ఇక జాతీయ జెండా ఎగిరేది ఎక్కడ? | Dalmia Bharat Group Adopts Red Fort  | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 5:45 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

Dalmia Bharat Group Adopts Red Fort  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను 1830లో అప్పటి బ్రిటీష్‌ ‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ విలియం బెంటింక్‌ అమ్మేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. తమ అలవెన్సుల్లో విలియం కోత విధించారన్న కోపంతో అప్పట్లో బెంగాల్‌ ఆర్మీ ఈ వదంతును సష్టించింది. అది ఎంతగా ప్రచారం జరిగిందంటే భారత జాతీయవాదులు తాజ్‌ మహల్‌ను అమ్మవద్దంటూ ధర్నా చేశారు. బ్రిటీష్‌ పాలకులు ఏర్పాటు చేసిన భారత పురాతత్వ సంస్థ (ఏఎస్‌ఐ)కూడా ఆ వదంతిని నమ్మింది. ఆ తర్వాత అదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటను ‘దాల్మియా భారత్‌ గ్రూప్‌’నకు కేంద్ర ప్రభుత్వం నిజంగా అమ్మేసిన ఎవరు నమ్మరు. 

ఐదేళ్లపాటు ఎర్రకోటను పరిరక్షించాల్సిన బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాల్మియా సంస్థకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగుతున్న విషయం తెల్సిందే. చక్కెర, సిమ్మెంట్, విద్యుత్‌ వ్యాపారాలను చేసుకొనే దాల్మియా సంస్థకు ఓ అద్భుత చారిత్రక కట్టడం పరిరక్షణ బాధ్యతలు అప్పగించడం ఏమిటీ? దాని పట్ల ఆ సంస్థ ఆసక్తి చూపడం ఏమిటీ? అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి విస్తత ప్రచారం చేయడమే కాకుండా, కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన సంస్థకు చారిత్రక కట్టడాల పట్ల ఆసక్తి ఎందుకు ఉంటుంది? పోనీ బాబ్రీ విధ్వంసానికి ప్రతిఫలంగానే బీజేపీ ప్రభుత్వం ఈ కట్టడాన్ని దాల్మియా సంస్థకు అప్పగిస్తుందా?

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన తాజ్‌ మహల్‌ను కూలగొట్టాలంటూ మాట్లాడిన బీజేపీ ప్రభుత్వ నేతలు అదే షాజహాన్‌ 1639లో నిర్మించిన ఢిల్లీ కోటను ఎందుకు పరిరక్షించాలనుకుంటున్నారో అర్థం కాదు? ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు దత్తత పేరిట ఎర్రకోటను దాల్మియా సంస్థకు లీజుకు ఇచ్చింది. ఎర్రకోట ఎంట్రీ టిక్కెట్‌పై వచ్చిన డబ్బులను విధిగా ఎర్రకోట పరిరక్షణకే ఖర్చు పెట్టాలన్నది అందులో ఓ షరతు. నిర్మాణం దెబ్బతినకుండా మిగతా కోటలో ఎన్ని రెస్లారెంట్లనైనా, ఎన్ని హోటళ్లనైనా నడుపుకోవచ్చు. ఎంత రేటైన పెట్టుకోవచ్చు. ఖరీదైన పర్యాటకుల కోసం సకల కళలను పోషించవచ్చు. ఎంత సొమ్మయిన ఆర్జించవచ్చు. 

ప్రస్తుతం ఎర్రకోట సందర్శనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి భారతీయులు ఒక్కరికి 35 రూపాయలు, విదేశీయులకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపు భారతీయుల నుంచే 500 రూపాయలు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఎంట్రీకి రెండు స్నాక్స్‌ ఇస్తామంటూ ఆ స్నాక్‌ల బిల్లును కంపెనీ తన ఖాతాలో కూడా వేసుకోవచ్చు.  హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్‌ ద్వారా తాజ్‌ గ్రూప్‌ ఎంత సంపాదిస్తుందో, అంతకన్నా పదింతలు ఎర్రకోట ద్వారా సంపాదించవచ్చన్నది ఎవరైనా ఊహించవచ్చు. సమైక్య భారత్‌ చిహ్నంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై త్రివర్ణ ప్రతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీ. 

ఆ ఆనవాయితీని బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కొనసాగిస్తూ వచ్చారు. మహారాష్ట్ర మీదుగా అఫ్ఘానిస్తాన్‌ వరకు విస్తరించిన మొఘల్‌ చక్రవర్తుల చరిత్రను చెరిపేసి ఆధునిక మహారాష్ట్రలో కొన్ని జిల్లాల విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను విస్తరించేందుకు 210 మీటర్ల విగ్రహాన్ని నిర్మిస్తున్న బీజేపీ పాలకులు....ఎర్రకోటను దాల్మియా స్వాధీనం చేసుకున్నాక శివాజీ రాజ్యానికి రాజధాని అయిన ‘రాయ్‌గఢ్‌’ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేస్తారా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement