దబాంగ్ అంటే నిర్భయ.. ‘భయం లేని’ అని అర్థం. దూని గ్రామంలో ఘిసీదేవిని అంతా ‘దబాంగ్ దేవి’ అని పిలుస్తారు. నిజానికది ధైర్యం కాదు. ధర్మాగ్రహం. ఎందుకొచ్చింది ఆమెకంత ఆగ్రహం?! అది రాజస్తాన్‌లోని దూని గ్రామం. ఘిసీ దేవి ఉదయాన్నే గ్రామానికి దగ్గరలోని అడవి నుంచి వంటచెరకు పోగు చేసి మోపు నెత్తిన పెట్టుకుని వస్తోంది. అదే సమయంలో ముగ్గురు ఆకతాయిలు మోటార్‌బైక్‌పై, బడి నుంచి ఇంటికి సైకిల్‌పై వెళ్తున్న ఒక బాలికను వెంబడిస్తూ, అసభ్యంగా ఏదో అంటున్నారు. వారిలో ఒకడు ఆమె మార్గాన్ని అడ్డగించి, ఫోన్ నంబర్ ఇవ్వమన్నాడు. ‘నా దగ్గర ఫోన్ లేదు’ అని అంటుంటే, ఇంకేవో ‘నంబర్లు’ చెప్పమని వెకిలిగా అడుగుతున్నాడు!ఈ దృశ్యాన్ని ఘిసీ కళ్లు చూశాయి. అంతే! ఒక్కసారిగా ఆమెను ఆగ్రహం కమ్మేసింది. ఇంకేమీ ఆలోచించలేదు. తన నెత్తిన ఉన్న కట్టెల మోపులోనుంచి ఒక లావుపాటి కర్రను బయటికి లాగి, తలా నాలుగు తగిలించింది.
‘ఇంకోసారి అమ్మాయిల జోలికి వచ్చారో, జైలుకు పంపిస్తా’ అంటూ హెచ్చరించింది. అప్పటివరకు తాము ఏమి చేసినా అడిగేవారే లేరు, తమకు తిరుగేలేదు అని విర్రవీగుతున్న ఆ పోకిరీలకు.. ఘిసీ ఇచ్చిన వార్నింగ్‌తో షాక్ తగిలినట్లయింది. చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు.ఘిíసీకి ఆ సమయంలో వాళ్లు ఉన్నత కులానికి చెందిన వారని కానీ, చదువుకున్నవారని కానీ, వారి తల్లిదండ్రులు డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లని కానీ గుర్తు రాలేదు. ఆమెకు అనిపించిందొక్కటే.. ఆపదలో ఉన్న ఆ అమ్మాయిని ఆదుకోవడం. ఆ తర్వాత కూడా ఆమె ఎందరో అమ్మాయిల్ని కాపాడింది. పోకిరీ రాయుళ్ల పని పట్టింది. ఘిసీ పేరెత్తితే మగాళ్లకు హడల్ ఘిసీదేవి వయసు ఇప్పుడు 50 ఏళ్లు. దూని గ్రామంలో భార్యలను హింసించే వారు, అక్కచెల్లెళ్లపై చేయి చేసుకునే మగధీరులు ఘిసీ పేరెత్తితే చాలు, ఇప్పటికీ జంకుతో ఒకడుగు వెనక్కివేస్తారు. స్త్రీలపై వివక్షను గట్టిగా ప్రశ్నించింది దేవి. ఆమె అండతో ఇరుగుపొరుగు మహిళలు తమపై దౌర్జన్యం చేసే మగాడి పెత్తనాన్ని నిలదీయడం మొదలు పెట్టారు. ఆకతాయిలకు జడిసి ఆడపిల్లల్ని బడికి, కాలేజీకి çపంపని తల్లులు ఇప్పుడు ధైర్యంగా మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. ఇక ఇల్లాళ్లయితే పాస్‌పోర్టులు, రేషన్‌కార్డులను తమ పేరుతోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఊరంతా మహిళా వలంటీర్లు అంతకు ముందు వరకు రొట్టెలు గుండ్రంగా రాలేదని భార్యని కొట్టి చంపిన పైశాచికపు సంఘటనలు దూని గ్రామంలో సర్వ సాధారణం.
అంతేకాదు, ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్లగింజ వేయడమో, జిల్లేడు పాలు పోయడమో చేసే అమానవీయ ఘటనలు కూడా అక్కడ తరచూ జరిగేవి. ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక.. అంతో ఇంతో ధైర్యం ఉన్న కొందరు ఆడవాళ్లను పోగు చేసి, వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పడం మొదలు పెట్టింది ఘిసీ దేవి. దాంతో, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి, ఎన్నికలలో గెలిచి వార్డుమెంబర్లు అయిన ఆడవాళ్లు తమ భర్తల జోక్యాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. వరకట్నం కోసం బహిరంగంగా డిమాండ్ చేసే వాళ్లిప్పుడు లేనేలేరు. పురుషాహంకారంతో తమ ఇంటి ఆడవాళ్లను హింసించే మగవాళ్లు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన నాలుగు రాళ్లను నాటుసారా దుకాణాల పరం చేసి, ఒళ్లు తెలియకుండా ఎక్కడంటే అక్కడ పడిపోయే మగవాళ్లు కనిపించడం లేదిప్పుడు. వారి బదులు, అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడు మాన్పించే మహిళా సైనికులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు! ఈ మార్పుకు కారణం ఘిసీ దేవి పోరాటాలే. ముందు... మాటల్తో చెప్తారు దేవి ఇప్పుడు 11మంది మహిళా సభ్యులున్న ‘డూన్ జమట’ అనే బృందానికి నాయకురాలు. తాగుడు, వరకట్నం, కుటుంబంలోని స్త్రీలను హింసించడం, ఆడవాళ్లను అల్లరి పెట్టే పోకిరీ మూకను అదుపు చేయడమే వారి ముందున్న లక్ష్యాలు. అందులోని అందరు సభ్యులూ.. ముందు మాటలతో చెబుతారు. మాటలతో దారిలోకి రాలేదంటే ప్రత్యేకమైన యూనిఫారమ్, ఐడీ కార్డులు, ఆ పై చేతిలో బెత్తాన్ని ధరించి అపర కాళికావతారం దాలుస్తారు. అగ్రవర్ణాలవారితోనూ అమీతుమీ కుల రక్కసిపై కూడా ఘిసీదేవి పోరాటం చేసింది.
ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పాతుకుపోయి ఉన్న కుల వివక్షను కూకటి వేళ్లతో పీకే ప్రయత్నం చేసింది. ఆ గ్రామంలో వీధి కుళాయిలో వచ్చే మంచినీటిని అందరూ పట్టుకోవడానికి వీలు లేదు. ముందుగా అగ్రవర్ణాల వారు పట్టుకోవాలి, ఆ తర్వాత మిగిలిన నీటిని వీరే అట్టడుగు వారికి పోసేవారు. ఈ దారుణంపై తీవ్రంగా స్పందించిందామె. మంచినీటిని అందరూ పట్టుకునేలా చేసింది. ఇంట కూడా గెలిచింది చివరికి ఆమె పుట్టింటి నుంచి, తన అత్తమామల నుంచి రావలసిన వాటాను కూడా రాబట్టుకుంది. తన కడుపున పుట్టిన పిల్లలు ముగ్గురినీ చక్కగా చదువుకునేలా చేసింది. ఇవన్నీ ఆమెకు సులువుగా ఏమీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఆమె అనేకసార్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగింది. ఎన్నోమార్లు జైలుకెళ్లొచ్చింది. తన్నులు తినింది. అవమానాలూ భరించింది. అన్నింటినీ ధైర్యంతో, సహనంతో అడ్డుకుంది. ఇప్పుడా గ్రామం ఒక ప్రశాంత సౌధం. ఆ ఊరిలో ఆడ, మగ అందరూ సమానమే. ఏ ఇంటినుంచీ అసహాయంగా ఉన్న ఆడపిల్లల ఆర్తనాదాలు వినిపించడం లేదు. ఆత్మవిశ్వాసంతో ఆడవాళ్లు హాయిగా తీస్తున్న కూనిరాగాలు తప్ప! – డి.వి.ఆర్. పదేళ్లు అత్తింటి గడప తొక్కలేదు పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులామెను ఓ అయ్య చేతిలో పెట్టి, చేతులు దులుపుకున్నారు. భర్త పచ్చి తాగుబోతు అని, పైసాకి కూడా కొరగానివాడనీ అర్థమయ్యేలోపే ముగ్గురు ఆడపిల్లలకు తల్లయిందామె. వరకట్నం వేధింపులు, అత్తమామల ఆరళ్లు ఉండనే ఉన్నాయి. వాళ్లందరికీ దేవి పుట్టింటి ఆస్తిపై కన్నుంది. ఎందుకంటే, చిన్నప్పుడే ఇంటినుంచి వెళ్లిపోయిన దేవి తమ్ముడు ఇంతవరకూ తిరిగి రాలేదు మరి.
ఆ ఒక్క ఆశతోనే ఇన్నాళ్లూ ఓపికపట్టారు కానీ, ఎప్పుడైతే మూడోసారీ ఆమెకు ఆడపిల్లే పుట్టిందో, ఇక వారామెను అనరాని మాటలు అని, మెడబట్టి గెంటేయడంతో పుట్టింటికి చేరింది దేవి. పదేళ్ల వరకూ అత్తింటి గడప తొక్కనే లేదు. భర్తను వదిలేసి వచ్చిన కూతురంటే పుట్టింటిలోనూ చులకనే కదా. దాంతో ఆమె తన పొట్ట తాను పోషించుకోవడానికి నాలుగిళ్లలో పని చేసేది. వారే ఆమెకు తిండి పెట్టడంతోపాటు పాత బట్టలు కూడా ఇచ్చేవారు. మనుగడ కోసం పోరాడే సమయంలోనే ఆమె మానసికంగా, శారీరకంగా బాగా గట్టిపడింది. కొందరిని కలుపుకుని మహిళాసైన్యాన్ని తయారు చేసింది. అలాగే అమ్మానాన్నలను పోగొట్టుకుని వీధిన పడిన ఓ ఆరుగురు పిల్లలను చేరదీసింది. వారికి తానే తిండి పెట్టింది. బట్టలు కొనిచ్చింది. దాంతో వారామెకు కళ్లూ, చెవులూ అయ్యారు. ఏ ఇంటిలో అయినా ఆడవాళ్లను హింసిస్తున్నా, భర్త, అత్తమామలు వేధిస్తున్నా ఆ విషయాన్ని ఆమె చెవిలో ఊదేవారు. ఘిసీదేవి వెంటనే కొంగు బిగించి కార్యరంగంలోకి దిగేది.
దబాంగ్ దేవి
Published Fri, Jun 22 2018 12:23 AM | Last Updated on Fri, Jun 22 2018 1:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment