ఒంగోలు : రోడ్డు భద్రత ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ వి.నాగశివుడు అన్నారు. ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో ఆదివారం జరిగిన రీజియన్ స్థాయి ప్రమాదరహిత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రస్తుతం ఎక్కువగా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయన్నారు. రోడ్డు భద్రతపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన లేని కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
ఆర్టీసీ డ్రైవర్లకు సంస్థ సీయూజీ సిమ్ కార్డులను అందజేసింది అత్యవసర సమయంలో సమాచార సేకరణ లేదా సమాచారం తెలియజేసేందుకు మాత్రమేనన్నారు. అందువల్ల వాటిని ప్రయాణంలో తక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. బస్సుల కండీషన్ మెరుగుపరిచేందుకు ఆర్టీసీ ప్రత్యేక దృష్టిపెట్టిందని పేర్కొన్నారు. ఆర్టీసీ సీఎంఈ రవికాంత్ మాట్లాడుతూ సమాజంలో నేడు ఆరోగ్య, ఆర్థిక, ఉద్యోగ భద్రత వంటి వాటిపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నా రోడ్డు భద్రతపై మాత్రం దృష్టి సారించడంలేదన్నారు.
ప్రజలను చైతన్యం చేయడం కోసమే ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించడం ద్వారా కార్మికుల్లో కూడా నూతనోత్తేజాన్ని ఆర్టీసీ నింపుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, పలు డిపోల మేనేజర్లతో పాటు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డిపో స్థాయిలో ప్రమాదరహిత డ్రైవర్లుగా వరుస మూడు స్థానాల్లో నిలిచిన వారికి సన్మానంతో పాటు ప్రథమ స్థానం కింద రూ.500, ద్వితీయ రూ.400, తృతీయ రూ.300 నగదు బహుమతిని అందజేశారు.
రోడ్డు భద్రత.. సామాజిక బాధ్యత
Published Mon, Jul 28 2014 3:15 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement