సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త | Known entrepreneur social responsibility | Sakshi
Sakshi News home page

సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త

Published Sun, Sep 18 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త

సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త

మన దిగ్గజాలు
అవిభక్త భారతదేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. నెలకొల్పిన పరిశ్రమలను లాభాల బాటలో నడిపించడం సరే, అనాచారాలతో కునారిల్లుతున్న సమాజాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్న సామాజిక బాధ్యతనూ గుర్తెరిగిన అసాధారణ వ్యక్తి ఆయన. స్వాతంత్య్రానికి ముందు దేశంలో టాటా, బిర్లాల తర్వాత మూడో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా నిలిచిన దాల్మియా గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జైదయాల్ దాల్మియా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలపై గల దార్శనికత, ఉన్నత ఆదర్శాలపై గల నిబద్ధత దాల్మియాను భారత పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలుపుతాయి.

వ్యాపార నేపథ్యం
జైదయాల్ దాల్మియా 1904 డిసెంబర్ 11న రాజస్థాన్‌లోని చిరావా గ్రామంలో జన్మించారు. కొంతకాలం ఆయన కుటుంబం కలకత్తాకు వలస వెళ్లడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది. తర్వాత తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. చిరావాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అప్పటికే జైదయాల్ అన్న రామకృష్ణ దాల్మియా పలు వ్యాపారాలను నిర్వహిస్తూ ఉండేవారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక జైదయాల్ అన్నకు చేదోడుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించి, అన్న మనసు చూరగొన్నారు. జైదయాల్‌ను సంప్రదించనిదే రామకృష్ణ దాల్మియా కీలక నిర్ణయాలేవీ తీసుకునేవారు కాదు. దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్లలో జైదయాల్ తనదైన ముద్రవేశారు.
 
తీపి ప్రారంభం
దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం చక్కెర కర్మాగారాలతో మొదలైంది. నిర్మల్‌కుమార్ జైన్ అనే బీహారీ వ్యాపారితో కలసి 1932-33లో దాల్మియా సోదరులు సుగర్ మిల్లును ప్రారంభించారు. మరుసటి ఏడాదే మరో చక్కెర మిల్లును ప్రారంభించారు. బ్యాంకింగ్, బీమా రంగాలపై దృష్టి సారించి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, భారత్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల్లో ప్రధాన వాటాదారుగా ఎదిగారు. 1935లో రాజ్‌గంగపూర్‌లో తొలి సిమెంట్ కర్మాగారాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో ఇది దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్‌గా (డీబీసీఎల్) అవతరించింది. జైదయాల్ సారథ్యంలో దాల్మియా గ్రూప్ సిమెంటు కర్మాగారాల సంఖ్య అనతి కాలంలోనే ఆరుకు పెరిగింది.

వీటిలో ఒకటి కరాచీలో ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సిమెంటు కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా అప్పట్లో అవిభక్త భారత్‌లో సిమెంటు రంగంలో ఏసీసీ గుత్తాధిపత్యానికి తెరదించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధాసక్తులు గల జైదయాల్, సిమెంటు కర్మాగారాల కోసం యూరోప్ నుంచి అధునాతన యంత్రాలను తెప్పించారు. సిమెంటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలోనే మొదటిసారిగా వెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా రౌర్కెలాలో 1954లో అగ్నిప్రమాదాలను తట్టుకునే ఇటుకలను తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలో నిరుపయోగంగా మారిన వాహనాలను దిగుమతి చేసుకుని, తుక్కుగా మార్చి విక్రయించేందుకు అలెన్ బెర్రీ అడ్ కో కంపెనీని స్థాపించారు. పత్రికారంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, అందులోనూ అడుగుపెట్టారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురణ సంస్థ బెన్నెట్ కోల్మన్ అండ్ కో కంపెనీని కొనుగోలు చేశారు. స్వాతంత్య్రానంతరం జైదయాల్ దాల్మియా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించి, వాటి అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే దాల్మియా గ్రూపులో విభేదాల వల్ల సోదరులు విడిపోయారు జైదయాల్ వాటాకు రాజ్‌గంగపూర్, కరాచీ సిమెంటు కర్మాగారాలు వచ్చాయి. కరాచీ కర్మాగారాన్ని 1964లో అమ్మేసి, స్వదేశంలోని సంస్థల విస్తరణకు కృషి చేశారు.
 
రచయిత, సంస్కరణాభిలాషి...
పారిశ్రామికవేత్తల్లో చాలామంది రచనా వ్యాసంగం, సంఘ సంస్కరణలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. జైదయాల్ దాల్మియా మాత్రం అందుకు భిన్నంగా ఈ రెండు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బెంగాలీ వైష్ణవ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించడమే కాకుండా, ధర్మశాస్త్రం, అస్పృశ్యత, ప్రాచీన భారతంలో గోమాంసం వంటి పుస్తకాలను రాశారు. సంస్కృత భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆయన రామకృష్ణ జైదయాల్ దాల్మియా శ్రీవాణీ అలంకరణ్ సంస్థను స్థాపించారు.  

సాంఘిక సంస్కరణలకు విశేషంగా కృషి చేశారు. వితంతువులకు, వికలాంగులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణ జైదయాల్ దాల్మియా సేవా సంస్థాన్ పేరిట సేవాసంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ వంటి కార్యక్రమాలకు విశేషంగా కృషిచేశారు. చరమాంకంలో వ్యాపారరంగం నుంచి విరమించుకున్న తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కాలం సేవా కార్యక్రమాలకే అంకితమైన జైదయాల్ దాల్మియా 1993లో కన్నుమూశారు.
- దండేల కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement