Dalmia Group
-
ఇక జాతీయ జెండా ఎగిరేది ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను 1830లో అప్పటి బ్రిటీష్ ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’ విలియం బెంటింక్ అమ్మేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. తమ అలవెన్సుల్లో విలియం కోత విధించారన్న కోపంతో అప్పట్లో బెంగాల్ ఆర్మీ ఈ వదంతును సష్టించింది. అది ఎంతగా ప్రచారం జరిగిందంటే భారత జాతీయవాదులు తాజ్ మహల్‌ను అమ్మవద్దంటూ ధర్నా చేశారు. బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ)కూడా ఆ వదంతిని నమ్మింది. ఆ తర్వాత అదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటను ‘దాల్మియా భారత్ గ్రూప్’నకు కేంద్ర ప్రభుత్వం నిజంగా అమ్మేసిన ఎవరు నమ్మరు. ఐదేళ్లపాటు ఎర్రకోటను పరిరక్షించాల్సిన బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాల్మియా సంస్థకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగుతున్న విషయం తెల్సిందే. చక్కెర, సిమ్మెంట్, విద్యుత్ వ్యాపారాలను చేసుకొనే దాల్మియా సంస్థకు ఓ అద్భుత చారిత్రక కట్టడం పరిరక్షణ బాధ్యతలు అప్పగించడం ఏమిటీ? దాని పట్ల ఆ సంస్థ ఆసక్తి చూపడం ఏమిటీ? అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి విస్తత ప్రచారం చేయడమే కాకుండా, కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన సంస్థకు చారిత్రక కట్టడాల పట్ల ఆసక్తి ఎందుకు ఉంటుంది? పోనీ బాబ్రీ విధ్వంసానికి ప్రతిఫలంగానే బీజేపీ ప్రభుత్వం ఈ కట్టడాన్ని దాల్మియా సంస్థకు అప్పగిస్తుందా? మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్‌ను కూలగొట్టాలంటూ మాట్లాడిన బీజేపీ ప్రభుత్వ నేతలు అదే షాజహాన్ 1639లో నిర్మించిన ఢిల్లీ కోటను ఎందుకు పరిరక్షించాలనుకుంటున్నారో అర్థం కాదు? ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు దత్తత పేరిట ఎర్రకోటను దాల్మియా సంస్థకు లీజుకు ఇచ్చింది. ఎర్రకోట ఎంట్రీ టిక్కెట్‌పై వచ్చిన డబ్బులను విధిగా ఎర్రకోట పరిరక్షణకే ఖర్చు పెట్టాలన్నది అందులో ఓ షరతు. నిర్మాణం దెబ్బతినకుండా మిగతా కోటలో ఎన్ని రెస్లారెంట్లనైనా, ఎన్ని హోటళ్లనైనా నడుపుకోవచ్చు. ఎంత రేటైన పెట్టుకోవచ్చు. ఖరీదైన పర్యాటకుల కోసం సకల కళలను పోషించవచ్చు. ఎంత సొమ్మయిన ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఎర్రకోట సందర్శనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి భారతీయులు ఒక్కరికి 35 రూపాయలు, విదేశీయులకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపు భారతీయుల నుంచే 500 రూపాయలు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఎంట్రీకి రెండు స్నాక్స్ ఇస్తామంటూ ఆ స్నాక్‌ల బిల్లును కంపెనీ తన ఖాతాలో కూడా వేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ద్వారా తాజ్ గ్రూప్ ఎంత సంపాదిస్తుందో, అంతకన్నా పదింతలు ఎర్రకోట ద్వారా సంపాదించవచ్చన్నది ఎవరైనా ఊహించవచ్చు. సమైక్య భారత్ చిహ్నంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై త్రివర్ణ ప్రతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కొనసాగిస్తూ వచ్చారు. మహారాష్ట్ర మీదుగా అఫ్ఘానిస్తాన్ వరకు విస్తరించిన మొఘల్ చక్రవర్తుల చరిత్రను చెరిపేసి ఆధునిక మహారాష్ట్రలో కొన్ని జిల్లాల విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను విస్తరించేందుకు 210 మీటర్ల విగ్రహాన్ని నిర్మిస్తున్న బీజేపీ పాలకులు....ఎర్రకోటను దాల్మియా స్వాధీనం చేసుకున్నాక శివాజీ రాజ్యానికి రాజధాని అయిన ‘రాయ్‌గఢ్’ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేస్తారా?! -
ఎర్రకోట దత్తత.. ఆగ్రహజ్వాలలు
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక సంపద ఎర్రకోట చుట్టూ వివాదం ముసురుకుంటోంది. ఎర్రకోటను ఐదేళ్లకు దాల్మియ గ్రూపు దత్తత తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. చారిత్రక సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. పార్లమెంట్, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టులను కూడా అభివృద్ధి పేరుతో లీజుకిస్తారా అని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. దేశంలోని 93 వారసత్వ కట్టడాల అభివృద్ధికి కేంద్ర పర్యాటకశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వారసత్వ స్థలం ఎర్రకోట అభివృద్ధి కాంట్రాక్ట్‌ను అడాప్ట్ హెరిటేజ్ సైట్ పథకం కింద ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, టూరిజం శాఖలతో దాల్మియా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లపాటు ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున ఆ సంస్థ పర్యాటకశాఖకు చెల్లించనున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై కేంద్ర టూరిజం శాఖ స్పందించింది. గత ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు రాష్ట్రపతి ఈ పథకాన్ని ప్రకటించారు. చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే దాల్మిక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం. కేవలం వారసత్వ కట్టడాల అభివృద్ధి కోసమే ఇందుకు శ్రీకారం చుట్టామని, ఇందులో ఎలాంటి లాభాపేక్షలేదని ట్వీట్లో పేర్కొన్నారు. -
సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త
మన దిగ్గజాలు అవిభక్త భారతదేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. నెలకొల్పిన పరిశ్రమలను లాభాల బాటలో నడిపించడం సరే, అనాచారాలతో కునారిల్లుతున్న సమాజాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్న సామాజిక బాధ్యతనూ గుర్తెరిగిన అసాధారణ వ్యక్తి ఆయన. స్వాతంత్య్రానికి ముందు దేశంలో టాటా, బిర్లాల తర్వాత మూడో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా నిలిచిన దాల్మియా గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జైదయాల్ దాల్మియా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలపై గల దార్శనికత, ఉన్నత ఆదర్శాలపై గల నిబద్ధత దాల్మియాను భారత పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలుపుతాయి. వ్యాపార నేపథ్యం జైదయాల్ దాల్మియా 1904 డిసెంబర్ 11న రాజస్థాన్‌లోని చిరావా గ్రామంలో జన్మించారు. కొంతకాలం ఆయన కుటుంబం కలకత్తాకు వలస వెళ్లడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది. తర్వాత తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. చిరావాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అప్పటికే జైదయాల్ అన్న రామకృష్ణ దాల్మియా పలు వ్యాపారాలను నిర్వహిస్తూ ఉండేవారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక జైదయాల్ అన్నకు చేదోడుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించి, అన్న మనసు చూరగొన్నారు. జైదయాల్ను సంప్రదించనిదే రామకృష్ణ దాల్మియా కీలక నిర్ణయాలేవీ తీసుకునేవారు కాదు. దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్లలో జైదయాల్ తనదైన ముద్రవేశారు. తీపి ప్రారంభం దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం చక్కెర కర్మాగారాలతో మొదలైంది. నిర్మల్‌కుమార్ జైన్ అనే బీహారీ వ్యాపారితో కలసి 1932-33లో దాల్మియా సోదరులు సుగర్ మిల్లును ప్రారంభించారు. మరుసటి ఏడాదే మరో చక్కెర మిల్లును ప్రారంభించారు. బ్యాంకింగ్, బీమా రంగాలపై దృష్టి సారించి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, భారత్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల్లో ప్రధాన వాటాదారుగా ఎదిగారు. 1935లో రాజ్‌గంగపూర్‌లో తొలి సిమెంట్ కర్మాగారాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో ఇది దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్‌గా (డీబీసీఎల్) అవతరించింది. జైదయాల్ సారథ్యంలో దాల్మియా గ్రూప్ సిమెంటు కర్మాగారాల సంఖ్య అనతి కాలంలోనే ఆరుకు పెరిగింది. వీటిలో ఒకటి కరాచీలో ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సిమెంటు కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా అప్పట్లో అవిభక్త భారత్‌లో సిమెంటు రంగంలో ఏసీసీ గుత్తాధిపత్యానికి తెరదించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధాసక్తులు గల జైదయాల్, సిమెంటు కర్మాగారాల కోసం యూరోప్ నుంచి అధునాతన యంత్రాలను తెప్పించారు. సిమెంటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలోనే మొదటిసారిగా వెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా రౌర్కెలాలో 1954లో అగ్నిప్రమాదాలను తట్టుకునే ఇటుకలను తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలో నిరుపయోగంగా మారిన వాహనాలను దిగుమతి చేసుకుని, తుక్కుగా మార్చి విక్రయించేందుకు అలెన్ బెర్రీ అడ్ కో కంపెనీని స్థాపించారు. పత్రికారంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, అందులోనూ అడుగుపెట్టారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురణ సంస్థ బెన్నెట్ కోల్మన్ అండ్ కో కంపెనీని కొనుగోలు చేశారు. స్వాతంత్య్రానంతరం జైదయాల్ దాల్మియా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించి, వాటి అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే దాల్మియా గ్రూపులో విభేదాల వల్ల సోదరులు విడిపోయారు జైదయాల్ వాటాకు రాజ్‌గంగపూర్, కరాచీ సిమెంటు కర్మాగారాలు వచ్చాయి. కరాచీ కర్మాగారాన్ని 1964లో అమ్మేసి, స్వదేశంలోని సంస్థల విస్తరణకు కృషి చేశారు. రచయిత, సంస్కరణాభిలాషి... పారిశ్రామికవేత్తల్లో చాలామంది రచనా వ్యాసంగం, సంఘ సంస్కరణలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. జైదయాల్ దాల్మియా మాత్రం అందుకు భిన్నంగా ఈ రెండు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బెంగాలీ వైష్ణవ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించడమే కాకుండా, ధర్మశాస్త్రం, అస్పృశ్యత, ప్రాచీన భారతంలో గోమాంసం వంటి పుస్తకాలను రాశారు. సంస్కృత భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆయన రామకృష్ణ జైదయాల్ దాల్మియా శ్రీవాణీ అలంకరణ్ సంస్థను స్థాపించారు. సాంఘిక సంస్కరణలకు విశేషంగా కృషి చేశారు. వితంతువులకు, వికలాంగులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణ జైదయాల్ దాల్మియా సేవా సంస్థాన్ పేరిట సేవాసంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ వంటి కార్యక్రమాలకు విశేషంగా కృషిచేశారు. చరమాంకంలో వ్యాపారరంగం నుంచి విరమించుకున్న తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కాలం సేవా కార్యక్రమాలకే అంకితమైన జైదయాల్ దాల్మియా 1993లో కన్నుమూశారు. - దండేల కృష్ణ