభ - సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘బంధన్’ ఆఖరుది. A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on Jul 8, 2018 at 11:26pm PDT -
దబాంగ్ దేవి
దబాంగ్ అంటే నిర్భయ.. ‘భయం లేని’ అని అర్థం. దూని గ్రామంలో ఘిసీదేవిని అంతా ‘దబాంగ్ దేవి’ అని పిలుస్తారు. నిజానికది ధైర్యం కాదు. ధర్మాగ్రహం. ఎందుకొచ్చింది ఆమెకంత ఆగ్రహం?! అది రాజస్తాన్‌లోని దూని గ్రామం. ఘిసీ దేవి ఉదయాన్నే గ్రామానికి దగ్గరలోని అడవి నుంచి వంటచెరకు పోగు చేసి మోపు నెత్తిన పెట్టుకుని వస్తోంది. అదే సమయంలో ముగ్గురు ఆకతాయిలు మోటార్‌బైక్‌పై, బడి నుంచి ఇంటికి సైకిల్‌పై వెళ్తున్న ఒక బాలికను వెంబడిస్తూ, అసభ్యంగా ఏదో అంటున్నారు. వారిలో ఒకడు ఆమె మార్గాన్ని అడ్డగించి, ఫోన్ నంబర్ ఇవ్వమన్నాడు. ‘నా దగ్గర ఫోన్ లేదు’ అని అంటుంటే, ఇంకేవో ‘నంబర్లు’ చెప్పమని వెకిలిగా అడుగుతున్నాడు!ఈ దృశ్యాన్ని ఘిసీ కళ్లు చూశాయి. అంతే! ఒక్కసారిగా ఆమెను ఆగ్రహం కమ్మేసింది. ఇంకేమీ ఆలోచించలేదు. తన నెత్తిన ఉన్న కట్టెల మోపులోనుంచి ఒక లావుపాటి కర్రను బయటికి లాగి, తలా నాలుగు తగిలించింది. ‘ఇంకోసారి అమ్మాయిల జోలికి వచ్చారో, జైలుకు పంపిస్తా’ అంటూ హెచ్చరించింది. అప్పటివరకు తాము ఏమి చేసినా అడిగేవారే లేరు, తమకు తిరుగేలేదు అని విర్రవీగుతున్న ఆ పోకిరీలకు.. ఘిసీ ఇచ్చిన వార్నింగ్‌తో షాక్ తగిలినట్లయింది. చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు.ఘిíసీకి ఆ సమయంలో వాళ్లు ఉన్నత కులానికి చెందిన వారని కానీ, చదువుకున్నవారని కానీ, వారి తల్లిదండ్రులు డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లని కానీ గుర్తు రాలేదు. ఆమెకు అనిపించిందొక్కటే.. ఆపదలో ఉన్న ఆ అమ్మాయిని ఆదుకోవడం. ఆ తర్వాత కూడా ఆమె ఎందరో అమ్మాయిల్ని కాపాడింది. పోకిరీ రాయుళ్ల పని పట్టింది. ఘిసీ పేరెత్తితే మగాళ్లకు హడల్ ఘిసీదేవి వయసు ఇప్పుడు 50 ఏళ్లు. దూని గ్రామంలో భార్యలను హింసించే వారు, అక్కచెల్లెళ్లపై చేయి చేసుకునే మగధీరులు ఘిసీ పేరెత్తితే చాలు, ఇప్పటికీ జంకుతో ఒకడుగు వెనక్కివేస్తారు. స్త్రీలపై వివక్షను గట్టిగా ప్రశ్నించింది దేవి. ఆమె అండతో ఇరుగుపొరుగు మహిళలు తమపై దౌర్జన్యం చేసే మగాడి పెత్తనాన్ని నిలదీయడం మొదలు పెట్టారు. ఆకతాయిలకు జడిసి ఆడపిల్లల్ని బడికి, కాలేజీకి çపంపని తల్లులు ఇప్పుడు ధైర్యంగా మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. ఇక ఇల్లాళ్లయితే పాస్‌పోర్టులు, రేషన్‌కార్డులను తమ పేరుతోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఊరంతా మహిళా వలంటీర్లు అంతకు ముందు వరకు రొట్టెలు గుండ్రంగా రాలేదని భార్యని కొట్టి చంపిన పైశాచికపు సంఘటనలు దూని గ్రామంలో సర్వ సాధారణం. అంతేకాదు, ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్లగింజ వేయడమో, జిల్లేడు పాలు పోయడమో చేసే అమానవీయ ఘటనలు కూడా అక్కడ తరచూ జరిగేవి. ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక.. అంతో ఇంతో ధైర్యం ఉన్న కొందరు ఆడవాళ్లను పోగు చేసి, వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పడం మొదలు పెట్టింది ఘిసీ దేవి. దాంతో, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి, ఎన్నికలలో గెలిచి వార్డుమెంబర్లు అయిన ఆడవాళ్లు తమ భర్తల జోక్యాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. వరకట్నం కోసం బహిరంగంగా డిమాండ్ చేసే వాళ్లిప్పుడు లేనేలేరు. పురుషాహంకారంతో తమ ఇంటి ఆడవాళ్లను హింసించే మగవాళ్లు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన నాలుగు రాళ్లను నాటుసారా దుకాణాల పరం చేసి, ఒళ్లు తెలియకుండా ఎక్కడంటే అక్కడ పడిపోయే మగవాళ్లు కనిపించడం లేదిప్పుడు. వారి బదులు, అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడు మాన్పించే మహిళా సైనికులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు! ఈ మార్పుకు కారణం ఘిసీ దేవి పోరాటాలే. ముందు... మాటల్తో చెప్తారు దేవి ఇప్పుడు 11మంది మహిళా సభ్యులున్న ‘డూన్ జమట’ అనే బృందానికి నాయకురాలు. తాగుడు, వరకట్నం, కుటుంబంలోని స్త్రీలను హింసించడం, ఆడవాళ్లను అల్లరి పెట్టే పోకిరీ మూకను అదుపు చేయడమే వారి ముందున్న లక్ష్యాలు. అందులోని అందరు సభ్యులూ.. ముందు మాటలతో చెబుతారు. మాటలతో దారిలోకి రాలేదంటే ప్రత్యేకమైన యూనిఫారమ్, ఐడీ కార్డులు, ఆ పై చేతిలో బెత్తాన్ని ధరించి అపర కాళికావతారం దాలుస్తారు. అగ్రవర్ణాలవారితోనూ అమీతుమీ కుల రక్కసిపై కూడా ఘిసీదేవి పోరాటం చేసింది. ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పాతుకుపోయి ఉన్న కుల వివక్షను కూకటి వేళ్లతో పీకే ప్రయత్నం చేసింది. ఆ గ్రామంలో వీధి కుళాయిలో వచ్చే మంచినీటిని అందరూ పట్టుకోవడానికి వీలు లేదు. ముందుగా అగ్రవర్ణాల వారు పట్టుకోవాలి, ఆ తర్వాత మిగిలిన నీటిని వీరే అట్టడుగు వారికి పోసేవారు. ఈ దారుణంపై తీవ్రంగా స్పందించిందామె. మంచినీటిని అందరూ పట్టుకునేలా చేసింది. ఇంట కూడా గెలిచింది చివరికి ఆమె పుట్టింటి నుంచి, తన అత్తమామల నుంచి రావలసిన వాటాను కూడా రాబట్టుకుంది. తన కడుపున పుట్టిన పిల్లలు ముగ్గురినీ చక్కగా చదువుకునేలా చేసింది. ఇవన్నీ ఆమెకు సులువుగా ఏమీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఆమె అనేకసార్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగింది. ఎన్నోమార్లు జైలుకెళ్లొచ్చింది. తన్నులు తినింది. అవమానాలూ భరించింది. అన్నింటినీ ధైర్యంతో, సహనంతో అడ్డుకుంది. ఇప్పుడా గ్రామం ఒక ప్రశాంత సౌధం. ఆ ఊరిలో ఆడ, మగ అందరూ సమానమే. ఏ ఇంటినుంచీ అసహాయంగా ఉన్న ఆడపిల్లల ఆర్తనాదాలు వినిపించడం లేదు. ఆత్మవిశ్వాసంతో ఆడవాళ్లు హాయిగా తీస్తున్న కూనిరాగాలు తప్ప! – డి.వి.ఆర్. పదేళ్లు అత్తింటి గడప తొక్కలేదు పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులామెను ఓ అయ్య చేతిలో పెట్టి, చేతులు దులుపుకున్నారు. భర్త పచ్చి తాగుబోతు అని, పైసాకి కూడా కొరగానివాడనీ అర్థమయ్యేలోపే ముగ్గురు ఆడపిల్లలకు తల్లయిందామె. వరకట్నం వేధింపులు, అత్తమామల ఆరళ్లు ఉండనే ఉన్నాయి. వాళ్లందరికీ దేవి పుట్టింటి ఆస్తిపై కన్నుంది. ఎందుకంటే, చిన్నప్పుడే ఇంటినుంచి వెళ్లిపోయిన దేవి తమ్ముడు ఇంతవరకూ తిరిగి రాలేదు మరి. ఆ ఒక్క ఆశతోనే ఇన్నాళ్లూ ఓపికపట్టారు కానీ, ఎప్పుడైతే మూడోసారీ ఆమెకు ఆడపిల్లే పుట్టిందో, ఇక వారామెను అనరాని మాటలు అని, మెడబట్టి గెంటేయడంతో పుట్టింటికి చేరింది దేవి. పదేళ్ల వరకూ అత్తింటి గడప తొక్కనే లేదు. భర్తను వదిలేసి వచ్చిన కూతురంటే పుట్టింటిలోనూ చులకనే కదా. దాంతో ఆమె తన పొట్ట తాను పోషించుకోవడానికి నాలుగిళ్లలో పని చేసేది. వారే ఆమెకు తిండి పెట్టడంతోపాటు పాత బట్టలు కూడా ఇచ్చేవారు. మనుగడ కోసం పోరాడే సమయంలోనే ఆమె మానసికంగా, శారీరకంగా బాగా గట్టిపడింది. కొందరిని కలుపుకుని మహిళాసైన్యాన్ని తయారు చేసింది. అలాగే అమ్మానాన్నలను పోగొట్టుకుని వీధిన పడిన ఓ ఆరుగురు పిల్లలను చేరదీసింది. వారికి తానే తిండి పెట్టింది. బట్టలు కొనిచ్చింది. దాంతో వారామెకు కళ్లూ, చెవులూ అయ్యారు. ఏ ఇంటిలో అయినా ఆడవాళ్లను హింసిస్తున్నా, భర్త, అత్తమామలు వేధిస్తున్నా ఆ విషయాన్ని ఆమె చెవిలో ఊదేవారు. ఘిసీదేవి వెంటనే కొంగు బిగించి కార్యరంగంలోకి దిగేది. -
సల్మాన్ రికార్డ్.. వరుసగా 13వ సారి!
భారతీయ సినిమా వందకోట్ల మార్కెట్ రేంజ్‌ను దాటి చాలా కాలం అవుతోంది. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు రీజినల్ సినిమాలు కూడా వందకోట్ల మార్క్‌ను ఈజీగా అందుకుంటున్నాయి. అయితే ఈ రికార్డ్ ను వరుసగా సాధించిన స్టార్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ లిస్ట్ అందరికంటే టాప్ ప్లేస్ లో ఉన్న కండలవీరుడు సల్మాన్ ఖాన్. వరుసగా 13 సినిమాలను వందకోట్ల మార్క్ దాటించిన సల్మాన్, ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేని అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాయాడు. దంబాగ్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సల్లూభాయ్ ఆ సినిమాతోనే వందకోట్ల మార్క్‌కు గేట్లు ఎత్తేశాడు. అప్పటి నుంచి వరుసగా తాను హీరోగా నటించిన ప్రతీ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడం విశేషం. అంతేకాదు ప్రేమ్ రతన్ ధన్ పాయో, జైహో, ట్యూబ్‌లైట్ లాంటి ఫ్లాప్ సినిమాలలో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన సల్మాన్ మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రేస్ 3 విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా దారుణమైన రివ్యూస్ వచ్చిన కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా జెట్ స్పీడుతో దూసుకెళుతుండటం విశేషం. -
సల్మాన్ స్పీడు పెంచాడు
గత ఏడాది భజరంగీ బాయిజాన్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. అయితే ఆ రికార్డ్‌కు ఏడాదిలో కాలం చెల్లిపోయింది. ఈ ఏడాది సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్లుభాయ్ తన రికార్డ్‌ను తానే తిరగరాస్తున్నాడు. ఇప్పటికీ భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే అభిమానులు రికార్డుల లెక్కలేస్తుంటే.., సల్మాన్ మాత్రం వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కబీర్ ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ సినిమాకు ఓకె చెప్పేశాడు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ఏక్తా టైగర్, భజరంగీ బాయిజాన్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ట్యూబ్ లైట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో సల్మాన్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన దబాంగ్ సీరీస్‌లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు మరోసారి సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్వకత్వం వహించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను సీక్వల్గా కాకుండా చుల్ బుల్ పాండే పోలీస్ ఎలా అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో ప్రీక్వల్గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్గా నటించనుంది. -
బ్యాడ్ పోలీస్ గుడ్ సన్
దేడ్ కహానీ - దబాంగ్ 2015లో ముంబై బాంబ్ బ్లాస్ట్‌ల నిందితుడు యాకూబ్ మెమన్‌ని ప్రభుత్వం ఉరితీయబోయే ముందు అత్యంత ప్రజాదరణ కలిగిన సినీ హీరో, భారతీయ పౌరుడు సల్మాన్‌ఖాన్, ‘‘యాకూబ్‌ని కాదు వాళ్లన్నయ్య టైగర్ మెమన్‌ని ఉరి తీయాలి - ఇతన్ని తీయకూడదు’’ అని పబ్లిగ్గా ట్వీట్లు పెట్టాడు - ‘భయం లేదు’. సెప్టెంబర్ 26, 2011లో ముంబై వరుస బాంబుదాడుల మారణ హోమం తర్వాత, ఇదే భారతదేశ పౌరుడు, అత్యధిక ప్రజాదరణ కలిగిన టాప్ త్రీ హీరోల్లో ఒకడు, సల్మాన్‌ఖాన్ ఏకంగా పాకిస్థానీ టెలివిజన్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ, పాకిస్థాన్ని బ్లేమ్ చేయకూడదు, భారతదేశ రక్షణ దళాల వైఫల్యం అని పబ్లిగ్గా చెప్పగలిగాడు - ‘భయం లేదు’. ప్రభుత్వ అటవీశాఖ నియమాలకి విరుద్ధంగా రాజస్థాన్‌లో షూటింగ్‌కి వెళ్లినపుడు స్నేహితులతో కలిసి కృష్ణజింకల్ని వేటాడగలిగాడు - దొరికినా, జైలుకెళ్లినా, మళ్లీ స్వేచ్ఛగా బైటికి రాగలిగాడు ఇదే నటుడు - ‘భయం లేదు’. మద్యం సేవించి, వాహనం నడిపినపుడు రోడ్డుపక్కన నిద్రిస్తున్న పౌరుల పైకి కారు పోనిచ్చి, వారి చావుకి కారణమైన అభియోగాన్ని కోర్టులో ఎదుర్కొన్న హీరో. - ‘భయం లేదు’. ఇవన్నీ బొమ్మకి అవతలవైపు బొరుసు - నిజ జీవిత పాత్ర వేసే నీచమైన వేషాలివి. అయినా ‘భయం లేదు’. ఎందుకంటే భారతీయ సమాజంలో పదిమంది అభిమానుల్ని సంపాదించగలిగినా, లేదా ప్రభుత్వ అండదండలున్నా, లేదు పదిమంది రౌడీలని పోషించగలిగినా, ఏ మగాడికీ ఇంక ‘భయం లేదు’ - జనాభాలో రెండో అగ్రదేశం విచిత్రంగా ఒక వ్యక్తి వెనకాలున్న జనాన్ని చూసి భయపడడం. ఈ బొరుసుని చూస్తే నాకు భయమేస్తుంది. మన సమాజం తాలూకు సిగ్గులేనితనం మీద అసహ్యం వేస్తుంది. కానీ అవతలి వైపు బొమ్మ, వెండితెర మీద కనిపించగానే అభిమానం పుట్టేస్తుంది. ఆనందం తాండవిస్తుంది. బొమ్మ చేసే మాయ అది. ఆ మాయ పుట్టించే భ్రమ అది. భయం లేకపోవడమే ఇంగ్లిషులో ఫియర్నెస్, హిందీలో ‘దబాంగ్’. అది సూపర్‌హిట్ సినిమాగా ఆడడం కేవలం సల్మాన్‌ఖాన్ చేసిన మెస్మరిజమ్. తమ్ముడు అర్బాజ్‌ఖాన్ నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ దర్శక, రచయిత అనురాగ్ కశ్యప్ సోదరుడు, అభినవ్ కశ్యప్‌ని దర్శకుడిగా తొలిసారి పరిచయం చేస్తూ, పాత తరం ప్రముఖ హీరో, మాజీ కేంద్ర మంత్రి శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హాను కథానాయికగా మొదటిసారి పరిచయం చేస్తూ, సల్మాన్‌ఖాన్ వీర సాహస, హస్య, శృంగార విన్యాసాలే తెరంతా నిండిపోయేలా, మధ్యలో తళుక్కుమని ఓ కంటిమీద నీటి చుక్క మొలకెత్తేలా కొంచెం కరుణ రసం కలిపి అల్లుకున్న పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ దబాంగ్. అమ్మకో కొడుకు, నాన్నకో కొడుకు. ఈ సవతి కొడుకుల మధ్య చిన్నప్పట్నుంచి వైరం. మామూలుగా ఈ లైన్ రాగానే మనసులో ఇద్దరు హీరోల సినిమా అని బలంగా అనిపించేస్తుంది. కానీ, సింగిల్ స్టార్ సినిమాగా దీన్ని ప్యాకేజ్ చేయడమే కష్టమైన పని, కొత్త పనీ కూడా. దానికే ఈ సినిమా కొత్తదనాన్ని పుణికిపుచ్చుకుందని నేననుకుంటున్నాను. చాలా ఏళ్ల తర్వాత వినోద్ ఖన్నా, డింపుల్ కపాడియా హీరో తల్లి, సవతి తండ్రిగా నటించడం కూడా బావుంది. ‘రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్’ అన్నది గొప్ప వాణిజ్య సూత్రం సినిమాలకి. అది సరిగ్గా పాటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యి నిర్మాతలకి కనక వర్షం కురిపించాయి. ‘దబాంగ్’ వాటిల్లో ఒకటి. 1999 తర్వాత 11 ఏళ్లల్లో మూడే మూడు సినిమాలు చేసి, ఆ మూడూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి దాదాపు కెరీర్ అయిపోయిందనుకున్న సల్మాన్‌ఖాన్‌ని ‘దబాంగ్’ 240 కోట్ల లాభసాటి స్టార్ హీరోగా మళ్లీ నాలుగైదేళ్లు, అరడజను సినిమాల దాకా టాప్‌లో నిలబెట్టింది. బాడీ పాతది. కానీ దానికి కుట్టిన చొక్కా చాలా కొత్తది, కలర్ఫుల్ది. అదే ఆకట్టుకుంది జనాన్ని. హీరోని ఎంత మాస్‌గా రాసుకున్నారో స్క్రిప్టులో, అంత క్లాస్‌గా చూపించారు లుక్స్‌లో. ఈ ఫ్యూజన్ సినిమాకి సరికొత్త ట్రెండ్‌ని తెచ్చింది. ఆ ఫ్యూజన్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేసి తెలుగులో తీసిన ‘గబ్బర్‌సింగ్’ కూడా సూపర్‌హిట్ అయింది. ఇంచుమించు సల్మాన్లాగే ముందు సినిమాల ఫ్లాపులతో ఉన్న పవర్‌స్టార్‌ని ఒకేసారి యాభై కోట్ల క్లబ్ దాటించేసి టాప్ హీరోగా టాలీవుడ్లో పోటీలో నిలబెట్టేసింది. నెగెటివ్ టచ్ ఉన్న హీరో పాజిటివ్‌గా మారడం అనే దుష్మన్ ఫార్ములా ఎప్పటికీ సూపర్‌హిట్టేనని మరోసారి మిలీనియమ్‌లో రుజువైంది. సోనాక్షి సిన్హా చాలా అందంగా, పరిపక్వంగా నటించింది. ‘మున్నీ బద్నామ్ హుఈ’ పాట ఈ చిత్రాన్ని ప్రజల్లో విపరీతంగా పాపులర్ చేసింది. మలైకా అరోరాఖాన్ స్వయంగా నర్తించింది. ఆమె ఈ చిత్ర నిర్మాత, సల్మాన్ సవతి సోదరుడి పాత్రధారి అర్బాజ్‌ఖాన్ భార్య. ఆమె కూడా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇమామి సంస్థ ‘జండుబామ్’ అనే తమ ప్రొడక్ట్ పేరు ఈ ఐటమ్ సాంగ్‌లో వాడినందుకు నిర్మాతల మీద కేసు పెట్టింది. కానీ కోర్టు బైట ఈ కేసు సెటిలైపోయి, మలైకాతో జండుబామ్ ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కూడా చేసుకుంది. చిత్రంలో కన్నా విచిత్రం భారత దేశంలో సహజంగా జరుగుతుంటుంది అనడానికి ఇదింకో ఉదాహరణ. ‘దబాంగ్’ ఓ సూత్రం. ప్రతి డైలాగులోనూ ఓ పంచ్గానీ, ఓ మాస్ మంత్రం గానీ, ఓ విజువల్ ఇంట్రెస్ట్ గానీ ఉంటుంది. దాన్ని పూర్తిగా, కాన్ఫిడెంట్‌గా, భయం లేకుండా క్యారీ చేశాడు కాబట్టే సల్మాన్‌ఖాన్‌కి సక్సెస్‌లో ఎక్కువ షేర్ వచ్చింది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒడిసిపట్టాడు కాబట్టే పవన్‌కల్యాణ్‌కి కూడా గబ్బర్‌సింగ్ సక్సెస్‌లో పెద్ద వాటా వచ్చింది. ఒక సినిమాని కొన్ని కోట్ల మంది చూస్తారు. కానీ పదుల మంది సరిగా అర్థం చేసుకుంటారు. మిగిలినవాళ్లు ఎంజాయ్ చేస్తారంతే. ఆ పదుల మందిలో మిత్రుడు తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఒకడు. అతణ్ని ఎంచుకున్న నిర్మాత బండ్ల గణేశ్ అభినందనీయుడు, అదృష్టవంతుడు కూడా. సోనూసూద్ ఊళ్లో చిన్న సైజు విలను. అతనికింద కొంతమంది రౌడీలు. అతనిపైన కొద్దిమంది రాజకీయ నాయకులు. హీరో ఒక అసిస్టెంట్ కమిషనర్. అయినా బండగా, బాధ్యత లేకుండా పెరిగిన బాపతు కాబట్టి రౌడీలా ప్రవర్తిస్తుంటాడు. దూకుడెక్కువ. ‘నాకు దమ్ముంది, ధైర్యం ఉంది - తిక్క కూడా ఉంది’ అని అతనే చెప్పుకుంటాడు. హీరో, విలన్ల గొడవలో విలన్ హీరో తల్లిని చంపుతాడు. తమ్ముణ్ని ఇరికిస్తాడు. తండ్రిని నష్టపరుస్తాడు. చివరికి హీరో చేతిలో చస్తాడు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదనుకుంటున్నారా... సినిమగా చూడండి భయం లేదు. పక్కా పైసా వసూల్. సల్మాన్‌ఖాన్ వీర సాహస, హస్య, శృంగార విన్యాసాలే తెరంతా నిండిపోయేలా, మధ్యలో తళుక్కుమని ఓ కంటిమీద నీటి చుక్క మొలకెత్తేలా కొంచెం కరుణ రసం కలిపి అల్లుకున్న పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ దబాంగ్. - వి.ఎన్.ఆదిత్య -
మూడో ‘దబాంగ్’
‘దబాంగ్’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాల్లో చుల్బుల్ పాండేగా సల్మాన్ ఖాన్ చేసిన సందడిని ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. మూడో ‘దబాంగ్ ’ కిక్‌ను బాక్సాఫీస్‌కు రుచి చూపించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు ఈ కండల వీరుడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ధ్రువీకరించారు.ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తామని ఆయన తెలిపారు. సల్మాన్ ప్రస్తుతం ‘ప్రేమ్ రతన్ ధాన్ పాయో’, ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. -
నాకా భయం లేదు!
‘దబాంగ్’లాంటి మెగా హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా... ఆ తరువాత చెప్పుకో తగ్గ ఆఫర్లు లేవనే చెప్పాలి సోనాక్షి సిన్హాకు. అందుకే రూటు మార్చి ఇద్దరు ముగ్గురు ఫిమేల్ స్టార్స్ ఉన్న సినిమాల్లో కూడా చేస్తోందని బీ టౌన్లో గుసగుస. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడిగితే... ‘మల్టీ స్టారర్ సినిమాలో చేయడం ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నా. ఇప్పటికే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. కెరీర్ గురించి నాకెలాంటి అభద్రతా భావం లేదు. అజయ్‌దేవ్‌గణ్‌తో చేస్తున్న యాక్షన్ జాక్సన్లో రోల్ నచ్చింది. సో... హీరోయిన్లు ఎంతమంది ఉన్నారన్నది సమస్య కాదు’ అంది సోనాక్షి. -
లేడీ ‘దబాంగ్’
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దబాంగ్‌లో రౌడీ పోలీస్‌గా నటించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఖాకీ డ్రెస్ ప్రేమలో పడిపోయారు. తాజాగా రాణీముఖర్జీ పోలీస్ డ్రెస్‌లో మెరవనుంది. ఆమె నటించిన మర్దానీ చిత్రం పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో ఆమెను చూసినవారందరూ లేడీ దబాంగ్ అంటున్నారు. -
కలవరపడిన సల్మాన్
జైహో చిత్రం తనను కలవరపాటుకు గురి చేసిందని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ఆ చిత్రం విడుదలైయ్యాక ప్రేక్షకుల స్పందన చాలా బాగుందన్నారు. అయితే ఆ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. సగటు ప్రేక్షకుడు వైవిద్యాన్ని కోరుకుంటాడని సల్లూబాయ్ తెలిపారు. గతంలో తాను నటించిన దబాంగ్, రెడీ చిత్రాలు బాక్స్ అఫీస్ వద్ద కనకవర్షం కురిసిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రేక్షకులు కోరుకున్న వైవిధ్యం జైహు చిత్రంలో లేదేమో అని ఆయన వ్యాఖ్యానించారు. జైహూ చిత్రం సీరియస్ కథనంతో నడిచి, సమాజానికి ఓ మంచి సందేశాన్ని అందిస్తుందన్నారు. అయితే చిత్ర పరాజయం పాలైతే ఒక్కరిని నిందించడం తగదని సల్మాన్ అభిప్రాయపడ్డారు. జైహూ చిత్రం విడుదలైన వారం రోజులలో రూ. 61 కోట్లు వసూల్ చేసింది. సోమవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ జైహై చిత్రం గురించి పైవిధంగా వ్యాఖ్యానించారు. -
పార్టీ, పబ్ లకు వెళ్లేంత తీరికెక్కడిది: సోనాక్షి
'దబాంగ్', 'రౌడీ రాథోడ్', 'లుటేరా', తాజా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా' చిత్రాలతో సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ల టాప్ జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. తన కేరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ.. రూమర్లకు, సహచర నటులతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటంలో సోనాక్షి సిన్హా తగిన చర్యలు జాగ్రత్తగానే తీసుకుంటోంది. రూమర్లకు, సెన్సెషనల్ వార్తలకు ఎలా దూరం ఉంటున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ... పబ్, ఫార్టీలకు వెళ్లను. నాకు ప్రైవేట్ జీవితం గడపడమే ఇష్టం. అంతేకాక నిజంగా చెప్పాలంటే నాకు సమయం లేదు అని అన్నారు. నాకు షూటింగ్ లతోనే సమయం గడిచిపోతుంటే.. పార్టీ, పబ్ లకు వెళ్లే తీరిక ఎక్కడుంటుంది అని సోనాక్షి సిన్హా ప్రశ్నించింది. అంతేకాక అసభ్యకరమైన పాత్రలను తనకు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఆఫర్ చేయలేదని.. తనకు ఎలాంటి పాత్రలు సరిపోతాయో సినీ నిర్మాతలకు తెలుసునని సోనాక్షి తెలిపింది.